తన క్షేమ సమాచారం కోరుతూ తన కుటుంబం ఫోన్ చేస్తూనే ఉంటుందని సోమా కడాలీ చెప్పారు. "నేను బాగానే ఉంటాను," అని 85 ఏళ్ళ ఆ వృద్ధుడు వారికి ధైర్యం చెప్తుంటారు.
అకోలే (అకోలా అని కూడా రాయవచ్చు) తాలూకా వారణ్ఘుశీ నుంచి వచ్చిన ఈ రైతు, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా అకోలా నుండి లోణి వరకు మూడు రోజుల (ఏప్రిల్ 26-28) పాటు చేయ తలపెట్టిన నిరసన పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చారు. తన వయసును పక్కనబెట్టి, తానిక్కడ వుండాల్సిన అవసరాన్ని గురించి వివరిస్తూ,"నేను నా మొత్తం జీవితాన్ని పొలాలపైనే గడిపాను," అంటారాయన.
రూ.2.5 లక్షల అప్పుల భారాన్ని మోస్తోన్న ఆయన, "70 సంవత్సరాల పాటు వ్యవసాయం చేసిన తర్వాత కూడా నాకు దాని గురించి ఏమీ తెలియని పరిస్థితిలో పడతానని నేనెప్పుడూ అనుకోలేదు." అన్నారు. కడాలీ, మహదేవ్ కోలి ఆదివాసీ సముదాయానికి చెందిన వ్యక్తి. ఆయనకు తన గ్రామంలో ఐదు ఎకరాల భూమి ఉంది. వాతావరణం ఇంతటి అనూహ్యంగా మారడాన్ని తానెన్నడూ చూడలేదని ఆయన చెప్పారు
"నాకు కీళ్ళ నొప్పులున్నాయి. నడిచేటప్పుడు మోకాళ్ళు నొప్పెడతాయి. పొద్దున్నే నిద్ర లేవడం కూడా నాకు ఇష్టముండదు. ఏమైనా కానీ, నేను మాత్రం నడుస్తాను," అంటారు కడాలీ
ఏప్రిల్ 26, 2023న అకోలే నుండి ప్రారంభమయ్యే మూడు రోజుల నిరసన కవాతులో పాల్గొనేందుకు అక్కడ గుమిగూడిన 8,000 మంది రైతులలో కడాలీ కూడా ఉన్నారు. ఊరేగింపు సంగమ్నేరు వైపు వెళ్ళే కొద్దీ అనేకమంది రైతులతో నిండిన ట్రక్కులు, బస్సులు వస్తూనే ఉన్నాయి. అఖిల భారత కిసాన్ సభ (AIKS) అంచనా ప్రకారం అదే రోజు సాయంత్రానికి ఊరేగింపు అక్కడికి చేరుకునే సమయానికి, రైతుల సంఖ్య 15,000 మందికి చేరుకుంది.
ఎఐకెఎస్ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ఢవళే, ఇతర సభ్యుల అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు అకోలేలో భారీ బహిరంగ సభ జరిగిన తర్వాత, జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కవాతులో రైతులతో కలిసి సంఘీభావంగా పాల్గొననున్న ప్రముఖ పాత్రికేయుడు పి.సాయినాథ్ మొదటి వక్తగా మాట్లాడారు. ఇతర వక్తలలో ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్. ఆర్. రామ్‌కుమార్, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) ప్రధాన కార్యదర్శి మరియం ఢవళే ఉన్నారు.
"ఈ వాగ్దానాలతో మాకు విసుగెత్తిపోయింది," ఈ నిరసనలలో ఎక్కువ భాగాన్ని నిర్వహిస్తోన్న ఎఐకెఎస్ కార్యదర్శి అజిత్ నవలే అన్నారు. "మాకు వాటిని నెరవేర్చటం కావాలి."
ఏప్రిల్ 28న లోణిలో ఉన్న మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ నివాసం వద్ద ఈ పాదయాత్ర ముగుస్తుంది. 39 డిగ్రీల సెల్సియస్‌కు చేరువలో ఉన్న ఉష్ణోగ్రతలో, అధికమైన ఎండవేడిమిని కూడా లెక్కచేయక అనేకమంది వృద్ధులు ఈ పాదయాత్రలో చేరాలని నిర్ణయించుకోవడంలోనే, రైతులలో ఎంతగా నిరాశ, కోపం ఉన్నాయో స్పష్టంగా కనిపిస్తోంది.
'ఈ వాగ్దానాలతో మేం విసిగిపోయాం,' అంటారు, ఈ నిరసనలలో ఎక్కువ భాగాన్ని నిర్వహించిన అఖిల భారత కిసాన్ సభ కార్యదర్శి అజిత్ నవలే. 'మాకు వాటిని నెరవేర్చడం కావాలి'
వేలాది మంది రైతులు రెవెన్యూ శాఖ మంత్రి ఇంటివైపుకు కవాతుచేస్తూ వెళ్తున్న దృశ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమాద ఘంటికలు మోగించింది. ప్రస్తుత ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు - రెవెన్యూ, ఆదివాసీ వ్యవహారాలు, కార్మిక శాఖ - డిమాండ్లపై చర్చలు జరిపేందుకు వేదిక వద్దకు రావచ్చని అనుకుంటున్నారు.
కానీ భారతి మాంగా వంటి చాలామంది రైతులు అంత సులభంగా శాంతించలేరు. “ఇది మా హక్కుల కోసం. ఇది మా మనవళ్ల కోసం,” అని పాలఘర్ జిల్లాలోని తన గ్రామం ఇబథ్పాడా నుండి 200 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి, రైతుల కవాతులో పాల్గొంటోన్న డెబ్బై ఏళ్ళు పైబడిన ఆ రైతు చెప్పారు.
వర్లీ సముదాయానికి చెందిన మాంగా కుటుంబం కొన్ని తరాలుగా రెండెకరాల భూమిని సాగుచేస్తున్నారు. కానీ ఆ భూమి అటవీ భూమిగా వర్గీకరించి ఉండటంతో, దానిపై ఆ కుటుంబానికి ఎటువంటి హక్కు ఉండదు. "నేను చచ్చిపోక ముందే, ఆ భూమికి నా కుటుంబం హక్కుదారుగా ఉండటాన్ని చూడాలనుకుంటున్నాను," అంటారామె.
ఈ మూడు రోజుల కోసం తాను ఎన్ని రొట్టెలను మూటగట్టుకు వచ్చిందో ఆమెకు సరిగ్గా లెక్క తెలియదు. "నేను తొందరతొందరగా వాటిని మూటగట్టుకుని వచ్చేశాను," అని ఆమె వివరించారు. రైతులు తమ హక్కుల కోసం మళ్ళీ కవాతు చేస్తున్నారనీ, తాను కూడా అందులో భాగం కావాలని మాత్రమే ఆమెకు తెలిసింది.
ఇక్కడికి తరలివచ్చిన వేలాది మంది రైతుల డిమాండ్లు కొత్తవేమీ కావు. 2018 కిసాన్ లాంగ్ మార్చ్‌లో, రైతులు - ఎక్కువమంది ఆదివాసీలు - నాశిక్ నుండి ముంబై వరకు 180 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పటి నుండి, రైతులు రాజ్యంతో కొనసాగుతున్న పోరాటంలో ఉన్నారు. (చదవండి: The march goes on… )
పెరుగుతోన్న పెట్టుబడి ఖర్చులు, పంటల ధరలు పడిపోవడం, వాతావరణ మార్పుల కారణంగా పేరుకుపోయిన పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారు; పంటల కాలం ముగిసిన తర్వాత కూడా రైతులు విలవిలలాడుతున్నారు. గత రెండు వానాకాలాలలో కురిసిన అతివృష్టి కారణంగా పంట నష్టపోయినవారికి పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అలాంటి హామీని ఇచ్చి కూడా అందుకు అవసరమైన చర్యలు తీసుకోలేదు
మహారాష్ట్రలోని ఆదివాసీ జిల్లాల్లో, మైలురాయి వంటి అటవీ హక్కుల చట్టం (FRA), 2006ని మెరుగ్గా అమలు చేయాలని ఆదివాసీ రైతులు ఏళ్ళ తరబడి డిమాండ్ చేస్తున్నారు.
కోవిడ్-19 వ్యాప్తి తర్వాత లీటరు పాలను రూ. 17కు అమ్ముకోవాల్సిన దుస్థితిలో పడిన పాడి రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం జోక్యం చేసుకుని పూడ్చాలని రైతు కార్యకర్తలు కోరుతున్నారు.
ఒకసారి అకోలే తాలూకాలోని శెల్విహిరే గ్రామానికి చెందిన ఒక రైతు గుల్చంద్ జంగలే, అతని భార్య కౌసాబాయి తమ భూమిని అమ్మవలసి వచ్చింది. డెబ్బై ఏళ్ళ వయసు దాటిన ఈ దంపతులు తమకు దొరికినపుడు రోజువారీ కూలీ పనిని ఎంచుకుంటారు. వారి కొడుకును మాత్రం వ్యవసాయం నుండి బయటకు పంపేశారు. "అతను పుణేలో కూలీగా పనిచేస్తున్నాడు," అని జంగలే PARIతో చెప్పారు. "నేనతన్ని వ్యవసాయం నుండి బయటపడమని చెప్పాను. అందులో భవిష్యత్తు లేదు.”
తమ భూమిని అమ్మిన తర్వాత, జంగలే, కౌసాబాయి దంపతులు గేదెలను పెంచుతూ, వాటి పాలను అమ్మేవారు. "కోవిడ్-19 విరుచుకుపడినప్పటి నుండి బతకటం చాలా కష్టంగా ఉంటోంది," అన్నారాయన.
ఈ కవాతుకు రావాలని నిశ్చయించుకున్న జంగలే, “నేను ఈ నిరసన కవాతులో పాల్గొనడం కోసం మూడు రోజుల నా రోజువారీ కూలిని వదులుకున్నాను. ఈ వయస్సులో ఈ వేడిలో మూడు రోజుల పాటు నడిచిన తర్వాత, నేను వెంటనే పని చేయలేను. కాబట్టి నా ఐదు రోజుల కూలీ పోయిందని అనుకోవచ్చు."
కానీ వేలాదిమంది ఇతర రైతుల మాదిరిగానే ఆయన కూడా తన గొంతును వినిపించాలని కోరుకుంటున్నారు. "వేల మంది రైతులు భుజం భుజం కలిపి కవాతు చేస్తున్నప్పుడు, మీ గురించి మీకు మంచి అనుభూతి కలుగుతుంది. ఇది మీకు కొంత భరోసానూ ఆశనూ ఇస్తుంది. అలాంటి అనుభూతిని మనం చాలా అరుదుగా మాత్రమే అనుభవిస్తాం.”
తాజా కలం:
పాదయాత్ర రెండవ రోజైన ఏప్రిల్ 27, 2023న మహారాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు క్యాబినెట్ మంత్రులను - రెవెన్యూ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్, కార్మిక మంత్రి సురేష్ ఖాడే, ఆదివాసీ అభివృద్ధి శాఖ మంత్రి విజయ్‌కుమార్ గావిత్ - సంగమ్నేర్లో రైతు నాయకులతో సమావేశమై వారి డిమాండ్ల గురించి వివరంగా చర్చించడానికి పంపించింది.
పరిష్కారం కోసం తీవ్రమైన ఒత్తిడి రావటంతోనూ, 15,000 మంది - ప్రధానంగా ఆదివాసీ రైతులు - లోణీలోని రెవెన్యూ మంత్రి నివాసం వైపు కవాతు చేయడంతోనూ, వారు దాదాపు అన్ని డిమాండ్లను మూడు గంటల్లోనే అంగీకరించారు. డిమాండ్లను సాధించడంతోనే, ఆల్ ఇండియా కిసాన్ సభ (AIKS), ఇంకా ఇతరులు నిరసన కవాతు ప్రారంభమైన ఒక రోజు తర్వాత దానిని విరమించారు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి