ఎనభై రెండేళ్ల బాపూసుతార్ 1962 నాటి ఆ రోజును చాలా స్పష్టంగా గుర్తు పెట్టుకున్నారు. అతను తన చెక్క ట్రెడిల్ చేనేత మగ్గాలలో మరొకదాన్ని అమ్మేశారు. ఏడు అడుగుల పొడవుండే ఈ మగ్గాన్ని ఆయనే స్వయంగా తన స్వంత వర్క్‌షాప్‌లో తయారు చేశారు. ఇది కొల్హాపుర్‌లోని సాంగాఁవ్ కసబా గ్రామానికి చేందిన ఒక చేనేతకారుడి నుంచి 415 రూపాయలను ఆయనకు సంపాదించిపెట్టింది.
అదే ఆయన తయారుచేసిన చివరి చేనేతమగ్గం కాకపోయుంటే, అది ఆయనకు సంతోషకరమైన జ్ఞాపకంగానే మిగిలి ఉండేది. ఆ తర్వాత ఆర్డర్లు రావడం ఆగిపోయింది; ఆయన చేతి తయారీ చెక్క ట్రెడిల్ మగ్గాలను తీసుకునేవారు లేకపోయారు. " త్యావెలి సాగ్లా మోడ్లా (అంతా ముగిసిపోయింది)," అని ఆయన గుర్తుచేసుకున్నారు.
ఆరు దశాబ్దాల తర్వాత ఈరోజు, మహారాష్ట్ర, కొల్హాపుర్ జిల్లాలోని రెండాల్‌లో- గ్రామంలో మిగిలివున్న చిట్టచివరి ట్రెడిల్ చేనేత మగ్గం తయారీదారు బాపు ఒక్కరే అని కొంతమందికి మాత్రమే తెలుసు; ఆయన ఒకప్పుడు అందరికీ చాలా అవసరమైన నిపుణత కలిగిన చేతిపనివాడు అని కూడా. "రెండాల్‌కూ, సమీప గ్రామాలకూ చెందిన ఇతర చేనేత మగ్గం తయారీదారులందరూ చనిపోయారు" అని గ్రామంలోని వృద్ధ నేతకారుడు వసంత్ తాంబే (85) చెప్పారు.
చెక్క నుంచి చేనేత మగ్గాలను రూపొందించడం రెండాల్‌కు ఒక కోల్పోయిన సంప్రదాయం. "ఆ (చివరి) చేమగ్గం కూడా ఇప్పుడు ఉనికిలో లేదు," అని బాపూ, నిరాడంబరమైన తన ఇంటి చుట్టూ ఉన్న వర్క్‌షాప్‌ల నుంచి వస్తోన్న మరమగ్గాల శబ్దాలను వినడానికి కష్టపడుతూ అన్నారు.
బాపూ ఇంటిలో ఉండే ఒంటి గది సంప్రదాయ వర్క్‌షాప్ ఒక యుగానికి సాక్ష్యంగా నిలిచింది. వర్క్‌షాప్‌లో ఉన్న మట్టిరంగుల సమ్మేళనం - డార్క్, సెపియా, రస్సెట్, శాడిల్, సియెన్నా, మహోగనీ, రూఫస్ వంటి మరెన్నో వర్ణాలు- నెమ్మదిగా వెలిసిపోయి, కాలం గడిచేకొద్దీ వాటి మెరుపు మసకబారుతోంది.
*****
రెండాల్ మహారాష్ట్రలోని కొల్హాపుర్ జిల్లాలో, వస్త్ర పరిశ్రమకు నెలవైన ఇచల్‌కరంజి అనే పట్టణం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. 20వ శతాబ్దపు తొలి దశాబ్దాలలో, ఇక్కడినుండి అనేక చేనేత మగ్గాలు ఇచల్‌కరంజి పట్టణానికి చేరుకున్నాయి. దాంతో ఇది రాష్ట్రంలోనే కాక భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిచెందిన వస్త్ర పరిశ్రమ కేంద్రాలలో ఒకటిగా మారింది. ఇచల్‌కరంజికి సమీపంలో ఉన్న రెండాల్ కూడా ఒక చిన్న వస్త్ర తయారీ కేంద్రంగా మారింది.
1928లో బాపూ తండ్రి కీ.శే. కృష్ణ సుతార్ తొలిసారిగా 200 కిలోల బరువున్న భారీ మగ్గాలను తయారు చేయడం నేర్చుకున్నారు. ఇచల్‌కరంజికి చెందిన గొప్ప నిపుణత కలిగిన హస్తకళాకారుడు, కీ.శే. దాతే ధూలప్ప సుతార్ ఈ మగ్గాలను ఎలా తయారు చేయాలో కృష్ణకు నేర్పించారని బాపూ చెప్పారు.
“1930ల ప్రారంభంలో ఇచల్‌కరంజిలో చేనేత మగ్గాలను తయారుచేసిన మూడు కుటుంబాలు ఉండేవి,” అని బాపూ గుర్తుచేసుకున్నారు. ఆయన జ్ఞాపకశక్తి మెత్తగా నేసిన దారంలా మహా పదునైనది. "అప్పట్లో చేతి మగ్గాలు బాగా విస్తరిస్తున్నాయి, కాబట్టి మా నాన్న వాటిని ఎలా తయారుచేయాలో నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు." ఆయన తాత, కీ.శే. కల్లప్ప సుతార్, నీటిపారుదల కోసం (కప్పీ వ్యవస్థతో పనిచేసే) సంప్రదాయ మోట్ ని (కందకాన్ని) కూర్చడంతో పాటు కొడవలి, చేతి పార, కులావ్ (ఒక రకమైన నాగలి) వంటి వ్యవసాయ ఉపకరణాలను తయారుచేసేవారు.
చిన్నతనంలో, బాపుకు తన తండ్రి వర్క్‌షాప్‌లో గడపడం చాలా ఇష్టంగా ఉండేది. అతను 1954లో, తన 15 సంవత్సరాల వయస్సులో, మొదటి మగ్గాన్ని తయారుచేశారు. " మేం ముగ్గురం కలిసి ఆరు రోజులకు పైగా, 72 గంటల పాటు దానిపై పనిచేశాం," అంటూ ఆయన నవ్వారు. "మేం దానిని రెండాల్‌లోని ఒక చేనేత కళాకారుడికి 115 రూపాయలకు అమ్మాం." ఒక కిలో బియ్యం ధర 50 పైసలుగా ఉన్న ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం డబ్బు కిందే లెక్క!
60వ దశకం ప్రారంభానికి చేతితయారీ మగ్గం ధర రూ. 415కు పెరిగింది. "మేం ఒక నెలలో కనీసం నాలుగు చేతి మగ్గాలను తయారుచేసేవాళ్ళం." అయితే అది ఎప్పుడూ ఒకే ఒక యూనిట్‌గా అమ్ముడవలేదు. "మేం ఒక ఎద్దుల బండిపై మగ్గం విడి భాగాలను తీసుకువెళ్ళేవాళ్ళం. వాటిని చేనేతకారుల వర్క్‌షాప్‌లో ఒక్కటిగా అమర్చేవాళ్ళం" అని ఆయన వివరించారు.
త్వరలోనే బాపూ డాబీ (మరాఠీలో డబీ )ని తయారుచేయడం నేర్చుకున్నారు. మగ్గం పైభాగాన బయటకే అమర్చివుండే ఈ పరికరం, బట్టను నేస్తున్నప్పుడే వస్త్రంపై క్లిష్టమైన డిజైన్‌లను, నమూనాలను తయారుచేయడంలో సహాయపడింది. తన మొదటి సాగ్ వాన్ (టేకు కర్ర) డబీ ని తయారుచేయడానికి అతనికి మూడు రోజులలో, 30 గంటల సమయం పట్టింది. "నాణ్యత బాగుందో లేదో చూసుకోవడానికి రెండాల్‌లోని నేత కార్మికుడు లింగప్ప మహాజన్‌కి దీనిని ఉచితంగా ఇచ్చాను." అని ఆయన గుర్తు చేసుకున్నారు.
దాదాపు ఒక అడుగు ఎత్తు, 10 కిలోల బరువుండి, ఫుట్‌బాల్‌లా ఉండే డాబీని రూపొందించడానికి ఇద్దరు నిపుణులైన పనివాళ్ళు రెండు రోజులు పనిచేయాల్సి వచ్చేది; ఒక దశాబ్ద కాలంలో బాపు అలాంటి 800 డాబీలను తయారుచేశారు. "1950లలో ఒక డాబీ 18 రూపాయలకు అమ్ముడయేది. 1960ల నాటికి దాని ధర 35 రూపాయలకు పెరిగింది." అని ఆయన చెప్పారు.
1950వ దశకం చివరి వరకు రెండాల్‌లో 5,000 చేనేత మగ్గాలు ఉండేవని వసంత్ అనే నేతకారుడు చెప్పారు. " నౌవారి (తొమ్మిది గజాల) చీరలను ఈ మగ్గాలపై నేసేవారు" అంటూ ఆయన, 60వ దశకంలో తాను వారానికి 15 చీరలకు పైగా నేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు .
చేతితయారీ మగ్గాలు ప్రధానంగా సాగ్ వాన్ తో తయారయ్యేవి. డీలర్లు కర్నాటకలోని దండేలి పట్టణం నుంచి ఈ కలపను తీసుకొచ్చి ఇచల్‌కరంజిలో అమ్మేవారు. "నెలకు రెండుసార్లు, మేం ఎద్దుల బండిలో వెళ్ళి, ఇచల్‌కరంజి నుండి వాటిని (రెండాల్‌కు) తీసుకొచ్చేవాళ్ళం" అని బాపూ చెప్పారు. ప్రయాణానికి వారికి వెళ్ళడానికొక మూడు గంటలు, రావడానికొక మూడు గంటలు పట్టేది.
బాపూ ఒక ఘన్ ఫుట్ (ఘనపుటడుగు) సాగ్ వాన్ ను 7 రూపాయలకు కొనేవారు. 1960లలో ఇది రూ. 18కి పెరిగింది. ఈరోజు దీని ధర ఘనపుటడుగుకు రూ. 3000కు పైగా ఉంది. ఇదే కాకుండా, సాలి (ఇనుప కడ్డీ), పట్ట్యా (చెక్క పలకలు), నట్ బోల్ట్‌లు, స్క్రూలు కూడా ఉపయోగించేవారు. "ప్రతి చేతిమగ్గం తయారీకి దాదాపు ఆరు కిలోల ఇనుము, ఏడు ఘన్ ఫుట్ ల టేకు అవసరమయ్యేది." అని ఆయన చెప్పారు. 1940లలో కిలో ఇనుము ధర 75 పైసలుగా ఉండేది.
బాపూ కుటుంబం, కొల్హాపుర్‌లోని హాత్‌కానంగలే తాలూకా లోనూ, కర్నాటకలోని బెలగావి జిల్లా సరిహద్దులో ఉండే చికోడి తాలూకా లోని కరదాగా, కోగనోళి, బోరగాఁవ్ గ్రామాలలోనూ తమ చేమగ్గాలను అమ్మేవారు. ఈ పనితనం చాలా సూక్ష్మంగా ఉండేది కావడంతో, రాము సుతార్, బాపూ బలిసో సుతార్, కృష్ణ సుతార్ (అందరూ బంధువులే) అనే ముగ్గురు కళాకారులు మాత్రమే 1940ల ప్రారంభంలో రెండాల్‌లో ఈ చేమగ్గాలను తయారుచేసేవారు.
చేతి మగ్గాల తయారీ అనేది కుల-ఆధారిత వృత్తి. మహారాష్ట్రలోని ఇతర వెనుకబడిన కులాలలో జాబితా చేయబడిన సుతార్ కులానికి చెందినవారు ఈ వృత్తిని చేస్తారు. "కేవలం పాంచాల్ సుతార్ (ఉపకులం) వాళ్ళు మాత్రమే వీటిని తయారుచేసేవారు" అని బాపూ చెప్పారు.
ఇది కూడా పురుషుల ఆధిపత్యం ఉన్న వృత్తే. బాపూ తల్లి కీ.శే. సోనాబాయి ఒక రైతు, గృహిణి కూడా. 60లలో వయసున్న ఆయన భార్య లలితా సుతార్ కూడా గృహిణి. “రెండాల్‌లోని స్త్రీలు చరఖా పై దారాన్ని తిప్పి, దానిని కండెకు చుట్టేవారు. తర్వాత మగవాళ్ళు దానితో నేస్తారు,” అని వసంత్ భార్య విమల్ (77) చెప్పారు. నాలుగవ ఆల్ - ఇండియా హ్యాండ్లూమ్ సెన్సస్ (2019-20) ప్రకారం, భారతదేశంలోని చేనేత కార్మికులలో 2,546,285 మంది, లేదా 72.3 శాతం మంది మహిళా కార్మికులు ఉన్నారు.
ఈనాటికీ బాపూ, 50ల లోని నిపుణులైన కళాకారుల గురించి అబ్బురపడుతూనే ఉంటారు. “కబనుర్ గ్రామానికి చెందిన (కొల్హాపుర్ జిల్లా) కల్లప్ప సుతార్ హైదరాబాద్, సోలాపుర్‌ల నుండి మగ్గాల తయారీ కోసం ఆర్డర్‌లను పొందేవారు. ఈయన కింద (కూడా) తొమ్మిది మంది కార్మికులు పనిచేసేవారు,” అని ఆయన చెప్పారు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే మగ్గం తయారీలో సహాయం చేస్తూ, ఎవరికీ కూలీల సహాయం తీసుకునే స్థోమతలేని తరుణంలో, కల్లప్ప తొమ్మిది మంది పనివాళ్ళను పెట్టుకోవడం అంటే ఎంతమాత్రం తక్కువ విజయం కాదు.
బాపూ తాను ఎంతగానో ప్రేమించే ఒక సాగ్ వాన్ పెట్టె వైపు చూపించారు. 2 x 2.5 అడుగుల వైశాల్యమున్న ఆ పెట్టెను ఆయన తన వర్క్‌షాప్‌లో తాళంపెట్టి ఉంచారు. “ఇందులో 30కి పైగా వివిధ రకాల స్పానర్‌లు, ఇతర లోహపు సాధనాలు ఉన్నాయి. అవి ఇతరులకు మామూలు సాధనాలుగా కనిపించవచ్చు, కానీ నాకివి నా కళను గుర్తు చేస్తాయి,” కదిలిపోయి చెప్పారాయన. బాపూ, గతించిన ఆయన అన్నయ్య వసంత్ సుతార్, వారి తండ్రి నుండి ఒక్కొక్కరు 90 స్పానర్లను వారసత్వంగా పొందారు.
బాపూ అంత వయసే ఉండే రెండు పాత చెక్క అరమరల నిండా ఉలులు, చేతితో పనిచేసే చిత్రిక గుల్లలు, చేతి డ్రిల్లింగ్ సాధనాలు, బ్రేస్‌లు, చేతి రంపాలు, వైస్‌లు, క్లాంప్‌లు, మోర్టైజ్ ఉలులు, ట్రై స్క్వేర్, సంప్రదాయ లోహపు డివైడర్‌లు, దిక్సూచి, మార్కింగ్ గేజ్, మార్కింగ్ నైఫ్, ఇంకా మరెన్నో పరికరాలు ఉన్నాయి. "నేను ఈ సాధనాలను మా తాత, తండ్రి నుండి వారసత్వంగా పొందాను" అని ఆయన గర్వంగా చెప్పారు.
తన కళను గురించిన జ్ఞాపకాలను భద్రపరచడానికి కొల్హాపుర్ నుండి ఫోటోగ్రాఫర్‌ను ఆహ్వానించిన సంగతిని బాపూ గుర్తు చేసుకున్నారు. 1950లలో రెండాల్‌లో ఫోటోగ్రాఫర్‌లు లేరు. ఆరు ఛాయాచిత్రాలు తీయడానికి, ప్రయాణ ఖర్చుల కోసం శ్యామ్ పాటిల్ రూ.10 వసూలు చేసేవారు. "రెండాల్‌లో ఈరోజు చాలామంది ఫోటోగ్రాఫర్‌లు ఉన్నారు; కానీ ఫోటో తీయడానికి సంప్రదాయ కళాకారులెవరూ సజీవంగా లేరు" అని ఆయన చెప్పారు.
*****
బాపూ తన చివరి చేనేత మగ్గాన్ని 1962లో అమ్మేశారు. ఆ తర్వాత వచ్చిన సంవత్సరాలు అనేక సవాళ్ళతో కూడుకున్నవి - కేవలం అతనికి మాత్రమే కాదు.
రెండాల్ కూడా ఆ దశాబ్దంలో భారీ మార్పులకు లోనయింది. నూలు చీరలకు డిమాండ్ బాగా తగ్గిపోవడంతో నేత కార్మికులు చొక్కా గుడ్డను నేయడం మొదలుపెట్టారు. “మేం తయారుచేసిన చీరలు చాలా నిరాడంబరంగా ఉండేవి. కాలక్రమేణా, ఈ చీరలలో ఏమీ మార్పు రాలేదు కానీ, చివరికి డిమాండ్ మాత్రం పడిపోయింది.” అని వసంత్ తాంబే చెప్పారు.
అంతే కాదు. వేగవంతమైన ఉత్పత్తి, అధిక లాభాలు, శ్రమ సౌలభ్యం వంటి వాగ్దానాలతో వచ్చిన మరమగ్గాలు, చేమగ్గాల స్థానాన్ని భర్తీ చేయడం ప్రారంభించాయి. రెండాల్‌లోని దాదాపు అన్ని చేమగ్గాలూ పనిచేయడం మానేశాయి . ఈరోజు 75 ఏళ్ల సిరాజ్ మోమిన్, 73 ఏళ్ల బాబులాల్ మోమిన్ అనే ఇద్దరు నేత కార్మికులు మాత్రమే చేతి మగ్గాలను ఉపయోగిస్తున్నారు; వారు కూడా దానిని త్వరలో వదిలివేయాలనే ఆలోచనలో ఉన్నారు.
"నాకు చేతి మగ్గాలను తయారు చేయడమంటే చాలా ఇష్టం," బాపూ ఆనందంగా గుర్తుచేసుకున్నారు. ఒక దశాబ్దం కంటే తక్కువ సమయంలోనే 400 ఫ్రేమ్ మగ్గాలను తయారుచేశానని ఆయన చెప్పారు. అన్నీ చేతితోనే! అనుసరించడానికి రాతపూర్వకమైన సూచనలేమీ లేవు; అతను గానీ, అతని తండ్రి గానీ మగ్గాల కొలతలను గానీ డిజైన్‌ను గానీ ఎన్నడూ రాసిపెట్టలేదు. “ మాపా డోక్యాత్ బాస్ లేలీ . తోండ్ పాథ్ ఝాలా హోతా (అన్ని డిజైన్లూ, అన్ని కొలతలూ నా తలలోనూ మనసులోనూ ఉన్నాయి)." అని ఆయన చెప్పారు.
మరమగ్గాలు మార్కెట్‌ను ఆక్రమించినప్పటికీ, వాటిని కొనుగోలు చేయలేని కొంతమంది నేత కార్మికులు సెకండ్ హ్యాండ్ చేతి తయారీ మగ్గాలను కొనుగోలు చేయడం ప్రారంభించారు. 70వ దశకం ప్రారంభంలో, ఉపయోగించిన చేమగ్గాల ధర ఒక్కొక్కటి 800 రూపాయలు.
"అప్పట్లో చేనేత మగ్గాలను చేసేవారు లేరు. ముడిసరుకుల ధరలు కూడా పెరిగాయి కాబట్టి ( ఈ మగ్గాలను తయారుచేసేందుకు) ఖర్చు కూడా పెరిగింది.” అని బాపూ వివరించారు. "అదీగాక, చాలామంది నేతకారులు తమ చేనేత మగ్గాలను సోలాపుర్ జిల్లాలోని (మరొక ముఖ్యమైన వస్త్ర పరిశ్రమ కేంద్రం) నేత కార్మికులకు అమ్మేశారు." పెట్టుబడులు, రవాణా ఖర్చులు పెరగడంతో చేనేత మగ్గాలను తయారుచేయడం ఇక సాధ్యం కాదు.
ఈరోజు చేనేత మగ్గాన్ని చేయడానికి ఎంత ఖర్చవుతుందని అడిగితే బాపూ నవ్వారు. "ఎవరికైనా ఇప్పుడు చేమగ్గం ఎందుకు కావాలి?" అంటూ ఎదురుప్రశ్న వేసి, ఆపైన కొన్ని లెక్కలు వేసి, “కనీసం రూ. 50,000 అవుతుంది." అని చెప్పారు.
1960ల ప్రారంభం వరకు బాపూ మగ్గాలకు మరమ్మత్తులు చేయడం ద్వారా, మగ్గాలు తయారుచేయడం ద్వారా తన ఆదాయాన్ని పెంచుకునేవారు. మరమ్మత్తుల కోసం వచ్చేవారికి ఒక్కసారికి 5 రూ.ల చొప్పున తీసుకునేవారు. "చేయాల్సిన మరమ్మత్తును బట్టి, మేము రేట్లు పెంచేవాళ్ళం," అని ఆయన గుర్తుచేసుకున్నారు. కొత్త చేనేత మగ్గాల కోసం ఆర్డర్లు రావడం ఆగిపోయిన తర్వాత, 1960ల మధ్యలో, బాపూ, ఆయన సోదరుడు వసంత్ తమ జీవన అవసరాలను తీర్చుకోవడానికి ఇతర మార్గాలను అన్వేషించడం ప్రారంభించారు.
"మేం కొల్హాపుర్ వెళ్ళాం. అక్కడ ఒక మెకానిక్ స్నేహితుడు మోటారును ఎలా రివైండ్ చేయాలో, ఎలా మరమ్మత్తు చేయాలో కూడా నాలుగు రోజుల్లో మాకు నేర్పించాడు," అని ఆయన చెప్పారు. మరమగ్గాలను ఎలా మరమ్మత్తు చేయాలో కూడా వాళ్ళు నేర్చుకున్నారు. రివైండింగ్ అనేది మోటారు కాలిపోయిన తర్వాత చేసే ఆర్మేచర్ వైండింగ్ ప్రక్రియ. 1970లలో, బాపూ కర్నాటకలోని బెలగావి జిల్లాలోని మాంగుర్, జంగమవాడి, బోరగాఁవ్ గ్రామాలకు; మహారాష్ట్ర కొల్హాపుర్ జిల్లాలోని రంగోలి, ఇచల్‌కరంజి, హుపారీలకు మోటార్లు, సబ్‌మెర్సిబుల్ పంపులు, ఇంకా ఇతర యంత్రాలను రివైండ్ చేయడానికి వెళ్ళేవారు. "రెండాల్‌లో వీటి మరమ్మత్తులు ఎలా చేయాలో నాకూ, నా సోదరుడికి మాత్రమే తెలుసు కాబట్టి మాకప్పుడు చాలా పని ఉండేది."
దాదాపు 60 ఏళ్ల తర్వాత, పని చేయడం కష్టతరంగా మారడంతో, బలహీనపడిన బాపూ ఇచల్‌కరంజికి, రంగోలి గ్రామానికి (రెండాల్ నుండి 5.2 కి.మీ) మోటార్‌లను రిపేర్ చేయడానికి సైకిల్‌పై వెళ్తున్నారు. ఒక మోటారును రివైండ్ చేయడానికి ఆయనకు కనీసం రెండు రోజులు పడుతుంది. నెలకు దాదాపు రూ. 5,000 ఆదాయం వస్తుంది. "నేనేమీ ఐటిఐ పట్టభద్రుడిని (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ గ్రాడ్యుయేట్) కాను," అని నవ్వుతూ, "కానీ, నేను మోటార్లు రివైండ్ చేయగలను." అన్నారు బాపూ.
ఆయన తన 22 గుంఠల (0.5 ఎకరాల) వ్యవసాయ భూమిలో చెరకు, జోంధాల (జొన్నలలో ఒక రకం), భుయిముగ్ (వేరుశెనగ) లను సాగు చేయడం ద్వారా కొంత అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. కానీ వయస్సు పెరుగుతున్నందున, ఆయన తన పొలంలో కష్టపడి పని చేయలేకపోతున్నారు. తరచుగా వచ్చే వరదల వలన ఆయనకు భూమి నుండి దిగుబడి గానీ, రాబడి గానీ అంతగా రావడంలేదు.
కోవిడ్-19, లాక్‌డౌన్‌లు ఆయన పనినీ ఆదాయాన్నీ ప్రభావితం చేయడంతో గత రెండేళ్లుగా బాపూ చాలా కష్టపడుతున్నారు. "చాలా నెలలుగా, నాకు ఎటువంటి ఆర్డర్లు రావడంలేదు," అని అతను చెప్పారు. ఆయన తన గ్రామంలో పెరిగిపోతున్న ఐటిఐ పట్టభద్రులు, మెకానిక్‌ల నుండి కూడా పోటీని ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా, "ఇప్పుడు తయారవుతున్న మోటార్లు మంచి నాణ్యతతో ఉంటున్నాయి. వాటికి ఎక్కువ రివైండింగ్ అవసరం లేదు."
చేనేత రంగంలో కూడా పనులు అందడం లేదు. చేనేత సెన్సస్ 2019-20 ప్రకారం, మహారాష్ట్రలో చేనేత కార్మికుల సంఖ్య 3,509కి తగ్గింది. 1987-88లో మొదటి చేనేత సెన్సస్ నిర్వహించినప్పుడు, భారతదేశంలో 67.39 లక్షల మంది చేనేత కార్మికులు ఉండేవారు. 2019-2020 నాటికి ఆ సంఖ్య 35.22 లక్షల మంది కార్మికులకు పడిపోయింది. భారతదేశం ప్రతి సంవత్సరం 100,000 మంది చేనేత కార్మికులను నష్టపోతోంది.
భారతదేశంలోని 31.45 లక్షల చేనేత కుటుంబాలలో 94,201 కుటుంబాలు అప్పుల్లో మునిగి ఉన్నాయని చేనేత జనాభా లెక్కలు చెప్తున్నాయి. నేత కార్మికులకు చాలా తక్కువ వేతనం ఉంటుంది. చేనేత కార్మికులకు సంవత్సరానికి సగటున 207 పని దినాలు ఉంటాయి.
మరమగ్గాల విస్తరణ, చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల చేమగ్గాల మీద నేయడం, చేమగ్గాల తయారీ కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితులు బాపూను విచారంలో ముంచెత్తాయి.
“చేనేతను నేర్చుకోవాలని ఇప్పుడెవరూ కోరుకోవడంలేదు. ఇలాగయితే ఆ వృత్తి ఎలా మనుగడ సాగిస్తుంది?” అని బాపూ అడుగుతారు. "ప్రభుత్వం యువ విద్యార్థుల కోసం (చేనేత) శిక్షణా కేంద్రాలను ప్రారంభించాలి." దురదృష్టవశాత్తు, రెండాల్‌లో ఎవరూ బాపు నుండి చెక్క చేనేత మగ్గాలను తయారుచేసే కళను నేర్చుకోలేదు. 82 సంవత్సరాల వయస్సులో, ఆరు దశాబ్దాల క్రితమే అభ్యాసం చేయడం మానేసిన ఒక నైపుణ్యానికి సంబంధించిన విజ్ఞానాన్నంతా నిక్షిప్తం చేసుకున్న ఏకైక సంరక్షకుడు బాపూ ఒక్కరే.
ఏదో ఒక రోజు, మరొక చేనేత మగ్గాన్ని తయారుచేయాలనుకుంటున్నారా, అని నేను ఆయన్ని అడిగాను. "అవి (చేనేత మగ్గాలు) నేడు మౌనంగా ఉన్నాయి. కానీ సంప్రదాయ చెక్క పరికరాలకూ, నా చేతులకూ కూడా ఇప్పటికీ చేవ ఉంది." అని ఆయన చెప్పారు. ఆయన అక్రోటు రంగు చెక్క పెట్టె వైపు మోహంగాచూస్తూ నవ్వుతున్నారు. ఆయన చూపులు, ఆయన జ్ఞాపకాలు మాత్రం మట్టి రంగులో మసకబారుతున్నాయి.
ఈ కథనం, గ్రామీణ కళాకారులపై సంకేత్ జైన్ అందిస్తోన్న సిరీస్‌లో భాగం. దీనికి మృణాళినీ ముఖర్జీ ఫౌండేషన్ సహకారాన్నందిస్తోంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి