ఫాతిమా బానో ఒక పద్యం చదువుతోంది: "ఫ్యాన్ పైన తిరుగుతుంది, పాప కింద పడుకుంటుంది," అని హిందీలో చెప్పింది. “నిద్రపో పాప నిద్రపో, పెద్ద ఎర్రని మంచం మీద పడుకో... ” రాజాజీ టైగర్ రిజర్వ్ లోపల ఉన్న గుజ్జర్ బస్తీ లో మధ్యాహ్నం తరగతికి హాజరవుతున్న పిల్లలు అందరూ తనపైనే చూస్తోంటే, ఆ తొమ్మిదేళ్ల చిన్నారి వాన్ గుజ్జర్, ఏదో ఒకవిధంగా గుర్తించబడకుండా ఉండటానికి ప్రయత్నిస్తోంది..
ఆ రోజు తబస్సుమ్ బీవీ ఇంటి ముందు వారి ‘పాఠశాల’ జరుగుతోంది. 5 నుండి 13 సంవత్సరాల వయస్సు గల విద్యార్థుల సమూహం, ఒక పెద్ద దరి మీద , కొన్ని నోట్బుక్లు చేత పట్టుకుని కూర్చున్నారు. వారిలో తబస్సుమ్ బీవీ ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూడా ఉన్నారు; ఈ బస్తీలో దాదాపు అందరిలాగే ఆమె కుటుంబంలో వారు కూడా గేదెల పెంచుతూ, పాలు అమ్ముతూ జీవిస్తున్నారు.
2015 నుండి, పాఠశాల కునౌ చౌడ్ సెటిల్మెంట్లో యార్డ్‌లో లేదా ఇంట్లో పెద్ద గదిలో, అడపాదడపా సమావేశమవుతోంది. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించబడతాయి. డిసెంబర్ 2020లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు, ఫాతిమా బానో పద్యం చదువుతోంది. తరగతిలో 11 మంది అమ్మాయిలు, 16 మంది అబ్బాయిలు ఉన్నారు.
వాన్ గుజ్జర్ లో ఉన్న యువకుల బృందం ఆ బడి ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలోని యమకేశ్వర్ బ్లాక్‌లోని దాదాపు 200 కుటుంబాల బస్తీ అయిన కునౌ చౌద్లో వారు నిరంతర విద్య అవసరాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. (రాష్ట్రంలోని కుమావోన్, గర్వాల్ ప్రాంతాలలో 70,000 -100,000 మధ్య వాన్ గుజ్జర్లు నివసిస్తున్నారని కమ్యూనిటీ కార్యకర్తలు అంచనా వేస్తున్నారు; వీరిని ఉత్తరాఖండ్‌లో OBC జాబితాలో చేర్చారు. ప్రస్తుతం వీరు షెడ్యూల్డ్ తెగ గుర్తింపు కోసం డిమాండ్ చేస్తున్నారు.) టైగర్ రిజర్వ్‌లో ఉండే వీరి గుడిసెలు సాధారణంగా మట్టితో, తాటి మట్టలతో కట్టి ఉంటాయి. అటవీ శాఖ ఇక్కడ శాశ్వత నిర్మాణాలను నిషేధించింది, పైగా టాయిలెట్ సౌకర్యం లేదు. అడవిలో ప్రవహిస్తున్న సెలయేళ్ళు, వాగుల నీటినే వినియోగిస్తారు.
కునౌ చౌడ్ రిజర్వ్ లోపల ఉంది, ఇది పక్కా రహదారికి దూరంగా ఉంది - అనేక అడ్డంకుల వలన ఇక్కడ పాఠశాల విద్య అస్థిరంగా ఉండటమే కాక అసాధారణంగా కూడా ఉంటుంది. ప్రభుత్వ మోడల్ ప్రైమరీ స్కూల్ (5వ తరగతి వరకు), ప్రభుత్వ ఇంటర్ కాలేజ్ (12వ తరగతి వరకు) మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. చిరుతపులులు, ఏనుగులు, జింకలు వంటి వన్యప్రాణులు ఇక్కడ తిరుగుతుంటాయి. పాఠశాలలకు చేరుకోవడానికి లోతులేని బీన్ నది (గంగానదికి ఉపనది)లోకి దిగి, ఆ నీటిలోనే నడవాలి. వర్షాకాలం- జులై నుండి ఆగస్టు నెలల్లో, నీరు పెరిగినప్పుడు, పిల్లలు పాఠశాలకు వెళ్లడం మానేస్తారు లేదా వారి తల్లిదండ్రుల సహాయంతో దీనిని దాటుతారు.
చాలా మంది కనీసం పాఠశాలలో నమోదు కూడా కాలేదు - పత్రాల కొరత వలన ఈ ప్రయత్నాలు ముందుకు సాగవు. రిమోట్ ఫారెస్ట్ బస్తీలలో నివసిస్తున్న గుజ్జర్ కుటుంబాలకు అధికారిక పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడం, సేకరించడం చాలా కష్టమైన పని. కునౌ చౌద్‌లోని తల్లిదండ్రులు తమ పిల్లలలో చాలా మందికి జనన ధృవీకరణ పత్రాలు (పైగా వీరు సెటిల్మెంట్లోనే పుట్టినవారు) లేదా ఆధార్ కార్డ్‌లు లేవని చెప్పారు. (మే 2021లో, ఉత్తరాఖండ్ హైకోర్టు వాన్ గిజ్జర్లు ఎదుర్కొంటున్న అనేక నిరంతర సమస్యలను పరిష్కరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది)
చాలా కుటుంబాలలో, పెద్ద పిల్లలు తమ రోజులలో ఎక్కువ భాగం పశువులను కాస్తూ గడుపుతారు. వారిలో జైటూన్ బీబీ 10 ఏళ్ల కుమారుడు ఇమ్రాన్ అలీ, తన కుటుంబానికి చెందిన ఆరు గేదెలను సంరక్షిస్తున్నాడు. ఆగస్టు 2021లో అతను 6వ తరగతిలో చేరినప్పటికీ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, అతని చదువు సాగడమే పెద్ద సవాలుగా మారింది. “నేను పశువులకు మెటా వేయడానికి ఉదయం 6 గంటలకు లేస్తాను, ఆ తరవాత పాలు పితుకుతాను. ఇంకా నేను వాటిని నీరు త్రాగించడానికి తీసుకువెళ్తాను,వారికి ఎండుగడ్డిని ఇస్తాను,” అని అతను చెప్పాడు. ఇమ్రాన్ తండ్రి పాలు అమ్ముతారు, అతని తల్లి తమ పశువులతో పాటు ఇంటి పనులు చూసుకుంటుంది.
ఇమ్రాన్ లాగా, ఇక్కడ ఉన్న చాలామంది పిల్లలు రోజులో ఎక్కువ భాగం ఇంటి పనుల్లో నిమగ్నమై ఉంటారు. దీనివలన వారి పాఠశాల విద్యను ప్రభావితమవుతుంది. "గేదెల చూసుకోవడంలో మా పిల్లలు మాకు సహాయం చేస్తారు. వారు వాటిని త్రాగడానికి, మేతకు తీసుకువెళతారు. చుల్హా మీద వంట చేయడానికి అడవి నుండి కట్టెలు తీసుకురావడానికి కూడా వారు సాయం చేస్తారు." అని బానో బీబీ చెప్పారు. ఆమె పెద్ద కుమారుడు, 10 ఏళ్ల యాకూబ్, ఇంటర్-కాలేజ్‌లో 7వ తరగతి చదువుతున్నాడు, అయితే 5 నుండి 9 సంవత్సరాల వయస్సు ఆమె ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు, బస్తీలోని 'అనధికారిక' పాఠశాలలో చదువుతున్నారు. "మా పిల్లలు చదువుకుంటే బాగుండు. కానీ మేము ఈ అడవిలోనే బతకాలి.[కాబట్టి ఈ పనులు కూడా చేయాలి]."
చాలా కాలంగా, ఈ వర్గపు సంచార వలసలు కూడా విద్యకు ఆటంకంగా ఉన్నాయి. కానీ స్థానిక అటవీ హక్కుల కమిటీ సభ్యుడు షరాఫత్ అలీ మాట్లాడుతూ, ఇప్పుడు చాలా మంది వాన్ గుజ్జర్లు వేసవిలో ఎత్తైన ప్రాంతాలకు వెళ్లడం లేదని ఏడాది పొడవునా అదే బస్తీలలో నివసిస్తున్నారని చెప్పారు. కునౌ చౌద్‌లోని దాదాపు 200 కుటుంబాలలో, ఇప్పటికీ 4-5 కుటుంబాలు మాత్రమే పర్వతాలకు (ఉత్తరకాశీ లేదా రుద్రప్రయాగ జిల్లాల్లో) వెళ్తున్నాయని ఆయన అంచనా.
2020లో కోవిద్ మహారోగం వలన నిర్వహించిన సుదీర్ఘమైన లాక్డౌన్, తరవాత మళ్లీ 2021లో నిర్వహించిన లాక్డౌన్, చదువును కొనసాగించే ప్రయత్నాలను ఇంకా ప్రభావితం చేసింది. “లాక్డౌన్ కారణంగా మా పాఠశాల [ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల] మూసివేశారు. ఇప్పుడు మేము మా స్వంతంగా [బస్తీలోని ‘పాఠశాల’లో] చదువుతున్నాము, ”అని ఇమ్రాన్ 2020లో నాతో చెప్పాడు.
మార్చి 2020లో లాక్డౌన్ ప్రారంభమైనప్పుడు, ఇంట్లో పాఠాలు కొంతవరకు కొనసాగాయి. "మేము పిల్లలకు వారి నోట్బుక్లలో పనిని ఇచ్చేవాళ్ళం. 3-4 రోజుల తర్వాత వాటిని తనిఖీ చేసేవాళ్ళం. ఒకే ఇంటిలో 3-4 మంది పిల్లలను కూర్చోబెట్టి వారికి కొత్త పాఠం నేర్పేవాళ్ళం," అని వారి ఉపాధ్యాయుడు, 33 ఏళ్ల మొహమ్మద్ శంషాద్ చెప్పారు. అతను, 26 ఏళ్ళ మొహమ్మద్ మీర్ హమ్జా, 20 ఏళ్ళ అఫ్తాబ్ అలీ, ఈ పాఠశాలలో స్థానిక ఉపాధ్యాయులు.
2017లో, వారు ఇంకా ఇతర యువకులు వాన్ గుజ్జర్ గిరిజన యువ సంగతన్ను స్థాపించారు - దీనికి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అంతటా 177 మంది సభ్యులు (ఆరుగురు మహిళలు) ఉన్నారు. ఈ సమూహం వారి వర్గానికి విద్యను అందించడం, ఇంకా వారి అటవీ హక్కులపై దృష్టి పెడుతుంది. హంజా కరస్పాండెన్స్ కోర్సు ద్వారా సోషల్ వర్క్‌లో మాస్టర్స్ చదువుతున్నాడు. షంషాద్ డెహ్రాడూన్ కాలేజీలో బికామ్ డిగ్రీ చేశాడు. అఫ్తాబ్ ప్రభుత్వ ఇంటర్-కాలేజ్ నుండి 12వ తరగతి పరీక్షలు ప్యాసయ్యాడు. బస్తీలోని ఇతర నివాసితుల మాదిరిగానే, వారి కుటుంబాలు కూడా ఆదాయం కోసం గేదెలపైనే ఆధారపడతాయి.
చదువు కోసం బడికి వెళ్లాలంటే, బడికి వెళ్లే దారంతా రాళ్లుంటాయి. చాలా కాలం పాటు తాము ఎప్పుడూ పాఠశాలకు వెళ్లని తల్లిదండ్రులకు, చదువుకుంటే వచ్చేప్రయోజనాల పై నమ్మకం ఉండేది కాదు అని ఉపాధ్యాయులు చెప్పారు. చాలా కష్టపడి వారికి వివరించాక ఇప్పుడు వారికి చదువు అవసరం అర్థమైంది.
చదువుకున్న వారికి ఉద్యోగాలు చాలా అరుదు, ఇతర జీవనోపాధి ఎంపికలు కూడా పరిమితం. అటవీ శాఖ అటవీ భూమిలో సాగు చేయకూడదని వాన్ గుజ్జర్ల పై ఆంక్షలు విధించింది. చాలా కుటుంబాలకు గేదెలు, ఆవులు ఉన్నాయి. ఇవి 5 నుండి 25 పశువుల వరకు ఉండొచ్చు. రిషికేశ్‌లో నివసిస్తున్న వ్యాపారులు (ఈ పట్టణం సెటిల్మెంట్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది) గుజ్జర్ కుటుంబాల నుండి పాలను కొనుగోలు చేస్తారు. పెంచే పశువుల సంఖ్యను బట్టి ఒక కుటుంబం పాలు అమ్మి నెలకు రూ. 20,000-25,000 సంపాదిస్తారు. కానీ ఈ ఆదాయంలో ఎక్కువ భాగం అదే వ్యాపారుల నుండి మేత సేకరణకు, పాత అప్పులను తిరిగి చెల్లించడానికి ఖర్చు చేస్తారు. (ముఖ్యంగా మునుపటి వలస నెలలైన ఏప్రిల్ నుండి సెప్టెంబరు వరకు పెరిగే రుణాలపై).
యువ సంఘటన్‌కు డైరెక్టర్‌గా ఉన్న మీర్ హంజా ఇప్పటి వరకు కునౌ చౌద్లో 10 శాతం మంది పిల్లలు కూడా స్థిరమైన విద్యను పొందలేకపోయారని అంచనా వేశారు. "విద్యా హక్కుపై చట్టాలు ఉన్నప్పటికీ, మా బస్తీ ఒక గ్రామ పంచాయితీకి అనుబంధించబడనందున విద్యకు సంబంధించిన వివిధ ప్రభుత్వ పథకాలు ఇక్కడ వరకు అందడం లేదు. గ్రామ పంచాయతీ ఉండడం వలన పథక సంబంధిత ప్రయోజనాలను పొందే అర్హత లభిస్తుంది." కునౌ చౌడ్కు రెవెన్యూ గ్రామ హోదా కల్పించాలని ఇక్కడి వాసులు డిమాండ్ చేస్తున్నారు.
2015-16లో, పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం (2009) నిబంధనల ప్రకారం, అధికారిక విద్య అందక మారుమూల ప్రాంతాల్లోనివసిస్తున్న కునౌ చౌడ్తో సహా కొన్ని బస్తీ లలో వాన్ గుజ్జర్ పిల్లల కోసం నాన్-రెసిడెన్షియల్ ప్రత్యేక శిక్షణా కేంద్రాలు (NRSTCలు) ప్రారంభించారు.
ఆ విద్యా సంవత్సరంలో, కునౌ చౌద్‌లోని 38 మంది పిల్లలు ఈ స్థానిక తరగతులకు హాజరయ్యారని యమకేశ్వర్‌లోని బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శైలేంద్ర అమోలి చెప్పారు. 2019లో మరొక ఆమోదం పొందిన తర్వాత, ఆ సంవత్సరం జూన్ నుండి మళ్లీ 92 మంది పిల్లలతో మార్చి 2020 లాక్డౌన్ వరకు తరగతులు నిర్వహించబడ్డాయి. 2021-22 విద్యా సంవత్సరానికి కూడా కునౌ చౌద్ లో, 6 నుండి 12 సంవత్సరాల వయస్సు గల 63 మంది విద్యార్థులకు, NRSTC తరగతులు ఆమోదించబడ్డాయి, అని శైలేంద్ర చెప్పారు.
అయినప్పటికీ వాన్ గుజ్జర్లకు అధికారిక విద్యపై పెద్దగా నమ్మకం లేదని ఆయన చెప్పారు. 2015-16లో ఎన్ఆర్ఎస్టిసి కింద నమోదైన చాలా మంది పిల్లలు 2021-22లో తిరిగి నమోదు చేయబడ్డారు, అయితే ఈ తరగతులు అన్ని ప్రస్తుత ఇబ్బంది తొలగించడానికి చేసే ఏర్పాట్లు మాత్రమే అని ఆయన చెప్పారు.
అయితే, హంజా ఇతర స్థానిక ఉపాధ్యాయులు NRSTC తరగతులు (2015-16 మరియు 2019 లో) సక్రమంగా సాగలేదని, వాటిపై పర్యవేక్షణ లేదని చెప్పారు. ఉపాధ్యాయులు తరచుగా గైర్హాజరయ్యారు, వీరు వేరే గ్రామాల నుండి, వర్గాల నుండి వచ్చారు, వీరికి ఇక్కడి స్థానిక సూక్ష్మ నైపుణ్యాలు తెలియవు.
ఎన్ఆర్ఎస్టిసి మార్గదర్శకాల ప్రకారం, పథకం ఆమోదించబడిన సెటిల్మెంట్లు లేదా గ్రామాల్లో, స్థానిక విద్యావంతులైన యువకులకు బోధనా పనిని కల్పించి, వారికి నెలకు రూ. 7,000 ఇవ్వాలని చెప్పారు. కానీ 2015-16లో కునౌ చౌడ్లో తరగతులు ప్రారంభమైనప్పుడు, బస్తీలో డిగ్రీ చదివిన వారు లేరు. అందుకని మరొక గ్రామానికి చెందిన వ్యక్తిని ఉపాధ్యాయుడిగా నియమించారు. ప్రస్తుతం మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న మీర్ హంజా, ఇప్పుడు బీకామ్ డిగ్రీ చదివిన షంషాద్ ఇప్పటికీ తమకు ఉద్యోగం ఇవ్వలేదని వాపోతున్నారు.
ఇంతలో, వారు నిర్వహించే ఈ 'అనధికారిక' తరగతులు, అడపాదడపా జరుగుతున్న NRSTC సెషన్ల ద్వారా మిగిలి ఉన్న ఖాళీలను పూరిస్తూ, ప్రభుత్వ ఇంటర్-కాలేజీకి హాజరయ్యే పాత విద్యార్థులకు ట్యూషన్లుగా కొనసాగుతున్నాయి. అలానే చిన్న పిల్లలను (ప్రాథమిక పాఠశాలకు హాజరయ్యే వారు అలాగే ఇప్పటివరకు ఇంకా నమోదు కానివారు) వారి 5వ తరగతి పరీక్షలను 6వ తరగతిలో నమోదు చేసుకునే వీలు కల్పించేందుకు కూడా ఉపయోగపడుతున్నాయి. స్థానిక ఉపాధ్యాయులు ఒక్కో విద్యార్థికి రూ. 30-35 వారి ఖర్చులకు తీసుకోవచ్చు. ఈ మొత్తం మారవచ్చు, పైగా ఇదేమి తప్పనిసరిగా ఇవ్వవలసిన సొమ్ము కాదు.
తమ వర్గ సభ్యులతో చాలా కాలం పనిచేసి, విద్య వల్ల కలిగే ప్రయోజనాల గురించి వారిని ఒప్పించే ప్రయత్నం చేసిన తర్వాత, నెమ్మదిగా ,మార్పు వస్తోంది, అని ఉపాధ్యాయులు చెప్పారు.
“మా పిల్లలు చదవడం, వ్రాయడం తెలుసుకోవాలని మా కోరిక. అడవిలో జీవితం చాలా కష్టంగా ఉంది” అని జైటూన్ బీబీ చెప్పారు. “మేము పడిన కష్టం వారు పడలేరు, మాలో ఎవరికీ చదువు లేదు. మా పిల్లలు మాలా ఉండకూడదనుకుంటున్నాం."
మహ్మద్ రఫీ కూడా 5 నుండి 11 సంవత్సరాల మధ్య లో ఉన్న తన ముగ్గురు పిల్లలను చదివించాలనుకుంటున్నాడు. 11 సంవత్సరాల అతని కొడుకు యాకూబ్ ను , ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతిలో చేర్పించారు. అతని ఇద్దరు చిన్న పిల్లలు బస్తీ తరగతులకు హాజరవుతున్నారు. "బయటి ప్రపంచాన్ని చూస్తే మా పిల్లలు చదివించాలని అనిపిస్తుంది," అని రఫీ చెప్పారు.
షరాఫత్ అలీ ఇద్దరు పిల్లలు, ఏడేళ్ల కుమారుడు నౌషాద్, ఐదేళ్ల కుమార్తె ఆషా కూడా బస్తీ పాఠశాలలో చదువుతున్నారు. "గత ఐదు సంవత్సరాలుగా, వేసవిలో మా జంతువులతో [ఎత్తైన పర్వతాలకు] వెళ్లడం మానేశాను," అని అతను చెప్పాడు. “మేము ఇప్పుడు అదే స్థలంలో నివసిస్తున్నాము, దీనివల్ల మా పిల్లలకు చదవడం, రాయడం వస్తుంది. వారు మంచి విద్యను పొందాలని మేము కోరుకుంటున్నాము. వారు కూడా సమాజంలో అందరిలానే జీవించాలి. వారికి కూడా ఉద్యోగాలు రావాలి.”
వాన్ గుజ్జర్ సెటిల్మెంట్లలోని ఈ కృషి ఇతర ఫలితాలను కూడా చూపుతోంది, అని శంషాద్ చెప్పారు. “2019లో ఐదు వాన్ గజ్జర్ బస్తీలకు చెందిన దాదాపు 40 మంది పిల్లలు మా సంగతన్ ద్వారా 6వ తరగతిలో చేరారు. కొంతమంది విష్యార్థులు, ఇందులో అమ్మాయిలు కూడా ఉన్నారు (కునౌ చౌద్ నుండి ఇప్పటివరకు ఎవరూ లేకపోయినప్పటికీ) 10వ తరగతికి, మరికొందరు 12వ తరగతికి చేరుకుంటున్నారు.”
ప్రారంభంలో, బస్తీ తరగతులకు కొంతమంది అమ్మాయిలు మాత్రమే వచ్చేవారు. "మేము వారి తల్లిదండ్రులతో మాట్లాడవలసి వచ్చేది. కానీ గత 3-4 ఏళ్లలో పరిస్థితి మారిపోయింది. ఈ విద్యా సంవత్సరంలో కునౌ చౌడ్కు చెందిన విద్యార్థులలో 6వ తరగతికి అడ్మిషన్ పొందిన రంజానోకు, సుమారు 12 సంవత్సరాలు. ఆమె తన కుటుంబం నుండి అధికారిక పాఠశాలకు హాజరైన మొదటి అమ్మాయి అవుతుంది. తను ‘10వ తరగతి పాస్ కావాలనుకుంటున్నా’, అని నాకు చెప్పింది.”
వారిలో, బహుశా కొంతకాలం తర్వాత, ఆ పద్యం చదువుతున్న తొమ్మిదేళ్ల ఫాతిమా బానో కూడా ప్రభుత్వ పాఠశాలకు తన వర్గం సాగిస్తున్న అనిశ్చిత ప్రయాణాన్ని చేపట్టవచ్చు.
అనువాదం: అపర్ణ తోట