ఈ సంవత్సరం ఏప్రిల్ 10న రాత్రి 10:30 గంటలకు, హయ్యూల్ రహమాన్ అన్సారీ ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్‌లో ఉన్నాడు. అతను జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీ జిల్లాలోని హతియా రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు 12:30 గంటలకు వచ్చే హతియా ఎక్స్‌ప్రెస్ కోసం వేచి ఉన్నాడు. అక్కడ నుండి, రహమాన్ బస్ స్టాండ్‌కు ఆటోరిక్షా తీసుకొని వెళ్లి, ఆ తర్వాత పొరుగున ఉన్న ఛత్ర జిల్లాలోని తన గ్రామమైన అసర్హియాకు బస్సులో వెళ్తాడు.
ఈ మొత్తం ప్రయాణం అతనికి ఒకటిన్నర రోజులు పడ్తుంది.
అయితే, రైలు ఎక్కే ముందు, స్టేషన్ యొక్క నిశ్శబ్ద మూలలో నిలబడి ఉన్న 33 ఏళ్ళ రెహమాన్, ఒక సంవత్సరం వ్యవధిలో రెండవసారి ముంబైని ఎందుకు విడిచిపెడుతున్నాడో మాకు చెప్పిండు.
ఇంటికి పొయ్యే రైలు కోసం వేచి ఉండటానికి కొన్ని రోజుల ముందు, అతని కొత్త యజమాని పని మందగించిందని చెప్పాడు. "ఆయన ఇట్లా అన్నాడు, 'రెహమాన్, క్షమించు, మేము నిన్ను పనిలో పెట్టుకోలేము. తర్వాత ఎప్పుడైనా మళ్లీ ప్రయత్నించవచ్చు. ” అలా అతను, అప్పుడే చేరిన ఉద్యోగాన్ని కోల్పోయాడు – ఆ ఉద్యోగం అసలు ఇంకా మొదలేకాలే.
రెహమాన్ 10 సంవత్సరాల క్రితం జంషెడ్పూర్ లోని కరీం సిటీ కాలేజీ నుండి మాస్ కమ్యూనికేషన్లో BA పట్టభద్రుడయ్యాక ముంబైకి వెళ్లాడు. అతను వీడియో ఎడిటర్‌గా ప్రాజెక్ట్ ఆధారిత అసైన్మెంట్లను చేపట్టాడు. నగరంలో తనను తాను నిలబెట్టుకోనికి, ఇంటికి కొంత డబ్బు పంపడానికి తగినంత సంపాదించేటోడు.
కానీ మార్చి 2020లో, దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వల్ల లాక్డౌన్ ప్రకటించినప్పుడు, అతను తన ఉద్యోగాన్ని కోల్పోయిండు - దానితో పాటే అతని నెల జీతం, రూ. 40,000 కూడా కోల్పోయాడు. తన గ్రామానికి చెందిన మరో నలుగురితో కలిసి రెహమాన్ అద్దెకు తీసుకున్న చిన్న గదిలో నివసించడం కొనసాగించాడు. బాంద్రా వెస్ట్ యొక్క లాల్ మిట్టి ప్రాంతంలో ఒక్కొక్కరు రూ. 2,000 అద్దె కడుతునారు. అది చాన కఠినమైనది అని అతను యాద్చేసుకున్నాడు - ఒక సమయంలో, అతనికి రేషన్ కొనుక్కోవడం కోసం కూడా తగినంత డబ్బు కుడా లేకుండే.
"గత సంవత్సరం, మహారాష్ట్ర ప్రభుత్వం నుండి నాకు ఎసువంటి సహాయం అందలే" అని రెహమాన్ అన్నారు. ఒక మాజీ సహోద్యోగి అతనికి బియ్యం, పప్పు, నూనె, ఖర్జూరాలు ఇచ్చాడు. "నేను ఆ సమయంలో మస్త్ బాధపడ్డాను. ఆ ముచ్చట గురించి నేను ఎవరితోనూ మాట్లాడలేను."
కాబట్టి, పోయిన ఏడాది మే మధ్యలో, రెహమాన్ అసర్హియాలోని ఇంటికి పోనీకి మూడు నెలల అద్దెను ఆదా చేసుకున్నాడు. అతను, అతని రూమ్మేట్లు ఒక ప్రైవేట్ బస్సును అద్దెకు తీసుకున్నారు. దాని అద్దె ఒక్కో సీటుకు రూ. 10,000. అద్దె తరువాత ఇస్తామని తన యజమానిని అభ్యర్థించాడు.
రెహమాన్ తన గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత, తన ఐదుగురు సోదరులతో కలిసి తన కుటుంబానికి చెందిన 10 ఎకరాల పొలంలో పని చేయడం శురూ చేసిండు. పంట వేయడం, సాగు చేయడం, కోతలను పర్యవేక్షించడం చేశాడు. అతని తల్లిదండ్రులు, సోదరులు, వారి కుటుంబాలు, అందరూ కలిసి గ్రామంలో నివసిస్తున్నారు. రెహమాన్ భార్య 25 ఏళ్ల సల్మా ఖాతున్, వారి పిల్లలు, 5 ఏళ్ల ఎమ్. అఖ్లాక్ 2 ఏళ్ల సైమా నాజ్, కూడా వారితోనే నివసిస్తున్నారు.
మహమ్మారికి ముందు, రెహమాన్ ఇంటి ఖర్చులకి, వారి పొలాన్ని నడపనీకి కుటుంబం తీసుకున్న రుణాల చెల్లింపు కోసం ఇంటికి రూ. 10,000-15,000 వరకు పంపించాడు. లాక్డౌన్ ఆంక్షలను సడలించినప్పుడు, రాబోయే ఉద్యోగావకాశాల ఆలోచన అతడిని తిరిగి ముంబైకి తిరిగి రప్పించింది. అతను 10 నెలల తర్వాత ఫిబ్రవరి 2021 చివరిలో తిరిగి ముంబై వచ్చాడు.
అప్పటికే అతను తన ఇంటి యజమానికి 10 నెలల అద్దె అప్పుగా ఉండే. పొలంలో పని చేయడం ద్వారా జమ చేసిన డబ్బు, మరియు లక్నోలో చిన్న చిన్న ఎడిటింగ్ పన్ల ద్వారా సంపాదించిన పైసల్ తో, ముంబై చేరుకున్న ఎంబటే రెహమాన్ రూ. 18,000 - తొమ్మిది నెలల అద్దె కట్టేశిండు.
కానీ అతను కొత్త కార్యాలయంలో పని ప్రారంభించడానికి ముందు, ఏప్రిల్ 5 నుండి మహారాష్ట్రలో పాక్షిక లాక్డౌన్ ప్రకటించబడ్డది (ఏప్రిల్ 14 న పూర్తి లాక్డౌన్ అమలు చేశిర్రు). కోవిడ్ -19 యొక్క రెండవ వేవ్ ప్రాజెక్టులను మందగించింది. అదే సమయంలో రెహమాన్ యొక్క కొత్త యజమాని అతన్ని ఇకపై పనిలో పెట్టుకోలేనని తేల్చి చెప్పిండు.
ఇంతకు ముందు పని దొరకడంలో అనిశ్చితి రెహమాన్‌ను ఎక్కువగా ప్రభావితం చేయలేకుండే. "నేను ప్రాజెక్ట్ కోసం సైన్ ఇన్ చేశినప్పుడు, అది కొన్నిసార్లు ఆరు నెలలు, రెండు సంవత్సరాలు లేదా మూడు నెలలు కూడా ఉంటుండే. నేను దానికి అలవాటు పడిన, "అని అతను చెప్పాడు. "కానీ కార్యాలయాలు అకస్మాత్తుగా మూసినప్పుడు, అది చాలా కష్టం అయ్యింది."
ఇంతకుముందు, ఒక ఆఫీసులో పనులు జరగకపోతే, వేరే ప్రదేశాలలో దరఖాస్తు చేసుకోవస్తుండే. "ఇప్పుడు, వేరే చోట ఉద్యోగం సంపాదించుకోవడం కూడా కష్టమే. మహమ్మారి కారణంగా, ఒకరు కరోనా పరీక్ష చేయించుకోవాలే, సానిటైజ్ అవ్వాలే... ఇంకా మల్లా ప్రజలు తమ భవనాల్లోకి అపరిచితులను అనుమతించక పోతుండే. ఇది మాకు పెద్ద సమస్యగా మారే, ”అని రెహమాన్ వివరించారు.
అతను తన గ్రామంలో నివసించడం కంటే మరేమీ మార్గం లేకపోయినప్పటికీ, ఇట్లా అన్నాడు, “అయితే నేను ఆడ ఈ విధమైన పని [వీడియో ఎడిటింగ్] చేయనీకిలేదు. పైసల్ అవసరమైనప్పుడు, నగరానికి పోవాల్సిందే. ”
అనువాదం: జి. విష్ణు వర్ధన్