ఆ వర్క్ షాప్ దగ్గర నేమ్ బోర్డు లేదు! “ యే తో ఏక్ గుమ్నామ్ దుకాన్ హై (ఇది కేవలం ఒక అనామక దుకాణం),” అని మొహమ్మద్ అజీమ్ అన్నారు. 8x8 అడుగులున్న ఆ షెడ్డుకున్న ఆస్బెస్టాస్ గోడలు మసి, సాలెగూళ్ళతో నిండి ఉన్నాయి. ఒక మూల చిన్న ఇనప కొలిమి ఉంది; షెడ్డు మధ్యలో, నల్లగా కాలిన మట్టి కుప్పపై నీలిరంగు టాపోలిన్ (tarpaulin) షీట్ కప్పబడి ఉంది.
ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు, పశ్చిమ హైదరాబాద్‌లో దూద్ బౌలిలోని ఇరుకైన సందుల గుండా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి, అజీమ్ తన వర్క్ షాప్ దగ్గర దాన్నిపార్క్ చేస్తారు; ఆ షెడ్డు ప్రహరీ గోడ అవతల హకీమ్ మీర్ వజీర్ అలీ స్మశానవాటిక ఉంది.
మురికి ప్లాస్టిక్ డబ్బాలు, తుప్పు పట్టిన లోహపు పెట్టెలు, విరిగిన బకెట్లు, వివిధ రకాల పనిముట్లు నేలపై చెల్లాచెదురుగా పడిపోయి, అసలు కదలడానికి కూడా జాగా లేని ఆ దుకాణంలో – ఇసుక క్యాస్టింగ్ ద్వారా లోహపు టోకెన్లను తయారు చేస్తూ – అతను తన రోజుని ప్రారంభిస్తారు.
28 ఏళ్ల అజీమ్ అచ్చు వేసే ఈ టోకెన్లను (లేదా నాణేలను), ఇప్పటికీ హైదరాబాద్ లోని కొన్ని పాత టీ కొట్లు, రెస్టారెంట్లు ఉపయోగిస్తున్నాయి. గతంలో ఇలాంటి క్యాంటీన్ టోకెన్లను మిల్లులు, మిలిటరీ అవుట్లెట్లు, రైల్వేలు, బ్యాంకులు, క్లబ్‌లు, సహకార సంఘాలు, ఇతర సంస్థలు ఉపయోగించేవి. కాలక్రమేణా ప్లాస్టిక్ నాణేలు/పేపర్ రసీదులు అందుబాటులోకి రావడంతో, ఈ లోహపు టోకెన్లకు ఉండే గిరాకీ బాగా పడిపోయింది. కానీ, ఇప్పటికీ హైదరాబాద్ లోని కొన్ని రెస్టారెంట్లు, తమ రోజువారీ ఆదాయాన్ని లెక్కించేందుకు వీటిపైనే ఆధారపడ్డాయి: కస్టమర్లు ఏదైనా ఆర్డర్ చేస్తే, ఆ వంటకానికి సంబంధించిన నాణేలు వారికి ఇచ్చి, వాటి ఆధారంగా మొత్తం ఆదాయాన్ని లెక్కిస్తాయి.
ప్రస్తుతం ఈ నాణేలను తయారుచేసే నైపుణ్యం కలిగిన కొద్దిమంది హస్తకళాకారులలో – కేవలం 10 కంటే తక్కువ మంది మాత్రమే హైదరాబాద్ లో ఉన్నారు – తానూ ఒకడని అజ్జూ (అజీమ్ కుటుంబ సభ్యులు, దుకాణదారులు అతనికి పెట్టిన ముద్దు పేరు) అంచనా.
అతను తయారుచేసిన పలురకాల టోకెన్లు నాకు చూపించారు. వాటిపై కొన్ని ఆంగ్ల పదాలు ముద్రించబడి ఉన్నాయి – టీ, అన్నం, ఇడ్లీ, పాయ, చేపలు, CBS (చికెన్ బిర్యానీ సింగిల్), CBJ (చికెన్ బిర్యానీ జంబో), MBS (మటన్ బిర్యానీ సింగిల్), MBJ (మటన్ బిర్యానీ జంబో)- మొదలైనవి. కొన్ని టోకెన్లపై వంటకాల నమూనాలు ముద్రించబడి ఉన్నాయి – టీపాట్, చేపలు, కోడి, మేక, దోస లాంటివి.
“ఈ నాణేలను తయారుచేయడంలో మాకు మంచి నైపుణ్యం ఉంది. ఒకప్పుడు వాటిని కొనుగోలు చేయడానికి హైదరాబాద్ నలుమూలల నుండి చాలామంది దుకాణదారులు ఇక్కడికి వచ్చేవారు. కానీ, ఇప్పుడు వ్యాపారం డీలా పడింది,” అని అరవయ్యో పడిలో ఉన్న అజీమ్ మామగారు-సాంప్రదాయ కమ్మరి (మౌల్డర్) మొహమ్మద్ రహీం తెలిపారు.
అజీమ్ తాతలు కూడా లోహపు పని (క్యాస్టింగ్) చేసేవారు. హైదరాబాద్ చివరి నిజాం హయాంలో (1911-1948) అతని ప్యాలెస్ కోసం టోకెన్లు, అలంకరణ వస్తువులను తయారుచేశారు. అలాగే, వారు లోహంతో రకరకాల గృహాలంకరణ వస్తువులను రూపొందించేవారని రహీం వివరించారు. తన పనితనం గురించి చెబుతూ, తాను నాణేలపై యజమానుల పేర్లు చెక్కి, వాటిని వారి వారి సైకిళ్లకి బిగించేవాడినన్నారు. ఇంతలో, కొన్నాళ్ల క్రితం ఒక సైకిల్ కోసం తన తండ్రి తయారుచేసిన ఒక లోహపు పలకను అజీమ్ నాకు చూపించారు.
అజీమ్ తండ్రి మొహమ్మద్ ముర్తుజా, నాణేల తయారీలో సిద్ధహస్తుడు కావడం చేత, ఈ ప్రాంతంలో దాదాపు ప్రతి ఒక్కరూ అతని దగ్గరే నాణేలు చేయించుకునేవారు. కానీ దశాబ్దాల క్రితం, అజ్జూ పుట్టకముందు, కొలిమి పేలిన దుర్ఘటనలో ముర్తుజా తీవ్రంగా గాయపడడంతో, అతని కుడి చేతిని తీసేయాల్సి వచ్చింది.
అయినప్పటికీ, ముర్తుజా-రహీంలు తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగించారు. అయితే, మొదటిసారి క్యాస్టింగ్ పని ప్రారంభించినప్పుడు తన వయసెంతో అజీమ్ కి గుర్తులేదు. అతను 4వ తరగతి వరకే చదివారు; స్నేహితుడితో గొడవ పడినందుకు, అతని చదువు మాన్పించి తనను ఈ పనిలో కుదిర్చారు ముర్తుజా. ఇప్పుడు, నాణేల తయారీ మాత్రమే అజీమ్ కు తెలిసిన ఏకైక విద్య.
దశాబ్దాలుగా ఆ కుటుంబం తమ దుకాణాన్ని అనేక సార్లు తరలించాల్సి వచ్చింది – కూల్చివేతల వలన, కొలిమి నుండి వచ్చే పొగ కారణంగా నమోదైన ఫిర్యాదుల వలన, స్థల పరిమితుల వలన- ఇలా అనేక కారణాలు. ఒకసారి చార్మినార్ సమీపంలోని షెడ్డు నుండి అదే ప్రాంతంలో చిన్న మసీదు పక్కనున్న దుకాణంలోకి మారితే, కొన్నిసార్లు వారి మూడు గదుల ఇంట్లోనే ఒక గదిలో కొలిమిని ఏర్పాటు చేసుకొని పనిచేయాల్సి వచ్చింది. అలా ఇంటి నుండి పని చేసినప్పుడు, అజీమ్ భార్య నజీమాబేగం సమీపంలో ఉండే మైదానాల నుండి మట్టిని తీసుకొచ్చి, దాన్ని జల్లెడ పట్టి, అచ్చులలో నింపేవారు.
మార్చి 2020 లో లాక్డౌన్ సమయంలో ప్రారంభమైన నెలావారి అంగవైకల్య పెన్షన్ రూపేణా వచ్చే రూ. 2,000 ముర్తుజా కుటుంబాన్ని ఎంతగానో ఆదుకున్నాయి. అజీమ్ ముగ్గురు అక్కాచెల్లెళ్లు, వివాహితులు-గృహిణులు; అతని తమ్ముడు ఒక ద్విచక్ర వాహన షోరూంలో వెల్డింగ్ పని చేస్తున్నారు.
ఏప్రిల్ 2020 లో, ముర్తుజా చనిపోవడంతో (అజీమ్ తల్లి ఖాజా 2007 లో మరణించారు) పెన్షన్ రావడం ఆగిపోయింది. దాంతో, నవంబర్ 2020 లో, ఎక్కువ మంది కస్టమర్ల దృష్టిని ఆకర్షించి, ఆదాయాన్ని పెంచుకునే ఉద్దేశ్యంతో, స్మశానవాటిక పక్కనే ఉన్న ఒక దుకాణాన్ని అజీమ్ అద్దెకు తీసుకున్నారు. కానీ, అది ఫుట్ పాత్ పై ఉండడంతో, అధికారులు ఎప్పుడైనా దానిని కూల్చివేస్తారని ఆయన భయపడుతున్నారు.
నేను ఆ దుకాణానికి వెళ్ళిన ముందురోజే, బేగంపేట్ లో ఉన్న ఒక రెస్టారెంట్ నుండి అతనికి ఆర్డర్ వచ్చింది.
వెంటనే పని మొదలు పెడుతూ, ముందుగా ఆ రెస్టారెంట్ ఇచ్చిన ఆర్డర్ ఆధారంగా సదరు వంటకం నిర్దిష్ట ఆకారాన్ని ఎంచుకోవాలి – ఉదాహరణకి టీ కప్పు లేదా చేప – అని అజీమ్ చెప్పారు. ఈ ఆకృతుల యొక్క మాస్టర్ టోకెన్లను తెల్లని లోహం (లెడ్ మరియు లిథియం లోహాల సమ్మిశ్రణం)తో తయారుచేస్తారు; ఎన్నో ఏళ్ల నుండి అజీమ్ దగ్గర ఆ మాస్టర్ టోకెన్లు ఉన్నాయి. అతను ఆ ప్రతిరూపాలను సృష్టించే క్లిష్టమైన ప్రక్రియను ప్రారంభించారు.
ఇందులో భాగంగా, ఒక చెక్క పలకపై పేటీ (మెటల్ ఫ్రేమ్ లేదా అచ్చు)ని నిలిపి, దానిపై కొంత సంజీర (కాస్టింగ్ పౌడర్) చల్లారు. "ఇసుక కణాలకు నాణేలు అంటుకు పోకుండా ఈ పౌడర్ (పొడి) నిరోధిస్తుంది," అని వివరిస్తూ, అజీమ్ తనకు కావలసిన ఆకారంలో ఉండే టోకెన్లను ఒక్కొక్కటిగా ఆ బోర్డుపై పెట్టారు.
ఆ తర్వాత, పేటీ లో నాల్గవ వంతు భాగం, బైండింగ్ ఏజెంట్ (బెల్లంతో చేసిన గోధుమ రంగు ద్రవం)తో కలిపిన ఇసుక రజనుతో నింపారు. పెద్ద కణాలను జల్లెడ పట్టి తొలగించాకే, మట్టి లేదా ఇసుక వాడాలని ఆయన తెలిపారు. ఆ వెంటనే, అస్తర్ మిట్టి (బేస్ మట్టి)లో జిగురు లాంటి మిశ్రమాన్ని, నీలిరంగు టాపోలిన్ కింద కప్పి ఉంచిన (మునుపటి క్యాస్టింగ్ పనుల వల్ల) నల్లగా కాలిన మట్టిని జోడించారు.
పేటీ మొత్తం దాదాపు నిండిన తర్వాత, అజీమ్ తన కాళ్లతో ఆ మట్టిని బలంగా తొక్కి, ఫ్రేమ్‌ను తలక్రిందులు చేశారు. దాంతో, ఆ మిశ్రమంపై నాణేల ఆకృతి పొందుపరచబడింది. అచ్చు ఒక మూతతో కప్పబడి ఉంటుంది; అతను దానిపై మరికొంత సంజీరా పొడి, అస్తర్ మిట్టి మరియు కాలిన మట్టిని పొరలు పొరలుగా చల్లి, దాన్ని మళ్ళీ తొక్కారు. ఇదంతా పూర్తయ్యేసరికి, అతని పాదాలకు మట్టి-మసి అంటుకొని, నల్లగా తయారయ్యాయి!
అదనంగా ఉన్నఇసుకను తొలగించి, పేటీ ని తెరిచి, సునిశితంగా మాస్టర్ టోకెన్లను తీసి చూస్తే, ఆ మట్టి మిశ్రమంలో క్యావిటీల (ఘన పదార్థంలో ఏర్పడే గుల్ల ప్రదేశాలు) రూపంలో నగిషీలు పొందుపరచబడి ఉన్నాయి.
ఒక చిన్న కర్రతో రంధ్రాలు చేసి, వాటి గుండా కరిగిన అల్లూమినంను ఆ మట్టి మిశ్రమంలో పోశారు అజీమ్. అదే కర్రతో కావిటీస్ లోపల మట్టి/ఇసుకని సమం చేస్తూ, మునుపటి ఆర్డర్లలో భాగంగా రూపొందించిన నగిషీలను – ఉదాహరణకు మరొక రెస్టారెంట్ పేరు – చెరిపేశారు. ఆ తర్వాత, పేటీని మూసివేసి, దానిని గట్టిగా పట్టుకొని, పైన ఒక చెక్క పలకను ఉంచారు. ఇప్పుడు క్యాస్టింగ్ చేయాలి.
ఇందులో భాగంగా, చేతితో పట్టుకునే బ్లోయర్ (కొలిమితిత్తి) ద్వారా భట్టీ (కొలిమి)లోకి బొగ్గును కాల్చారు. బొగ్గు బాగా వేడెక్కిన తర్వాత, ఉపయోగించని పాత అల్లూమినం నాణేలు లేదా ఘనపదార్ధపు ముక్కలతో ఒక లోహపు గిన్నెను లోపల అమర్చారు. ఇవి కరిగినప్పుడు, హోల్డర్ని ఉపయోగించి, వేడి ద్రవాన్ని పేటీలో పోశారు. ఎలాంటి రక్షణ కవచం లేకుండానే అజీమ్ ఈ పనంతా చేశారు. “ఇలా పనిచేయడం నేను అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే, రక్షణ పరికరాలు కొనడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం,” అని ఆయన తెలిపారు.
ఆ తర్వాత, ద్రవ స్థితిలో ఉన్న లోహం ఘనీభవించిన కొన్ని నిముషాలలోనే అచ్చు తెరిచి, కొత్త నాణేలను బైటికి తీసి, ఫైల్ సహాయంతో వాటి అంచులను పదును చేశారు. “ యే రహా హమారా కాయిన్ (ఇదిగో నా నాణెం)," అంటూ అజీమ్ తన అరచేతిలో దాగిన ఆ చిన్న లోహపు వస్తువును గర్వంగా నాకు చూపించారు.
తదుపరి దశలో, నాణేలపై వంటకాలు, రెస్టారెంట్ల పేర్లను ఆంగ్లంలో చెక్కాలి. ఇందుకోసం, తాజాగా ముద్రించిన అల్లూమినం టోకెన్లపై సుత్తితో అక్షరాలు-సంఖ్యల పంచ్‌లు వేయాలి. కొత్త నగిషీలతో తయారుచేయబడిన ఈ నాణేలను క్యాస్టింగ్ ప్రక్రియలో తిరిగి ఉపయోగించవచ్చు.
“నాణేల సంఖ్య (ఒక బ్యాచ్) పేటీపై ఆధారపడి ఉంటుంది. నా దగ్గర 12 వేర్వేరు సైజులు ఉన్నాయి,” అని అజీమ్ తన వద్దనున్న ఫ్రేమ్‌లను చూపించారు. 15x9 అంగుళాల మీడియం-సైజ్ పేటీలో అతను ఒకేసారి 40 టోకెన్లను తయారు చేయగలరు. ఎక్కువ ఆర్డర్లు వస్తే, రోజుకు 10 గంటలు పని చేస్తూ, 600 నాణేలు తయారు చేస్తారు.
అరుదైన సందర్భాలలో, కొత్త ఆకృతుల్లో తెల్ల లోహపు మాస్టర్ కాయిన్ తయారు చేయాల్సి వచ్చినప్పుడు, అజీమ్ తన కస్టమర్లను సదరు డిజైన్ యొక్క 3డి ప్లాస్టిక్ ప్రతిరూపాన్ని తీసుకురమ్మని అడుగుతారు (అజీమ్ తండ్రి ముర్తుజా, తన చేతులతో కొత్త ఆకృతులను అవలీలగా రూపొందించేవారు). కానీ, దీనికి చాలా ఖర్చవుతుందని, అతని వినియోగదారులలో ఎక్కువమంది పాత డిజైన్లనే పునరావృతం చేయడానికి ఇష్టపడతారు.
ప్లాస్టిక్ నాణేల కంటే లోహపు నాణేల మన్నిక ఎక్కువ, ధర తక్కువని ముహమ్మద్ మోహీన్ తెలిపారు. అజీమ్ షెడ్డు నుండి 13 కిలోమీటర్ల దూరంలో, బేగంపేట్ లో ఉన్న ఒక హోటల్లో అతను వెయిటర్‌గా పనిచేస్తున్నారు. “మాది మాన్యువల్ లెక్కింపు వ్యవస్థ. మా కస్టమర్లు కూడా నాణేలను ఇష్టపడతారు. మేము ప్రతి వంటకం కోసం 100 నాణేలను తయారు చేయిస్తాం. వీటిని ఒకసారి వాడితే, ఆ వంటకం 100 మందికి వడ్డించామని అర్ధమవుతుంది. రోజువారీ ఆదాయాన్ని ఇలాగే లెక్కిస్తాం. చదువు రాకపోవడంతో మేము ఈ టోకెన్ల వ్యవస్థకి బాగా అలవాటుపడ్డాం,” అని ఆర్డర్ ఇవ్వడానికి వచ్చిన మోహీన్ వివరించారు.
ఒక టోకెన్ తయారు చేయడానికి అజీమ్ రూ.3 తీసుకుంటారు. కానీ 1,000 నాణేల కంటే తక్కువ ఉన్న ఆర్డర్లకు రూ. 4 చొప్పున తీసుకుంటారు. “నాకు ప్రతిరోజూ ఆర్డర్లు రావు. వారానికి 2-3 సార్లు మాత్రమే వస్తాయి. కొంతమంది కస్టమర్లు నా దుకాణం దగ్గరికి వస్తుంటారు. కొంతమంది నాకు కాల్ చేసి ఆర్డర్ పెడుతుంటారు; కొంతమందికి 300 నాణేలు కావాలి, కొంతమందికి 1,000 నాణేలు కావాలి. ఈ కారణంగానే నాకు స్థిరమైన ఆదాయం ఉండదు; ఒక్కోసారి వారంలో రూ.1,000 మాత్రమే వస్తే, ఒక్కోసారి రూ.2,500 వరకు సంపాదిస్తుంటాను!”
అలాగే, కొన్నిసార్లు ఆర్డర్ పెట్టినా కూడా టోకెన్లను తీసుకోడానికి కస్టమర్లు రారు. తన షెడ్డులో పైన అరలో దాచి ఉంచిన అలాంటి ఒక టోకెన్ల సెట్ ను చూపిస్తూ, "నేను ఈ 1,000 నాణేలను తయారు చేశాను కానీ, సదరు కస్టమర్ ఇప్పటివరకూ రాలేదు," అని బాధపడ్డారు. ఇలా కొన్ని రోజులు వేచి చూసి, క్లెయిమ్ చేయని ఆ టోకెన్లను మళ్ళీ కరిగించి, అతను వేరే నాణేలు తయారు చేస్తుంటారు.
ఇదిలా ఉంటే, తన సంపాదనలో ఎక్కువ భాగం రెండు షాపుల అద్దెకు ఖర్చవుతోందని అజీమ్ వాపోయారు – మసీదు దగ్గరున్న పాత దుకాణానికి రూ.800 (కస్టమర్లను ఆకర్షించేందుకు ఉపయోగపడుతోంది; పైగా రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్నా తక్కువ అద్దెకు దొరకడంతో దాన్ని కొనసాగిస్తున్నారు)చెల్లిస్తే, స్మశానవాటిక పక్కనున్న ఆస్బెస్టాస్ షెడ్డు కోసం రూ.2,000 చెల్లిస్తున్నారు. " ఇది కాకుండా, ప్రతి నెలా పాఠశాల ఫీజులు, కిరాణా, ఇతర గృహావసరాల కోసం సుమారు రూ.6,000-7,000 వరకు ఖర్చవుతుంది," అని అజీమ్ తెలిపారు. అయితే, వేడి నీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్టుగా, అతని తమ్ముడు కూడా కుటుంబ భారాన్ని పంచుకుంటున్నారు.
సాధారణంగా మధ్యాహ్న సమయంలో, తన దుకాణానికి ఒక కిలోమీటరు దూరంలో, మొయిన్పురాలో ఉన్న తన ఇంటికి అజీమ్ తిరిగి వస్తారు. అతని ఇంట్లో ఎలాంటి ఫర్నిచర్ లేదు; సిమెంట్ బండలపై ప్లాస్టిక్ చాపలు మాత్రం పరిచి ఉన్నాయి. “నా పిల్లలు ఈ క్యాస్టింగ్ పని చెయ్యాలని నేను కోరుకోవడం లేదు. కొలిమి, వేడి లోహాలతో పనిచేయడం చాలా ప్రమాదకరం,” అని అతను చెప్పారు.
"నా పిల్లలకు సురక్షితమైన భవిష్యత్తు కావాలి. నాకు సాధ్యమైనంత వరకు వారికి నాణ్యమైన విద్యను అందించాలనుకుంటున్నాను," అని అజీమ్ భార్య నజీమా కూడా అన్నారు. వారి మూడేళ్ల కుమార్తె సమీరా ఆమెను అంటిపెట్టుకొని ఉంటే, ఆరేళ్ల కుమారుడు తాహిర్ ఒక మూల ఆడుకుంటూ కనబడ్డాడు. అతని చేతిలో కొన్ని నాణేలు, అతని తాతయ్య తన కోసం తయారు చేసిన చిన్న ఇనుప సుత్తి ఉన్నాయి!
అనువాదం: వై క్రిష్ణ జ్యోతి