ఎడిటర్ సూచన: తమిళనాడులోని ఏడు పంటలపై రాసిన కథనాలలో ‘లెట్ దెమ్ ఈట్ రైస్(వాళ్ళు వరి అన్నం తిననీ)’ అనే సిరీస్‌లోని మొదటి కథ ఇది. ఈ వరసలో PARI, ఇప్పటి నుండి రెండు సంవత్సరాలలో 21 మల్టీమీడియా నివేదికలను ప్రచురిస్తుంది, ఇవి రైతుల జీవితాలను వారి పంటల ప్రపంచం ద్వారా పరిశీలిస్తాయి. అపర్ణ కార్తికేయన్ రాస్తున్నఈ సిరీస్‌కు బెంగుళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం నుండి గ్రాంట్ లభించింది.
బంగారు వర్ణంలో సూర్యుడు ఎప్పటిలానే అందంగా ఉదయిస్తుండగా, రాణి తన పనికి వెళ్లిపోయింది. అతి బరువైన ఒక పెద్ద చెక్కబద్దను పట్టుకుని, ఆమె అందరికి తెలిసిన, వంటగదిలో అతి ముఖ్యమైన ఆహారపదార్థం - ‘ఉప్పు’ను కుప్పగా చేస్తుంది.
ఆమె పనిచేసే చతురస్రపు గడిలో అడుగును గీరుతూ, ఒకసారి కరకరలాడే, ఒక్కోసారి మెత్తగా, తడిగా ఉన్న ఉప్పు గళ్లను, ఆమె అక్కడే ఒకచోట కుప్పగా పేరుస్తుంది. చిన్న మడే అయినా ఆమె ప్రతిసారి ఉప్పుగళ్లను లాగుతున్నకొద్దీ, ఆ ఉప్పు గళ్ల కుప్ప పెద్దవవుతూ ఉంటే ఆమె పని ఇంకా కష్టమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె లాగిన ప్రతిసారి ఆ కుప్పకు మరో 10 కిలోల ఉప్పుని జతచేస్తుంది - ఇది ఆమె శరీరబరువులో నాలుగో భాగం.
అలా ఆమె ఆగకుండా 120 అడుగులకు 40 అడుగులుండే స్థలంలో పైన పేలవమైన ఆకాశం, కింద నీళ్ల పై ప్రతిబింబిస్తుండగా, ఆమె తన నీడతో పాటే కదులుతూ పనిచేసింది. ఈ ఉప్పటి ప్రపంచం గత 52 రెండేళ్లుగా ఆమె పని ప్రదేశమైంది. ఇదే ప్రదేశం ఇదివరకు ఆమె తండ్రిది, ప్రస్తుతం ఆమె కొడుకుది కూడా అయింది. ఇక్కడే ఎస్. రాణి ఆమె కథను నాకు చెప్పింది. ఆ కథతో పాటే దక్షిణ తమిళనాడులో తూత్తుకూడి జిల్లాలో ఉన్న 25,000 ఎకరాల ఉప్పు మడుల గురించి కూడా తెలిసింది
ప్రితి ఏడూ మార్చ్ నుండి అక్టోబర్ వరకు, ఈ కోస్తా జిల్లా ఉప్పు తయారీకి సరిగ్గా సరిపడే వాతావరణం ఉంటుంది - ఇక్కడ వేడిగా, పొడిగా తేమలేకుండా ఉండడం వలన ఖచ్చితంగా ఆరు నెలలు నిరంతరాయంగా ఉప్పు ఉత్పత్తి జురుగుతు ఉంటుంది. తమిళనాడులోనే అత్యంత అధికంగా ఉప్పును ఉత్పత్తి చేసే జిల్లా ఇదే. దేశం మొత్తంలో 11 శాతం ఉప్పులో తమిళనాడులోనే ఉత్పత్తి అవుతుంది. దీనికన్నా ఎక్కువగా, గుజరాత్ నుండి, 16 మిలియన్ టన్నుల ఉప్పు, మన దేశం లో ఉత్పత్తి అయ్యే సగటు ఉప్పు పంటలో లేదా 76 శాతం అంటే 22 మిలియన్ టన్నులు ఉత్పత్తి అవుతుంది. ఈ దేశంలో ఉత్పత్తి అయ్యే ఉప్పు సంఖ్యతో చూస్తే 1947లో ఉత్పత్తి అయిన 1.9 MT చాలా ఎక్కువ.
సెప్టెంబర్ మధ్యలో, PARI మొదటిసారి తూత్తుకుడిలో రాజా పండి నగర్ లో ఉన్న ఉప్పు మడుల వద్దకు వెళ్లింది. ఆ సాయంత్రం, రాణి, ఆమెతో పనిచేసేవారు మమ్మల్ని కలిసి, వేపచెట్టు కింద గుండ్రంగా వేసిన కుర్చీలలో కూర్చుని మాతో కబ్బుర్లు చెప్పారు. వారి ఇళ్లు- కొన్ని ఇటుకలతో, ఆస్బెస్టాస్ రేకులతో , కొన్ని గుడిసెలు మాత్రమే -పై కప్పులు పడిపోతున్నాయి - మా వెనుక ఉన్నాయి. ఈ ఉప్పు మడులు లేదా ఎక్కడైతే ఉప్పుని తయారు చేస్తారో అవి రోడ్డు పక్కనే ఉన్నాయి, వారు పని చేసే ప్రదేశం తరాల బట్టి అక్కడే ఉంది. మా సంభాషణ సాగుతున్నకొద్దీ వెలుగు తగ్గిపోతోంది. ఈ సంభాషణ నెమ్మదిగా, సోడియం క్లోరైడ్ (NACl),(ఉప్పుకు ఉన్న రసాయన పేరు)ను తయారు చేయడానికి జరిగే క్లిష్టమైన ప్రక్రియ గురించి మాకు వేగవంతమైన జ్ఞానం అందేంత అద్భుతంగా సాగింది.
తూత్తుకుడిలోని ఈ ‘పంట’ సముద్రపు నీటి కంటే ఉప్పు ఎక్కువగా ఉండే ‘నేల క్రింది’ ఉప్పునీరు నుండి పండిస్తారు. దీన్ని బోరు బావుల ద్వారా పైకి తోడుతుంటారు. రాణి, ఆమె స్నేహితులు పనిచేసే 85 ఎకరాల ఉప్పు మడులలో, ఏడు బోరుబావులనుండి, అక్కడి మడుల్లోకి నాలుగు అంగుళాల వరకు నీటిని నింపుతారు. (ప్రతి ఎకరం దాదాపు తొమ్మిది ప్లాట్‌లుగా విభజించబడి ఉంది. ఇందులో దాదాపు నాలుగు లక్షల లీటర్లు నీళ్లుంటాయి. అంటే నవభై 10,000 లీటర్ల నీటి ట్యాంకర్లలో పట్టేన్ని నీళ్లు)
కొద్దిమంది మాత్రమే బి అంథోని సామి లాగా ఉప్పలం (ఉప్పుమడుల) నిర్మాణాల గురించి అర్ధం చేసుకుని వివరించగలరు. ఈయన తన 56 ఏళ్లలో ఎక్కువకాలం ఉప్పు కార్మికుడిగానే పనిచేశారు. అతని పని వివిధ ఉప్పుమడుల్లో నీటి లెవెల్‍ని నిర్వహించడమే. సామి మడులను రెండు రకాలుగా విడదీస్తారు. ఆణ్ పాతిలు (మగ పాదులు) అంటే నీళ్ళని త్వరగా ఎండగట్టేవి లేదా లోతు లేని ఉప్పుమడులు, అంటే వాటికి అవి త్వరగా ఎండిపోయేవిగా చెబుతారు. రెండవ రకం పెణ్ పాతిలు (ఆడ పాదులు) ఉప్పుని పుట్టించేవి, అంటే గళ్లు తయారీచేసేవిగా చెబుతారు.
బ్రైన్ ని పైకి లాగగానే ముందుగా ఎవాపరేటర్లను నింపుతాము.” అన్నారు.
ఇక ఆ తరవాత అంతా సాంకేతికంగా మాట్లాడతారు.
ద్రవాల నిర్దిష్ట గురుత్వాకర్షణను కొలిచే పరికరం అయిన బామ్ హైడ్రోమీటర్ ద్వారా ఆ ఉప్పు నీరులో లవణీయతను డిగ్రీలలో కొలుస్తారు. స్వేదనజలం యొక్క 'బామ్ డిగ్రీ' సున్నా. అదే సముద్రపు నీటిలోనైతే ఇది 2 నుండి 3 బామ్ డిగ్రీల వరకు ఉంటుంది. అలాగే బోర్‌వెల్ నీటిలో 5 నుండి 10 డిగ్రీల మధ్య ఉంటుంది. ఉప్పు 24 డిగ్రీల వద్ద ఏర్పడుతుంది. "నీరు ఆవిరైపోతుంది. దానితో లవణీయత పెరగుతుంది, ఆ తరవాత అది క్రిస్టలైజర్లకు పంపబడుతుంది" అని సామి చెప్పారు.
ఆ తరవాత రెండు వారాల పాటు, ఆడవారు ఒక చాలా పెద్ద బరువైన ఇనుప చువ్వలుండే పారవంటి పరికరంతో నీళ్లను దువ్వినట్లుగా రోజూ కలియబెడతారు. ఒక రోజు దీనితో నిలువునా లాగితే , మరో రోజు అడ్డంగా లాగుతారు. ఉప్పు గళ్లు కిందనే ఉండిపోకుండా ఇలా చేస్తారు. పదిహేను రోజుల తరవాత మగ, ఆడవారు కలిసి ఒక పెద్ద చెక్క తెడ్డు వాడి ఉప్పుని తీస్తారు. దీనిని తరవాత వారం అంటే రెండు మడుల మధ్య ఉన్న వరప్పు గట్టు మీద వేస్తారు.
ఇప్పుడు, కష్టతరమైన పని మొదలవుతుంది: ఆడవారు, మగవారు వరప్పు నుండి ఉప్పుని తలమీద పెట్టుకుని వెళ్లి దూరంగా ఒకచోట కుప్పలా పోస్తారు. ప్రతి వ్యక్తికి కొన్ని వరప్పు గట్లు ఇస్తారు. దాని నుంచి వారు ప్రతి రోజు 5-7 టన్నుల ఉప్పును తల మీద పెట్టుకుని మోస్తారు. అంటే మొత్తం 150 సార్లు వాళ్ళు నెత్తి మీద 35 కేజీల బరువు పెట్టుకుని 150 నుండి 250 అడుగులు నడుస్తారు. ఇన్నిసార్లు తిరిగారు కాబట్టి ఆ చిన్న ఉప్పుకుప్ప నెమ్మదిగా దిబ్బంత పెరిగిపోతుంది. ఆ సూర్య కాంతిలో ఈ తెల్లని ఉప్పుగళ్లు వజ్రాలలాగా మెరిసిపోతాయి. ఇది వేడిగా ఉన్నఈ గోధుమ రంగు నేలలోని సంపద.
*****
ఒక ప్రేమికుడి కోపం ఆహారానికి ఉప్పు వంటిది. ఎక్కువైతే రుచించదు.
అది చెంథిల్ నాథన్ చేసిన తిరుక్కురల్ (పవిత్ర జంటలు) నుండి ద్విపద యొక్క అనువాదం (మరియు క్లుప్త వివరణ). 4వ శతాబ్దం BCE నుండి 5వ శతాబ్దం CE మధ్య కాలంలో జీవించినట్లు వివిధ చరిత్రకారులు విశ్వసించే తమిళ కవి - సన్యాసి తిరువల్లువర్ రాసిన తిరుక్కురల్‌లోని 1,330 ద్విపదలలో ఇది ఒకటి .
సరళంగా చెప్పాలంటే: ఉప్పును ప్రతీకగా తమిళ సాహిత్యంలో వాడడం రెండు వేల ఏళ్ళ క్రితమే మొదలైంది. అంటే దానికంటే ముందుగానే తమిళనాడు కోస్తా ప్రాంతంలో ఉప్పు తయారీ మొదలైంది.
చెంతిల్ నాథన్, 2000 ఏళ్ళ ప్రాచీనమైన సంగం యుగానికి చెందిన ఒక కవిత ను కూడా అనువదించారు. ఈ కవితలో కూడా ఉప్పును మాధ్యమంగా ఉపయోగించారు. ఈ పదాన్ని ప్రేమికుల గురించి వ్రాస్తున్నప్పుడు వాడారు.
సొరచేపలను వేటాడుతుండగా
గాయపడిన మా నాన్నతేరుకుని
మళ్లీ నీలిసముద్రంలోకి వెళ్లిపోయాడు
ఉప్పుతో బియ్యాన్ని కొనడానికి
మా అమ్మ, ఉప్పు మడులలోకి వెళ్లింది.
ఇప్పుడు దూరాన్ని మతించని
నడకవలన కలిగే అలసటను భరించగలిగే
ఒక మిత్రుడు ఉంటే బావుండు,
ఆ చల్లని దూర తీరాలలోని
మనిషికి
నన్ను చూడాలనుకుంటే,
ఇదే సమయమని
నా మాటగా చెప్పాలి.
జానపదాలు, సామెతలు కూడా ఉప్పుతో ముడిపడినవి ఉన్నాయి. అందులో ఒకటి రాణి నాకు చెప్పింది, ప్రసిద్ధి పొందిన తమిళ సామెత, ఉప్పిలా పండం కుప్పయిలే : ఉప్పు లేని భోజనం, అర్ధం లేనిది. ఆమె వర్గంవారు ఉప్పును లక్ష్మిగా భావిస్తారు, ఈమె హిందూ దేవతల్లో సంపదకు దేవత. “ఎవరైనా ఇల్లు మారితే మేము ఉప్పును, పసుపును, నీళ్లను తీసుకెళ్లి వారింట్లో పెట్టి వస్తాము. అది శుభం.” అన్నది రాణి.
సంస్కృతిలో ఉప్పుని విశ్వాసానికి ప్రతీకగా వాడతారు. రచయిత ఎ. శివసుబ్రమణియన్ చెబుతారు: జీతానికి తమిళ పదం సంబలం - ఇక్కడ సంబ అంటే వరి, ఉప్పలం అంటే ఉప్పును పండించే చోటు. ఆయన పేరు గాంచిన పుస్తకం ఉప్పితావారై (తమిళుల సంస్కృతిలో ఉప్పును గురించి మొనొగ్రఫ్)లో, ఆయన తమిళంలో తరచుగా వాడే సామెతను దృష్టికి తెస్తారు - ఉప్పితావరల్ ఉల్లవుమ్ నేనై - అంటే నీ భోజనంలో ఉప్పు వేసినవాడిని మరచిపోకు. అంటే నీ యజమానిని మరిచిపోకు.
మార్క్ కుర్లాన్స్కీ తన గొప్ప అద్భుతమైన పుస్తకం, ‘ సాల్ట్: ఏ వరల్డ్ హిస్టరీ, ’లో చెప్పినట్లు “ఇది మొదటి అంతర్జాతీయ విక్రయం పొందిన ఉత్పత్తులలో ఒకటి; దీని ఉత్పత్తి మొదటగా వచ్చిన పరిశ్రమలో ఒకటి, ఇదే మొదట గుత్తాధిపథ్యం తీసుకున్నదనడానికి ఏమి సందేహం లేదు.”
ఈ ఒక్క దినుసు మన భారతీయ చరిత్రను పూర్తిగా మార్చేసింది, మహాత్మా గాంధీ మార్చ్ ఏప్రిల్ 1930లో బ్రిటిష్ష్ రాజ్యానికి పన్ను కట్టకుండా గుజరాత్ లోని దండి వరకు మార్చ్ చేశారు. ఆ తరవాత అదే ఏడాది ఏప్రిల్లో, ఆయన రాజకీయ సహోద్యోగి సి రాజగోపాలాచారి, తమిళనాడులో ఉప్పు సత్యాగ్రహారాన్ని తిరుచానపల్లి నుండి, వేదారణ్యం వరకు నడిపారు. దేశ స్వాతంత్య్ర పోరాటాలలో దండి మార్చ్ ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచిపోయింది.
*****
“అత్యంత కష్టమైన పనికి అతి తక్కువ
వేతనాలు.”
– ఆంథోనీ సామి, ఉప్పు కార్మికుడు
రాణి మొదటి జీతం రోజుకు 1.25 రూపాయిలు. ఇది 52 ఏళ్ళక్రిందటి సమయం. ఆమెకి ఎనిమిదేళ్లున్నప్పుడు ఒక పొడుగు లంగా వేసుకుని ఉప్పు బట్టీల మధ్య తిరుగుతూ ఉండేది. ఆంథోమి సామికి కూడా తన మొదటి జీతం గుర్తుంది- 1.75 రూపాయిలు. ఏళ్ల తరవాత ఆది 21 రూపాయలకు మారింది. ఈ రోజు, దశాబ్దాల పోరాటం తరవాత ఆడవారికి రోజు వేతనం 395 రూపాయిలు, మగవారికి 405 రూపాయిలు అయింది. కానీ ఒక విషయం మాత్రం అలానే ఉంది. “అత్యంత కష్టమైన పనికి అతి తక్కువ వేతనం.”
“ నేరం ఆయిట్టు”, (ఆలస్యం అవుతోంది), రాణి కొడుకు కుమార్, తూత్తుకుడి యాసలో పొద్దున్న 6గం. లకు పిలిచాడు. మేము ఉప్పు మడులకు అప్పటికే చేరిపోయాము, అతను పని మొదలుపెట్టడం ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో అన్నాడు. దూరం నుండి ఆ మడులు చిత్రాల్లాగా ఉన్నాయి- ఆకాశం ఊదా, బంగారు వర్ణాలలో ఉంది, కింద మడులలో నీరు మెరుస్తోంది, చల్లగాలి దయగా నిమురుతోంది, దూరంగా ఫ్యాక్టరీలు తమకేం తెలియనట్టున్నాయి. ఒక అందమైన ప్రకృతి దృశ్యం. ఇంకో అరగంటలో, ఇది ఎంత క్రూరంగా మారబోతున్నదో మీకు అక్కడ పనిచేస్తే తెలుస్తుంది.
ఒక పాడైపోయి ఉన్న పాత షెడ్ వద్ద ఉప్పు మడుల మధ్యలో, ఆడామగా అంతా తయారవుతారు. ఆడవారు వారి చీరల పైన చొక్కాలు వేసుకుని, ఒక బట్టతో నెత్తి మీద చుట్టకుదురు తయారు చేసుకుని పెట్టుకుంటారు. ఆ తరువాత వారు పని చేయవలసిన సామాగ్రిని అల్యూమినియం గిన్నెలను, బకెట్ల, మంచినీళ్ల బాటిళ్లు, ఆహరం - ఒక స్టీల్ కారేజ్లో గంజి అన్నాన్ని పట్టుకుని బయలుదేరుతారు. ఎడమ వైపు చూపిస్తూ, “ఈ రోజు ఉత్తరం వైపు వెళుతున్నాము,” అన్నాడు కుమార్. అతనివెనుకే ఒక బృందం కదులింది. వారంతా ఒక రెండు వారసలో ఉన్న మడుల వద్ద ఆగి అక్కడి ఉప్పును కొన్ని గంటలలో ఖాళీచేస్తారు.
వెంటనే వాళ్ళు పనిలోకి దిగుతారు. ఆడవారు, మగవారు, వారు వేసుకున్న బట్టలను పైకి మడుస్తారు. చీరలు, లంగాలు; ధోతీల అంచులు వారి మోకాళ్లను తాకుతాయి. వాళ్ళు ఉప్పును పారతో ఎత్తి వారితో తెచ్చుకున్న బేసిన్లలో నింపుకుంటారు. ఒక్కసారి ఆ బేసిన్లు నిండగానే ఒకరి బరువు ఇంకొకరి నెత్తి మీద పెట్టుకుని తీగ మీద నడిచినంత లాఘవంగా ఆ సన్నని దారి గుండా - చెరో వైపు నీరు ఉండగా, 35 కిలోల ఉప్పును వారి తల పై మోస్తూ, ఆ తాటి చెక్క వంతెన మీద ఒకటి, రెండు, మూడు… ఆరు అడుగులు.
ఇలా సాగిన ప్రతి ప్రయాణం తరువాత, ఒక విరామం తీసుకున్న క్షణం, తెల్లని వర్షంలా ఉప్పును కురిపిస్తూ వారు వారి బేసిన్లను ఖాళీ చేసి, మళ్లీ ఇంకా తీసుకురావడానికి వెనక్కు మరలుతారు. అలా మళ్లీ మళ్లీ, ప్రతి ఒక్కరు కనీసం 150-200 సార్లు తిరుగుతారు. చివరికి అక్కడ ఒక ఉప్పు దిబ్బ వెలుస్తుంది, 10 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు, ఒక అంబారం (కుప్ప). ఇది ఒక సముద్రము, సూర్యుడి బహుమతే కాదు- రాణి, ఆమె మనుషుల చెమటోడ్చిన కష్టం కూడా.
ఈ మడులకు మరోవైపు, 53 ఏళ్ళ రాణి, ఆంథోనీ సామి పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఆమె ఆ ఇనుప చువ్వలను ఉప్పు నీటిని కలియబెట్టడానికి వాడుతుంది, అతను తెడ్డుతో అంతా ఒకచోటకు చేరుస్తున్నాడు. అక్కడ నీరు నెమ్మదిగా, సలసల మని చప్పుడు చేస్తుంటే ఆ ఉప్పు గట్టిపడుతుంది. ఇక రోజు వేడెక్కుతుంది, నీడలు నల్లబడతాయి, కానీ ఎవరూ వారి పనిని ఆపరు, వారు ఒళ్ళు విరుచుకోవడానికి, కనీసం ఊపిరి తీసుకోవడానికి కూడా ఆగలేరు. ఆంథోనీ నుండి తెడ్డుని అందుకుని నేను గట్టు మీదకు ఉప్పును ఎత్తి వేయడానికి ప్రయత్నించాను. అది చాలా కిరాతకమైన పని. ఐదుసార్లు అలా చేయగానే నా భుజాలు మంటపుట్టాయి, వెన్నునొప్పి పుట్టింది, చెమట నా కనురెప్పల మీదకు కారింది.
ఆంథోనీ ఏమి మాట్లాడకుండా నా వద్దనున్న తెడ్డుని తీసుకుని అక్కడున్న ఉప్పుని తోయడం మొదలుపెట్టాడు. నేను రాణి పని చేస్తున్న మడిలోకి వెళ్లాను. ఆమె చివరి మడిలో పని చేస్తోంది. ఆమె కండరాలు బిగుసుకుంటున్నాయి, లాగుతోంది, అలా మళ్లీ మళ్లీ, ఆ మొత్తం తెల్లని పదార్ధం అంతా ఒకవైపుకు తోసుకు వచ్చేవరకు, ఆ మడిలో ఉన్న నీళ్లన్నీ తెలుపు కోల్పోయి గోధుమ రంగులోకీ వచ్చేవరకు, మళ్లీ మదిలో కొత్త నీరు నింపుకోవడానికి, ఇంకో ఉప్పుపంటను తయారుచేయడానికి ఆమె కష్టపడుతూనే ఉంది.
ఆమె అడ్డదిడ్డంగా ఉన్న కుప్పను తన తెడ్డుతో సరిచేశాక, రాణి తనతో నన్ను కూర్చోమని పిలిచింది. అలా కూర్చున్న మేము, ఆ పెద్ద తెల్లటి ఉప్పు దిబ్బ పక్కన, దూరంగా వెళ్లిపోతున్న గూడ్స్ ట్రయిన్ ని చూస్తున్నాం.
“ఒకప్పుడు గూడ్స్ ట్రైన్ ఇక్కడ ఉప్పును తీసుకెళ్లడానికి వచ్చేది,” అన్నది రాణి, పాత దారిని గాలిలో గీస్తూ. “వారు కొన్ని క్యారేజీలు ట్రాక్ పైన వదిలేసేవారు, తరవాత ఇంజన్ వాచ్చి వాటిని తీసుకు వెళ్ళిపోయేది.” ఆమె ఎడ్ల బండ్లు, గుర్రబ్బగ్గీలు, ఆ షెడ్ వద్దకు వచ్చే రోజుల గురించి మాట్లాడింది. ఇప్పుడు సూర్యుడు, ఉప్పు, పని తప్ప ఇంకేమి లేదు. ఇలా చెప్పి ఆమె తన రొంటిలో దోపుకున్న గుడ్డసంచిని బయటకు తీసింది. అందులో ఒక చిన్న రెండురూపాయల అమృతాంజనం డబ్బా, ఒక విక్స్ ఇన్హేలర్ ఉన్నాయి. “ వీటి వలన(ఇంకా ఆమె షుగర్ మాత్రల వలన)నా పని సాగుతోంది.” అని ఆమె చిన్నగా నవ్వింది.
*****
“ఒకరోజు వర్షం పడితే, మాకు వారం పాటు పని దొరకదు.”
– తూత్తుకుడిలోని ఉప్పు మడుల కార్మికులు
ఏళ్ళు గడిచిన కొద్దీ పని వేళలు కూడా మారిపోయాయి. ఇదివరకు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మధ్యలో ఒక గంట భోజన విరామంతో సాగే పనివేళలు, ఇప్పుడు రెండు బృందాలుగా మారి, ఒక బృందం ఉదయం 2 గంటల నుండి పొద్దున్న 8 గంటల వరకు పని చేస్తుంటే, మరో బృందం పొద్దున్న 5 గంటల నుండి 11 గంటల వరకు పనిచేస్తున్నారు. ఈ షిఫ్తులలో అన్నిటికన్నా కష్టమైన పని జరుగుతుంది. ఇటువంటి సమయాలలో, వారు ఇంకా కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. కొంతమంది పనివాళ్లు అటువంటి అదనపు పనులను చేయడానికి షిఫ్ట్ సమయం అయిపోయినా, ఉండిపోతారు.
“పది గంటల తరవాత అక్కడ నుంచోవాలంటే చాలా వేడిగా మారిపోతుంది,” అన్నారు ఆంథోనీ సామి. ఉన్నట్టుండి ఉష్ణోగ్రత, వాతావరణం ఎలా మారిపోతాయి అనేది ఆయన స్వయంగా చూసి అనుభవించినవాడు. న్యూయార్ టైమ్స్ లో గ్లోబల్ వార్మింగ్ పై సాగే ఒక ఇంటరాక్టివ్ పోర్టల్ డేటాలో ఈయన వ్యక్తిగత గమనికలను ఉంచారు.
ఆంథోనీ 1965 లో పుట్టారు. అప్పట్లో తూత్తుకుడి(టుటుకోరిన్ అని పిలిచేవారు)లో ఏడాదిలో 136 రోజులు, ఉష్ణోగ్రత 32 డిగ్రీలు దాటేది. ఈ రోజు సమాచారం ప్రకారం, ఏడాదిలో 258 రోజులు ఇదే ఉష్ణోగ్రత ఉంటోంది. అతని జీవితకాలంలో ఏడాదిలో వేడి రోజులు 90శాతం పెరిగాయి.
దానితో కలిపే అకాల వర్షాలు కూడా పెరిగాయి.
“ఒకరోజు వర్షం పడితే, మాకు ఒక వారం వరకు పని దొరకదు”, అని పనివాళ్లంతా ఒకే గొంతుకతో అన్నారు. వర్షం వచ్చి ఉప్పు, అవక్షేపం, మడులు, అని కొట్టుకెళ్లిపోతాయి. కొన్ని రోజుల పాటు పని లేక, అందువలన డబ్బులులేక అల్లాడవలసి వస్తుంది.
చాలావరకు , ఈ నిలకడ లేని వాతావరణానికి, స్థానికంగా జరిగిన మార్పులు కారణం. నీడనిచ్చే చెట్లను కొట్టివేశారు, ఇప్పుడంతా ఖాళీగా పైన నీలమైన ఆకాశం మాత్రమే కనిపిస్తుంది. ఇవి ఫోటోలలో బాగా అనిపిస్తాయి, కాని నీడలేని ఆకాశం కింద అంత వేడిలో పనిచేయాలంటే దుర్భరంగా ఉంటుంది. ఉప్పు మడులు కూడా ఇబ్బందిగా మారాయి ఎందుకంటే, “ఇదివరకు యజమానులు తాగునీరు అందుబాటులో ఉంచేవారు, ఇప్పుడు మేము నీళ్లను మా ఇంటి నుంచి బాటిళ్లలో ఇక్కడికి మోసుకురావాలి.” అన్నది ఝాన్సీ. మరి టాయిలెట్ల సంగతేంటి అని నేనడిగితే ఆ ఆడవాళ్లు ఎగతాళిగా నవ్వారు. “మేము ఆ మడుల వెనుక ఉన్న పొలాలలోకి వెళతాము”, అన్నారు. ఎందుకంటే అక్కడ మరుగుదొడ్డి ఉన్నాగాని, వాడుకోడానికి నీళ్లు లేవు.
ఇవే గాక ఉప్పు మడులలో పనిచేసే ఆడవాళ్ళకి ఇంట్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా పిల్లలతో. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆమె వాళ్ళను కూడా తనతో పనికి తెచ్చి ఇక్కడ షెడ్డులో ఒక తూలి , అంటే ఒక గుడ్డ ఉయ్యాల కట్టి పనికి వెళ్లేదాన్నని చెప్పింది రాణి. “కాని ఇప్పుడు నా మనవలను ఇంటివద్దనే వదిలేసి రావలసి వస్తోంది. మడులలో పిల్లలకు స్థానం లేదు అని చెబుతారు”. బాగానే ఉంది కాని, దీని అర్ధం పిల్లలను బంధువుల ఇళ్లలోనో, ఇంటిపక్కవారికో అప్పజెప్పి రావడం, లేక వదిలేసి రావడం కాదు కదా. “చిన్నపిల్లలకు మూడేళ్లు వచ్చాకనే బల్వాడి కి తీసుకెళ్లగలము. అయినా గాని అక్కడ పని వేళలు 9 గంటలకు మొదలవుతాయి. మాకు ఆ సమయాలలో కుదరదు.”
*****
"చూడు నా చేతులు, మగవాడి చేతులలా లేవూ?"
–
మహిళా ఉప్పు మడి కార్మికులు
ఆ ఆడవారు వారి శరీరాల గురించి మాట్లాడే సరికి, వారిలో లేని చురుకు వచ్చేసింది. ఈ పనికి వారు చాలా మూల్యం చెల్లించవలసి వస్తోంది. రాణి తన కళ్ల గురించి చెప్పడంతో మొదలైంది. అలా మెరుస్తున్న తెల్లని ఉప్పుని చూడడం వలన వాళ్ల కళ్ల నుండి నీళ్లు కారతాయి. బాగా కాంతివంతంగా ఉన్నప్పుడు కళ్ళు చికిలించి చూడవలసి వస్తుంది. “వారు మాకు నల్ల కళ్లద్దాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వాళ్లు చాలా తక్కువ డబ్బులు ఇచ్చి వాటితో కొనుక్కోమంటారు. మాకు ఏడాదికొకసారి కాలిజోళ్లు, కళ్లజోళ్లూ కొనుక్కోవడానికి 300 రూపాయిలు ఇస్తారు.”
కొంతమంది ఆడవారు నల్లటి సాక్స్ పాదాల అడుగు భాగంలో రబ్బరు తొడుగుని కుట్టించి వేసుకుంటారు. కాని ఈ మడులలో పని చేసే వారిలో ఒకరు కూడా గాగుల్స్ వేసుకోలేదు. “మంచి కళ్ళజోడు అంటే 1000 రూపాయిల ఖర్చు ఉంటుంది, చవకరకంవి వేసుకున్నా ఉపయోగం ఉండదు, ఇంకా ఇబ్బంది పెరుగుతుంది,” అని చెప్పారు. నలభైయేళ్లు వచ్చేసరికి వారి కళ్ళు ఎలా దెబ్బతిన్నాయో చెప్పారు.
రాణితో పాటు ఇంకా చాలామంది ఆడవారు మాట్లాడసాగారు. వారికి పని నుండి అసలు విరామం అనేది దొరకదు చెప్పారు- తాగడానికి సరిపడా మంచి నీళ్లు ఉండవు, విపరీతమైన ఎండ, వేడి చాలా ఎక్కువగా ఉంటుంది, ఉప్పునీరు వారి చర్మాన్ని పాడు చేస్తుంది. “చూడు నా చేతులను, ముట్టుకో, మగవారి చేతులలా లేవూ?” అందరూ తమ అరచేతులు,వేళ్లు, పాదాలు నాకు చూపించారు. వారి గోర్లు నల్లబడిపోయాయి, వంగిపోయాయి, చేతులకు కాయలు కాచాయి, కాళ్లకు చాలా మచ్చలున్నాయి, మానకుండా ఉన్న చిన్న చిన్న గాయాలు, వారు నీళ్లలోకి దిగినప్పుడల్లా సలుపుతుంటాయి.
మన భోజనాన్ని రుచికరం చేసే పదార్ధం, వారి శరీరాలను తినేస్తోంది.
ఈ జాబితా ఇంకా లోతుకు వెళ్తుంది. గర్భసంచి తీసివేయడం, కిడ్నీల్లో రాళ్లు, హెర్నియా. రాణి కొడుకుకు 29 ఏళ్ళు, గట్టిగా ఉన్నాడు. కాని అతను మోసే బరువుకు అతనికి హెర్నియా వచ్చింది. అతను ఆపరేషన్ చేయించుకుని మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. మరైతే ఇప్పుడు ఏమి చేస్తున్నాడు? “నేను ఇంకా బరువులు మోస్తున్నాను”, అన్నాడు. అతనికి మరో మార్గం లేదు. ఈ ఊరిలో ఇంకా చేయడానికి వేరే పనులు కూడా ఏమీ కనిపించడం లేదు.
కొంతమంది యువకులు ఇక్కడ రొయ్యల యూనిట్లలోనూ పూల ఫ్యాక్టరీలలోను పనిచేస్తారు. కానీ ఉప్పు మడులలో పని చేసేవారు 30 ఏళ్ళ పైబడ్డవారే, వీరు దశాబ్దాల తరబడి ఇక్కడ పని చేశారు. కుమార్ కోపం అంతా వేతనంతోనే. “ఇక్కడ ప్యాకర్లు కాంట్రాక్టు పనివారి వంటివారే, మాకు బోనస్ కూడా రాదు. ఒక ఆమెకు ఒక కిలో ఉప్పును చెరో 25 ప్యాకట్లలో వేసినందుకు 1.70 రూపాయిలు ఇచ్చారు. ఇంకొకామెకు 25 పాకెట్లు సీల్ చేసినందుకు 1.70 రూపాయిలు ఇచ్చారు. (ఒక పాకెట్ 7 పైసల కన్నా తక్కువ). ఆ తరవాత ఇంకో వ్యక్తికి, సాధారణంగా వీరు మగవారే అయుంటారు, ఒక సంచిలో ఈ 25 ప్యాకెట్లను సర్దడానికి, చేత్తో కుట్టడానికి, ఒక వరసలో పెట్టడానికి 2 రూపాయిలు ఇస్తారు. ఆ సంచులు నిలువునా ఎంత ఎత్తులో పేరిస్తే, ఆ పని చేస్తున్న వారి శరీరం మీద అంత భారం ఉంటుంది. కానీ వేతనం 2 రూపాయిలు మాత్రమే ఉంటుంది.”
డాక్టర్ అమలోర్పవనాథన్ జోసెఫ్, వాస్కులర్ సర్జన్ మరియు తమిళనాడు రాష్ట్ర ప్రణాళికా సంఘం సభ్యుడు, వీరి గురించి మాట్లాడుతూ, “వైద్యపరంగా, వారు ఏ పాదరక్షలు తయారుచేసుకుని వాడుతున్నారో, అవి లీక్ ప్రూఫ్ లేదా టాక్సిన్ ప్రూఫ్ కావు. వీటితో ఒకటి రెండు రోజులు పనిచేస్తే ఫర్వాలేదు. కానీ ఇది వారి జీవితకాల వృత్తి అయితే మాత్రం, వారికి శాస్త్రీయంగా రూపొందించిన బూట్లు అవసరం, అవి తరచుగా మారుస్తుండాలి. ఇలా చేయకపోతే వారి పాదాల ఆరోగ్యానికి ఎటువంటి హామీ ఉండదు.”అన్నారు.
ఉప్పు నుండి ప్రతిబింబించే తెల్లటి కాంతితో పాటు, "అలాంటి వాతావరణంలో గాగుల్స్ లేకుండా పని చేయడం వల్ల కళ్ళలో చాలా చికాకులు ఉంటాయి" అని ఆయన చెబుతున్నారు. ఉప్పు మడులలో, క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి, కార్మికులందరి రక్తపోటును తరచుగా తనిఖీ చేయాలని ఆయన సలహా ఇచ్చారు. "130/90 కంటే ఎక్కువ రీడింగ్ ఉన్నవారు ఎవరైనా ఉంటే, నేను వారిని ఉప్పుమడిలో పని చేయడానికి అనుమతించను." అని ఆయన అన్నారు. కార్మికులు ఆ వాతావరణంలో శ్రమిస్తున్నప్పుడు కొంత మొత్తంలో ఉప్పును పీల్చుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రతిరోజూ ఆ ఉప్పు లోడ్‌లను మోసుకెళ్లడం వలన ఐదారు శారీరక శ్రమతో కూడిన పనులు ఉంటాయి. "అక్కడ శక్తి అసాధారణంగా ఖర్చు అవుతుంది." అన్ని చెప్పారు.
ఈ కార్మికులు నాలుగైదు దశాబ్దాలుగా ఈ పనిలో ఉండి ఉండవచ్చు. కానీ ఎటువంటి సామాజిక భద్రత, వేతనంతో కూడిన సెలవులు, శిశు సంరక్షణ లేదా గర్భిణీ ప్రయోజనాలు లేకుండా, వారు 'కూలీలు' (తక్కువ వేతన కార్మికులు) కంటే మెరుగైనవారు కాదని, ఉప్పు మడి కార్మికులు చెబుతున్నారు.
*****
“ఉప్పుకు 15,000 పైనే ఉపయోగాలున్నాయి.”
– ఎం. కృష్ణమూర్తి , జిల్లా సమన్వయకర్త,
తూత్తుకూడి, అసంఘటిత కార్మికుల సమాఖ్య
“USA, చైనా తరవాత భారతదేశమే అతి పెద్ద తయారీదారు.” అన్నారు కృష్ణమూర్తి. “ఉప్పు లేకుండా బతకడం ఇంచుమించుగా అసాధ్యం, అయినాగాని, ఈ పనివారి జీవితాలు వారి పంటంత ఉప్పగా ఉంటాయి.”
కృష్ణమూర్తి అంచనా ప్రకారం తూత్తుకుడి జిల్లాలో 50,000 మంది ఉప్పు కార్మికులు ఉన్నారు. అంటే 7.48 లక్షల మంది కార్మికులున్న జిల్లాలో ప్రతి 15 మందిలో ఒకరు ఈ రంగంలో ఉన్నారు. ఫిబ్రవరి-సెప్టెంబర్ మధ్య దాదాపు 6-7 నెలల కాలంలో మాత్రమే వారికి పని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం వారి సంఖ్య చాలా తక్కువగా 21,528 వరకు ఉంది - ఇది తమిళనాడు రాష్ట్రం మొత్తంలో వారి జనాభా. కానీ కృష్ణమూర్తి అసంఘటిత కార్మికుల సమాఖ్య ఈ విషయంలోనే అక్కరకు వస్తుంది. వారు అధికారిక గణన నుండి మినహాయించబడిన కార్మికులను భారీ సంఖ్యలో నమోదు చేశారు.
ఇక్కడ పని చేసే ప్రతి ఉప్పు కార్మికుడు, ఉప్పు గళ్లను గీరడానికి గాని, లేదంటే ఉప్పును ఎత్తి మోసుకురావడానికి గాని, రోజుకు ఇంచుమించుగా 5 నుండి 7 టన్నుల ఉప్పుని ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి మారుస్తారు. ఈ ఉప్పు టన్నుకు 1600 నుండి 8,000 రూపాయిలు ఖరీదు చేస్తుంది. కానీ ఒక్క అకాల వర్షం ఈ పనిని వారం పది రోజుల పనిని పాడుచేస్తుంది.
కానీ వారిని 1991 తరవాత వచ్చిన సరళీకరణ పాలసీలు ఎక్కువగా దెబ్బ తీశాయి. ఇవి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువయ్యాయి, పెద్ద, ప్రైవేట్ సంస్థలను మార్కెట్లోకి అనుమతించారు. తరాల తరబడి, “దళితులూ, ఆడవారే ఇక్కడి కఠినమైన నేల నుండి ఉప్పు పంటను తెచ్చారు. ఇందులో 70-80 శాతం బలహీనవర్గాల నుండి వచ్చిన వారే. ఈ ఉప్పు మడులను వారికే ఎందుకు లీజుకు ఇవ్వడం లేదు? వారు ఈ నేల కోసం వేసే వేలంపాటలో పెద్ద కార్పరేటులతో ఎలా నెగ్గగలరు?”
కార్పోరేషన్లు ఇటువంటి వాటిలోకి అడుగుపెట్టాక, వీటి పరిమాణం బాగా పెరిగిపోయింది. పదుల ఎకరాల నుండి వేల ఎకరాల వరకు- ఇలా పెరిగాక, ఖచ్చితంగా పనులన్నీ మెషిన్లతో చేయిస్తారని కృష్ణమూర్తి నమ్ముతున్నారు. “మరి 50,000 మంది ఉప్పు కార్మికుల సంగతి ఏంటి?” అని అడుగుతారు.
ప్రతి ఏడాది అక్టోబర్ 15 తరవాత ఇక పని ఉండదు - అప్పుడే ఈశాన్య ఋతుపవనాలు మొదలవుతాయి, ఇవి జనవరి 15 దాకా ఉంటాయి. ఈ మూడు నెలలు అతికష్టంగా సాగుతాయి. కుటుంబాలన్నీ అప్పు చేసి డబ్బు తెచ్చుకుని ఇబ్బంది పడుతూ నడుస్తాయి. ఉప్పు మడులలో పనిచేసే, యాభైఏడేళ్ల ఎం వేలుస్వామి , ఉప్పు తయారీలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడతాడు. “నా తల్లిదండ్రుల కాలంలో చిన్న చిన్న ఉత్పత్తిదారులు ఉప్పును తయారీ చేసి అమ్మేవారు.”
రెండు పాలసీ మార్పులు వీటన్నిటిని నిలిపివేశాయి. 2011 లో కేంద్ర ప్రభుత్వం, మనుషులు తినే ఉప్పులో అయోడిన్ కలపాలని ప్రకటించింది. కొంతకాలం తరవాత ఉప్పు మడులన్నిటికి లీజు ఒప్పందం మార్చింది. ప్రభుత్వానికి ఆ శక్తి ఉన్నది, ఎందుకంటే ఉప్పు మన రాజ్యాంగ యూనియన్ జాబితాలో ఉన్నాది.
2011 భారత ప్రభుత్వ నిబంధన ప్రకారం " అయోడైజ్ చేయబడితే తప్ప , సాధారణ ఉప్పును నేరుగా మానవ వినియోగానికి విక్రయించడం గాని, ఇవ్వడం గాని, బయట కాని అతని ప్రాంగణంలో గాని విక్రయించకూడదు." దీని అర్థం సాధారణ ఉప్పు ఫ్యాక్టరీ ఉత్పత్తి మాత్రమే. (రాతి ఉప్పు, నల్ల ఉప్పు మరియు హిమాలయన్ పింక్ వంటి కొన్ని వర్గాలు మినహాయించబడ్డాయి.) ఈ సాంప్రదాయ ఉప్పు ను పండించేవారు తమ ఏజెన్సీని కోల్పోయాయని కూడా దీని అర్థం. దీనిని చట్టబద్ధంగా సవాలు చేయబడినప్పుడు, సుప్రీం కోర్ట్ ఈ నిబంధనను తీవ్రంగా విమర్శించింది - కానీ ఇప్పుడుకూడా నిషేధం సమర్థవంతంగా అమలులో ఉంది . ఆహారం కోసం ఉపయోగించే సాధారణ ఉప్పును అయోడైజ్ చేయకపోతే విక్రయించబడదు.
ఇక రెండో మార్పు అక్టోబర్ 2013లో అయింది. కేంద్ర నోటిఫికేషన్ లో ఇతర విషయాలతోపాటు: “టెండర్‌ను ఆహ్వానించడం ద్వారా ఉప్పు తయారీకి కేంద్ర ప్రభుత్వ భూమి లీజుకు ఇవ్వబడుతుంది.” అని ఉంది. ఇంకా, ప్రస్తుతం ఉన్న లీజు ఏదీ పునరుద్ధరించబడదు. తాజా టెండర్లు పిలవబడతాయి. లీజు గడువు ముగిసే చోట, ప్రస్తుత లీజుదారు "తాజాగా ఆశించే వారితో కలిసి పాల్గొనవచ్చు." అని ఉంది. ఇది పెద్ద నిర్మాతలకు మాత్రమే అనుకూలమని కృష్ణమూర్తి అన్నారు.
నాలుగు దశాబ్దాల క్రితం, ఝాన్సీ తల్లిదండ్రులు సబ్ - లీజుకు ఆ భూమిని తీసుకుని, నోటిని తవ్వి గిలక సాయంతో ఆ నీటిని తోడి, తాటి ఆకుల బుట్టను బకెట్టుగా వాడి, వారికున్న 10 చిన్న మడులలో వేసేవారు. ప్రతిరోజూ ఆమె తల్లి 40 కిలోల ఉప్పుని ఆమె నెత్తి మీద పెట్టుకుని(తాటి ఆకుల బుట్టలోనే) ఊరిలో అమ్మేది. “ఐస్ కంపెనీలు ఆమె దగ్గర ఉన్న ఉప్పుని 25-30 రూపాయలకు కోనేసేవారు.” వాళ్ళమ్మ వెళ్లలేకపోయినప్పుడు, ఆమె ఝాన్సీకి చిన్న బుట్టను ఇచ్చి పంపేది. ఝాన్సీకి, తాను, 10 పైసలకు కూడా ఉప్పు అమ్మినట్లు గుర్తుంది. “ మా మడులు ఉన్నచోట ఇప్పుడు భవంతులు వెలిశాయి. వాటి పైన ఇళ్లున్నాయి అన్నది,” ఝాన్సీ. “భూమి మా చేతుల్లోంచి ఎలా వెళిపోయిందో మాకు తెలీదు.” ఆమె నీరసంగా అన్నది, ఆమె గొంతులో పశ్చాత్తాపము వినిపిస్తోంది, చుట్టూ ఉప్పు నిండిన గాలి, బరువుగా ఉంది.
తమ జీవితం ఎప్పుడూ కష్టంగానే గడిచింది అంటారు ఉప్పు కార్మికులు. దశాబ్దాల తరబడి తపియోకా, చిరుధాన్యాలు(అరుదుగా బియ్యం తింటారు) మాత్రమే వారి ఆహరం. పక్కనే కొద్దిగా చేపకూర ఉంటుంది. ఇప్పుడందరూ తినే ఇడ్లి , వారు ఏడాదికొకసారి వచ్చే దీపావళి పండుగకు మాత్రమే తింటారు. చిన్నప్పుడు, తరవాత రోజు పండగ కాబట్టి ఇడ్లీలు పెడతారన్న ఉత్సాహంతో తనకు రాత్రంతా నిద్రపట్టలేదని ఝాన్సీ చెప్పింది.
దీపావళి, సంక్రాతి, ఈ రెండు పెద్ద పండగలకు మాత్రమే వారు కొత్త బట్టలు కొనుక్కునేవారు. అప్పటిదాకా, వాళ్లకు పాత చిరిగిపోయిన బట్టలు వేసుకునేవారు. ముఖ్యంగా అబ్బాయిల పాంట్లలో 16 కన్నాలు ఉంటాయి, ప్రతి కన్నమూ సూది దారంతో కుట్టి ఉండేవి.” అన్నది ఝాన్సీ కుడుతున్నట్టుగా చేతులు గాల్లో తిప్పుతూ. కాళ్లకు, తాటి ఆకులతో చేసిన చెప్పులు వేసుకునేవారు, అవి వాళ్ల తల్లి లేక తండ్రి చేతులతో చేసినవి, ఒక నారపోగుతో అవి కదలకుండా కలిపి కుట్టేవారు. ఇది సరిపడా రక్షణ ఇస్తుంది ఎందుకంటే, అప్పటి నీటిలో ఇప్పుడు ఉన్నంత ఉప్పు లేదు. ఉప్పు పరిశ్రమగా మారినప్పుడు, ఇంట్లో వాడే నీళ్లు మొత్తం వాడుకలో అతి చిన్న భాగం మాత్రమే.
*****
“నేను నా పేరు రాయగలను, బస్సు నంబర్లు గుర్తుపట్టగలను, ఎంజీఆర్
పాటలు కూడా పాడగలను.”
– ఎస్. రాణి, ఉప్పు మాది కార్మికురాలు, నాయకురాలు
పని అయిపోయాక, రాణి, సాయంత్రం మమ్మల్ని తన ఇంటికి ఆహ్వానించింది. ఒక చిన్నగదిలో ఒక సోఫా, ఒక సైకిల్, తాడు మీద వేలాడుతున్న కొన్ని బట్టలు ఉన్నాయి. వేడి టీ తాగుతూ ఆమె తనకు 29 ఏళ్ళ వయసులో, రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి జరుగిందని చెప్పింది. ఇది మామూలుగా గ్రామీణ యువతుల వయసుతో పోలిస్తే ఆలస్యంగా జరిగినట్లే. ఆమె కుటుంబంలో పేదరికమే బహుశా ఆ ఆలస్యానికి పెద్ద కారణం కావచ్చు. రాణికి ముగ్గురు పిల్లలు- తంగమ్మాల్, సంగీత, కమల; ఒక కొడుకు, కుమార్, ఆమెతోనే ఉంటాడు.
ఆమెకు పెళ్ళైనా గాని, “మా వద్ద వేడుకలు జరిపించడానికి డబ్బులు లేవు,” అన్నది. ఆ తరవాత ఆమె మాకు తమ ఫోటో అల్బుములు చూపించింది, పిల్లలు రజస్వల అయినప్పుడు వేడుకలు, ఇంకెవరిదో పెళ్లి, కుటుంబమంతా మంచి బట్టలు వేసుకుని ఉండడం, ఆమె కొడుకు కుమార్ పాడడం, డాన్స్ చేయడం ఇవన్నీ వాళ్ళు ఉప్పు మోయడం వలన వచ్చిన డబ్బుతో ఖర్చుపెట్టినవి.
అలా మేము నవ్వుతూ మాట్లాడుతుంటే రాణి ఒక చేత్తో చేసిన పచ్చని వైర్ బాస్కెట్ ని అల్లడం పూర్తి చేసింది. చివరలను బిగదీసి, బుట్టను పట్టుకోడానికి చేతులు కూడా చేసింది. అసలైతే కుమార్ యూట్యూబ్ వీడియోలో చూసి జామకాయ ఆకారంలో అల్లడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు అతనికి ఇవన్నీ చేయడానికి సమయం దొరకదు. ఇంకాస్త సంపాదిన వస్తుందని అతను రెండో షిఫ్ట్ కి కూడా ఉప్పు పనికి వెళ్తాడు. “ఆడవారికి ఇంట్లో ఎప్పుడూ రెండో షిఫ్ట్ ఉంటుంది, వాళ్ళకి అసలు విశ్రాంతి ఉండదు.” అన్నాడు కుమార్.
రాణి కైతే అసలు ఎప్పుడూ విశ్రాంతి దొరకలేదు. ఆమెకి మూడేళ్లు ఉండగానే తన తల్లితో, అక్కతో పాటు ఆమెను సర్కస్ కి పంపారు. “ దీనిని టుటికోరిన్ సోలమన్ సర్కస్ అనేవారు, మా అమ్మ, హై వీల్- ఒక చక్రం మాత్రమే ఉన్న సైకిల్ నడపడంలో ఛాంపియన్. రాణి బార్ లో నేర్పరి, ఆమె అక్క గారడీ చేసేది. మా అక్క టైట్ రోప్ పై కూడా నడిచేది. నేను వెనక్కి వంగి కప్పులను నోటితో అందుకునేదాన్ని.” సర్కస్ ట్రూప్ తో ఆమె మధురై లో, మనప్పారై, నగర్ కోయిల్, పొల్లాచి తిరిగింది.
ఆమెకి ఎనిమిదేళ్లొచ్చినప్పుడు, సర్కస్ మళ్లీ టుటుకోరిన్ కి వచ్చింది. రాణిని ఉప్పు మడులలో పనికి పంపించారు. అప్పటినుండి, ఆ ఉప్పు మడులే రాణి ప్రపంచం అయ్యాయి. అదే రాణి చివరిసారి బడికి వెళ్లడం. “నేను మూడో తరగతి వరకే చదివాను. నేను నా పేరు రాయగలను, బస్సు నెంబర్ చదవగలను, ఎంజీఆర్ పాటలు పాడగలను.” ఆ రోజు పొద్దున్న, రేడియోలో ఎంజీఆర్ పాటతో గొంతు కలిపింది ఆమె.
ఆమె మంచి నర్తకి కూడా, ఆటపట్టిస్తూ అన్నారు ఆమె సహోద్యోగులు. పార్లమెంట్ సభ్యురాలైన కనిమొళి కరుణానిధి అధ్యక్షత వహించిన వేడుకలో పాల్గొన్నదని, ఈ మధ్యే ఆమె చేసిన కరగాట్టం ప్రదర్శన గురించి వారు చెబుతుంటే, రాణి సిగ్గుపడింది. కుళు , మహిళల స్వయం సహాయక బృందానికి, అలాగే ఉప్పు కార్మికుల నాయకురాలిగా రాణి కూడా వేదిక మీద మాట్లాడటం నేర్చుకుంటోంది. అలానే ఆమె ప్రభుత్వా సమావేశాలలో తమ సంఘం తరఫున ప్రాతినిధ్యం వహించడానికి ప్రయాణిస్తుంది. తన సహోద్యోగులు ఆమెను గురించి “ ఈమె ఉప్పు మడుల రాణి”, అంటే ఆమె నవ్వుతుంది.
2017 లో, కృష్ణమూర్తి ఏర్పాటుచేసిన అటువంటి ఒక యాత్రలో, - ఆమె చెన్నై కి వెళ్ళింది. “మేము చాలామందిమి మూడురోజుల పాటు వెళ్లాము. చాలా సరదాగా గడిచింది. మేము ఒక హోటల్ రూమ్ లో ఉన్నాం, ఎంజీఆర్ సమాధిని చూశాము, అన్నా సమాధిని చూశాము. నూడుల్స్, చికెన్, ఇడ్లి, పొంగల్ తిన్నాము. మేము మెరీన బీచ్ కి వెళ్లేసరికి చాలా చీకటైపోయింది కాని అక్కడ చాలా బావుంది!”
ఇంట్లో, ఆమె భోజనం చాలా సాధారణంగా ఉంటుంది. ఆమె అన్నము, కొళంబు ( కూర)- మామూలుగా చేప, ఉల్లిపాయ లేదా చిక్కుళ్లతో చేసుంది. పక్కన నంజుకోవడానికి కరువాడు(ఎండు చేప), ఒక కూరగాయ- క్యాబేజ్ కానీ బీట్ రూమ్ కూడా ఉంటుంది. “మా దగ్గర డబ్బులు లేకపోతే మేము కాఫీ డికాషన్ మాత్రమే తాగుతాము.” ఆమె దానికి ఆరోపించదు. క్రిస్టియన్ అయిన ఆమె చర్చిలకు వెళ్లి అక్కడ కీర్తనలు పాడుతుంది. ఆమె భర్త శేసు చనిపోయాక, ఆమె పిల్లలు ముఖ్యంగా తన కొడుకు ఆమెని బాగా చూసుకుంటున్నాడని చెప్పింది. “ ఒన్నుమ్ కురై సొల్లా ముడియాడు ”. నేను దేని గురించి ఫిర్యాదు చేయలేను. “నాకు దేవుడు మంచి పిల్లలను ఇచ్చాడు.”
ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు, కానుపు రోజు వరకు పని చేస్తూనే ఉంది. ఆ ఉప్పుమడుల నుండే నేరుగా ఆసుపత్రికి వెళ్ళింది. “నా కడుపు ఇక్కడ వరకు ఉండేది అందామె తన మోకాలి పైన ఉన్న తొడను తడుతూ. కానుపు అయిన 13 రోజులకు ఆమె ఉప్పు మడులకు వచ్చేసేది. బిడ్డ ఆకలేస్తే ఏడవకుండా ఉండడానికి ఆమె తపియొక పిండితో పలచని గంజి వంటిది చేసేది. రెండు చెంచాల ఈ గంజి ఒక గుడ్డలో కట్టి, నీళ్లలో ముంచి, వేడి చేసి, ఒక గ్రైప్ వాటర్ బాటిల్లో రబ్బర్ పీకతో ఇస్తే, ఆమె మడి నుండి వెనక్కు వచ్చి ఆ బిడ్డ కు పాలు ఇచ్చే లోపల, ఎవరో ఒకరు ఆ బిడ్డకు ఇది తాగించేవారు.
నెలసరులు కూడా చాలా ఇబ్బంది అయేది, తొడలు కోసుకుపోయి, మంటపుట్టేవి. “సాయంత్రం వేడి నీళ్లతో స్నానం చేసాక, నా తొడలకు కొబ్బరినూనె రాసేదాన్ని, తరవాత రోజు పనికి వెళ్ళడానికి వీలవ్వాలని... ”
ఏళ్ళ తరబడి ఉన్న అనుభవంతో, రాణి, ఉప్పుని చూసి అది ఆహారానికి సంబంధించినదో కాదో చెప్పేయగలదు. మంచి రాతి ఉప్పు ఒకే పరిమాణం ఉన్న రాళ్లతో ఉంటుంది, అతుక్కోదు, నీళ్ళగా కారదు. “అది కనుక అతుక్కునేలా ఉంటే, అది వంటకు బావుండదు.” బామ్ థర్మామీటర్లు, విస్తృతమైన నీటిపారుదల మార్గాలతో శాస్త్రీయంగా తయారు చేయబడిన ఉప్పు ఒకే లక్ష్యంతో నడపబడుతుంది - అధిక మొత్తంలో ఉప్పును పండించడం. ఆ ఉద్దేశం నెరవేరవచ్చు, కానీ ఆ ఉప్పులో ఎక్కువ భాగం పారిశ్రామిక అవసరాలకు సరిపోతుంది, అని ఆమె నాకు చెప్పింది.
*****
"ఉప్పు మందులను వ్యవసాయం లాగ చూడాలి, పరిశ్రమలాగా కాదు.”
– జి. గ్రహదురై, అధ్యక్షుడు, తూత్తుకుడి,
చిన్న తరహా ఉప్పు తయారీదారుల సంఘం
తూత్తుకుడిలోని ఉప్పుమడుల నుండి పెద్దగా దూరం లేని న్యూ కాలనీలోని తన ఎయిర్ కండిషన్డ్ ఆఫీసులో జి. గ్రహదురై, నాకు జిల్లా ఉప్పు పరిశ్రమ పై పెద్ద చిత్రాన్ని అందించారు. అతని సంఘంలో దాదాపు 175 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఒక్కొక్కరికి 10 ఎకరాల భూమి ఉంది. జిల్లావ్యాప్తంగా 25 వేల ఎకరాల్లో ఏటా 25 లక్షల టన్నుల ఉప్పు ఉత్పత్తి అవుతుంది.
సగటున, ప్రతి ఎకరం సంవత్సరానికి 100 టన్నులు చేస్తుంది. బాగా వర్షాలు కురిసిన సంవత్సరంలో,అది 60కి పడిపోతుంది. "ఉప-నేల ఉప్పునీరుతో పాటు, నీటిని పంప్ చేయడానికి మనకు విద్యుత్తు అవసరం, అలానే ఉప్పును తయారు చేయడానికి కార్మికులు అవసరం," అని గ్రహదురై చెప్పారు. కార్మికుల శ్రమవేతనం గురించి, “ఇది పైకి, పైకి, పైకి అలా వెళుతోంది. అంతేగాక, గతంలో ఉన్న ఎనిమిది పని గంటల నుండి ఇప్పుడు కేవలం నాలుగు పని గంటలకు తగ్గిపోతోంది. వారు ఉదయం 5 గంటలకు వస్తారు, ఉదయం 9 గంటలకు వెళ్లిపోతారు, యజమానులు అక్కడికి వెళ్ళినప్పటికీ, అక్కడ కూలీలు కనపడరు.” అన్నారు. పని గంటల విషయంలో ఆయన చెప్పిన లెక్క, కార్మికుల చెప్పిన లెక్క మధ్య చాలా తేడా ఉంది
ఉప్పు మడి కార్మికుల పని, పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయని గ్రహదురై అంగీకరించారు. "నీరు మరియు మరుగుదొడ్లు అందించాలి, కానీ అది రవాణాపరంగా అంత సులభం కాదు, ఎందుకంటే మడులు 100 కిలోమీటర్ల పొడవునా ఉన్నాయి."
తూత్తుకుడి ఉప్పు మార్కెట్ తగ్గిపోతోందని గ్రహదురై చెప్పారు. "గతంలో, ఇది ఎక్కడైనా ఉత్తమమైన తినదగిన ఉప్పుగా పిలువబడేది. అయితే ఇప్పుడు ఇది నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు మాత్రమే వెళుతోంది, సింగపూర్ మరియు మలేషియాకు కొద్దిగా ఎగుమతి చేయబడుతుంది. ఇది చాలా వరకు పరిశ్రమలలో ఉపయోగించబడుతుంది. అవును, వర్షాకాలం తర్వాత మడులను తొలగించిన తరవాత బయటపడే జిప్సం నుండి కొంత చిన్న ఆదాయం వస్తుంది. కానీ ఉప్పు ఉత్పత్తి కూడా వాతావరణ మార్పుల వల్ల, ఏప్రిల్, మే లలో వచ్చే అకాలవర్షాలతో ఎక్కువగా ప్రభావితమవుతుంది.”
గుజరాత్ నుండి గట్టి పోటీ కూడా ఉంది, “అక్కడి వాతావరణం తూత్తుకుడి కంటే వేడిగా, పొడిగా ఉంటుంది. ఇప్పుడు దేశ ఉత్పత్తిలో 76 శాతం ఆ పశ్చిమ రాష్ట్రం నుండే వస్తుంది. వారి ఉప్పు నిల్వలు చాలా పెద్దవి, తయారీ కూడా పాక్షికంగా యాంత్రీకరించబడింది, కొంతవరకు బీహార్ [పేలవంగా-చెల్లించే] వలస కార్మికులు పని చేస్తారు. వారి మడులు ఆటుపోట్ల ద్వారా నిండుతాయి అందువలన విద్యుత్ ఖర్చులు కూడా ఆదా అవుతాయి.” అన్నారు.
తూత్తుకుడిలో టన్ను ఉప్పు ఉత్పత్తి ధర 600 నుండి 700 రూపాయలు, అయితే గుజరాత్‌లో అది 300 మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. "ముఖ్యంగా 2019లో టన్ను ధర అకస్మాత్తుగా 600కి పడిపోయినప్పుడు మనం ఎలా పోటీపడగలము?" దీనిని భర్తీ చేయడానికి, గ్రహదురై, ఇంకా ఇతరులు ఉప్పు తయారీని “వ్యవసాయంగా పరిగణించాలని, పరిశ్రమగా పరిగణించకూడదని కోరుతున్నారు. [అందుకే ఉప్పును 'పంట'గా భావించాలి.]” చిన్న ఉప్పు తయారీదారులకు తక్కువ వడ్డీ రుణాలు, సబ్సిడీ విద్యుత్, ఫ్యాక్టరీలు కార్మిక చట్టాల నుండి మినహాయింపు అవసరం.
“ఇప్పటికే గుజారాత్ నుండి ఓడలు వచ్చి తూత్తుకుడిలో ఉప్పు అమ్మివెళ్లాయి.
*****
“ఏదైనా ఘోరం జరిగితేనే వాళ్లు మా గురించి రాస్తారు”
– మహిళా ఉప్పు కార్మికులు
ఉప్పుమడి కార్మికుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి, అసంఘటిత కార్మికుల ఫెడరేషన్‌కు చెందిన కృష్ణమూర్తి అనేక డిమాండ్లను లేవనెత్తారు. ప్రాథమిక సౌకర్యాలతో పాటు - నీరు, పారిశుధ్యం, విశ్రాంతి స్థలం - పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కార్మికులు, యజమానులు, ప్రభుత్వ ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
“మాకు వెంటనే శిశుసంరక్షణ సౌకర్యాలు కావాలి. ఇప్పుడైతే అంగన్వాడీలు ఆఫీస్ గంటల్లోనే పనిచేస్తాయి(9-5 వరకు). ఉప్పు కార్మికులు 5 గం. లకు ఇల్లు వదిలి పనికి బయలుదేరవలసి వస్తుంది. కొందరైతే అంతకన్నా ముందుగానే బయలుదేరాలి. పిల్లలలో అందరికన్నాపెద్దవారు, ముఖ్యంగా ఆడపిల్ల అయితే, అమ్మ బదులు పిల్లలను చూసుకుంటుంది, కానీ ఆమె చదువు పాడైపోతుంది. అంగన్వాడీలు 5 గం. నుండి 10 గం. వరకు పని చెయ్యొద్దా ఈ పిల్లలను చూసుకోవడానికి?”
కృష్ణమూర్తి తన చిన్ని విజయాలను గురించి చెప్తాడు. జీతాలు కాస్త పెరగడం, బోనస్ లు రావడం వంటివి - ఇవన్నీ కూడా పనిచేసే వారు ఒక బృందంగా మారి, వారి హక్కుల కోసం పోరాడారు కాబట్టి జరిగింది. ఎప్పటినుండో వర్షాల సమయంలో సహాయక చర్యగా 5000 రూపాయిల డిమాండ్ చేస్తున్న వీరికి, ఇప్పుడు 2021 లో తమిళనాడులోని కొత్త DMK ప్రభుత్వం మంజూరు చేసింది. కృష్ణమూర్తి, సోషల్ వర్కర్ ఉమామహేశ్వరి ఒక అసంఘటిత వ్యవస్థను వ్యవస్థీకృతం చేయడం కష్టమని ఒప్పుకున్నారు. ఆరోగ్య సమస్యలన్నీ వృత్తిపరంగా వచ్చినవే. కానీ వారు ఖచ్చితంగా అడుగుతారు, “కొన్ని ప్రాథమిక సామాజిక భద్రతా చర్యలు అందుబాటులోకి తీసుకురాలేమా?" అని.
ఎంతైనా, ఆ ఆడవాళ్లు చెప్పినట్లుగా, ఇక్కడ యజమానులకు మాత్రమే లాభం చేకూరుతుంది. ఝాన్సీ ఉప్పు మడులను తాటి చెట్లతో పోలుస్తుంది. రెండూ గట్టిగా ఉంటాయి, ఎంత ఎండలో ఎండినా, ఎప్పుడూ ఉపయోగకరంగానే ఉంటాయి. ‘ దుడ్డు’ ఆమె అన్నది, డబ్బులగుంచి ప్రస్తావిస్తూ, చాలాసార్లు ఆ మాటను అన్నది- ఈ ఉప్పు మడులు ఎల్లప్పుడూ యజమానులకు డబ్బులను ఇస్తాయి.
“కానీ మాకు ఇవ్వవు. మా జీవితం గురించి ఎవరికీ తెలీదు”, అన్నారు ఈ ఆడవారు, చిన్న కప్పుల్లో టీ తాగుతూ. “ప్రతిచోటా మీరు రైతుల గురించి రాస్తారు. కానీ మేము నిరసన చేస్తే తప్ప మీడియా మాతో మాట్లాడదు.” వాళ్ళ గొంతుకలు పదునెక్కాయి, “ మా గురించి ఏదైనా ఘోరం జరిగితే తప్ప రాయరు. చెప్పండి, అందరూ ఉప్పు వాడరా?”
ఈ పరిశోధన అధ్యయనానికి బెంగుళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం వారి రీసెర్చ్ ఫండింగ్ ప్రోగ్రామ్ 2020లో భాగంగా నిధులు సమకూరుస్తుంది.
అనువాదం: అపర్ణ తోట