ఉదయం మూడు గంటల సమయం. నారింజ రంగు టార్పాలిన్ గుడారం బయట కూర్చొని ఉన్న నందిని, తన నేస్తం చూపిస్తోన్న సెల్ ఫోన్ టార్చి వెలుగులో మేకప్ వేసుకుంటోంది.
ఒక సాదా నూలు చీర కట్టుకొని ఉన్న ఆ 18 ఏళ్ళ అమ్మాయికి మరి కొద్ది గంటల్లో పెళ్ళి జరగబోతోంది.
ఆ ముందు రోజు సాయంత్రమే ఆమె, ఆమె వరుడైన 21 ఏళ్ళ జయరామ్లు బంగళామేడు (అధికారికంగా సెరుక్కనూర్ ఇరులర్ కాలనీ అని పిలుస్తారు) నుంచి తమ స్నేహితులతో, కుటుంబాలతో కలిసి మామిళ్ళాపురం వచ్చారు. దక్షిణ చెన్నైలోని ఈ బీచ్ పొడవునా చిన్న చిన్న గుడారాలు వేసుకుని ఉంటోన్న వందలాది ఇరులర్ కుటుంబాలలో, తమిళనాడులోని తిరువళ్ళూర్ జిల్లాకు చెందిన ఈ బృందం కూడా ఒకటి.
తమిళనాడు తీరప్రాంతంలో అతి కొద్దికాలమే ఉండే శీతాకాలం వేసవికాలానికి దారినిచ్చే ప్రతి మార్చి నెలలో మామిళ్ళాపురం (ఇంతకుముందు మహాబలిపురం అని పిలిచేవారు) బంగారు రంగు ఇసుక, రంగు రంగులను విరజిమ్ముతుంది. సమీపంలోని చెట్ల నుండి తాజాగా కత్తిరించిన కొమ్మల మీద సన్నటి చీరలు, టార్పాలిన్లు కట్టి ఏర్పాటు చేసిన ఆవరణలు, గుడారాలతో సందడి సందడిగా మారుతుంది.
ప్రసిద్ధి చెందిన ఈ బీచ్లో మామూలుగా స్థానిక, అంతర్జాతీయ పర్యాటకులు చేసే సందడిని మాసి మాగమ్ పండుగను జరుపుకోవడానికి రాష్ట్రమంతటి నుంచీ వచ్చిన ఇరులర్ సముదాయపు ప్రజలు భర్తీ చేస్తారు. సుమారు 2 లక్షల జనాభా ( భారతదేశంలో షెడ్యూల్డ్ తెగల గణాంక ప్రొఫైల్, 2013 ) ఉన్న ఇరులర్లు ప్రత్యేకించి హానికి లోనయ్యే ఆదివాసీ సమూహం (PVTG) కు చెందినవారు. వారు తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో చెదురుమదురుగా విస్తరించి ఉన్న చిన్న, చిన్న సమూహాలుగా నివసిస్తున్నారు.
తమిళమాసమైన మాసి (ఫిబ్రవరి-మార్చి)లో, కన్నియమ్మ దేవతకు ప్రార్థనలు చేసేందుకు ఇరులర్లు బృందాలుగా మామిళ్ళాపురంకు వస్తారు. కన్నియమ్మ ఈ తెగవారు పూజించే ఏడుగురు కన్యకా దేవతలలో ఒక దేవత. మాగం (మఖ) హిందూ జ్యోతిషశాస్త్రంలో ఒక నక్షత్రం పేరు.
"అమ్మకు కోపం వచ్చి సముద్రానికి వెళ్ళిపోతుందని మా పెద్దవాళ్ళు చెప్పేవారు," అని జయరామ్ అమ్మమ్మ వి. సరోజ చెప్పారు. "అప్పుడు మనం తిరిగి రమ్మని ఆమెను వేడుకోవాలి. ఆమె కోపం చల్లారిపోయి తిరిగి ఇంటికి వస్తుంది," ఆమె వివరించారు.
ఎక్కువలో ఎక్కువగా అక్కడ ఉండే నాలుగైదు రోజులూ ఇరులర్లు అక్కడి ఉప్పునీటి కయ్యలలో చేపలు పడతారు; నత్తలు, ఎలుకల కోసం, దగ్గరున్న పొదలలో పక్షుల కోసం వేటాడి తమ తిండిని సమకూర్చుకుంటారు.
దగ్గరలో ఉన్న అడవిలో వేటాడటం, తినగలిగే మొక్కల కోసం వెదకటం, వంటచెరకును, ఔషధ మూలికలను సేకరించటం ఇరులర్ల సంప్రదాయన జీవన సరళి. (చదవండి: Digging up buried treasures in Bangalamedu )
అటవీ విస్తీర్ణం నిర్మాణాలకూ పొలాలకూ దారినివ్వడం, వారి నివాస ప్రాంతాల చుట్టూ ఉన్న అడవులకూ సరస్సులకూ వెళ్ళేందుకు అనుమతులు పరిమితమైపోవటం వలన ఇరులర్లు ఇప్పుడు ఎక్కువగా రోజువారీ కూలీ పనులు, పొలాల్లో, నిర్మాణ స్థలాల్లో, ఇటుక బట్టీలలో, MNREGA (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఇది గ్రామీణ ప్రాంత కుటుంబాలకు సంవత్సరంలో 100 రోజుల ఉపాధికి హామీ ఇస్తుంది) ప్రదేశాలలో పనిచేస్తున్నారు. వారిలో కొందరు విషానికి విరుగుడు మందు తయారీ కోసం పాములను పట్టుకోవడానికి, సరఫరా చేయడానికి లైసెన్స్ పొందారు, అయితే అలాంటి పని కాలానుగుణమైనది, ఎప్పుడు దొరుకుతుందో తెలియనిది.
అలమేలు, చెన్నైలో ఇప్పుడిప్పుడే శివారు ప్రాంతంగా మారుతోన్న మనపాక్కంలో ఒక కుప్ప మీడు (చెత్త వేసే ప్రదేశం) దగ్గర నివసించే దినసరి కూలీ. 45 ఏళ్ళ వయసున్న ఈమెకు, అమ్మన్ కు ప్రార్థనలు చేయడానికి ప్రతి సంవత్సరం తీరానికి 55 కిలోమీటర్లు దూరం ప్రయాణించి రావటంలో ఒక అంశం ఉంది. "చుట్టూ చూడండి," అక్కడ ఏర్పాటుచేసుకున్న ఆవరణలను చూపిస్తూ, "మేమెప్పుడూ ఇలాగే జీవించాం. నేల మీద. బల్లులు ఉన్నా, పాములు ఉన్నా. అందుకే అమ్మ కు మనం నైవేద్యాలను తరై [నేల] మీదనే పెట్టాలి," అంటారామె.
పొద్దుపొడుపుకు ఇంకా కొన్ని గంటలకు ముందే ప్రార్థనలు మొదలవుతాయి. అంత పొద్దున్నే నిద్ర లేచినవారు చిక్కురొక్కురుగా ఉన్న గుడారాలలో దారిచేసుకుంటూ, నిద్ర పోతున్నవారిని తొక్కకుండా దాటుకుంటూ, నిండు పున్నమి వెన్నెల దారి చూపిస్తుండగా బీచ్ వైపుకు కదులుతారు. ప్రతి కుటుంబం తమ నైవేద్యాలను ఉంచేందుకు సముద్రతీరాన ఒక ప్రదేశాన్ని ఎంచుకుంటారు.
"మేం ఇసుకతో ఏడు మెట్లు కడతాం," అలమేలు చెప్పారు. ప్రతి మెట్టు మీద వారు దేవతకు తమ నైవేద్యాలను ఉంచుతారు. ఆ నైవేద్యాలలో పువ్వులు, కొబ్బరికాయలు, తమలపాకులు, మరమరాలు, బెల్లం కలిపిన బియ్యపు పిండి ఉంటాయి. వారు పెట్టిన నైవేద్యాలను అలలు వచ్చి ముంచెత్తగానే, అమ్మ లేదా అమ్మన్ తమను నిజంగా దీవించిందని ఇరులర్లు నమ్ముతారు.
“ అదత్తి కుడుత్తా, యెత్తుక్కువా [మనం ఆమెను ఆజ్ఞాపిస్తే, ఆమె స్వీకరిస్తుంది],” అని అలమేలు చెప్పారు. ఇక్కడ దేవతను ఆజ్ఞాపించడం ఏమిటని వింతగా అనిపించవచ్చు, కానీ ఇరులర్లు తమ దేవతతో పంచుకునే ప్రత్యేకమైన అనుబంధం ఇది. “ఇది మీ అమ్మను పిలవడం లాంటిది. మీరు ఆమె దగ్గర స్వతంత్రంగా ఉండవచ్చు,” అని ఇరులర్ కార్యకర్త మణిగండన్ వివరించారు.
ఈ ఆరాధన సమయంలో కొంతమంది వ్యక్తులను దేవత పూనుతుందని ఇరులర్లు నమ్ముతారు. చాలామంది భక్తులు, కన్నియమ్మ పూనుతుందని వారు నమ్మేవారితో సహా, సంప్రదాయబద్ధంగా పసుపు లేదా నారింజ రంగు దుస్తులను ధరిస్తారు. కొంతమంది పురుషులు చీరలు కట్టుకుని, తమ తలలను పూలతో అలంకరించుకుంటారు.
తిరుత్తణికి చెందిన మణిగండన్ ఒక ఇరులర్ కార్యకర్త. "మాకు పూజారులు ఉండరు. అమ్మన్ ఆత్మను స్వీకరించాలని నిర్ణయించుకున్న వారందరూ పూజారులవుతారు," ఆయన PARIతో చెప్పారు. మణిగండన్ 2023, నవంబర్లో మరణించారు.
ఆ ఉదయం (మార్చి 7, 2023) నందిని, జయరామ్లు వివాహం చేసుకున్నారు. దేవత ఆత్మ పూనిందని నమ్ముతున్న ఇద్దరు మహిళలు ఆశీర్వదించిన ఈ పెళ్ళి వేడుక చాలా త్వరగానూ, సాదాసీదాగానూ ముగిసింది. తీరం పొడవునా పూజారులు పెళ్ళిళ్ళు చేయటం, శిశువులకు పేర్లు పెట్టటం, వారిని ఆశీర్వదించడం, వారికి అరుళ్వాక్కు లేదా దివ్య పదాన్ని ఇవ్వడం చేస్తున్నారు.
నీటిని తమ అమ్మన్ గా ఆరాధించే ఇరులర్లు పూజించడానికి ఆమెను తమ ఇళ్ళకు తీసుకువెళతారు. సముద్రపు నీటిని ప్లాస్టిక్ సీసాలలో తీసుకువెళ్ళి, తమ ఇంటి చుట్టూ చల్లుకుంటారు, ఆ యాత్రకు రాలేని వారికి కూడా ఆ నీటిని ఇస్తారు.
సముద్రపు గాలి బంధనాలతో, తమ దేవత దీవెనల ఆయుధాలు ధరించిన ఇరులర్లు తమ గుడారాలను మూసివేస్తారు. నూతన వధూవరులైన నందిని, జయరామ్లు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. పెళ్ళి జ్ఞాపకాలను మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకోవడానికి వాళ్ళు ఈ సంవత్సరం (2024) ఇక్కడకు తిరిగి రావాలని అనుకుంటున్నారు. "సముద్రపు ఒడ్డున వంట చేసుకొని, సముద్ర స్నానం చేసి, మహాబలిపురంలో కొన్ని రోజులు సంతోషంగా గడుపుతారని," సరోజ చెప్పారు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి