చారల లుంగీని మోకాళ్ళ మధ్య నుంచి దోపుకొని, కేవలం 30 సెకన్ల కాలంలో 40 అడుగుల ఎత్తున్న తాటిచెట్టును సగం వరకు ఎక్కగలడు అజయ్ మహతో.
అతను ప్రతిరోజూ ఇదే పని చేస్తాడు – కళ్ళు తిరిగే ఎత్తున ఉండే తాటిచెట్లను అవలీలగా ఎక్కి, వాటి మట్టల దగ్గర ఉండే మొవ్వల నుండి నీరాను సేకరిస్తాడు.
బిహార్‌లోని సమస్తీపూర్ జిల్లాలో, మే మాసపు ఒక ఉదయాన, 27 ఏళ్ళ ఈ కల్లుగీత కార్మికుడు తాటిచెట్టు ఎక్కడానికి సిద్ధమవుతున్నాడు. “ ఆబ్ త తార్ కే పేర్ జైసన్ సక్కత్ హో గెలైహన్. కాంటా భీ నై భొకైతై (ఇవి తాటిచెట్టులా గట్టిగా మారిపోయాయి. ముల్లు గుచ్చుకున్నా ఏమీ కాదు),” తన కాయలుగట్టిన రెండు చేతులను చూపిస్తూ అన్నాడు అజయ్.
“చెట్టు ఎక్కుతున్నప్పుడు పట్టు బలంగా ఉండాలి. రెండు చేతులతో, కాళ్లతో చెట్టు మానును గట్టిగా పట్టుకోవాల”ని చెబుతూ, రెండు చేతుల వేళ్ళను ఎలా మెలిపెట్టి మాను చుట్టూ పెనవేయాలో అజయ్ చూపించాడు. సన్నగా, గరుకుగా ఉండే తాటి మానులను ఎక్కే కష్టతరమైన పని వలన అతని ఛాతీ పైన, చేతుల మీద, చీలమండల దగ్గర నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి.
“ 15 సాల్ కే రహియే తహియే సే ఇస్టార్ట్ కా దెలియే రా (నాకు 15 ఏళ్ళ వయసున్నప్పటి నుండి తాటిచెట్లు ఎక్కడం మొదలుపెట్టాను),” అంటూ 12 సంవత్సరాలుగా తాను చేస్తున్న పని గురించి ఈ గీత కార్మికుడు వివరించాడు.
రసూల్‌పుర్ గ్రామ నివాసి అయిన అజయ్, పాసీ సముదాయానికి చెందినవాడు. సంప్రదాయకంగా వీళ్ళు కల్లుగీత కార్మికులు – అజయ్ కుటుంబంలో కనీసం మూడు తరాలుగా ఇదే పని చేస్తున్నారు.
“మొదట్లో, నేను చెట్టు సగం ఎక్కి దిగుతుండేవాడిని,” అజయ్ గుర్తుచేసుకున్నాడు. అయితే, చిన్నతనం నుండే చెట్టు ఎక్కడంలో నైపుణ్యం సంపాదించాలని అతని తండ్రి అతనిని ప్రోత్సహించేవారు. “తాటిచెట్టు పైకెక్కి కిందకి చూస్తే, నా గుండె ఆగిపోతుందేమోనన్నంత భయమేసేది.”
“నేను మొదటిసారి తాటిచెట్టు ఎక్కినప్పుడు, నా ఛాతీ, చేతులు, కాళ్ళ నుండి రక్తం కారింది. కానీ, క్రమక్రమంగా ఈ శరీరభాగాలపై ఉండే చర్మం గట్టిపడింది,” తాటిచెట్లను ఎక్కీ దిగటంవల్ల మానుకు చర్మం ఒరుసుకుపోయి, తనకు కలిగిన గాయాల గుర్తులను చూపిస్తూ చెప్పాడు అజయ్.
అజయ్ సరాసరిన రోజులో ఉదయం ఒక ఐదు, సాయంత్రం మరో ఐదు తాటిచెట్లను ఎ క్కి దిగుతాడు. ఎండ తీవ్రతను తప్పించుకోవడానికి మధ్యాహ్నం పూట విరామం తీసుకుంటాడు. అతను రసూల్‌పుర్‌లో 10 తాటిచెట్లను గుత్తకు తీసుకున్నాడు. ప్రతి చెట్టుకి సంవత్సరానికి రూ.500, లేదా ఆ వెలకు సమానమైన నీరాని సదరు భూయజమానికి చెల్లిస్తున్నాడు.
“ బైసాఖ్ (ఏప్రిల్-జూన్) మే ఎగో తాడ్ సే 10 బోతల్ తాడీ నికలైఛయ్. ఒకరా బాద్ కమ్ హోయి లగై ఛయ్. (వైశాఖ మాసంలో ఒక్కో చెట్టు నుండి 10 సీసాల నీరా వస్తుంది. ఈ మంచి సీజన్ అయిపోయిన తరువాత, దిగుబడి తగ్గడం మొదలవుతుంది),” అని ఈ గీత కార్మికుడు తెలిపాడు.
నురుగలా ఉండే నీరా నుండి బెల్లం తయారుచేస్తారు, లేదంటే దాన్ని పులియబెట్టి కల్లు (toddy) తయారుచేస్తారు. “మేం ఈ నీరాని ఒక్కో సీసాను సుమారు రూ.10 చొప్పున పైకర్ (టోకు వ్యాపారి)కు అమ్ముతాం,” అజయ్ చెప్పాడు. ఒక్కో సీసాలో దాదాపు 750 మి.లీ. నీరా ఉంటుంది. బైసాఖ్ నెలలలో, అజయ్ రోజుకు రూ.1,000 వరకు సంపాదిస్తాడు. కానీ ఆ తరువాతి తొమ్మిది నెలల్లో అతని సంపాదన గణనీయంగా – దాదాపు 60-70 శాతం – పడిపోతుంది.
అజయ్ సరాసరిన రోజులో ఉదయం ఒక ఐదు, సాయంత్రం మరో ఐదు తాటిచెట్లను ఎక్కుతాడు. ఎండ తీవ్రతను తప్పించుకోవడానికి మధ్యాహ్నం పూట విరామం తీసుకుంటాడు
సీజన్ అయిపోయాక, సీసా ఒకటి రూ.20 చొప్పున, నేరుగా తన స్థానిక వినియోగదారులకు తన ఇంటి వద్దనే నీరాను విక్రయిస్తాడు అజయ్. ఈ పని ద్వారా వచ్చే ఆదాయంపైనే అతని భార్య, ముగ్గురు పిల్లలు ఆధారపడ్డారు.
భారతదేశంలో, పురుషుల అంతర్రాష్ట్ర వలసలు ఎక్కువగా నమోదవుతున్న ప్రధానమైన జిల్లాలలో సమస్తీపూర్ ఒకటి. కానీ, ఇక్కడే ఉంటూ, గీత కార్మికుడిగా పని చేయడానికి ఇష్టపడే అజయ్, తన చుట్టూ ఉన్న ధోరణికి భిన్నంగా బతుకుతున్నాడు.
*****
చెట్టెక్కడానికి ముందు, అజయ్ తన నడుము చుట్టూ డర్బాస్ (నైలాన్ బెల్ట్)ను గట్టిగా కట్టుకుంటాడు. ఆ డర్బాస్‌కు ఒక ఇనుప అకురా (కొక్కెం), ఒక ప్లాస్టిక్ డబ్బా, ఒక హఁసువా (కొడవలి) వేలాడుతుంటాయి. “10 లీటర్ల నీరాతో కిందకి దిగుతున్నప్పుడు కూడా కదలకుండా ఉండేలా డర్బాస్ ను గట్టిగా కట్టుకోవాలి,” అజయ్ వివరించాడు.
దాదాపు 40 అడుగుల ఎత్తున్న తాటిచెట్టును సగం వరకూ ఎక్కాక, జారుడుగా ఉండే మిగిలిన సగం మానును ఎక్కేందుకు అజయ్ తన పాదాల మధ్య ఒక సాగే పకసీ (తోలు/రెక్సిన్ పట్టీ)ని బిగించి, దాని సాయంతో చెట్టు మీద తన పట్టును మరింత బలంగా బిగించడాన్ని నేను గమనించాను.
అజయ్ ముందురోజు సాయంత్రమే తాటి మొవ్వలో ఒక గాటు పెట్టి, అక్కడ ఒక ఖాళీ లబనీ (మట్టి కుండ)ని అమర్చాడు. పన్నెండు గంటల తర్వాత, లబనీలో నిండిన సుమారు ఐదు లీటర్ల నీరాని సేకరించేందుకు మళ్ళీ చెట్టెక్కాడు. తేనెటీగలు, చీమలు, కందిరీగలు ఆశించకుండా, ఆ మట్టి కుండకు అడుగున క్రిమిసంహారక మందు పూయాలని అతను నాకు వివరించాడు.
చెట్టు చిటారున ఉన్న మట్టల మధ్య జాగ్రత్తగా కూర్చున్న అజయ్, కొడవలితో లేత మొవ్వలకు తాజాగా గాట్లు పెట్టాడు. ఖాళీ చేసిన లబనీ ని మళ్ళీ అక్కడే అమర్చి కిందకి దిగాడు. ఈ మొత్తం ప్రక్రియ 10 నిమిషాల్లో అయిపోయింది.
సమయం గడిచే కొద్దీ నీరా చిక్కగా, పుల్లగా మారుతుంది. అందుకే, అజయ్ నాకో సలహా ఇచ్చాడు: “ తాడ్ కే తాడీకో పేడ్ కే పాస్ హీ పీ జానా చాహియే, తబ్ హీ ఫాయదా హోతా హై (నీరాని తాటిచెట్టు నుండి దింపగానే తాగాలి. అప్పుడే అది మేలు చేస్తుంది).”
కల్లు తీయడం ఎన్నో ప్రమాదాలతో కూడుకున్న జీవనోపాధి - చెట్టు పై నుండి ఏ మాత్రం అదుపుతప్పి కింద పడినా ప్రాణం పోతుంది, లేదా శాశ్వత అంగవైకల్యంతో బతకాలి.
మార్చి నెలలో అజయ్ గాయపడ్డాడు. “చెట్టు మాను పై నుండి నా చేయి జారిపోయి నేను కింద పడ్డాను. నా మణికట్టుకి గాయమైంది.” ఆ తరువాత దాదాపు నెలరోజుల వరకు అతను చెట్టెక్కలేకపోయాడు. ఈ ఏడాది ప్రారంభంలో, అజయ్ బంధువొకరు – అతను కూడా కల్లు గీస్తాడు – తాటిచెట్టు పై నుండి కింద పడిపోవడంతో, అతని నడుము, కాళ్ళు విరిగాయి.
అజయ్ మరొక తాటిచెట్టెక్కి, కొన్ని ముంజకాయలను కిందకి విసిరాడు. ఒక కొడవలితో ఆ కాయలను ఒలిచి, లోపలున్న ముంజలను రుచి చూడమని నాకు అందించాడు.
“ లీజియే, తాజా-తాజా ఫల్ ఖాయియే. షెహెర్ మే తో 15 రూపయే మే ఏక్ ఆంఖ్ మిల్తా హోగా (తీసుకోండి, తాజా తాజా ముంజలను తినండి. నగరంలో ఒక్కో ముంజ మీకు రూ.15కు దొరుకుతుండొచ్చు),” అతను నవ్వుతూ అన్నాడు.
అజయ్ కొంతకాలం నగర జీవితాన్ని కూడా రుచిచూశాడు- అదొక వృథాప్రయాస అని అతను అభిప్రాయపడ్డాడు. కొన్నేళ్ళ క్రితం అతను ఢిల్లీ, సూరత్‌లకు భవననిర్మాణ కూలీగా పనిచేసేందుకు వలస వెళ్ళాడు. అక్కడ అతనికి రోజుకు రూ.200-250 వచ్చేవి కానీ, "నాకు అక్కడ పనిచేయాలనిపించలేదు. సంపాదన కూడా తక్కువే," అన్నాడతను.
కల్లు అమ్ముకుంటే వచ్చే సంపాదనతో అతను సంతృప్తి చెందుతున్నాడు.
కల్లు తీసే పనిలో పోలీసుల నుండి దాడులు కూడా ఎదుర్కోవలసి ఉంటుందనేది నిజమే. బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టం-2016 ప్రకారం, పులియబెట్టిన కల్లుతో సహా మద్యం, ఇతర మత్తు పదార్థాలను “తయారుచేయడం, సీసాలలో నింపడం, పంపిణీ చేయడం, రవాణా చేయడం, సేకరించడం, నిల్వ చేయడం, తమ దగ్గర ఉంచుకోవడం, లేదా తాగడం” వంటివి నిషేధం. అయితే, ఇంతవరకూ బిహార్ పోలీసులు రసూల్‌పుర్‌పై దాడి చేయలేదన్నది నిజమే, కానీ “పోలీసులు ఇప్పటివరకూ ఇక్కడికి రాలేదు కాబట్టి ఎప్పటికీ రారు అనుకోవడానికేం లేదు,” అన్నాడు అజయ్.
పోలీసులు తమను తప్పుడు కేసుల్లో ఇరికించారని చాలామంది ఆరోపించడం నుంచి అతనిలో భయం మొదలైంది. పోలీసులు "ఎప్పుడైనా రావచ్చు,” అన్నాడతను.
కానీ అజయ్ ఈ ప్రమాదాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. “ఈ రసూల్‌పుర్‌లో నేను నా కుటుంబంతో కలిసి బతకాలి,” తన అరచేతుల్లో ఖైనీ (పొగాకు)ని రుద్దుతూ చెప్పాడతను.
ఫట్ఠే (వెదురు కర్ర) పై మట్టి వేసి, దానిపై తన కొడవలికి పదును పెట్టాడు అజయ్. తన పనిముట్లను సిద్ధం చేసుకొని, మరొక తాటిచెట్టు వైపుకు నడిచాడు .
ఈ కథనానికి రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల కోసం పోరాడుతూ జీవితాన్ని గడిపిన బిహార్‌కు చెందిన ట్రేడ్ యూనియన్ నాయకుడి జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన ఫెలోషిప్ మద్దతు ఉంది.
అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి