చీకటి, విరామాల్లో వెళ్తున్న రైళ్ల ఈలలు- ఈ రెండూ ఒక మగవాడు తమని చూస్తున్నాడు అనే భావన వలన కలిగే అశాంతిని మాత్రం కలిగించవు.
"రాత్రుల్లో రైల్వే ట్రాకులు మాత్రమే మాకు అందుబాటులో ఉండే టాయిలెట్లు," అంటుంది పదిహేడేళ్ల నీతూ కుమారి.
నీతూ దక్షిణ మధ్య పాట్నాలోని యార్పూర్ లోని తొమ్మిదో నెంబర్ వార్డులోని బస్తీలో ఉంటుంది. ఈ ఇళ్ల గుంపు మధ్య సిమెంటు వేసి ఉన్న ఒక చోటులో, నల్లాల వరస దగ్గర దాదాపు బట్టలన్నీ తీసేసి స్నానం చేస్తున్న ఇద్దరు పురుషులు గట్టిగా సబ్బు రుద్దుకుంటున్నారు. దాదాపు డజను మంది అబ్బాయిలు నీళ్లతో ఆడుకుంటూ, జారుగా ఉన్న నేలపై పడుతూ ఒకరిని ఒకరి లాగి పడేస్కుంటూ నవ్వుతూ అరుస్తున్నారు.
దాదాపు 50 మీటర్ల దూరంలో, ఒక టాయిలెట్ బ్లాక్ - ఈ కాలనీలో ఉన్నది ఒక్కటే - నిరుపయోగంగా ఉంది, దాని 10 క్యూబికల్‌లలో ప్రతి ఒక్కటి తాళం వేసి ఉంది, మహమ్మారి కారణంగా ఈ ప్రజా సౌకర్యాన్ని కమ్యూనిటీకి అప్పగించడం ఆలస్యం అయింది. కొంచెం ఎత్తులో ఆ బ్లాక్ రెండు మెట్లపై మేకలు సేద తీరుతున్నాయి. ఆ వెనకే ఉన్న రైల్వే ట్రాక్‌లపై చెత్త కుప్పలు పడి ఉన్నాయి. అక్కడి నుంచి వాడుకలో ఉన్న పబ్లిక్ టాయిలెట్ పది నిమిషాల నడక దూరంలో ఉంది, కొందరు యార్పూర్ కి మరో వైపున ఉన్న టాయిలెట్‌కు వెళ్ళడానికి ట్రాక్‌లను దాటి వెళ్తారు- ఇది కూడా 10 నిమిషాల పాటు ప్రయాసతో కూడిన నడకే.
"అబ్బాయిలు ఆ పని ఎప్పుడైనా ఎక్కడైనా చేస్తారు. అమ్మాయిలు ట్రాకులని రాత్రి పూట మాత్రమే వాడతారు," అంటుంది బిఏ మొదటి సంవత్సరం విద్యార్థిని నీతూ. (ఈ కథలో అన్ని పేర్లు మార్చబడ్డాయి.) ఆ ప్రాంతంలో ఉండే మిగతా అమ్మాయిల కన్నా తనని తాను అదృష్టవంతురాలిగా భావిస్తుంది - పగటి సమయంలో 200 మీటర్ల దూరంలో ఉన్న తన పిన్ని ఇంట్లో టాయిలెట్ వాడుకోగలదు.
"అంతే గాక, మా ఇంట్లో రెండు గదులు ఉన్నాయి, ఒక దాంట్లో మా తమ్ముడు పడుకుంటాడు, నాకు అమ్మకి ఒక గది. అంటే కనీసం ప్యాడ్లు మార్చుకోవడానికి నాకు ఇంట్లో ఏకాంతంగా ఉండే ఒక చోటు ఉంది ," అంటుంది నీతూ. "చాల మంది అమ్మాయిలు, మహిళలు రైల్వే ట్రాక్ల మీద నాప్కిన్లు మార్చుకోడానికి, రోజంతా ఎదురు చూస్తారు - అన్నిటి కన్నా చీకటిగా ఉండే భాగంలో."
ఆమె కాలనీ, చిన్న తొమ్మిదో నెంబర్ వార్డు బస్తీ, ఆ పక్కనే ఉన్న పెద్ద యార్పూర్ అంబేద్కర్ నగర్, ఇవన్నీ దాదాపు 2,000 కుటుంబాలకు, ఎక్కువగా కూలీలు, ఇంకా నీతూ వంటి అనేక మంది రెండో తరం పాట్నా వాసులకి నివాసం అని అక్కడ ఉంటున్న వాళ్ళ అంచనా. చాలా కుటుంబాలు నగరంలో పని కోసం దశాబ్దాల క్రితం బీహార్‌లోని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడకు వలస వచ్చారు.
యార్పూర్ అంబేద్కర్ నగర్‌లో, తాము చాలా కాలంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను ఉపయోగిస్తున్నామని, అయితే పాండెమిక్ కారణంగా జీవనోపాధి కోల్పోవడం వలన కలిగిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా, కొంతమంది ఇంట్లో తయారుచేసిన గుడ్డ న్యాప్‌కిన్‌లకు మారిపోయామని అక్కడి మహిళలు చెప్పారు. నాతో మాట్లాడటానికి గుడి వరండాలో గుమిగూడిన మహిళల్లో చాలామంది తమకు మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయని, అయితే ఇవి అధ్వాన్నంగా ఉన్నాయని, నిర్వహణ లేదా మరమ్మతులు లోపించాయని, రాత్రి వేళల్లో వెలుతురు సరిగా లేదని చెప్పారు. మరుగుదొడ్లు అన్ని వేళలా తెరిచి ఉంటాయి, కానీ చీకటిలో నడిచి వెళ్లడం చాలా పెద్ద అడ్డంకి.
"వార్డ్ నంబర్ 9లో ట్రాక్‌లకు అవతలి వైపు మాత్రమే టాయిలెట్లు లేవు" అని 38 ఏళ్ళ ప్రతిమా దేవి చెప్పింది, ఆమె మార్చి 2020లో పాఠశాలలు మూతబడే వరకు స్కూల్ బస్ అసిస్టెంట్‌గా నెలకు 3,500 సంపాదించేది. ఆ తర్వాత నుండి ఆమెకు పని లేదు. ఆమె భర్త, ఒక రెస్టారెంట్‌లో వంటవాడు, 2020 చివరిలో అతన్ని కూడా పనిలో నుంచి తీసేసారు.
యార్‌పూర్‌కి వెళ్లే ప్రధాన రహదారి పక్కన బండిపై సమోసాలు, ఇతర చిరుతిళ్లను అమ్ముకుంటూ ఆ దంపతులు జీవనం సాగిస్తున్నారు. ప్రతిమ తెల్లవారుజామున 4 గంటలకు మేల్కొని భోజనం వండడానికి, కొనుగోళ్లు చేయడానికి, ఆ రోజు అమ్మకాలకు సరిపడా సిద్ధం చేసి, ఆపై శుభ్రం చేసి కుటుంబం కోసం మళ్ళీ వంట చేస్తుంది. “మేము మునుపటి లాగ పది పన్నెండు వేలు సంపాదించట్లేదు, కాబట్టి మేము జాగ్రత్తగా ఖర్చు చేయాలి, ”అని ఆమె చెప్పింది. యార్‌పూర్‌లో ప్రస్తుతానికి శానిటరీ నాప్‌కిన్‌లు కొనడం మానేసిన మహిళల్లో ప్రతిమ కూడా ఉంది.
కాలేజీ విద్యార్థిని నీతూ కొన్నేళ్ల క్రితం మద్యానికి బానిసైన తన తండ్రిని కోల్పోయింది. ఆమె తల్లి స్లమ్ కాలనీ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో బోరింగ్ రోడ్‌లోని కొన్ని ఇళ్లలో వంట మనిషిగా పనిచేస్తుంది. ఇతర చిన్న చిన్న క్లీనింగ్ పనులతో పాటు ఆమె నెలకు రూ. 5,000-రూ. 6,000 సంపాదిస్తుంది.
"మా వైపు ఉన్న కాలనీలో 8 నుంచి 10 ఇళ్లలో ఇంట్లోపలే టాయిలెట్లు ఉన్నాయి, ,మిగతా అందరు ట్రాక్లని వాడతారు లేకుంటే వేరే పబ్లిక్ టాయిలెట్లకి నడిచి వెళ్తారు," అంటుంది నీతూ. ఇందులో ఆమె 'బుఆ' , అత్త ఇల్లు కూడా ఉంది - అయితే ఈ టాయిలెట్‌ల డ్రైనేజీలు సరిగ్గా నిర్మించి ఉండవు, అవి ఏ మురుగునీటి లైన్‌లకు కనెక్ట్ చేసి లేవు. “రాత్రి సమయం మాత్రమే నాకు సమస్య. కానీ నేను ఇప్పుడు దానికి అలవాటు పడ్డాను,” అని ఆమె చెప్తుంది.
నీతూ రైల్వే ట్రాక్‌లను ఉపయోగించాల్సి వచ్చే రాత్రుల్లో , రైలు హారన్ యొక్క శబ్దాలు, అది రాకముందే ట్రాక్‌లపై ప్రకంపనలు గమనిస్తూ అప్రమత్తంగా ఉంటుంది. ఇన్నేళ్ల బట్టి ఈ సెక్షన్లో రైళ్లు ఎంత తరచుగా వస్తాయో తనకి అవగాహన ఉందని తను చెప్పింది.
"అది సురక్షితం కాదు, అక్కడికి వెళ్లకుండా ఉంటే బాగుండు అని నేనూ అనుకుంటాను కానీ వేరే దారి ఏది? చాలామంది ఆడవాళ్లు, అమ్మాయిలు కూడా ట్రాక్లపై చీకటి ఉండే చోట్లలో న్యాప్కిన్లు మార్చుకుంటారు. కొన్నిసార్లు, మగవాళ్ళు ఎప్పుడూ మమ్మల్నే చూస్తున్నట్టు అనిపిస్తుంటుంది," అంటుంది తను. శుభ్రపరచుకోవడం కూడా ప్రతిసారి సాధ్యపడదు కానీ ఇంట్లో నీళ్ల నిల్వ సరిపడా ఉంటే ఒక చిన్న బకెట్ తీసుకెళ్తానని ఆమె చెప్పింది.
ఎవరో తనని చూస్తున్నారనే భావన గురించి తను ప్రస్తావించినప్పటికీ నీతూ గానీ మిగతా మహిళలు, అమ్మాయిలు గానీ టాయిలెట్లకి వెళ్లే దారిలో వారు గురయ్యే లైంగిక వేధింపుల గురించి మాట్లాడలేదు. అక్కడికి వెళ్లడం వాళ్ళకి సురక్షితంగా అనిపిస్తుందా? నీతూ లాగే మిగతా అందరూ కూడా అలవాటు పడిపోయారని, వెళ్లేప్పుడు తగినంత జాగ్రత్త కోసం సాధారణంగా జంటలుగానో గుంపులుగానో వెళ్తారని చెప్పారు.
ప్యాండెమిక్ సమయంలో నీతు తల్లి కొన్ని నెలలపాటు శానిటరీ న్యాప్‌కిన్‌లు కొనడం మానేసింది. "కానీ ఇది చాలా అవసరం అని నేను ఆమెకు చెప్పాను. మేమిప్పుడు అవి కొంటున్నాం. కొన్నిసార్లు ప్యాడ్‌ల ప్యాక్‌లను స్వచ్ఛంద సంస్థలు కూడా అందజేస్తాయి” అని నీతూ చెప్పింది. కానీ ఉపయోగించిన ప్యాడ్‌ను ఎలా ఎక్కడ పడేయాలనేది ఒక సమస్యగా మిగిలిపోయింది. "చాలా మంది అమ్మాయిలు వీటిని పబ్లిక్ టాయిలెట్లలో లేదా రైల్వే ట్రాక్‌లపై వదిలేస్తారు, ఎందుకంటే చేతిలో చిన్న పొట్లంతో డబ్బా కోసం వెతుకుతూ బయట తిరగడం ఇబ్బందికరంగా ఉంటుంది" అని ఆమె చెప్పింది.
నీతూ తను ఉపయోగించిన శానిటరీ న్యాప్‌కిన్‌లను సరైన సమయంలో అందుకుంటే చెత్త ట్రక్‌లో, లేదా అంబేద్కర్ నగర్ బస్తీకి ఇంకో వైపు చివర్లో ఉన్న పెద్ద చెత్త పడేయడానికి నడిచి వెళ్తుంది. ఈ 10 నిమిషాల నడక కోసం ఆమెకు సమయం లేకపోతే, ఆమె దాన్ని ట్రాక్‌లపై పడేస్తుంది.
యార్పూర్ నుండి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో, దక్షిణ-మధ్య పాట్నాలోని హజ్ భవన్ వెనుక సాగడ్డి మసీదు రోడ్డులో, ఓపెన్ నాలాకు ఇరువైపులా నిర్మించబడ్డ సెమీ-పక్కా ఇళ్ల వరుస ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చాలా కాలం క్రితం నగరానికి వలస వచ్చినవారే. వీళ్ళలో చాలామంది సెలవులకి, పెళ్లిళ్లకి లేదా ఇతర సందర్భాలలో బెగుసరాయ్, భాగల్పూర్ లేదా ఖగారియా జిల్లాల్లోని తమ కుటుంబాల దగ్గరికి, ఇళ్లకు వెళ్తారు.
దిగువ గట్టు వెంబడి ఉంటున్న వాళ్లలో 18 సంవత్సరాల పుష్ప కుమారి కూడా ఉంది. " యహాన్ తక్ పానీ భర్ జాతా హై (ఇక్కడ వరకు నీళ్లు నిండుతాయి)," ఆమె తన అరచేతులను తుంటిపై పెట్టి భారీ వర్షం కురిసినప్పుడు నీటి మట్టం ఎంతో చూపిస్తుంది. "నాలా పొంగి మా ఇళ్ళను, మరుగుదొడ్లను ముంచెత్తుతుంది."
ఇక్కడున్న దాదాపు 250 ఇళ్ళలో చాలా వాటికి బయట, నాలా అంచున కుటుంబాలు నిర్మించుకున్న మరుగుదొడ్డి ఉంది. మరుగుదొడ్ల నుండి వచ్చే వ్యర్థాలు నేరుగా రెండు మీటర్ల వెడల్పు గల ఓపెన్ డ్రెయిన్‌లోని కంపుకొట్టే నీళ్ళలోకి చేరుతాయి.
కొన్ని ఇళ్లకు దూరంగా ఉంటున్న 21 ఏళ్ల సోనీ కుమారి, వర్షాకాలంలో కొన్నిసార్లు టాయిలెట్‌లో నుంచి నీరు నిండి, అవి తగ్గిపోవడానికి ఒక రోజంతా గడిచిపోతుంది .ఈలోపు ఆ నీరు తగ్గడానికి ఎదురు చూడడం తప్ప ఆమెకు వేరే మార్గం లేదు.
ఖగారియా జిల్లాలో భూమిలేని కుటుంబానికి చెందిన ఆమె తండ్రి పాట్నా మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్‌పై పారిశుధ్య కార్మికుడు. అతను చెత్త వాహనంలో నడుస్తూ, పెద్ద డబ్బాలో చెత్తను సేకరించడానికి బైలేన్‌లలోకి వెళ్తాడు. "లాక్‌డౌన్ సమయంలో అతను పనిచేశాడు. వారికి [అతని బృందానికి] మాస్క్‌లు మరియు శానిటైజర్ ఇచ్చి పనికి వెళ్లమని చెప్పారు, ”అని తన BA డిగ్రీ రెండవ సంవత్సరం ప్రారంభించిన సోని చెప్పింది. ఆమె తల్లి సమీపంలోని ఇంట్లో ఆయాగా పనిచేస్తోంది. వారి నెలసరి కుటుంబ ఆదాయం దాదాపు రూ. 12,000.
తమ కాలనీలో ఓపెన్ డ్రెయిన్ పక్కనే ఇంటి ముందే మరుగుదొడ్డి ఉంటుంది, దానిని ఆ ఇంట్లో ఉండేవాళ్ళు మాత్రమే వాడతారు. "మాది అధ్వాన్నంగా ఉంది, ఒక రోజు స్లాబ్ నాలాలో పడిపోయింది," పుష్ప చెప్పింది. ఆమె తల్లి గృహిణి, తండ్రి, తాపీ మేస్త్రీ, భవన నిర్మాణ కూలీ, అతనికి కొన్ని నెలలుగా పని లేదు.
ఇక్కడి మరుగుదొడ్లు ఆస్బెస్టాస్ లేదా టిన్ రేకులతో తయారు చేసిన చిన్న క్యూబికల్‌లు. రేకులని కలిపి ఉంచడానికి వెదురు కర్రలు, రాజకీయ పార్టీ బ్యానర్, చెక్క పలక, కొన్ని ఇటుకలు వంటివి వాడారు. లోపల టాయిలెట్ సీట్ అయినా ఒక పింగాణీ గిన్నె(స్క్వాటింగ్ బౌల్) ఉంది - వీటిలో చాలా వరకు విరిగినవి, పగుళ్లు ఉన్నవి లేక రంగు మారినవి - కొన్ని టాయిలెట్‌లలో ఇవి కొద్దిగా ఎత్తులో నిర్మించబడ్డాయి. క్యూబికల్‌లకు తలుపులు లేవు - మాసిపోయిన పరదాలు మాత్రమే కొంచెం చాటుని ఇస్తాయి.
బస్తీలో మొదట్లో ఉన్న ఇళ్లకు కేవలం కొన్ని మీటర్ల దూరంలో, సగడ్డి మసీదు రోడ్డుకు చివరన ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ భవనం బయట రెండు మరుగుదొడ్లు ఉన్నాయి, మార్చి 2020లో ప్యాండెమిక్ ప్రారంభమైనప్పటి నుండి బడికి వేసినట్టే వాటికి కూడా తాళాలు వేసి ఉంచారు.
ఈ కాలనీ వాసులు దగ్గరలోని పబ్లిక్ కుళాయిల నుండి నీళ్లు పట్టుకుంటారు, స్నానాలు కూడా అక్కడే చేస్తారు. కొంతమంది మహిళలు తమ ఇళ్ల వెనుక స్నానం చేస్తారు. నేను మాట్లాడిన చాలామంది అమ్మాయిలు, యువతులు తమ ఇంటి గుమ్మం బయట లేదా పబ్లిక్ కుళాయి వద్ద, గుంపులుగా, నిండుగా బట్టలు వెస్కొని స్నానం చేయాలి.
“మాలో కొందరు స్నానం చేయడానికి మా ఇళ్ల వెనుక ఉన్న మూలకి నీళ్లు తీసుకెళ్తారు. అక్కడ కొంచెం ఎక్కువ చాటు ఉంటుంది, ”అని సోని చెప్పింది.
" అడ్జస్ట్ కర్ లేతే హైన్ (సర్దుకుని పోతాం)," బహిరంగ ప్రదేశంలో స్నానం చేయడం గురించి పుష్ప మాట్లాడుతూ అంది. "కాని నీటి కుళాయి నుంచి టాయిలెట్ వరకు నడవడం తప్పించుకోలేము," నవ్వుతూ చెప్పింది. "అందరికీ తెలుసు మీరు మీ పని కోసమే వెళ్తున్నారని"
బస్తీలో చెల్లాచెదురుగా ఉన్న కొన్ని చపాకల్ లేదా చేతిపంపులు మాత్రమే వాళ్ళకి మరో నీటి వనరు. అవే నీళ్లు (కుళాయిలు, చేతిపంపుల నుండి) వంటకి, త్రాగడానికి, ఇంట్లో అన్ని అవసరాలకు వాడతారు. స్వచ్ఛంద సేవా సంస్థ వాలంటీర్లు, పాఠశాల టీచర్లు సురక్షితమైన తాగునీటి గురించి తమకు సలహాలు ఇస్తున్నప్పటికీ ఎవరూ నీళ్ళని మరిగించడం లేదని బాలికలు చెబుతున్నారు.
శానిటరీ న్యాప్‌కిన్‌లు సర్వసాధారణం, లాక్‌డౌన్ సమయంలో దుకాణాలు సరిగ్గా అందుబాటులో లేనప్పటికీ, చాలా తక్కువ మంది అమ్మాయిలు బట్టని వాడాల్సి వచ్చిందని అమ్మాయిలు చెప్పారు. చాలా మంది అమ్మాయిలు, వాళ్ళ తల్లులు బట్టని వాడినా కూడా ఎల్లప్పుడూ తమ కోసం ప్యాడ్‌లను కొన్నారని అన్నారు.
తరచుగా, ఉపయోగించిన శానిటరీ నాప్‌కిన్‌లు ఓపెన్ నాలాలోకి వెళ్తాయి, అక్కడ అవి అప్పుడప్పుడు కొన్ని రోజులు లేదా వారాల తర్వాత వాటిని చుట్టి ఉంచిన పాలిథిన్ లేదా పేపర్ నుండి వేరయ్యి పైకి తేలుతాయి. “మునిసిపల్ చెత్త వాహనంలో ప్యాడ్‌లను సరిగ్గా పడేయడం మాకు [NGO వాలంటీర్లు] నేర్పించారు, కానీ కొన్నిసార్లు అది బాగా చుట్టినప్పటికీ పురుషులందరూ చూస్తుండగా ప్యాడ్‌తో నడవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది,” అని సోని చెప్పింది.
నాతో మాట్లాడటానికి స్థానిక కమ్యూనిటీ హాల్‌లో ఒక చోట చేరిన అమ్మాయిల గుంపులో ముసిముసి నవ్వులు విరజిమ్మాయి, అంతేగాక మరిన్ని కథలు కథనాలు బయటపడ్డాయి. "గత వర్షాకాలంలో నీళ్లలో మునిగిన టాయిలెట్ ని ఉపయోగించే అవసరం లేకుండా ఉండడానికి మనం ఒక్కరోజు తిండి తినని సమయం గుర్తుందా? అని అడుగుతుంది పుష్ప.
“నా తల్లిదండ్రులు ఇప్పుడు చేసే పనిని చేయనవసరం లేకుండా ఉండడానికి” గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం సంపాదించాలి అనుకుంటున్నానని చెప్పింది సోని. విద్య, కొంత ఆరోగ్య సంరక్షణ, ఇంకా కొన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చుకోగలిగినప్పటికీ పారిశుధ్యం వాళ్ళకి నిరంతర అడ్డంకి : "బస్తీల్లో మరుగుదొడ్లు అమ్మాయిలకు అతిపెద్ద సమస్య."
రిపోర్టర్ నోట్: ఈ కథను చేసేటప్పుడు సహాయం, ఇన్‌పుట్‌లు అందించిన దీక్షా ఫౌండేషన్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఫౌండేషన్ (UNFPA, పాట్నా మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు) పాట్నా నగరంలోని బస్తీల్లోని మహిళలు, పిల్లలతో పారిశుద్ధ్యం మరియు ఇతర సమస్యలపై పని చేస్తుంది.
పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.
ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? ఐయితే [email protected]కి ఈమెయిల్ చేసి అందులో [email protected]కి కాపీ చేయండి.
అనువాదం: దీప్తి సిర్ల