ఆదివారం ఉదయం 10:30 అయింది. హనీ పనికి వెళ్ళడానికి తయారవుతోంది. డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి, ఆమె జాగ్రత్తగా ఎర్రటి లిప్‌స్టిక్‌ను పూసుకుంది. "ఇది నా డ్రెస్ కి బాగా మ్యాచ్ అవుతుంది," అంటూనే, తన కూతురికి అన్నం పెట్టాలని గుర్తొచ్చి కంగారుగా పరిగెత్తింది. డ్రెస్సింగ్ టేబుల్‌కి పక్కగా కొన్నిమాస్కులు, ఒక జత ఇయర్‌ఫోన్‌లు తగిలించి ఉన్నాయి . కాస్మెటిక్స్, మేకప్ వస్తువులు టేబుల్ పై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అద్దంలోంచి గది మూలలో వేలాడదీసిన దేవుళ్ల బొమ్మలు, బంధువుల ఫొటోలు కనిపిస్తున్నాయి.
హనీ (పేరు మార్చబడింది) తన ఇంటి నుండి 7-8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక హోటల్‌లో తన క్లయింట్‌ను కలవడానికి సిద్ధమవుతోంది. న్యూఢిల్లీ మంగోల్‌పురి ప్రాంతంలోని బస్తీలో ఒక గది సెట్- ఆమె ఇల్లు. 32 సంవత్సరాల ఆమె వృత్తిరీత్యా సెక్స్ వర్కర్ గా రాజధాని సమీపంలోని నాంగ్లోయి జాట్ ప్రాంతంలో పనిచేస్తోంది. ఆమె హర్యానాలో గ్రామీణ ప్రాంతానికి చెందినది. “నేను 10 సంవత్సరాల క్రితం వచ్చాను, కాబట్టి ఇక్కడి మనిషినే అని చెప్పుకోవచ్చు. కానీ ఢిల్లీ వచ్చినప్పటి నుండి నా జీవితాన్ని దురదృష్టం వెంటాడింది.”
దురదృష్టం వెంటాడడం అంటే ?
“నాలుగు గర్భస్రావాలు తోహ్ బహుత్ బడి బాత్ హై [చాలా పెద్ద విషయం]! అవన్నీ నాకు తిండి పెట్టడానికి, నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి ఎవ్వరూ లేనప్పుడు, జరిగాయి. ”అని హనీ నవ్వుతూ చెప్పింది, ఆమె నవ్వు, తాను చేసిన సుదూర ప్రయాణానికి సంకేతం.
"నేను ఈ పనిని మొదలు పెట్టడానికి ఇదే కారణం. నా లోపల పెరుగుతున్న నా బిడ్డను పోషించడానికి నా దగ్గర డబ్బు లేదు. నేను ఐదవసారి కడుపుతో ఉన్నాను. నేను రెండు నెలల గర్భవతి గా ఉన్నప్పుడు నా భర్త నన్ను విడిచిపెట్టాడు. నేను ప్లాస్టిక్ కంటైనర్లను తయారుచేసే ఫ్యాక్టరీలో పని చేస్తే నెలకు 10,000 రూపాయలు వచ్చేవి. కానీ అస్తమానం జబ్బుపడుతూ ఉండడం వలన నా యజమాని నన్ను పని నుంచి వెళ్లగొట్టేసాడు. ”అని ఆమె చెప్పింది.
హనీకి 16 సంవత్సరాల వయస్సు దాటకుండానే పెళ్లి చేసారు ఆమె తల్లిదండ్రులు. కొన్ని సంవత్సరాలు ఆమె, ఆమె భర్త హర్యానాలోనే ఉన్నారు.అక్కడ అతను డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆమెకు 22 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు వారు ఢిల్లీకి వచ్చారు. కాని అక్కడకు వచ్చాక, ఆమె భర్త తాగుడుకు అలవాటుపడి ఇంటికి సరిగ్గా వచ్చేవాడుకాదు. "అతను నెలలు తరబడి వెళ్లిపోతాడు. ఎక్కడకో నాకు తెలియదు. అతను ఇప్పటికీ అలానే చేస్తాడు. ఎప్పుడూ చెప్పడు. వేరే ఆడవాళ్ళతో వెళ్లిపోయి, తన దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినప్పుడు మాత్రమే తిరిగి వస్తాడు. అతను ఫుడ్ సర్వీస్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తాడు. వచ్చిన డబ్బులు ఎక్కువగా తనపైనే ఖర్చుపెట్టుకుంటాడు. నాకు నాలుగు గర్భస్రావాలు జరగడానికి అసలు కారణం అదే. అతను నాకు అవసరమైన మందులను, మంచి తిండిని తీసుకురాలేదు. అప్పట్లో నేను చాలా బలహీనంగా ఉండేదాన్ని,” అని హనీ అంది.
ఇప్పుడు హనీ తన కుమార్తెతో మంగోల్‌పురిలోని వారి ఇంటిలో నివసిస్తుంది. దీని కోసం ఆమె నెలకు రూ. 3,500 రూపాయలు అద్దె చెల్లిస్తుంది. ఆమె భర్త వారితోనే ఉంటాడు, కాని కొన్ని నెలలకోసారి ఇంటిలోంచి వెళ్లిపోతుంటాడు. "నేను నా ఉద్యోగాన్ని పోగొట్టుకున్న తర్వాత ఎలాగోలా బ్రతకడానికి ప్రయత్నించాను, కానీ చేయలేకపోయాను. అప్పుడు గీతా దీదీ సెక్స్ వర్క్ గురించి నాకు చెప్పి నా మొదటి క్లయింట్ ను పంపింది. అప్పటికే నాకు 25 సంవత్సరాలు, నేను ఐదు నెలల గర్భవతిని.” ఆమె చెప్పింది. మేము మాట్లాడేటప్పుడు ఆమె తన కుమార్తెకు అన్నం తినిపిస్తోంది. హనీ కూతురు ఒక ప్రైవేట్ ఇంగ్లీష్-మీడియం పాఠశాలలో 2 వ తరగతి చదువుతోంది. నెలకు 600 రూపాయలు ఫీజు. లాక్డౌన్ సమయం కాబట్టి, ఆమె కూతురు హనీ ఫోన్‌లో ఆన్‌లైన్‌లో ఆమె తరగతులకు హాజరవుతుంది. ఆమె క్లయింట్లు కూడా ఆ ఫోన్ ద్వారానే హనీని సంప్రదిస్తారు.
"సెక్స్ వర్క్ ద్వారా వచ్చే డబ్బు ఇంటి అద్దె చెల్లించడానికి, తిండి ఖర్చులకి, మందులు కొనడానికి సరిపోతుంది. మొదట్లో నేను నెలకు 50,000 రూపాయలు సంపాదించేదాన్ని. అప్పటికి నేను చిన్నదానిని, అందంగా ఉండేదాన్ని. ఇప్పుడు నేను బరువు పెరిగాను,” అని హనీ నవ్వుతూ చెప్పింది. "నేను డెలివరీ తర్వాత ఈ పనిని విడిచిపెట్టి, కామ్వాలి (గృహ సహాయకురాలు/పనిమనిషి) లేదా స్వీపర్ వంటి పనులు చూసుకుందామనుకున్నాను,. కానీ నాకు రాసిపెట్టి లేదు.”
“నేను ఐదవ గర్భస్రావం జరగకూడదని చాలా గట్టిగా అనుకుని సంపాదించడం పైనే దృష్టి పెట్టాను. నా రాబోయే బిడ్డకు సాధ్యమైనంత మంచి మందులని, తిండిని ఇవ్వాలనుకున్నాను, అందుకే తొమ్మిదో నెల గర్భంలో కూడా క్లయింట్లని ఒప్పుకున్నాను. ఇది చాలా కష్టంగా ఉండేది కాని నాకు వేరే మార్గం లేదు. దీనివలన నా డెలివరీలో కొత్త సమస్యలు వస్తాయని నాకు తెలియదు, ”అని హనీ చెప్పింది.
"గర్భం దాల్చినప్పుడు చివరి త్రైమాసికంలో లైంగికంగా చురుకుగా ఉండడం చాలా రకాలుగా ప్రమాదకరం" అని లక్నోకు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ నీలం సింగ్ PARI కి చెప్పారు. "ఆమె పొర చీలిపోయి ఏవైనా లైంగిక వ్యాధులు సంక్రమించవచ్చు. లేదా అకాల ప్రసవం జరగొచ్చు.లేదా శిశువుకు కూడా STD రావచ్చు. గర్భధారణ ప్రారంభంలోనే లైంగిక సంబంధం సంభవిస్తే, అప్పుడు గర్భస్రావం జరగవచ్చు. చాలా సార్లు, సెక్స్ పనిలో ఉన్న మహిళలు గర్భాన్ని ఉంచుకోరు. కానీ వారు గర్భం దాల్చి సెక్స్ వర్క్ ని కొనసాగిస్తే, కొన్నిసార్లు ఆలస్యమైపోయి, సురక్షితం కాని గర్భస్రావానికి దారితీసి వారి ఆరోగ్యానికి ప్రమాదం జరగొచ్చు.” అన్నారు డాక్టర్ నీలం.
“ఒకసారి నేను భరించలేని దురద, నొప్పితో సోనోగ్రఫీ కోసం వెళ్ళినప్పుడు, నా తొడల మీద , పొత్తి కడుపు మీద అసాధారణమైన అలెర్జీ, యోని పై వాపు ఉందని తెలిసింది. ఆ బాధ, ఆ తర్వాత చికిత్సకి పెట్టాల్సిన ఖర్చు అర్ధమయ్యి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది." ఇది లైంగికంగా సంక్రమించే వ్యాధి అని డాక్టర్ ఆమెకు చెప్పారు. "కానీ, నా క్లయింట్లలో ఒకరు నాకు మానసిక ధైర్యం తో పాటు ఆర్థిక సహాయాన్ని ఇచ్చారు. నా వృత్తి గురించి నేను ఎప్పుడూ డాక్టర్‌తో చెప్పలేదు. దానివలన నాకు అది సమస్యలు రావచ్చు. ఒకవేళ డాక్టరు నా భర్త ను తీసుకుని రమ్మంటే ఎవరైనా క్లయింట్ ను వెంటబెట్టుకు పోయేదాన్ని. “
“నాకు సహాయం చేసిన ఆ మనిషికి దణ్ణం పెట్టుకుంటాను. నేను, నా కుతురు ఈ రోజు బాగానే ఉన్నాము. నా చికిత్స సమయంలో సగం బిల్లులను అతనే చెల్లించాడు. నేను ఈ పనిని కొనసాగించవచ్చని అప్పుడు నిర్ణయించుకున్నాను, ”అని హనీ చెప్పింది.
"కండోమ్‌లను ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యత గురించి చాలా సంస్థలు వారికి చెబుతున్నాయి" అని నేషనల్ నెట్‌వర్క్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ (ఎన్‌ఎన్‌ఎస్‌డబ్ల్యు) సమన్వయకర్త కిరణ్ దేశ్‌ముఖ్ చెప్పారు. “అయితే, సెక్స్ వర్కర్ మహిళల్లో గర్భస్రావాల కంటే అబార్షన్లు ఎక్కువగా జరుగుతాయి. సాధారణంగా, వారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళతారు, కానీ అక్కడ వైద్యులు కూడా వారి వృత్తి గురించి తెలుసుకున్న తర్వాత వారిని నిర్లక్ష్యం చేస్తారు. ”
అయితే వైద్యులు ఎలా కనుకుంటారు?
"వారు స్త్రీ జననేంద్రియ నిపుణులు(గైనకాలజిస్టులు)" అని మహారాష్ట్రలోని సాంగ్లిలో ఉన్న వెశ్య అన్యయ్ ముక్తి పరిషత్ (VAMP) అధ్యక్షురాలు అయిన దేశ్ముఖ్ అన్నారు. "వారు వారి చిరునామాను అడిగినప్పుడు ఆ మహిళలు ఏ ప్రాంతం నుంచి వచ్చారో తెలుసుకుంటే, వారికి అర్ధమైపోతుంది. మహిళలకు [గర్భస్రావం కోసం] తేదీలు ఇస్తారు కానీ అవి తరచూ వాయిదా పడతాయి. చాలా సార్లు, డాక్టర్ చివరికి గర్భస్రావం సాధ్యం కాదని ప్రకటిస్తూ, ‘మీరు నాలుగు నెలలు [గర్భం] దాటింది మరియు ఇప్పుడు అబార్షన్ అంటే అది చట్టరీత్యా నేరం.” అని బెదిరిస్తారు.
చాలామంది మహిళలు ప్రభుత్వ ఆసుపత్రులలో కొన్ని రకాల వైద్య సహాయాలు అందుకోవడం మానేశారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యొక్క అక్రమ రవాణా మరియు హెచ్ఐవి /ఎయిడ్స్ ప్రాజెక్ట్ నుండి వచ్చిన 2007 నివేదిక ప్రకారం, దాదాపు “తొమ్మిది రాష్ట్రాలలో సర్వే చేయబడిన 50 శాతం మంది సెక్స్ వర్కర్లు ఆసుపత్రి లో కాన్పు, కాన్పు తర్వాత సేవలు వంటి ప్రజారోగ్య సౌకర్యాల సేవలను అందుకోలేదని నివేదించారు.” కాన్పు సమయంలో చూపే వివక్ష, ఆలోచన ధోరణి, కేసులలో అర్జెన్సీ దీనికి కారణాలని తెలిసింది.
"ఈ వృత్తి పునరుత్పత్తి ఆరోగ్యానికి(Reproductive Health) సంబంధించినది" అని వారణాసికి చెందిన గుడియా సంస్థ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ అజీత్ సింగ్ చెప్పారు. గుడియ సంస్థ 25 సంవత్సరాలుగా సెక్స్ ట్రాఫికింగ్ ని నిరోధించడానికి పనిచేస్తోంది. ఈ సంస్థ అనే కాక , ఢిల్లీ జిబి రోడ్ ప్రాంతంలోని మహిళలకు సహాయపడే సంస్థలతో కలిసి పనిచేస్తున్న సింగ్, తన అనుభవంలో “సెక్స్ పనిలో 75-80 శాతం మంది మహిళలకు ఏదో ఒక పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.” అని చెప్పారు.
"మావద్దకు అన్ని రకాల క్లయింట్లు వస్తారు" అని నంగ్లోయి జాట్‌లో పని చేసే హనీ చెప్పారు. “ఎంబిబిఎస్ వైద్యులు, పోలీసులు, విద్యార్థులు, రిక్షా పుల్లర్లు ఇలా అందరూ మా దగ్గరికి వస్తారు. చిన్న వయస్సులో ఉన్నప్పుడు, మేము బాగా డబ్బు ఇవ్వగలిగే క్లయింట్లతోనే వెళ్లేవాళ్లం, కాని మా వయస్సు పెరిగే కొద్దీ సంపాదనే కష్టం అయిపోతుంది. ఇంతకు ముందులా ఎంచుకుని వెళ్లడం సాధ్యం కాదు. ఈ డాక్టర్లతో, పోలీసులతో బాగా ఉండాలి. వాళ్ళతో ఎప్పుడు యే అవసరం పడుతుందో తెలియదు. ”
ప్రస్తుతం ఆమె నెలకు ఎంత సంపాదిస్తుంది?
"ఈ లాక్డౌన్ లేనప్పుడైతే, నేను నెలకు 25,000 రూపాయలు సంపాదించేదాన్ని. కానీ అది సుమారు సంఖ్య. వచ్చే డబ్బు క్లయింట్ బట్టి ఉంటుంది. మేము రాత్రంతా గడిపామా లేదా కొన్ని గంటలు మాత్రమే (వారితో) గడిపామా అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది ”అని హనీ చెప్పింది. “మాకు క్లయింట్ గురించి సందేహాలు ఉంటే, మేము వారితో హోటళ్ళకు వెళ్లడానికి బదులుగా మా స్థలానికి పిలుస్తాము. నేనైతే వారిని ఇక్కడ నాంగ్లోయి జాట్‌లోని గీతా దీదీ ఇంటికి తీసుకువస్తాను. ఇక్కడ నెలలో కొన్ని రోజులు, లేదా రాత్రులు గడుపుతాను. క్లయింట్ ఇచ్చిన డబ్బుల్లో సగం గీత దీదీ తీసుకుంటుంది. అది ఆమె కమిషన్.” నికరంగా ధర నిర్ణయించడానికి కుదరకపోయినా, ఒక రాత్రికి కనీసం 1000 రూపాయిలు తీసుకుంటానని చెప్పింది హనీ.
40 ఏళ్ళ ప్రారంభంలో ఉన్న గీత, తన ప్రాంతంలోని సెక్స్ వర్కర్ల పర్యవేక్షకురాలు. ఆమె దేహ్ వ్యాపర్ (బాడీ బిజినెస్) లో కూడా ఉంది, కానీ ప్రధానంగా ఆమె తన ఇంటిని ఇతర మహిళలకు అందించడం ద్వారా, వారి నుండి కమీషన్ పొందడం ద్వారా జీవనం సాగిస్తుంది. "నేను అవసరమైన మహిళలను ఈ ఉద్యోగంలోకి తీసుకువస్తాను. వారికి పని చేయడానికి స్థలం దొరకనప్పుడు, నా గదిని ఇస్తాను. నేను వారి ఆదాయంలో 50 శాతం మాత్రమే తీసుకుంటాను,” అని గీత చాలా మామూలుగా చెప్పింది.
"నేను నా జీవితంలో చాలా చూశాను" అని హనీ చెప్పింది. "ఒక ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పనిచేయడం నుండి నా భర్త నన్ను విడిచి పెట్టినందున పని నుంచి వెళ్లగొట్టబడడం వరకు. ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్తో నేను బతుకుతున్నాను. ఇక దీని కోసం జీవితాంతం మందులు తీసుకోవాలి. ఇది నాతో ఎప్పటికీ ఉండాలని రాసిపెట్టి ఉంది.” ప్రస్తుతం, ఆమె భర్త కూడా హనీ తో, ఆమె కూతురితో కలిసి ఉంటున్నాడు.
ఆమె వృత్తి గురించి అతనికి తెలుసా?
"చాలా బాగా," హనీ చెప్పింది. “అతనికి ఇవన్నీ తెలుసు. ఇప్పుడు ఆర్థికంగా నాపై ఆధారపడటానికి ఒక కారణం కూడా దొరికింది. ఇప్పుడు నన్ను హోటల్‌కు దింపబోతున్నాడు. కానీ నా తల్లిదండ్రులకి [వారిది వ్యవసాయ కుటుంబం] దీని గురించి ఏమి తెలీదు. నేను వారికి ఎప్పటికీ చెప్పాలనుకోవట్లేదు. వారు చాలా పెద్దవాళ్ళైపోయారు, హర్యానాలో ఉన్నారు. ”
"అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం, 1956 ప్రకారం, 18 ఏళ్లు పైబడిన ఏ వ్యక్తి అయినా సెక్స్ వర్కర్ సంపాదన పై ఆధారపడి జీవించడం నేరం" అని పూణేకు చెందిన VAMP మరియు NNSW రెండింటికి న్యాయ సలహాదారు ఆర్తి పై చెప్పారు. “ఇందులో వయోజన పిల్లలు, భాగస్వామి / భర్త మరియు తల్లిదండ్రులు సెక్స్ పనిలో ఉన్న మహిళతో నివసిస్తున్నవారు ఎవరైనా ఆమె సంపాదనపై ఆధారపడి ఉన్నారంటే వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.” కానీ హనీ తన భర్తకు వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశం చాలా తక్కువ.
“లాక్డౌన్ ముగిసిన తర్వాత నేను క్లయింట్ కలవడం ఇదే మొదటిసారి. కానీ ఈ రోజుల్లో క్లయింట్లు తక్కువ అయిపోయారు, దాదాపు ఎవరూ దొరకడం లేరు, ” అని ఆమె చెప్పింది. “ఈ మహమ్మారి కాలంలో మా దగ్గ్గరికి వచ్చిన వాళ్లని నమ్మలేము. ఇంతకుముందు, మేము హెచ్ఐవి, ఇతర [లైంగిక సంక్రమణ] వ్యాధుల నుండి దూరంగా ఉండటానికి మాత్రమే జాగ్రత్తలు తీసుకోవలసి వచ్చింది. ఇప్పుడు, ఈ కరోనా కూడా ఉంది. ఈ మొత్తం లాక్డౌన్ మాకు శాపంగా ఉంది. అసలు డబ్బులు రావట్లేదు - ఉన్నదంతా ఖర్చయిపోయింది. రెండు నెలల పాటు నేను నా మందులను(యాంటీఫంగల్ క్రీమ్స్, లోషన్స్) కూడా కొనలేకపోయాను, తిండికే కష్టంగా గడిచింది.” అంటూ హాని తన భర్త ని హోటల్ దాకా బైక్ మీద దిగబెట్టమని పిలిచింది.
PARI మరియు కౌంటర్మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ని, పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా చేస్తున్నారు. సమాజం లో కీలకమైన పాత్రను పోషించే అట్టడుగు వర్గాల పరిస్థితులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషిచేస్తుంది.
ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటే [email protected] కు మెయిల్ చేసి [email protected] కు కాపీ పెట్టండి.
ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా ప్రజారోగ్యం మరియు పౌర స్వేచ్ఛపై జిగ్యసా మిశ్రా నివేదికలు అందిస్తారు. ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఈ రిపోర్టేజీలోని విషయాలపై సంపాదకీయ నియంత్రణను అమలు చేయలేదు.
అనువాదం : అపర్ణ తోట