భారతీయ బిలియనీర్ల జాబితా 12 నెలలలో 102 నుంచి 140 కు చేరినట్లుగా ఫోర్బ్స్ 2021 జాబితా చెప్తోంది. బిలియనీర్ల గురించి వారి ఆస్తి గురించి అయితే ఫోర్బ్స్ ని నమ్మవచ్చు. వారి ఉమ్మడి సంపద, పోయిన ఏడాదిలో “596 బిలియన్ డాలర్లు, అంటే ఇంచుమించుగా రెట్టింపు అయింది.”
దీని అర్థమేటంటే మన దేశంలో 140 మంది మనుషులు లేదా 0.000014 శాతం జనాభా, మన భారత GDP అయిన 2.62 ట్రిలియన్లో 22.7 శాతం లేదా ఐదోవంతు ఆస్తిని కలిగి ఉన్నారు. ఇప్పుడు GDP అన్న పదంలో gross అన్న మాటకు అర్ధం కూడా వేరుగా ధ్వనిస్తుంది.
చాలా వరకూ మన భారతీయ దినపత్రికలు ఫోర్బ్స్ వ్యక్తపరచిన ఈ విషయాన్ని ఒప్పుదలతో చాలా మామూలుగా చెప్పారు. కానీ ఎటువంటి పద్ధతిలో ఈ సంపాదన జరిగిందో తెలిసిన విషయాన్ని నిజాయితీగా, కట్టెవిరిగినట్లుగా చెప్పకుండా కావాలనే వదిలేశారు.
“ఇంకో కోవిడ్ 19 తరంగం భారత దేశంలో వ్యాపిస్తోంది. ఇప్పుడు 12 మిలియన్ కేసుల కన్నా ఎక్కువ అయ్యాయి. కానీ దేశ స్టాక్ మార్కెట్ భుజాలు విదిలించుకుని రొమ్ము విరిచి కొత్త ఎత్తులకు ఎగబ్రాకింది. సెన్సెక్స్ అంతకు ముందు ఏడాది కన్నా పోయిన ఏడాది 75 శాతం పెరిగింది. మన దేశంలో బిలియనీర్ల సంఖ్య 102 నుండి 140 కు వెళ్లి, వారి ఉమ్మడి ఆస్తి దాదాపు రెట్టింపయి 596 బిలియన్ $ లకు చేరింది.” అని ఫోర్బ్స్ తన మొదటి పేరా లోనే చెప్పింది.
అవును, ఈ 140 మంది ప్లూటోక్రాట్ల సంపద 90.4 శాతం పెరిగింది - ఒక సంవత్సరంలో జిడిపి 7.7 శాతం కుదించింది . వలస కార్మికుల రెండవ తరంగాన్ని మనం చూస్తుండగానే ఈ విజయాల వార్తలు వస్తాయి - ఇదివరకులాగానే లెక్కించడానికి కూడా వీలులేనంత సంఖ్యలో వీరు చెదరిపోయి - నగరాలను వదిలి మళ్లీ తమ గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. ఫలితంగా వచ్చే ఆ ఉద్యోగ నష్టాలు GDP కి ఏమాత్రం మేలు చేయవు. కానీ దేవుడి దయవలన, మన బిలియనీర్లకు అంతగా హాని జరగదు. ఈ విషయంలో మనకు ఫోర్బ్స్ ఎలాగూ హామీ ఇస్తుంది.
అంతేకాకుండా, బిలియనీర్ సంపద తర్కం కోవిడ్ -19 తర్కానికి వ్యతిరేకంగా పని చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. సంపదంతా ఒకే చోట చేరిస్తే, అధిక వ్యాప్తికి తక్కువ అవకాశం ఉంటుంది.
“అగ్రస్థానంలో ఉన్న వారు బాగా వృద్ధి చెందుతున్నారు" అని ఫోర్బ్స్ చెప్తుంది. "కేవలం ముగ్గురు ధనవంతులైన భారతీయుల సంపద కలపితే 100 బిలియన్ డాలర్ల పైనే అయింది." క్లబ్ 140 యొక్క సంపదలో 25 శాతానికి పైగా ఉన్న ఆ ముగ్గురి మొత్తం సంపద కలిపి 153.5 బిలియన్ డాలర్లు అయ్యాయి. పైనున్న ఇద్దరు - అంబానీ(84.5 బిలియన్ డాలర్లు), అదానీ (50.5 బిలియన్ డాలర్లు), సంపద కలిపితే వచ్చే అంకె, పంజాబ్ జీడీపీ (85.5 బిలియన్ డాలర్లు) లేదా హర్యానా జీడీపీ (101 బిలియన్ డాలర్లు) కంటే చాలా ఎక్కువ.
మహమ్మారి సంవత్సరంలో, అంబానీ తన సంపదకు 47.7 బిలియన్ డాలర్లు (రూ. 3.57 ట్రిలియన్లు) జోడించారు - అంటే రూపాయిల్లో ఆయన సగటున ప్రతి సెకనుకు 1.13 లక్షలు సంపాదించినట్లు . దీని సగటు పరిమాణం 5.24 వ్యక్తులు కల 6 పంజాబ్ వ్యవసాయ గృహాల సగటు నెలసరి ఆదాయం (రూ .18,059) కంటే ఎక్కువ.
అంబానీ యొక్క మొత్తం సంపద ఒక్క పంజాబ్ రాష్ట్ర GSDP కి ఇంచుమించుగా సమానం. పైగా ఈ ఆదాయం ఇది కొత్త వ్యవసాయ చట్టాలు పూర్తిస్థాయిలో ఇంకా అమల్లోకి రాకముందే ఉన్నది. ఒక్కసారి ఆ చట్టాలు కూడా పూర్తి అమల్లోకి వస్తే, అప్పుడు మరిన్నింతలుగా పెరుగుతుంది. అయితే ఇక్కడ, పంజాబ్ రైతు యొక్క నెలసరి సగటు తలసరి ఆదాయం సుమారు రూ. 3,450 (ఎన్ఎస్ఎస్ 70 వ రౌండ్)మాత్రమే అని గుర్తుపెట్టుకోండి.
చాలా వార్తాపత్రికలు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నివేదికను తీసుకున్నాయి కానీ ఫోర్బ్స్ చెప్పే కథాసన్నివేశాలు లేదా కనెక్షన్లు చెప్పబడలేదు. పిటిఐ కథలో కోవిడ్ లేదా కరోనా వైరస్ లేదా పాండమిక్ అనే పదాలు లేవు. ఫోర్బ్స్ నివేదిక చెప్పినట్టుగా, “ పది ధనవంతులైన భారతీయులలో ఇద్దరు హెల్త్ కేర్ సెక్టార్ వారు ఉన్నారు, కాబట్టి ఈ సెక్టారు ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి ప్రోత్సాహాన్ని పొందుతోంది.” ఫోర్బ్స్ మన 140 డాలర్ బిలియనీర్లలో 24 మందిని ‘హెల్త్‌కేర్’ పరిశ్రమల జాబితాలో ఉంచినప్పటికీ‘హెల్త్‌కేర్’ అనే పదం పిటిఐ నివేదికలో లేదా చాలా ఇతర కథనాలలో కనిపించదు.
ఈ మహమ్మారి సంవత్సరంలో ఫోర్బ్స్ జాబితాలో ఉన్న 24 మంది భారతీయ ‘హెల్త్ కేర్’ బిలియనీర్లలో మొదటి 10 మంది వారి సంపదకు 24.9 బిలియన్ డాలర్లు (సగటున ప్రతి రోజు రూ. 5 బిలియన్లు) చేర్చి, వారి మొత్తం విలువ 75 శాతం హెచ్చించి, 58.3(రూ .4.3 ట్రిలియన్లు) బిలియన్ డాలర్లకు వారి సంపదను పెంచారు. అయితే, కోవిడ్ -19 కు అందరూ సమానమే - అన్న విషయం గుర్తుందా?
మన నినాదమైన ‘భారతదేశంలో-తయారు-చెయ్యాలి-ఎక్కడైనా-తోసెయ్యాలి’ యొక్క (మేక్-ఇన్-ఇండియా-రేక్-ఇట్-ఎనీవేర్) డబ్బు సంచులు ఫోర్బ్స్ శిఖరపు అంచులలో ఉంది. ఎగువ నుండి కేవలం రెండు స్థానాలు మాత్రమే మనకు అడ్డు. 140 పరుగులతో నాటౌట్ బ్యాటింగ్ చేస్తున్న భారతదేశం, అత్యధిక బిలియనీర్లను కలిగి ఉండే విషయం లో అమెరికా మరియు చైనా తరువాత ప్రపంచంలో మూడవస్థానం లో ఉంది. ఇదివరకైతే జర్మనీ, రష్యా వంటివారు ఆ జాబితాలో కాస్త పక్కగానే ఉన్నట్లనయినా భ్రమింపజేసేవారు. కానీ ఈ సంవత్సరం వారి స్థానం ఏమిటో వారికి స్పష్టంగా చూపబడింది.
భారత దేశపు బరువైన మనీబ్యాగుల యొక్క 596 బిలియన్ డాలర్ల సంపద, సుమారుగా రూ. 44.5 ట్రిలియన్లు. ఇది 75 రాఫెల్ ఒప్పందాల కంటే కొంచెం ఎక్కువ. భారతదేశానికి సంపద పన్ను లేదు. ఒకవేళ మనం అలా చేస్తే, అంటే కనీసం 10 శాతం వసూలు చేయగలిగితే, అది రూ. 4.45 ట్రిలియన్లు అవుతుంది. ఈ డబ్బుతో ప్రస్తుత వార్షిక కేటాయింపు రూ. 73,000 కోట్లు (2021-22కి) ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మనం ఆరు సంవత్సరాలు నడపగలం. రాబోయే ఆరు సంవత్సరాలు గ్రామీణ భారతదేశంలో ఇది దాదాపు 16.8 బిలియన్ల పనిరోజులని కొనసాగించగలదు.
నగరాలు మరియు పట్టణాల నుండి పారిపోతున్న వలసదారుల కోవిడ్ రెండవ తరంగం ఇది. సమాజపరంగా వారికి మనపై నమ్మకం లేకపోవడం బాధనిపించినా వారి నిర్ణయం పూర్తిగా సమర్ధించదగ్గది. వీరు తిరిగి గ్రామాలకు చేరుకున్నప్పుడు MGNREGS పని దినాలు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ అవసరం.
అయితే గొప్పవారైన ఈ 140 మంది, వారి స్నేహితులు నుండి కొంత సాయం పొందారు. కార్పొరేట్లకు భారీగా మొదలైన పన్ను తగ్గింపులు, రెండుదశాబ్దాలుగా వాయువేగంతో సాగి ఆగస్టు 2019 నుండి ఇంకా ఊపందుకున్నాయి.
మహమ్మారి సంవత్సరంలో, హామీ ఇచ్చిన MSP ద్వారా రైతులకు పైసా రాయితీ ఇవ్వలేదు అని గుర్తుంచుకోండి; అదే సమయంలో కార్మికులకు ప్రతిరోజూ 12 గంటలు పని చేయటానికి అనుమతించే ఆర్డినెన్సులు ఆమోదించబడ్డాయి (కొన్ని రాష్ట్రాల్లో అదనపు నాలుగు గంటలకు ఓవర్ టైం చెల్లింపు లేకుండా); ఇంతేగాక ఇదివరకు కన్నా ఎక్కువగా సహజ వనరులు, ప్రజా సంపద- కార్పోరేట్లలో అత్యంత ధనికులకు అప్పగించబడింది. ఈ మహమ్మారి సంవత్సరంలో, ఒక దశలో ఆహార ధాన్యం 'బఫర్ స్టాక్స్' 104 మిలియన్ టన్నుల కు చేరుకుంది. కానీ ప్రజలకు ఉచితంగా 'మంజూరు' చేయబడినదేమో - ఆరునెలలపాటు 5 కిలోల గోధుమలు లేదా బియ్యం, మరియు 1 కిలో పప్పులు. ఇది కూడా, జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చేవారికి మాత్రమే. ఈ షరతు నిజంగా అవసరమైనవారికి ఆహారాన్ని అందజేయవలసిన నిష్పత్తిని గణనీయంగాతగ్గించింది. ఇదంతా, ఇన్ని దశాబ్దాలలో మొదటిసారి ఇన్ని వందల మిలియన్ల మంది భారతీయులు ఆకలితో ఉన్న ఈ సంవత్సరంలో జరిగింది.
ఫోర్బ్స్ చెప్పినట్లుగా ఈ సంపద “ఉప్పెన” ప్రపంచవ్యాప్తంగా ఉంది. "గత సంవత్సరంలో సగటున ప్రతి 17 గంటలకు ఒక కొత్త బిలియనీర్ తయాయ్యాడు. మొత్తంగా, ప్రపంచంలోని సంపన్నులు క్రితం సంవత్సరం కంటే 5 ట్రిలియన్ డాలర్లు ఎక్కువ ధనవంతులు.” ఆ కొత్త 5 ట్రిలియన్ డాలర్లలో భారతదేశం యొక్క ధనవంతులు దాదాపు 12 శాతం ఉన్నారు. అంటే, ఉన్న అన్ని రంగాలలోకెల్లా, ‘అసమానత’ అనేది ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మాత్రం ఎక్కడా గుర్తించలేదు.
అటువంటి సంపద “ఉప్పెన” సాధారణంగా కష్టాల ఉప్పెనపై నడుస్తుంది. ఇది ఒక్క మహమ్మారి గురించి మాత్రమే కాదు. విపత్తులు అద్భుతమైన వ్యాపారావకాశాలని సృష్టిస్తాయి. చాలామందికి ఒనగూడే దుఃఖం ద్వారా, వ్యాపారస్తులకు డబ్బు సంపాదించే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కానీ ఫోర్బ్స్ నమ్ముతున్నట్లు, “మహమ్మారిని పక్కకి నెట్టి మరీ” వారు ఏమి సంపాదించలేదు. వారు దాని అలల పోతూ పై సాగుతూ సంపాదన నావని అద్భుతంగా నడిపారు. "ప్రపంచంలో మహమ్మారి వ్యాప్తిని" ను ఆరోగ్య సంరక్షణ అనుభవిస్తోందని ఫోర్బ్స్ సరిగ్గా చెప్పింది. కానీ ఈ పెరుగుదల ఇతర రంగాలలో కూడా సంభవిస్తుంది, ఇది విపత్తును బట్టి ఉంటుంది.
డిసెంబర్ 2004 లో సునామీ సంభవించిన కేవలం ఒక వారం తరువాత, చుట్టూ స్టాక్ మార్కెట్ విజృంభించింది. ఈ విజృంభణ లో సునామీ వలన ప్రభావితమైన దేశాలు కూడా ఉన్నాయి. లక్షలాది ఇళ్లు, పడవలు, పేదలకున్న అన్ని రకాల ఆస్తులు ధ్వంసమయ్యాయి. సునామీతో 100,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఇండోనేషియా, జకార్తా కాంపోజిట్ ఇండెక్స్ ప్రతి మునుపటి రికార్డును బద్దలు కొట్టి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. మన స్వంత సెన్సెక్స్‌లో కూడా ఇలాగే జరిగింది . అప్పటికి, డాలర్, రూపాయి పునర్నిర్మాణం లో ఉన్న ఉత్తేజం, నిర్మాణం మరియు సంబంధిత రంగాలలో భారీ విజయాన్ని సాధించి పెట్టింది.
ఈసారి, ఇతర రంగాలలో ‘హెల్త్‌కేర్’ మరియు టెక్ (ముఖ్యంగా సాఫ్ట్వేర్ సేవలు) బాగా పనిచేశాయి. ఈ జాబితాలో భారతదేశపు టాప్ 10 టెక్ టైకూన్లు కలిసి 12 నెలల్లో 22.8 బిలియన్ డాలర్లు (లేదా ప్రతిరోజూ సగటున రూ.4.6 బిలియన్లు) కలిపి, మొత్తం సంపద 52.4 బిలియన్ డాలర్లు (రూ. 3.9 ట్రిలియన్లు) సంపాదించారు. అది 77 శాతం పెరుగుదల. అవును, ఆన్లైన్ విద్య - ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లోని పదిలక్షల మంది పేద విద్యార్థులకు విద్య అనేది అందకుండా మినహాయించినప్పటికీ - కొంతమందికి మాత్రం ప్రయోజనాలను తెచ్చిపెట్టింది. బైజు రవీంద్రన్ తన సొంత సంపదకు 39 శాతం జోడించి 2.5 బిలియన్ డాలర్ల (రూ. 187 బిలియన్) నికర విలువను చేరుకున్నాడు.
ప్రపంచంలో ఎవరి
స్థానాన్ని వారికి చూపామని మనం చెప్పడం చాలా సరైనదేనని నా అభిప్రాయం. అంటే…. 189 దేశాలలో యుఎన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్
లో మన దేశానికి 131 ర్యాంక్ లభించింది. ఎల్ సాల్వడార్, తజికిస్తాన్, కాబో వెర్డే, గ్వాటెమాల,
నికరాగువా, భూటాన్ మరియు నమీబియా మనకంటే ముందు ఉన్నాయి. నా ఊహ నిజమైతే, ప్రపంచ కుట్రలో
భాగంగా, దర్యాప్తు ఫలితాల ద్వారా మన దేశ పరిస్థితిని మునుపటి సంవత్సరంతో పోల్చి మందలించే రోజు కోసం తప్పక
ఎదురుచూడవలసి వస్తుంది. చూస్తూ ఉండండి.
ఈ వ్యాసం ది వైర్ లో మొదట ప్రచురితమైంది.
అనువాదం: అపర్ణ తోట