“పుట్టినప్పటినించి ఇంతే, నేను ఒక కూలీగానే పని చేసాను,” ఆగష్టు నెలలోని పలచని మంచులో తన ఇంటి నుంచి పొలానికి చకచకా నడుస్తూ, అన్నది రత్నవ్వ ఎస్.హరిజన్, ఆమె అక్కడ దినవారి కూలీగా పనిచేస్తుంది. జీవంతో తొణికిసలాడుతున్న ఆమె కాస్త ఒంగి గబగబా నడుస్తుంటే ఆమెకుర్ర వయసులో కుంటుపడిన కాలు కూడా బయటకు తెలియడం లేదు.
పొలానికెళ్లగానే ఆమె తనతో తెచ్చుకున్న పని బట్టలు బయటకు తీసింది. ముందు ఆమె తాను కట్టుకున్న చీర మీద ఒక నీలం చొక్కాని వేసుకుంది. ఆ తరువాత పుప్పొడి దుమ్ము నుండి కాపాడుకోవడానికి ఒక పసుపు ప్రింట్ ఉన్న నైటీని తన నడుము చుట్టూ కట్టుకుంది. దానిమీద ఒక చిరిగిపోయిన నీలి షిఫాన్ బట్టను సంచిలాగా కట్టుకుంది. అందులో ఆమె బెండ మొక్కల కొన్ని గండు హువు (మగ పూవు) వేసుకుంటుంది. కొన్ని దారాలను చేతిలో పట్టుకుని, నెత్తి మీద ఒక తెల్లగుడ్డ వేసుకుని, ఈ 45 ఏళ్ళ రత్నవ్వ, తన పనిని మొదలుపెడుతుంది.
ఆమె ఒక పూవును తీసుకుని దాని పూరెక్కలను సున్నితంగా వంచి మగ పూవు నుంచి పుప్పొడిని ప్రతి కీలాగ్రానికి రాస్తుంది. అలా చేసిన పూవుని గుర్తుపట్టడానికి దాని చుట్టూ ఒక దారాన్ని కడుతుంది. ఆమె వెన్ను వంచి, ఒక పూవు నుండి మరో పువ్వుకు కదులుతూ, లయబద్దంగా అన్ని బెండ మొక్కలలో ప్రతి పూవుని పరాగసంపర్కానికి సిద్ధం చేస్తుంది. ఆమె చేతి -పరాగసంపర్కంలో నైపుణ్యం చెందింది- చిన్నప్పటినుంచి ఆమె వృత్తి ఇదే.
రత్నవ్వ మాదిగ వర్గానికి చెందినది. కర్ణాటకలో ఇది ఒక దళిత కులం. ఆమె కర్ణాటకలోని హవేరి జిల్లాలో రాణిబెన్నూర్ తాలూకాలో కొననతాలి గ్రామం లోని మాదిగ కేరి(మాదిగ యిల్లు)లో నివసిస్తున్నది.
ఆమె ప్రతి రోజు నాలుగు గంటలకు నిద్ర లేస్తుంది. తన ఇంటి పనులన్ని చక్కబెట్టుకుని, ఇంటిలో అందరికి అల్పాహారం అందించి, మధ్యాహ్నానికి భోజనం వండిపెట్టి, త్వరగా ఏదో ఒకటి తిని, 9 గంటలకు పొలానికి వెళ్ళిపోతుంది.
రోజులో మొదటి సగంలోనే 200 బెండ మొక్కలను సంపర్కం చేయిస్తుంది. ఇది మూడెకరాల పొలంలో సగం కన్నా ఎక్కువ. ఆమె మధ్యాహ్నం అరగంట పాటు భోజనం చేయడానికి పని నుండి విరామం తీసుకుంటుంది. ఆ తరవాత మొగ్గలపై పొరలను తీయడానికి మళ్లీ పని మొదలుపెడుతుంది. ఈ పనికి ఆమె యజమాని రోజుకు 200 రూపాయిలు ఇస్తాడు.
ఆమె చేతి పరాగ సంపర్క పద్ధతులను త్వరగానే నేర్చుకుంది. “మాకు స్వంత భూమి లేదు, అందుకనే మేము వేరే వారి పొలాలలో పనిచేయవలసి వస్తుంది.” అన్నది. “నేను స్కూల్ కి వెళ్ళలేదు. నేను రజస్వల కాకముందే పని చేయడం మొదలుపెట్టాను. మేము పేదవాళ్లం కదా, మేము పని చేయకపోతే గడవదు. ఆ సమయంలో నేను కలుపు తీస్తుండేదాన్ని, టమాటో పంటలను చేతితో సంకర ఫలదీకరణం చేసేదాన్ని. “ ఆమె క్రాస్ లేదా క్రాసింగ్ అన్న మాటలను పూలను ఆమె చేతితో చేసే పర పరాగ సంపర్కం గురించి వాడుతుంది
రత్నవ్వ రాణిబెన్నూరు తాలూకాలోని తిరుమలదేవరకొప్ప గ్రామంలో భూమిలేని వ్యవసాయ కూలీల కుటుంబంలో జన్మించింది. హవేరిలో మొత్తం కార్మికుల్లో వ్యవసాయ కూలీలు 42.6 శాతం ఉన్నారు. ఈ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో, దాదాపు 70 శాతం మంది కూలీలు, మహిళలే. (జనగణన 2011). కాబట్టి రత్నవ్వ చిన్నతనంలోనే పనిచేయడం ప్రారంభించడం అసాధారణం కాదు.
రత్నవ్వ ఇంటిలో ఆమెతో కలిపి ఎనిమిది మంది పిల్లలున్నారు. వారిలో ఎక్కువ మంది అమ్మాయిలు, వారిలో రత్నవ్వే పెద్దది. ఆమెకు కోననతలిలో వ్యవసాయ కూలీ అయిన సన్నచౌదప్ప ఎం హరిజన్తో పెళ్లి జరిగింది. "మా నాన్న బాగా తాగేవాడు. కాబట్టి నేను రజస్వల అయిన ఒక సంవత్సరంలోపే పెళ్లి చేసేశారు. అప్పుడు నా వయస్సు ఎంతో నాకు తెలియదు,” అని ఆమె చెప్పింది.
తిరుమలదేవరకొప్పలో రత్నవ్వ చేతితో మొక్కలను పరాగసంపర్కం చేసి రోజుకు 70 రూపాయిలు సంపాదించేది. 15 సంవత్సరాల క్రితం ఆమె కోననతలిలో పని చేయడం ప్రారంభించినప్పుడు, ఆమె వేతనం రూ. రోజుకు 100 రూపాయిలు ఉండేదని ఆమె చెప్పింది. "వారు [భూస్వాములు] ప్రతి సంవత్సరం పది-పది రూపాయలు పెంచుతూ వచ్చారు, ఇప్పుడు నాకు 200 రూపాయలు వస్తున్నాయి."
కోననతలిలో విత్తన ఉత్పత్తిలో చేతి-పరాగసంపర్కం అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఇక్కడ బెండ, టమోటా, బీర,గుమ్మడి, దోసకాయల వంటి కూరగాయల వివిధ హైబ్రిడ్ లను పండిస్తారు. ఇది సాధారణంగా వర్షాకాలం లేదా శీతాకాలంలో జరుగుతుంది. ఇక్కడ గ్రామంలో ఉత్పత్తి అయ్యే వ్యవసాయ వస్తువులలో పత్తి తరువాత, కూరగాయల విత్తనాలదే ప్రాధాన్యత. ఇక్కడ నికర విత్తనాల విస్తీర్ణం 568 హెక్టార్లు (2011 జనాభా లెక్కల ప్రకారం). దేశంలో కూరగాయల విత్తనాల ఉత్పత్తిలో కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ప్రైవేట్ రంగం ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
శ్రమ, నేర్పు మాత్రమే కాకుండా చేతి-పరాగసంపర్కానికి పదునైన దృష్టి, చురుకైన చేతులు, అపారమైన సహనం, ఏకాగ్రతతో కూడిన పనివారు అవసరం. పూవులోని అతిచిన్న భాగాన్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించడానికి మగవారికంటే కంటే ఆడవారికే ప్రాధాన్యత ఎక్కువగా ఉంది - అందుకే ఈ పని అవసరమైన కాలంలో పొరుగు గ్రామాల నుండి మహిళా వ్యవసాయ కూలీలను కొననాతలికి తీసుకురావడానికి ఆటోరిక్షాలను నియమించారు.
ఏ రోజు అవసరమైతే ఆ రోజు, రత్నవ్వ అంబిగా(ఇతర వెనుకబడిన తరగతులు, లేదా OBC, కేటగిరీలో జాబితా చేయబడింది) వర్గానికి చెందిన భూ యజమాని పరమేశప్ప పక్కిరప్ప జాదార్ పొలంలో పనిచేస్తుంది. ఆమెకు 1.5 లక్షల రూపాయిల అప్పు ఉంది. ఆమె అతని నుండి వడ్డీ లేకుండా తీసుకున్న అప్పు , తన పనికి అడ్వాన్స్ చెల్లింపుగా పరిగణించబడుతుందని ఆమె చెప్పింది.
"ఇప్పుడు నా చేతిలో డబ్బు లేదు. మా యజమాని నేను పని చేసిన రోజులను లెక్కించి నేను పని చేసిన రోజుల కూలీని అప్పు కోసం చెల్లించుకున్నాడు.” అని ఆమె చెప్పింది. "మేము వారి పొలంలో పని చేసి మా అప్పుని తీరుస్తాము. ఆ తరువాత అవసరమైనప్పుడు మళ్లీ అప్పు తీసుకుంటాం. కాబట్టి మేము అప్పులు తీసుకోవడం, తిరిగి చెల్లించడం జరుగుతూనే ఉంటుంది.”
రత్నవ్వకు వర్షాకాలంలో పని చాలా కష్టంగా గడుస్తుంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు, ఓక్రా, దోసకాయ మొక్కలకు పరాగసంపర్కం చేస్తారు. దోసకాయల సంపర్కానికి ఎలాంటి విరామాలు లేకుండా కనీసం ఆరు గంటలు ఒకే వరుసన పనిచేయడం అవసరం. ఓక్రా మొగ్గల ఉపరితలాలు వేళ్లను గాయపరిచేంత పదునుగా ఉంటాయి.
ఆగస్టులో, నేను ఆమెను కలిసిన రోజు, రత్నవ్వ తన కొడుకు గోరు ముక్కను బొటనవేలికి అతికించుకుంది. ఎందుకంటే ఆమెకు ఓక్రా మొగ్గల పొరలను వలవడానికి పదునైన అంచు అవసరం. ఆమె పరమేశప్ప పొలం నుండి రెండు రోజుల విరామం తీసుకుని, అస్వస్థతకు గురైన తన 18 ఏళ్ల కుమారుడు లోకేష్ బదులు, అతను పని చేసే పొలంలో తాను పనిచేస్తుంది. అతను కూడా తన తల్లికి, ఆమె చేసిన 3000 రూపాయిల అప్పు తిరిగి చెల్లించడానికి సహాయం చేయడం కోసం పని చేస్తున్నాడు. ఈ 3000 రూపాయిలు ఆమె అతని కాలేజీ అడ్మిషన్ కోసం అప్పుగా తీసుకుంది.
అయితే ఆరుగురున్న ఆమె కుటుంబంలో మొత్తం ఆర్థిక భారాన్ని మోసేది రత్నవ్వనే . తన భర్త, అత్తగారు, ముగ్గురు కాలేజీకి వెళ్లే పిల్లలు- ఆమె వీరందరి రోజువారీ ఖర్చులను భరించడంతో పాటు, అనారోగ్యంతో ఉన్న తన భర్త వైద్యం కోసం కూడా చాలా ఖర్చు చేస్తుంది.
ఒక్క ఆగస్టు నెలలోనే ఆమె ఆమె భర్త ఆరోగ్య ఖర్చుల కోసం యజమాని నుండి 22,000 రూపాయిలు తీసుకుంది. ఆమె భర్తకు కామెర్లు సోకిన తర్వాత అతని ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. రక్తం ఎక్కించడానికి అతనిని ఆసుపత్రికి తీసుకువెళ్లవలసి వచ్చింది. కానీ దగ్గరలో ఈ సౌకర్యం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి మంగళూరులోనే ఉంది, ఇది వారి గ్రామానికి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఆమె యజమాని అవసరమైనప్పుడు ఆమెకు డబ్బు ఇస్తాడు. "నేను తిండికోసం, ఆసుపత్రి ఖర్చులకోసం, రోజువారీ అవసరాల కోసం అప్పు తీసుకున్నాను. అతను మా సమస్యలను పెద్దగా అర్థంచేసుకోడు. మాకు చాలా డబ్బు అప్పుగా ఇస్తాడు. నేను అక్కడకి [పనికి] మాత్రమే వెళ్తాను, ఇంకెక్కడికి వెళ్లను,” అని రత్నవ్వ చెప్పింది. "నేను ఇంకా పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించలేదు. నా అంతట నేను ఎంత చెల్లించగలను? "
ఆర్థికంగా ఆధారపడే ఈ అంతులేని ప్రక్రియ వలన, రత్నవ్వ యజమాని ఎప్పుడు అడిగినా పని చేయడానికి అంగీకరిస్తుంది. వేతనాల పెంచమని అడగడానికి కూడా లేదు. కోననతలిలో పనిచేసే పొరుగు గ్రామాల నుండి మహిళలు, ఎనిమిది గంటల పనికి రోజుకు 250 రూపాయిలు తీసుకుంటే, రత్నవ్వకి ఆమె పనిచేసే గంటలతో సంబంధం లేకుండా రోజుకు 200 రూపాయిలే వస్తాయి.
"అందుకే వారు నన్ను పనికి పిలిచినప్పుడల్లా నేను వెళ్ళాలి. కొన్నిసార్లు పని ఉదయం ఆరు గంటలకు మొదలైనా ముగిసేసరికి సాయంత్రం ఏడు దాటిపోతుంది. క్రాసింగ్ పని లేనట్లయితే, కలుపు తీయడానికి నాకు రోజుకు 150 రూపాయలు మాత్రమే ఇస్తారు,” ఆమె వివరించింది. "కాబట్టి, డబ్బు అప్పు తీసుకుంటే నేను ఏమీ మాట్లాడలేను, నన్ను పిలిచినప్పుడల్లా నేను వెళ్ళాలి. ఎక్కువ జీతం అడగలేను. ”
అయితే రత్నవ్వ శ్రమను అప్పు ఒకటే కుంగదీయడం లేదు. వివిధ సందర్భాలలో, రత్నవ్వను ఒక లింగాయత్ కుటుంబానికి పనులు చేయమని పిలుస్తుంది. ఒకప్పటి (బిట్టి చక్రి, 'చెల్లించని శ్రమ' అని కూడా పిలువబడే) పురాతన కులవాద ఆచారమైన ఒక్కలు పధ్ధతి , చట్టవిరుద్ధం అయినప్పటికీ, కోననాతలిలో ఇప్పటికీ ఆచరణలో ఉంది. ఈ ఆచారం ప్రకారం ఒక మాదిగ కుటుంబాన్ని ఒక లింగాయత్ కుటుంబం కులాచారం పేరున బందించి, లింగాయత్ ల ఇంట్లో మాదిగలను ఉచితంగా పని చేయమని బలవంతం చేస్తుంది.
“అది పెళ్లి అయినా, ఏదైనా ఫంక్షన్ అయినా, లేదా ఎవరైనా వారి ఇంట్లోవారు చనిపోయినా, మేము వారి ఇంటిని శుభ్రం చేయాలి. ఈ పని చేయడానికి ఒక రోజంతా పడుతుంది. మేము అన్ని పనులను చేయాలి. పెళ్లి జరిగితే, మేము మొత్తం ఎనిమిది రోజులు ఇక్కడే ఉండాలి,” అని రత్నవ్వ చెప్పింది. "కానీ వారు మమ్మల్ని తమ ఇంటి లోపలికి అడుగుపెట్టనివ్వరు; వారు మమ్మల్ని దూరంగా ఉంచుతారు. మాకు కొంచెం ఉడికించిన అన్నం, టీని ఇస్తారు. వారు మాకు కనీసం అన్నం తినే కంచం కూడా ఇవ్వరు. మేము కంచాలను మా ఇంటి నుంచే తెచ్చుకుంటాము. కొన్నిసార్లు వారు ఒక గొర్రెనో లేక దూడనో ఇస్తారు, కానీ మాకు డబ్బులు మాత్రం ఇవ్వరు. వారి పశువులు చనిపోయినప్పుడు, మమ్మల్ని పిలిచి మృతకళేబరాలను తీయిస్తారు.”
నాలుగు సంవత్సరాల క్రితం, ఆ లింగాయత్ కుటుంబంలోని సభ్యురాలు పెళ్లి చేసుకున్నప్పుడు, రత్నవ్వ కుల సంప్రదాయంలో భాగంగా కొత్త జత చెప్పులు కొనవలసి వచ్చింది, దానికి పూజ చేసి వరుడికి బహుమతి ఇవ్వవలసి వచ్చింది. ఆమె ఎంత శ్రమ పడినా ఆదాయం రాకపోయేసరికి, కొన్ని సంవత్సరాల క్రితమే అక్కడ పనిచేయడం మానేయాలని నిర్ణయించుకుంది. ఆమె తీసుకున్న నిర్ణయం లింగాయత్ కుటుంబానికి కోపం తెప్పించింది.
ఈ సంవత్సరం, పరమేశప్ప నుండి కొంత డబ్బు తీసుకుని, ప్రభుత్వం రత్నవ్వ భర్తకు గ్రామంలో కేటాయించిన అర ఎకరం స్థలంలో, ఓక్రాను మొక్కజొన్నను నాటారు. కాని, జూలైలో, కోననతలిలోని మడగా-మాసూర్ సరస్సు వెంబడి మాదిగలకు కేటాయించిన చిన్న చిన్న భూములను వర్షం ముంచెత్తింది. "ఈ సంవత్సరం హరిజనుల [మాదిగల] భూములలో ఓక్రా నాటారు. కానీ ప్రతిదీ నీటిలో మునిగిపోయింది," ఆమె చెప్పింది.
రత్నవ్వ భారాన్ని తగ్గించడానికి రాష్ట్ర యంత్రాంగం ముందుకు రాలేదు. భూమిలేని ఈ కార్మికురాలిని, ప్రత్యేకమైన ఏ ప్రభుత్వ సంక్షేమ చర్యల లబ్ధిదారుగా పరిగణించలేదు. ఆమె కోల్పోయిన పంటకు పరిహారం అందలేదు. అంతేగాక ఆమెకు వైకల్యం సర్టిఫికేట్ ఉన్నప్పటికీ, వైకల్యం ఉన్న వ్యక్తుల కోసం రాష్ట్ర నెలవారీ భత్యం రూ. 1,000 కూడా ఆమెకి అందలేదు.
తన తీవ్రమైన శారీరక శ్రమతో సుదీర్ఘకాలం గడిపినప్పటికీ డబ్బులు సరిపడాలేక, రత్నవ్వ మైక్రో ఫైనాన్స్ కంపెనీల రుణాలపై ఆధారపడింది, ఇది ఆమెను మరిన్ని అప్పుల్లో ముంచెత్తింది. ఆమె పరమేశప్పకు చెల్లించాల్సిన అప్పుతో పాటు, ఆమె చేసిన మరో రూ. 2 లక్షల అప్పు ఉంది. దీని వడ్డీ రేట్లు 2 నుండి 3 శాతం వరకు ఉంటాయి.
గత రెండు సంవత్సరాలలో, ఆమె తన ఇంటిలో ఒక గది కట్టుకోవడానికి, కళాశాల ఫీజులకు, వైద్య ఖర్చులకు కనీసం 10 వేర్వేరు చోటల నుండి అప్పు తీసుకుంది. రోజువారీ ఖర్చుల కోసం, ఆమె డబ్బు ఉన్న లింగాయత్ మహిళలను అడుగుతుంది. "గత సంవత్సరం, నేను అప్పు తీసుకున్న డబ్బుపై, నెలకు 2650 రూపాయిలను, వడ్డీ కోసం మాత్రమే చెల్లించాను.” అని ఆమె చెప్పింది. "కోవిడ్ -19 లాక్డౌన్ అయినప్పటి నుండి, వడ్డీ మొత్తాన్ని చెల్లించడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు, కానీ నేను ప్రతి నెలా ఖర్చుల కోసం అప్పు తీసుకుంటూనే ఉన్నాను.”
అప్పులు పేరుకుపోయినప్పటికీ, రత్నవ్వ తన పిల్లల చదువు మానిపించవద్దని నిశ్చయించుకుంది. ఆమె తన కూతురు సుమ, బిట్టి చక్రి సంప్రదాయాన్ని కొనసాగించదని గట్టిగా చెప్పింది. "నేను గాని నా కాలు గాని బలమైన స్థితిలో లేము. నేను దూరంగా నడవలేకపోతున్నాను. కానీ నా పిల్లలను దీనినుంచి [బానిసత్వం] విడుదల చేయాలి, లేదంటే వారు పాఠశాలను విడిచిపెట్టవలసి వస్తుంది. కాబట్టి నేను పని చేస్తూనే ఉన్నాను,” ఆమె వివరించింది. కష్టాలకు ఓర్చిన రత్నవ్వ, "వారికి కావలసినంత వరకు నేను వారికి విద్యనందిస్తాను" అని ప్రకటించింది.
అనువాదం: అపర్ణ తోట