“ఎక్కడా ఏ ఇబ్బంది లేదు. తేడాగా ఏమీ జరగలేదు.అంతా బానే ఉంది, జీవితం సాదాగా గడిచిపోతోంది.” అన్నాడు దినేష్ చంద్ర సుతార్- తమ కుటుంబపు దస్తావేజుల మధ్యలో కూర్చుని, రోజువారీ జీవితం ఎలా ఉండేదో తలుచుకుంటూ, జరగరానిది ఎలా జరిగిందో ఆలోచించుకుంటూ…
బాన్సీ గ్రామంలో తన ఇంటి గోడల మీద అతని చనిపోయిన భార్య ఫోటోలు వేలాడుతున్నాయి. దినేష్ దగ్గర ఫైల్ లో ఉన్న ఫోటోనే గోడ మీద కూడా ఉంది. 2015లో వాళ్ల పెళ్ళైన కొన్ని నెలలకు ఏదో ప్రభుత్వ స్కీం కు దరఖాస్తు చేసుకోవడానికి ఆ ఫోటో తీయించుకున్నారు.
ఐదేళ్లుగా దినేష్ ఈ పేపర్లను, ఫోటోలను తన మున్నాళ్ల ముచ్చటైన పెళ్లికి గుర్తుగా ఉంచుకున్నాడు. అతనికి ఇద్దరు కొడుకులు- మూడేళ్ళ చిరాగ్, 29 రోజుల దేవాన్ష్. చిన్న వాడికి పేరు కూడా పెట్టకముందే దినేష్ భార్య భావన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటున్న సమయంలో లోపలి పేగు లో కన్నాలు పడి, 50 మంచాలున్న బారిసద్రి మున్సిపాలిటీ కి చెందిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్(CHC) లో చనిపోయింది.
బి.ఎడ్ డిగ్రీ వుండి, బన్సీకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్వాల్ లో స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ 15,000 రూపాయలు సంపాదిస్తున్న దినేష్ జరిగిన విషయాలన్నీ ఆలోచిస్తూ తమ జీవితం ఇలా గాడి తప్పడానికి ఏది కారణమో అని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఆఖరికి తననే తిట్టుకుంటాడు.
“డాక్టర్లు అంతా బానే జరుగుతుందని చెప్పారు అది నమ్మి నేను ఆపరేషన్ కు ఒప్పుకోవడం వలన ఇదంతా జరిగిందా? నేను ఇంకా తెలుసుకుని ఉండవలసింది. నేను ఆపరేషన్ కి ఒప్పుకోకపోవలసింది, ఎవరినీ నమ్మకపోవలసింది. ఇదంతా నా తప్పే” అన్నాడు దినేష్. ఇలా అతను 24 జులై 2019 న అతని భార్య చనిపోయిన దగ్గరనుంచి తనని తాను నిందించుకుంటూనే ఉన్నాడు.
25 జూన్, 2019 న, తాను చనిపోయే నెల ముందుగానే 25 ఏళ్ళ భావన ఒక ఆరోగ్యమైన మగ శిశువుకు జన్మనిచ్చింది. మొదటిసారి లానే రెండవ సారి కూడా సుఖప్రసవం జరిగింది. ఆమె రిపోర్టులు, చెకప్ లే గాక ఊరికి 60 కిలోమీటర్ల దూరం లో చిత్తగడ్ జిల్లా, బారి సద్రి CHC లో జరిగిన ఆమె కాన్పు తో సైతం అన్ని సరిగ్గానే ఉన్నాయి.
కాన్పు అయిన తరువాత, భావన బన్సీలో తన తల్లి ఇంటివద్ద ఉంది. ఆ ఊరి జనాభా 3,883. కాన్పు అయిన ఇరవై రోజుల తరువాత ఒక ఆశా వర్కర్ (ASHA - Accredited Social Health Activist) తనతో పాటు రెగ్యులర్ చెక్ అప్ కి, CHC లో రక్త పరీక్షకి భావన ను రమ్మంది. ఆరోగ్య ఇబ్బందులు ఏమి లేకపోయినా భావన ఆమెతో వెళ్లాలని నిర్ణయించుకుంది. భావన తల్లి కూడా ఆమెతో బయలుదేరింది. “ఆశ వర్కర్ మన ఇంటికి వచ్చినప్పుడు ఆపరేషన్ గురించి ఏమి చెప్పలేదు, “ అని భావన వాళ్ళ అమ్మ దినేష్ తో చెప్పింది.
చెక్ అప్ , పరీక్షలు అయ్యాక , ఆశ వర్కర్ , డ్యూటీ డాక్టర్ భావనను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోమని సూచించారు.
“ఆమెకి అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు, పైగా ఆ దంపతులు కుటుంబ నియంత్రణ ప్రణాళిక గాని కానీ గర్భనిరోధక సాధనం కానీ వాడట్లేదు, ఆపరేషన్ చేయడమే మంచిది. జంజాటం వదిలిపోతుంది. “ అని ఆశ వర్కర్, డాక్టర్- భావనకి, తన అమ్మ ముందే చెప్పారు.
అయితే పదవ తరగతి వరకు చదువుకున్న భావన తన భర్త తో మాట్లాడి తరవాత వస్తాను అని చెబితే, వెంటనే చేయించుకోవడం మంచిది అని చెప్పారు. “ వారి CHC వద్ద స్టెరిలైసెషన్ క్యాంపు నడుస్తోంది. కాబట్టి ఆరోజే చేయించుకొమ్మని పోరారు. ‘ఇప్పుడే కానుపు అయింది, బానే ఉంది కాబట్టి, ఈ సమయం లోనే ఆపరేషన్ చేయించుకుంటే, మళ్లీ మళ్లీ ఆసుపత్రికి వచ్చే పని లేకుండా, ఒకేసారి కానుపు నుండి, ఆపరేషన్ నుండి తేరుకోవచ్చు,’ అని చెప్పారు.” అని దినేష్ గుర్తుచేసుకుంటూ అన్నాడు. అతను స్కూల్ నుంచి నేరుగా CHC కి తన భార్య ఫోన్ చేసి పిలిస్తే వచ్చాడు.
“కాస్త తేడా గా అనిపించింది. నిజం చెప్పాలంటే మేము అసలు ఆపరేషన్ గురించి అప్పటికి ఇంకా ఆలోచించలేదు. ముందు ముందు ఏమన్నా ఆలోచించేవాళ్లమేమో. కానీ అదే మొదటిసారి వినడం. నేను కూడా ఒప్పుకున్నా.” దినేష్ చెప్పాడు.
“ఇక ఆ తర్వాత అంతా మారిపోయింది. అన్నాడు అతను.
బారి సద్రి CHC లో 16 జులై న భావనతో కలిపి ఐదుగురు ఆడవాళ్ళకు ఆపరేషన్ చేశారు. మొట్ట మొదట భావనకే మినీలాప్ ప్రక్రియ ద్వారా ట్యూబల్ లైగేషన్ చేశారు ఒక MBBS డాక్టర్. మిగిలిన నలుగురిని ఆపరేషన్ అయిన రెండు గంటల తర్వాత డిశ్చార్జ్ చేశారు. మూడు గంటల తరువాత భావన విపరీతమైన కడుపు నొప్పితో నిద్ర లేచింది. ఆమెకి ఒక ఇంజెక్షన్ ఇచ్చి, బీపీ చాలా ఎక్కువగా ఉన్నదని CHC లోనే రాత్రి ఉండిపొమ్మన్నారు. తర్వాత రోజుకు కూడా ఆమె కడుపు నొప్పి తగ్గలేదు కానీ ఆమెను డిశ్చార్జ్ చేసేసారు.
“అదే డాక్టర్ చాలా కోపంగా, ‘ఆపరేషన్ తర్వాత నొప్పి సాధారణమే, ఇంటికి తీసుకెళ్ళు,’ అని చెప్పారు.” అన్నాడు దినేష్.
ఆ రాత్రికి భావన కడుపు వాచిపోయింది, నొప్పి భరింపరానిదయ్యింది. పొద్దుటికల్లా ఆ దంపతులు మళ్లీ CHC కి వచ్చారు. ఒక ఎక్స్ రే , సోనోగ్రఫీ తర్వాత, భావన ని మళ్లీ హాస్పిటల్ లో చేర్చుకున్నారు. ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళకి అర్ధం కాలేదు. తర్వాత మూడు రోజులు ఆమెకు రోజుకు 6 ఐ వి బాటిళ్లు ఎక్కించారు. ఒక రెండు రోజుల పాటు ఒక్క ముద్ద అన్నం కూడా తిననీయలేదు. కడుపులో ఉన్న వాపు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగింది.
ఆపరేషన్ అయిన ఐదు రోజులకి, రాత్రి 10 గంటల ప్రాంతం లో, భావనకు ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆమెని 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయపూర్ గవర్నమెంట్ ఆసుపత్రి కి మార్చాలి అని చెప్పారు. “ ఆయన ప్రైవేట్ వాహనాన్ని పిలిపించారు. దానికి డబ్బులు నేనే కట్టుకున్నా (రూ. 1500), CHC లో ఒక కాంపౌండర్ ని కూడా ఇచ్చి పంపారు. కానీ సమస్య ఏంటో నాకర్ధం కాలేదు. అదేదో ఆపరేషన్ కి సంబంధించినది, అని మాత్రమే తెలుసు.” అన్నాడు దినేష్.
వాళ్ళు మధ్య రాత్రి 2 గంటలకు ఉదయపూర్ లో ఉన్న మహారణా భూపాల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎమర్జెన్సీకి చేరారు. మళ్లీ కొత్త ఎక్స్ రే లు చూసి, వేరే బిల్డింగ్ లో ఉన్న స్త్రీ-శిశు వార్డు కి వెళ్ళమని చెప్పారు. అక్కడ భావన మళ్లీ అడ్మిషన్ ప్రక్రియ అంతా పూర్తి చేసి వెళ్లాల్సొచ్చింది.
ఐతే, దినేష్ కి ఏదో చాలా తేడా జరిగిందని మొదటి సారి అనిపించింది. ఎందుకంటే డ్యూటీ లో ఉన్న డాక్టర్లు, భావన కు చికిత్స చేయడానికి సుముఖం గా లేరు, “ మేము వేరే ఆసుపత్రులు చేసిన తప్పులకు చికిత్స చేయము” అని అన్నారు..
ఆఖరుకి ఆమెని జులై 22ను అడ్మిట్ చేసి, సోనోగ్రఫి చేశారు. రెండు ఆపరేషన్ లు వెంటనే చేస్తామని దినేష్ కి చెప్పారు. మొదటిది ఆమె పెద్దపేగులో ట్యూబ్ వేసి అందులో ఉన్న పదార్ధాన్ని బయటకు తీస్తామని, రెండోది ఆమె ఛిద్రమైన పేగులు బాగు చేస్తామని. ఆపరేషన్ జరిగిన తరవాత 48 గంటలు చాలా కీలకం అని చెప్పారు.
ఆపరేషన్ తరవాత డాక్టర్లు దినేష్ కు- అతని భార్యకు CHC బరిసద్రి లో జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో ఆమె పేగులు డాక్టర్ ఆపరేషన్ లో వాడిన కత్తి వలన కన్నాలు పడ్డాయని, అందుకే ఆమె పేగుల్లో ఉన్నమైల కడుపులోకి చేరి ఒళ్లంతా ఇన్ఫెక్షన్ పాకిందని చెప్పారు.
తరవాత 48 గంటలు భావనని పర్యవేక్షణలో ఉంచారు.ఆమె పిల్లలు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉన్నారు. ఆమె భర్త టీ నీళ్ల మీదే బతుకుతూ ఆమె మెరుగుదల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ భావన 24 జులై సాయంత్రం 7.15 గంటలకు భావన చనిపోయింది.
చిత్తగడ్ లో ఉన్న ప్రయాస్, అనే స్వచ్చంద సంస్థ, హ్యూమన్ రైట్స్ లా నెట్వర్క్ తో కలిసి ఈ విషయాన్ని గురించి డిసెంబర్ 2019 లో కేసు నిజనిర్ధారణ అధ్యాయాన్ని జరిపింది. భావన యొక్క కుటుంబ నియంత్రణ ఆపరేషన్, భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొన్న స్త్రీ మరియు పురుష స్టెరిలైజేషన్ సర్వీసెస్ (2006) వారి ప్రమాణాలను స్పష్టంగా ఉల్లంఘిస్తోందని వారు కనుగొన్నారు .
వారి నివేదికలో భావనను కమ్యూనిటీ సెంటర్‌కు రప్పించి, ముందస్తు సమాచారం లేదా కౌన్సెలింగ్ లేకుండా శాశ్వత కుటుంబ నియంత్రణ విధానానికి బలవంతం చేశారు. ఆపరేషన్ తర్వాత కూడా, CHC వైద్యులు వారి నిర్లక్ష్యం వల్ల పేగులలో ఏర్పడిన కన్నాల గురించి కుటుంబానికి తెలియజేయలేదు. అంతేగాక జరిగిన నష్టాన్ని సరిచేయడానికి శస్త్రచికిత్సను కూడా చేయలేదు. ఇంకా, CHC లేదా ఉదయపూర్ ఆసుపత్రిలో ఎవరూ ప్రభుత్వ కుటుంబ నియంత్రణ నష్టపరిహార పథకం 2013 కింద- ట్యూబల్ లైగేషన్ ప్రక్రియ వలన మరణం సంభవిస్తే కుటుంబానికి రాగల 2 లక్షల పరిహారం గురించి దినేష్ కి చెప్పలేదు.
స్టెరిలైజేషన్ పై ప్రభుత్వ మార్గదర్శకాలను విస్మరించి, స్టెరిలైజేషన్ 'క్యాంప్స్' యొక్క లక్ష్యాలని చేరుకునే విధానం ఎలా సాగుతుందో, ఇది మహిళల ఆరోగ్యం మరియు హక్కులను ఎలా కాలరాస్తుందో అన్నదానికి భావన ఒక మంచి ఉదాహరణ అని ప్రయాస్ డైరెక్టర్ ఛాయా పచౌలి అభిప్రాయపడ్డారు.
"ఒక స్త్రీ ఆమె మరియు ఆమె భాగస్వామి శస్త్రచికిత్సను ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని ఆలోచించుకోవడానికి తగినంత సమయం ఇవ్వాలి" అని పచౌలి మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ చెప్పారు. "ఒక శిబిరం జరుగుతున్నందున శస్త్రచికిత్స చేయించుకోమని ఆమెను బలవంతం చేయకూడదు. దాని కోసం మహిళలను సమీకరించమని ఉన్నత అధికారుల నుండి ఒత్తిడి ఉంది. వారు ఇకపై 'లక్ష్యాలను' బట్టి పని చేయరని ప్రభుత్వం చెప్పవచ్చు, అయినప్పటికీ మహిళలను ఆపరేషన్లకు ఒప్పించటానికి ఆరోగ్య కార్యకర్తలు నెట్టబడతారని మనకు తెలుసు.పైగా ఆ జిల్లా అధికారులను కూడా ఎన్ని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయో ఆ సంఖ్య ద్వారా వారి సమర్ధతను నిర్ణయిస్తారని కూడా తెలుసు.ఎక్కువ ఆపరేషన్లు జరిగే జిల్లాలకు ప్రభుత్వం అవార్డులు కూడా ఇస్తుంది. దీనంతటినీ ఆపివేయాలి.
"శిబిర(sterilisation camp ) విధానం నిజమైన స్ఫూర్తితో ఉండాలి.సురక్షితమైన శస్త్రచికిత్సలు చేయడమే కాకుండా ఆపరేషన్ కి ముందు, తరవాత కూడా ఏవైనా సమస్యలు ఉంటే సరైన చికిత్స ఇవ్వగలగాలి," అంటారు పచౌలి. "లేదా కుటుంబ నియంత్రణను ప్రాధమిక ఆరోగ్య సంరక్షణలో ఒక సాధారణ చర్యగా విలీనం చేయాలి. ఆరోగ్య కార్యకర్తలకు కౌన్సెలింగ్ నైపుణ్యాన్నిఅలవరచి, కౌన్సిలింగ్ ని ఆరోగ్య సంరక్షణలో ముఖ్యమైన అంశంగా ప్రోత్సహించాలి.” అన్నారు.”
రాజస్థాన్‌లో కుటుంబనియంత్రణ ఆపరేషన్ విఫలమైన మహిళల కేసులను ప్రయాస్ సంస్థ ఎదుర్కొంది. కాని వారికి అర్హత ఉందని తెలియకపోవడంతో వారు పరిహారం పొందే ప్రయత్నాలు చేయలేదు.
"తరచుగా, మహిళలు లేదా వారి భాగస్వామి లేదా కుటుంబానికి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ గురించి వారితో సరిగ్గా మాట్లాడకుండానే ఒప్పిస్తారు. ఒకవేళ ఆపరేషన్ చేసాక ఎదురయ్యే అరుదైన సందర్భాల్లో తలెత్తే సమస్యలు ఎప్పుడూ చర్చించబడవు, స్త్రీలు వీటికి ఎప్పుడూ సిద్ధంగా లేరు. ఆపరేషన్ విఫలమైతే లేదా తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు గుర్తించినట్లయితే ఏమి చేయాలో వారికి ఎప్పుడూ సలహా ఇవ్వరు. ఆపరేషన్ విఫలమవడం మరణం లేక ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల విషయంలో వారు పొందగలిగే పరిహారాల గురించి వారికి అరుదుగా సమాచారం ఇవ్వబడుతుంది, ”అని పచౌలి చెప్పారు.
ఇంత కష్టం లో ఉన్నప్పటికీ దినేష్ తన కుటుంబం లో జరిగిన విషాదాన్ని ధైర్యంతో, హాస్యంతో అంగీకరించాడు. అతను మళ్లీ స్కూల్ లో బోధించడం మళ్లీ మొదలుపెట్టాడు కాబట్టి తన లంచ్ బాక్స్ సర్దుకుంటూ, "నేను ఒక రోజు ఖాళీ లంచ్‌బాక్స్ తీసుకెళ్ళాను," అంటూ నవ్విస్తాడు.
సుతార్ ఇంటిలో నష్టం స్పష్టంగా కనిపిస్తోంది. కాని అన్నీ కొత్తగా ప్రారంభించాలని అతనికి తెలుసు. అతను తన కాంక్రీట్ ఇంట్లో కొన్ని నిర్మాణ పనులను మొదలుపెట్టాడు. టెలివిజన్ సెట్ ఆన్‌లో ఉంది, రోకలి శబ్దం ఒక మూలలో నుండి వినిపిస్తోంది. ఇరుగు పొరుగు మహిళలు దేవాన్ష్‌ను చూసుకుంటున్నారు.
భావనకు కావలసిన మందులు, రవాణాపై ఆ కుటుంబం 25000 రూపాయిలు ఖర్చు పెట్టింది. ఈ కష్టాన్ని ఎదుర్కోవడంలో ఎంతవరకు న్యాయం దొరికినా అది అందుకోవాలని దినేష్ నిశ్చయించుకున్నాడు. పరిహారం కోసం ఆయన పెట్టుకున్న 2 లక్ష రూపాయిల దరఖాస్తు చిత్తర్గడ్ లో చీఫ్ మెడికల్ ఆఫీసర్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. "నా దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టాను," అని ఆయన చెప్పారు. "భావన ఇక్కడ ఉండి ఉంటే బావుండేది, ఆ ఖర్చు గురించి ఆలోచనే ఉండేది కాదు."
పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. సమాజం లో కీలకమైన పాత్రను పోషించే అట్టడుగు వర్గాల పరిస్థితులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషిచేస్తుంది.
ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా ? అయితే [email protected] కు మెయిల్ చేసి [email protected] కు కాపీ పెట్టండి.
అనువాదం - అపర్ణ తోట