"ఇది వేడుకలకు
సరైన రోజు. వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంది,” అన్నారు లేహ్ జిల్లాలో రహదారి నిర్మాణ
స్థలాల్లో రోజువారీ కూలీగా పనిచేస్తోన్న పెమా రించెన్.
లడఖ్‌లోని హాన్లే
(ఆన్లే అని కూడా పిలుస్తారు) గ్రామంలో నివసించే 42 ఏళ్ల రించెన్ టిబెట్ క్యాలెండర్‌లో
ముఖ్యమైన పండుగ అయిన
సాగా దావా
ను గురించి
చెప్తున్నారు. ఈ పండుగను లడఖ్, సిక్కిమ్ అరుణాచల్ ప్రదేశ్‌లలోని బౌద్ధులు జరుపుకుంటారు.
"ఇంతకుముందు
ప్రతి కుగ్రామంలోనూ అందరూ
సాగా దావా
ను జరుపుకునేవాళ్ళు.
కానీ ఈ ఏడాది (2022) ఆరు గ్రామాలు మాత్రమే కలిసివచ్చాయి," హాన్లేలోని ఇండియన్
ఆస్ట్రొనామికల్ అబ్జర్వేటరీలో పనిచేస్తోన్న 44 ఏళ్ళ సోనమ్ దోర్జే అన్నారు. ఈయన ఇక్కడి
నాగా కుగ్రామంలో నివసిస్తుంటారు. కోవిడ్-19 ముమ్మరంగా ఉన్న సమయంలో రెండేళ్ళపాటు పరిమితంగా
జరుపుకున్న ఉత్సవాల తర్వాత పుంగుక్, ఖల్దో, నాగా, షాడో, భోక్, జిక్‌సోమా కుగ్రామాలన్నీ
కలిసి ఈ ఉత్సవాలను జరుపుకున్నాయి. చెదురుమదురు జనాభా కలిగిన ఈ కుగ్రామాలన్నీ హాన్లే
గ్రామంలో భాగంగా ఉన్నాయి. వీటన్నింటిలోని మొత్తం జనసంఖ్య 1,879 మంది (2011 జనాభా లెక్కలు).
మహాయాన శాఖకు చెందిన
బౌద్ధులు జరుపుకునే ఈ పండుగను
'శాకా దావా'
అని కూడా పిలుస్తారు.
సాగా దావా
ను టిబెట్
చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం నాలుగవ నెల 15వ రోజున జరుపుకుంటారు; 2022 సంవత్సరంలో,
ఇది జూన్ నెలలో వచ్చింది. టిబెట్ భాషలో
సాగా
అంటే నాలుగవ అనీ,
దావా
అంటే నెల అని అర్థం.
సాగా దావా
నెలను 'పుణ్య మాసం' అని పిలుస్తారు-
ఈ కాలంలో చేసే మంచి పనులకు అనేక రెట్లు ఎక్కువ ప్రతిఫలం లభిస్తుందని చెబుతారు. బుద్ధుని
జ్ఞాపకార్థం జరిగే ఈ పండుగ అతని పుట్టుకను, జ్ఞానోదయం కలిగిన రోజును,
పరినిర్వాణం
లేదా సంపూర్ణ నిర్వాణం చెందిన
రోజును సూచిస్తుంది.
PHOTO •
Ritayan Mukherjee
పర్వత శిఖరాగ్రాన ఉన్న 17వ శతాబ్దానికి చెందిన హాన్లే బౌద్ధ విహారం. ఇది టిబెట్ బౌద్ధుల ద్రుక్పా కగ్యు శాఖకు చెందినది
PHOTO •
Ritayan Mukherjee
టిబెట్ పీఠభూమి పశ్చిమ భాగమైన చాంగ్‌తాంగ్. సరస్సులతో చిత్తడి నేలలతో, నదీ పరీవాహక ప్రాంతాలతో కూడి ఉండే హాన్లే నదీ లోయ
జనాభాలో అత్యధికులు
- లడఖ్‌లోని లేహ్ జిల్లాలో దాదాపు 66 శాతం మంది - బౌద్ధులు (జనగణన 2011). అక్టోబర్
2019లో లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. తూర్పు, మధ్య లడఖ్ ప్రాంత జనాభాలో ఎక్కువ
భాగం టిబెట్ మూలాలకు చెందినవారు. వీరంతా ఈ ప్రాంతంలోని బౌద్ధ ఆరామాలలో అనేక పండుగలు
జరుపుకుంటారు.
సాగా దావా రోజున, టిబెట్‌లోని బౌద్ధులు మఠాలనూ దేవాలయాలనూ సందర్శిస్తూ, పేదలకు దానాలు చేస్తూ, మంత్రాలు పఠిస్తూ రోజంతా గడుపుతారు.
తూర్పు లడఖ్‌లోని హాన్లే నదీ లోయలో బౌద్ధమతాన్ని అనుసరించే చాంగ్‌పాస్ వంటి పశుపోషక సంచార సముదాయాలు సాగా దావాకు గొప్ప గుర్తింపును కలిగిస్తున్నాయి. ఈ పండుగను చూసేందుకు 2022 వేసవిలో లేహ్
జిల్లా ప్రధాన కార్యాలయానికి ఆగ్నేయంగా 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాన్లే నదీ లోయను ఈ విలేఖరి సందర్శించారు. భారతదేశం-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఒక సుందరమైన, మిట్టపల్లాలతో నిండివున్న ఈ హాన్లే నదీ లోయ విస్తారమైన ఖాళీ భూములతోనూ, మెలికలు తిరిగివున్న నదులూ, చుట్టూ ఎత్తైన పర్వతాలతోనూ నిండివుంది. ఇది చాంగ్‌థాంగ్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఒక భాగం.
అది పండుగ రోజున ఉదయం 8 గంటల సమయం. హాన్లే గ్రామంలోని స్థానిక బౌద్ధ విహారంలో ఊరేగింపు ప్రారంభం కానుంది. ఉత్సవ నిర్వాహక కమిటీ అధిపతి దోర్జే బుద్ధుని విగ్రహాన్ని మోసుకెళ్లే ఊరేగింపుకు నాయకత్వం వహిస్తున్నారు. ఉదయం ఎనిమిదిన్నరకే ఆ గ్రామం నుంచీ, ఇతర గ్రామాల నుంచీ వచ్చిన భక్తులతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మహిళలు
సుల్మా
అని పిలిచే సంప్రదాయక పొడవాటి గౌన్లు,
నెలన్
అని పిలిచే టోపీలను ధరిస్తారు.
సోనమ్ దొర్జే, అతని స్నేహితులు గొంపా (మఠం) నుండి బుద్ధుడిని ఎత్తుకొని వచ్చి ఆ విగ్రహాన్ని మెటాడోర్ వ్యాన్ పైన ఉంచారు. పండుగ ప్రార్థనల జెండాలతో నిండివున్న ఆ వాహనం రంగురంగుల రథాన్ని పోలి ఉంది. సుమారు 50 మంది వ్యక్తులు కార్లు, వ్యాన్‌లలో ఊరేగింపుగా టిబెటన్ బౌద్ధమతమైన ద్రుక్పా కగ్యు క్రమానికి సంబంధించిన 17వ శతాబ్దపు హాన్లే ఆశ్రమం వైపు బయలుదేరారు.
PHOTO •
Ritayan Mukherjee
పండుగ కోసం ఖల్డో గ్రామంలోని మేనే ఖాంగ్ ఆశ్రమం నుండి బుద్ధ విగ్రహాన్ని తీసుకువెళుతున్న సోనమ్ దోర్జే (ఎడమ), అతని తోటి గ్రామస్తులు
PHOTO •
Ritayan Mukherjee
ఒక నిర్దిష్ట క్రమంలో అమర్చివున్న టిబెటన్ ప్రార్థన జెండాలతో కప్పివున్న మెటాడోర్ వ్యాన్‌పై ఉంచిన విగ్రహం. జెండాలోని ప్రతి రంగు ఒక మూలకాన్ని సూచిస్తుంది, సమతుల్యతను సూచించడానికి కలిసి వస్తుంది
హాన్లే మఠంలో ఎరుపు టోపీలు ధరించిన బౌద్ధ ఆధ్యాత్మిక గురువులు లేదా
లామాలు
వాహనాల బారుకు స్వాగతం పలికారు. భక్తులు ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు, వారి స్వరాల ధ్వనితో ప్రాంగణమంతా ప్రతిధ్వనిస్తోంది. "ఈ ఉత్సవాలలో మరింత ఎక్కువమంది భక్తులు పాల్గొంటారని మేం ఆశిస్తున్నాం," అని 40 ఏళ్ళు
దాటిన హాన్లే నివాసి పెమా డోల్మా చెప్పారు.
ఉత్సవం జరుగుతోంది. నగారాల చప్పుడు, బాకాలు ఊదుతున్న శబ్దం వలన ఊరేగింపు నిలిచివుందని మాకు తెలిసింది. కొందరు పసుపు గుడ్డలో చుట్టివున్న బౌద్ధ గ్రంథాలను పట్టుకుని ఉన్నారు.
లామాలు
ముందుండి దారి తీస్తుండగా ఊరేగింపు నిట్టనిలువుగా ఉన్న వాలులో కిందికి సాగుతోంది. వారు మఠం లోపలనే ఉన్న అభయారణ్యం చుట్టూ తిరుగుతారు. ఆ తర్వాత ఆ గుంపులోని
లామాలు
ఒక సమూహంగా, భక్తులు మరొక సమూహంగా
విడిపోయి రెండు మెటాడోర్ వాహనాలలో ఎక్కుతారు. వారిప్పుడు ఖల్దో, షాడో, పుంగుక్, భోక్ గ్రామాల మీదుగా ప్రయాణించి నాగా వద్ద ప్రయాణాన్ని ముగిస్తారు.
ఖల్దో వద్ద బన్నులు(రొట్టెలు), శీతల పానీయాలు, ఉప్పు కలిపిన తేనీటితో భక్తులకు స్వాగతం లభించింది. పుంగుక్ వద్ద
లామాలు
, భక్తులు సమీపంలోని పర్వతాన్ని చుట్టుముట్టి, వెలిగిపోతోన్న నీలి ఆకాశం క్రింద ప్రవాహాల వెంటా, గడ్డి మైదానాల వెంటా నడుస్తారు.
మేం నాగా గ్రామానికి చేరుకున్నప్పుడు,
లామా
జిగ్మెట్ దోషాల్ మమ్మల్ని పలకరిస్తూ, “ఈ రోజెలా ఉంది మీకు? చాలా మనోహరంగా ఉంది కదా? దీనినే పుణ్య మాసం అని కూడా అంటారు. పవిత్ర గ్రంథాలలో దాగి ఉన్న తత్వాలను అర్థం చేసుకోవడానికి మనం వాటిని మరింతగా అధ్యయనం చేయాలి." అన్నారు.
PHOTO •
Ritayan Mukherjee
ఉత్సవానికి సిద్ధపడుతోన్న అన్‌మోంగ్ సిరింగ్(44). ఆమె ఉన్ని, బ్రోకేడ్, వెల్వెట్, పట్టు వస్త్రాలతో తయారుచేసిన సుల్మా - పొడవాటి గౌను - ను ధరించారు. దీనికి జతగా నూలు, నైలాన్ లేదా పట్టుతో చేసిన తైలింగ్ (రవికె)ని వేసుకున్నారు
PHOTO •
Ritayan Mukherjee
ఈ మతపరమైన ఊరేగింపు బుద్ధుని విగ్రహంతో సహా హాన్లే లోయలో ఉన్న హాన్లే ఆశ్రమానికి చేరుకుంటుంది. ఇదే ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన మఠం
PHOTO •
Ritayan Mukherjee
ఆరు గ్రామాల నుండి వచ్చిన భక్తులు వసారా గుండా మఠంలోకి ఊరేగింపుగా ప్రవేశిస్తారు
PHOTO •
Ritayan Mukherjee
సాగా దావా వేడుక కోసం 'ఉటుక్' అని పిలిచే పెద్ద గొడుగును సిద్ధం చేసిన హాన్లే మఠంలోని సన్యాసులు
PHOTO •
Ritayan Mukherjee
మఠం లోపల ప్రార్థన కార్యక్రమాలను గమనిస్తున్న గ్రామస్థులు రంగోల్ (ఎడమ), కెసాంగ్ ఏంజెల్ (కుడి)
PHOTO •
Ritayan Mukherjee
హాన్లే మఠానికి చెందిన ప్రముఖ సన్యాసులలో ఒకరు సాగా దావా రోజున ఆచారక్రియలను నిర్వహిస్తారు
PHOTO •
Ritayan Mukherjee
హాన్లే మఠానికి చెందిన సన్యాసి జిగ్మెట్ దోషాల్ ఇలా అంటారు: 'ఈ నెలను పుణ్యమాసం అని కూడా అంటారు. పవిత్ర గ్రంథాలలో దాగి ఉన్న తత్వాలను అర్థం చేసుకోవడానికి మనం వాటిని మరింతగా అధ్యయనం చేయాలి’
PHOTO •
Ritayan Mukherjee
ఆంగ్ అనే సంప్రదాయ సంగీత వాయిద్యాన్ని పట్టుకొని ఉన్న యువ లామా, దోర్జే టెస్రింగ్
PHOTO •
Ritayan Mukherjee
హాన్లే మఠం నుండి పవిత్ర గ్రంథాలను తీసుకువెళుతున్న సాగా దావా ఉత్సవ నిర్వాహకుల్లో ఒకరైన సోనమ్ దోర్జే. ఈ ప్రాంతంలోని గ్రామాల మీదుగా బుద్ధుని విగ్రహం ప్రయాణించేటప్పుడు ఈ పవిత్ర గ్రంథాలు కూడా విగ్రహంతో పాటే ఉంటాయి
PHOTO •
Ritayan Mukherjee
పవిత్ర గ్రంథాలను తీసుకువెళుతున్న హాన్లే లోయలోని వివిధ గ్రామాల మహిళలు
PHOTO •
Ritayan Mukherjee
ఈ పండుగ సందర్భంగా లామాలు సంప్రదాయ సంగీత వాయిద్యాలను వాయిస్తారు. ఈ చిన్న ఊదే వాయిద్యాన్ని (ఎడమ) గెల్లింగ్ అని పిలుస్తారు; ఆ పొడవైనది (మధ్య) టుంగ్
PHOTO •
Ritayan Mukherjee
ఊరేగింపు సాగుతుండగా హాన్లే లోయలోని నిట్టనిలువు వాలు ప్రదేశాన్ని దిగుతోన్న లామాలు
PHOTO •
Ritayan Mukherjee
ఈ ఊరేగింపు కోసం లామాలు ప్రయాణించే మార్గంలో హాన్లే నది వెంబడే ఉన్న హాన్లే మఠానికి ప్రదక్షిణ చేయడం కూడా ఉంటుంది
PHOTO •
Ritayan Mukherjee
షాడో గ్రామానికి వెళ్లే మార్గంలో ఖల్దో గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన బన్నులు, శీతల పానీయాలు, ఉప్పు తేనీరును తీసుకోవడానికి విరామం తీసుకుంటున్న ఊరేగింపు. ఊరేగింపు చేస్తున్నవారికి ఫలహారాలు ఏర్పాటు చేయడం ఈ పండుగ ఆచారాలలో భాగం
PHOTO •
Ritayan Mukherjee
పవిత్ర గ్రంథాలను తీసుకువచ్చిన లామాలను కలిసి అభివాదం తెలియచేయడానికి గొంపా వద్ద గుమిగూడిన షాడో గ్రామవాసులు
PHOTO •
Ritayan Mukherjee
షాడో గ్రామంలోని గొంపాలో ప్రార్థనలు ముగించుకొని బయటకు వచ్చిన హాన్లే మఠానికి చెందిన లామాలు
PHOTO •
Ritayan Mukherjee
షాడో గ్రామం తరువాత, వాహనాల వరుస హాన్లే లోయలోని మరొక కుగ్రామమైన పుంగుక్‌కు చేరుకుంటుంది. ఆ మధ్యాహ్నం వేళ ఊరేగింపు వాహనాల రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న గ్రామస్తులు
PHOTO •
Ritayan Mukherjee
పుంగుక్ గ్రామంలోని స్థానిక గొంపా వైపు వెళుతోన్న ఊరేగింపుకు స్వాగతం పలికేందుకు తెల్లటి కండువాలతో వేచి ఉన్న ఆ గ్రామస్తులు
PHOTO •
Ritayan Mukherjee
పుంగుక్ గొంపా లోపల సంప్రదాయ దుస్తులు ధరించి, ఖల్దో గ్రామాల నుండి వచ్చే స్నేహితుల రాక కోసం వేచి చూస్తోన్న మహిళలు
PHOTO •
Ritayan Mukherjee
పుంగుక్ గొంపాలోని కమ్యూనిటీ హాల్‌లో భోజనం చేస్తూ ఉప్పు తేనీరు తాగుతున్న థంక్‌చోక్ దోర్జే, అతని స్నేహితులు
PHOTO •
Ritayan Mukherjee
ఈ భోజనం ముగించిన తర్వాత ఊరేగింపు పుంగుక్ గ్రామాన్ని చుట్టివెళుతుంది. మిట్టపల్లాల భూభాగం, గాలులతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ గ్రామంలోని ఏ ఒక్క భాగాన్ని కూడా ఈ ఊరేగింపు వదిలిపెట్టదు
PHOTO •
Ritayan Mukherjee
ఊరేగింపులో నడుస్తూ పవిత్ర గ్రంథాలను తమ భుజాలపై మోస్తోన్న మహిళలు
PHOTO •
Ritayan Mukherjee
హాన్లే మఠం నుండి వచ్చిన లామాల ఆశీర్వాదం కోసం నివాసితులు వస్తుండగా, నాగా బస్తీకి వెళ్లే మార్గంలోని బగ్ గ్రామంలో ఆగిన ఊరేగింపు వాహనాల బారు. ఆ ఊరివారు ఊరేగింపు చేసేవారి కోసం ఫలహారాలను సిద్ధం చేశారు
PHOTO •
Ritayan Mukherjee
పవిత్ర గ్రంథాల నుండి ఆశీర్వాదం కోరుతున్న బగ్ గ్రామ నివాసితులు
PHOTO •
Ritayan Mukherjee
వారి మార్గంలో వచ్చిన ప్రతి గ్రామాన్ని చుట్టివచ్చిన తరువాత, చివరకు నాగా సమీపంలోని చక్కని పచ్చికభూమి వద్ద ఆగిన ఊరేగింపు. ఈ గ్రామ నివాసితులు టిబెటన్ మూలాలకు చెందినవారు. నగారాలు మ్రోగించడం ద్వారా లామాలు ప్రయాణం ముగిసినట్లుగా ప్రకటిస్తారు
అనువాదం: సుధామయి సత్తెనపల్లి