"తలకి రంగు వేసుకోవడం వల్ల జుట్టు మరింత తెల్లబడుతుంది". ప్రకటించేసింది పుష్పవల్లి. "ఈ మాదిరిగా" తెలుపు నీలం రంగు చదరాల గచ్చును చూపిస్తూ అంది. అరవైల్లో ఉన్న ఆమె తల పై ఉన్న కొంచెం జుట్టు పూర్తిగా తెల్లబడిపోయింది. "కొబ్బరి నూనె, లైఫ్ బాయ్ సబ్బు ఓన్లీ". ఓన్లీ అనే పదాన్ని ఇంగ్లీషు లోనే ఒత్తి పలుకుతూ అంది.
ఆమె ఒక మధ్యాహ్నం టైల్స్ వేసిన గచ్చు నేల మీద కూర్చుని గతాన్ని, ప్రస్తుతాన్ని నెమరు వేసుకుంటొంది. " మా అమ్మ ఉండేటప్పుడు" అంటూ చెప్పటం మొదలెట్టింది. "మా అమ్మ అత్తగారు ఒక కొబ్బరిముక్కను అమ్మకు ఇచ్చేది. అమ్మ ఆ ముక్కను నమిలి తలకు రాసుకునేది. అదే ఆవిడకు కొబ్బరి నూనె".
వాసంతి పిళ్లై, పక్కనే కూర్చుని పుష్ప వేణి తో ఏకీభవించింది. ఇద్దరు ఆడవాళ్ళూ (దూరపు బంధువులు కూడా) ధారవి లో ఒకే సందులో ఒకే గది ఉండే ఇళ్లలో దాదాపు 50 ఏళ్ళు గడిపారు. గొంతులో అరుదైన సంతృప్తి ధ్వనిస్తూ వాళ్ల జీవితం గురించి చెప్పారు. ఇద్దరిదీ దశాబ్దాల స్నేహ బంధం. మారిపోయిన ప్రపంచం గురించిన జ్ఞాపకాలు ఇద్దరికీ ఉన్నాయి.
పుష్ప వేణి 14-15 ఏళ్ళ వయసులో కొత్త పెళ్ళికూతురుగా ధారవిలో అడుగు పెట్టింది. పెళ్ళికొడుకు ధారవిలో ఉండేవాడు. పెళ్లి అక్కడే ఉన్న ఖాళీ స్థలంలో మంటపంలో జరిగింది."అతనికి అప్పుడు 40 ఏళ్ళు" అంది పుష్ప వేణి. అంత పెద్దవాడా? "అవును. అయినా ఆ రోజుల్లో ఇవన్నీ ఎవరూ పట్టించుకునే వారు కాదు". పెళ్లి తర్వాత సాంబార్ అన్నం పెళ్లి భోజనంగా పెట్టారు, కేవలం శాఖాహారం". ఆవిడ గుర్తుచేసుకుంది.
పెళ్లి తర్వాత ఆవిడ, ఆవిడ భర్త చిన్నసామి ఒక గదిలోకి మారారు. చిన్నసామి ఆ గదిని 500 రూపాయలు పెట్టి కొన్నాడు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. అతను దగ్గర్లోని ఒక వర్క్ షాప్ లో పని చేసేవాడు. అందులో శస్త్ర చికిత్సలో వాడే దారం వగైరాలు తయారు చేసేవారు. అతని 60 రూపాయల నెల జీతం 1990లలో రిటైర్ అయ్యే నాటికి 25 వేల రూపాయలు అయ్యింది.
సుమారు 200 చదరపు అడుగుల ఆ గదే తర్వాతి 50 ఏళ్లు పుష్పవతి ఇల్లయింది. (కుటుంబం పెరిగాక ఆ గదిలో ఒక అటక వచ్చి చేరింది తప్పితే ఇంకేమీ మారలేదు. ఒకానొక సమయంలో ఆ ఇంట్లో తొమ్మిదిమంది కాపురం ఉండేవాళ్ళు). నిరంతరం ఉండే టెంపో వ్యాన్లు, ఆటోరిక్షాలు దాటుకుంటూ, T- జంక్షన్ నుండి ధారవి వైపు వెళ్లే మెలికలు తిరిగిన సందులో 200 చదరపు అడుగుల గది అది. ”ఆ ఇంట్లో ఉన్నప్పుడే నా ముగ్గురు పిల్లలూ పుట్టారు. వాళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. వాళ్లకు పిల్లలు, మనవలు కలిగారు.”
ఇప్పుడు అరవైల్లో ఉన్న వాసంతి కూడా పెళ్లి తర్వాతే ఆ వీధిలోకి కాపురానికి వచ్చింది. అప్పుడు తనకి 20 ఏళ్లు. వాసంతి అత్తగారు, పుష్ప వేణి భర్త అక్కా తమ్ముళ్లు. ఆ రకంగా ధారవిలో ఆమెకు ముందు నుంచే బంధువులు ఉన్నారు. “అప్పటి నుంచి నేను ఈ గల్లీ లోనే ఉన్నాను," అంది వాసంతి.
1970ల్లో వాళ్ళిద్దరూ ధారవి కి వచ్చారు. "అప్పుడు ఈ ప్రదేశం చాలా వేరేగా ఉండేది. గదులు చాలా చిన్నవిగా ఉండేవి కానీ అవి దూరం దూరంగా ఉండేవి. చాలా ఖాళీ స్థలాలు ఉండేవి". అంది పుష్ప వేణి. ఆమె ఇల్లు మొదటి అంతస్తులో ఉండేది. అది అన్నీ కలిసిన ఒక చిన్న గది. అదే వీధిలో కొంత దూరంలో సామూహిక టాయిలెట్ వుండేది." ఇప్పుడు చాలా భవనాలు వచ్చేశాయి. నడవడానికి కూడా చోటు లేదు" అంటూ చేతులు దగ్గరగా చేసి ఎంత ఇరుకు అయిపోయాయో చూపించింది. (కాలం గడిచే కొద్దీ, ఉత్తర మధ్య ముంబాయి లో ఉండే ధారవి చాలా పెరిగింది. ఇప్పుడు అది దాదాపు 10 లక్షల జనాభా కి నివాస స్థలం. మురికివాడలు, భవనాలు, వర్క్ షాపులు, అంగళ్ళ తో దాదాపు ఒక చదరపు మైలు విస్తీర్ణంలో ఉంది)
“ఈ ప్రదేశం అంతా ఖ డీ (వాగు) , చిత్తడిగా అడవిలా ఉండేది" గుర్తు చేసుకుంది వాసంతి. మాహిం నీళ్లు పోలీస్ స్టేషన్( T- జంక్షన్) దాకా వచ్చేవి. మట్టి పోసీ పోసీ పోసీ ఎత్తు చేసి గదులు కట్టారు. ఇప్పుడు విచ్చలవిడిగా కట్టేసిన బహుళ అంతస్తుల బాంద్రా కుర్ల కాంప్లెక్స్ మడ అడవులతో నిండిన చిత్తడి నేల". ఆవిడ గుర్తుచేసుకుంటూ అంది." ఆ ప్రాంతం దగ్గరకు వెళ్లడానికి భయపడేవాళ్ళం. ఆడవాళ్ళం అందరం కలిసి ఇప్పుడు కళా నగర్ బస్ స్టాప్ ఉన్న దగ్గరకి వెళ్ళే వాళ్ళం. అక్కడొక పైప్ లైన్ ఉండేది. అక్కడే మేము బట్టలు ఉతుక్కుకునేది. ఇప్పుడదంతా మట్టితో కప్పేశారు.”
వాళ్ల చిన్నప్పుడు కొనుక్కున్నవన్నీ పైసలలో వుండేవి. పూనాలో గడచిన తన చిన్నతనాన్ని పుష్పవేణి గుర్తు చేసుకుంది. అక్కడ వాళ్ల నాన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లో పని చేసేవాడు( వాళ్ళ అమ్మ 80 ఏళ్ళ ఆవిడ. ఇంకా పూనా లోనే వుంటోంది.) " ఒక పైసా కి గుప్పెడు శనగలు వచ్చేవి" . ధరలు లేకపోయినా ఆ కాలం గడిచిపోయింది అన్న భావం అయితే వ్యక్తమవుతోంది ఆవిడ మాటల్లో." తులం బంగారం 50 రూపాయలు ఉండేది. అయినా మేం కొనలేకపోయేవాళ్ళం. ఒక మంచి నూలు చీర 10 రూపాయలు ఉండేది. మా నాన్న మొదటి జీతం 11 రూపాయలు. దాంతోనే ఆయన బండి నిండా సరుకులు తెచ్చేవాడు."
"చాలా కొద్ది డబ్బులతోనే మేము సంసారాన్ని నెట్టు కొచ్చాం. రోజుకి ఒక్క రూపాయి. దాంట్లో కూరగాయలకు 20 పైసలు, గోధుమలు 10 పైసలు, బియ్యం ఐదు పైసలు" ఆవిడ గుర్తుచేసుకుంది. "మా అత్తగారు మళ్ళీ ఆ ఒక్క రూపాయ లోన్చి ఒక పది పైసలు రోజూ మిగిల్చి దాచమనేది ".
ఆవిడ ధారవి కి వచ్చినప్పుడు ఇంతకుముందు గొప్పగా చెప్పిన లైఫ్ బాయ్ సబ్బు 30 పైసలు వుండేది. "చాలా పెద్దదిగా ఉండేది. చేతిలో పట్టేది కాదు. కొన్నిసార్లు మేము 15 పైసలు ఇచ్చి, సగం సబ్బు కొనే వాళ్ళం." అంది వాసంతి.
1980లకి వచ్చేసరికి ఆవిడ రోజు కూలీగా 15 రూపాయలు సంపాదించేది. "ఎక్కడ పని ఉంటే అక్కడికి పరిగెత్తేదాన్ని." అంది. ఆమెకు 17 ఏళ్ళు ఉన్నప్పుడు సేలం నుంచి ముంబై వచ్చింది. అప్పట్లో ఆమె ఒక సబ్బుల ఫ్యాక్టరీలో పని చేసేది. “నేను అక్కడ సబ్బులు ప్యాకింగ్ చేసేదాన్ని” అన్నది. తర్వాత ఆమె మజీద్ బండర్ దగ్గర చేపలు ప్యాకింగ్ చేసే చోట పనికి కుదిరింది. అటు తర్వాత చాలా ఏళ్లు రోజుకి అరడజను ఇండ్లల్లో సహాయకురాలిగా పని చేసింది.
తమిళనాడులో వాసంతి వాళ్ళ నాన్న పోలీస్ కానిస్టేబుల్ గా పని చేసేవాడు. వాసంతికి 3 ఏళ్ల వయసులో అమ్మ చనిపోయింది. ఆమె పదో తరగతి వరకు చదివింది. తనది మంచి జ్ఞాపకశక్తి. ఆ పాత రోజుల్ని ఆమె "అసలీ మాల్ " అంటుంది. " పొలాల నుంచి నేరుగా తెచ్చుకుని చెరకు గడను తినేవాళ్ళం. టమాటోలు శనగలు ఉసిరికాయలు అన్నీ నేరుగా పొలం నుంచి తెచ్చుకునే వాళ్ళం. తాడు విసిరి చింతకాయలు తెంపుకొని ఉప్పు కారం అద్దుకుని తినేవాళ్ళం". అదే ఆవిడ జ్ఞాపకశక్తి రహస్యం అని ప్రకటించేసింది. నల్ల జుట్టు కోసం కొబ్బరి నూనె, లైఫ్ బాయ్ సబ్బు వాడాలి అని పుష్పవేణి చెప్పినట్టు.
వాసంతి తాను పనిచేసే సబ్బుల ఫ్యాక్టరీలో ఒక కుర్రాడిని కలిసింది. అతడే తర్వాత ఆమె భర్త అయ్యాడు. "మాది మొదట ప్రేమ, తర్వాత పెద్దలు కుదిర్చిన పెళ్లి" సన్నని మృదువైన చిరునవ్వుతో అంది వాసంతి. "యవ్వనంలో ప్రేమలో పడనిది ఎవరు? మా పిన్ని అన్ని రకాల విచారణలు చేసిన తర్వాత మూడేళ్లకు 1979లో పెళ్లి చేసింది.”
ఆమె తన భర్త పేరు చెప్పలేదు. పుష్పవేణిని చెప్పమంది. తర్వాత తనే ఒక్కొక్క అక్షరమే పలుకుతూ చెప్పింది: ఆశాయ్ తంబి. “అతను ఎంతో మంచివాడు" అంది. “అతని మీద ప్రేమ ఇంకా ఉంది. అతను బంగారం. సౌమ్యుడు మృదుభాషి. మేము ఎంతో అన్యోన్యంగా జీవితం గడిపాం. ఇంకా నాకు అత్తగారింట్లో కూడా ఏ లోటు లేదు. అంతే కాదు మా అత్తగారు కూడా చాలా మంచిది. నేను కోరుకున్నవన్నీ నాకు దక్కాయి.”
2009 లో ఆశాయ్ తంబి చనిపోయాడు. " అతను తాగేవాడు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉండేది". వాసంతి గుర్తుచేసుకుంది. “కానీ మేము సుఖమైన జీవితం గడిపాం. దాదాపు 35 ఏళ్ళు కలిసి వున్నాం. ఈ రోజుకీ ఆయన్ని తలచుకుంటే ఏడుపు ఆగదు". ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి.
వాళ్ల ఒకే ఒక కొడుకు పుట్టిన కొద్ది రోజులకే చనిపోయాడు." కాన్పు తర్వాత నేను ఆసుపత్రి నుంచి ఇంటికి రాక ముందే చనిపోయాడు" అంది." దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను. పుష్ప వేణి పిల్లలే నా పిల్లలు. ఇప్పుడు వీళ్లందరినీ వదిలి నలసోపర వెళ్లాలంటే గుండె పిండేసినట్టే వుంటోంది."
ఈ సంవత్సరం అక్టోబర్ లో వాసంతి ధారవిలో ఇల్లు అమ్మేసింది. ఆకాశమే హద్దుగా పెరిగిన నివాస స్థలాల ధరల వల్ల వాళ్లకి బాగానే డబ్బులు వచ్చాయి. కానీ ముంబై లాంటి సిటీలో ఉన్న విపరీతమైన ధరలతో చూస్తే అది సముద్రంలో నీటిబొట్టంతే.
ధారవి లో ఉన్న అనేక దుస్తుల తయారీ కేంద్రాల నుండి ఈ ఆడవాళ్ళు ఇద్దరూ పని తెచ్చుకుంటారు - జీన్స్ ప్యాంట్లు కుట్టేసిన తర్వాత మిగిలిపోయిన దారాలు కత్తిరించే పని. ఒక్కో ప్యాంటు కి 1.50 రూపాయి ఇస్తారు. ఇద్దరూ కలిసి 2,3 గంటలు పని చేస్తే రోజుకి 50,60 రూపాయలు వస్తాయి. ఒక్కోసారి షేర్వాణీ లకు హుక్స్ కుట్టే పని తెచ్చుకుంటారు. బట్టలన్నీ తెలుపు నీలం టైల్స్ నేల మీద వేసి, మధ్యాహ్న సమయాలలో పనిచేస్తారు.
ధారవి లో ఉన్న అనేక దుస్తుల తయారీ కేంద్రాల నుండి ఈ ఆడవాళ్ళు ఇద్దరూ పని తెచ్చుకుంటారు - జీన్స్ ప్యాంట్లు కుట్టేసిన తర్వాత మిగిలిపోయిన దారాలు కత్తిరించే పని. ఒక్కో ప్యాంటు కి 1.50 రూపాయి ఇస్తారు
తన ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో పగడి పద్ధతిలో (చాలా తక్కువ అద్దె ఇస్తూ ఇంట్లో ఉండే పద్ధతి. ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో ఇల్లు కొనుక్కోవడంలో బాగా వాడుకలో ఉన్న పద్ధతి) రెండు గదుల ఇల్లు తీసుకుంది. అందులో ఆవిడ తన పెద్ద కొడుకుతో కలిసి ఉంటోంది. అతనొక ఆటోరిక్షా డ్రైవర్. భార్య, ముగ్గురు పిల్లలు.(పుష్పవాణి భర్త 1999 లో చనిపోయాడు). ఈ కొత్త ఇంట్లో కింద ఒక గది పైన ఒక గది ఉన్నాయి. కింద ఉన్న గదిలోనే ఒక చిన్న వంట ఇల్లు, టాయిలెట్ ఉన్నాయి. ఆ కుటుంబానికి అలాంటి ఇల్లు, ఒక పెద్ద ఎదుగుదల.
ఆవిడ ఇంకో కొడుకు ధారవి లోనే మరో వైపు ఉంటాడు. అతనికి ఇప్పుడు 42 ఏళ్లు. ఆవిడ ఇంతకుముందు చెప్పినట్టు అతను "స్పోర్ట్స", అంటే ఎక్సపోర్ట్స్ లో పని చేసేవాడు. లాక్ డౌన్ లో అతని ఉద్యోగం పోయింది. తర్వాత అతనికి మెదడులో రక్తనాళాలకు ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు కోలుకున్నాడు. ఉద్యోగం వెతుక్కుంటున్నాడు. పుష్పవేణి కూతురుకి 51 ఏళ్లు. ఆవిడకి నలుగురు మనవలు." నేనిప్పుడు ముత్తవ్వని,” అన్నది.
నా ఇద్దరు కొడుకులూ కోడళ్లూ నన్ను బాగా చూసుకుంటారు. ఏ ఒత్తిడి లేదు. ఏ ఇబ్బంది లేదు. విశ్రాంతిగా ఉన్నాను".
వాసంతి తన డబ్బుతో "నాలసోపర" అనే చోట ఇల్లు కట్టుకుంటోంది. ధారవికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉందా ఇల్లు. ఇల్లు తయారయ్యే వరకూ అక్కడే ఒక గదిలో అద్దెకు ఉంటోంది. అప్పుడప్పుడు ధారవికి, పుష్పవేణి దగ్గరకు వచ్చి పోతూ ఉంటుంది." ఇల్లు కట్టుకునేటప్పుడు దగ్గరలో ఉండాలి. నాకు కావలసినట్టు చెప్పి కట్టించుకోవచ్చు. నాపరాళ్లతో ఒక అలమరా నాకు ఆ ఇంట్లో ఉండాలి. మనం దగ్గర లేకపోతే వాళ్ళు పని సరిగ్గా చెయ్యరు," అంది వాసంతి.
ఆ ఇల్లు తయారయ్యాక అందులో బిస్కెట్లు, సబ్బులు అమ్మే చిల్లర కొట్టు పెట్టాలనుకుంటోంది. ఇక అదే ఆవిడకి జీవనోపాధి. " నేను పెద్దదాన్ని అయిపోతున్నాను. ఇళ్ళల్లో పని చేయలేను" అంది వాసంతి."నేను పేదదాన్నే. కానీ నా జీవితం సుఖంగా ఉంది. నాకు తినడానికి తిండీ, వేసుకోవడానికి బట్టలూ, ఉండటానికి ఇల్లూ ఉన్నాయి. నాకు ఏ చింతా లేదు. ఇంతకంటే నాకే అవసరమూ లేదు".
అనువాదం: వి. రాహుల్ జీ