మే 4న హరిందర్ సింగ్ తనతో పాటు పని చేసే పప్పుని, చివరి రెండు శవాలను దహనానికి తయారుచేయమని అడిగినప్పుడు తనతో పాటు పని చేసేవారిని అంత ఆశ్చర్య పరిచాననుకోలేదు. అతను మాటలాడిన పదాలు మామూలుగా లేవు.
“దో లౌన్డే లేటే హుయే హై (ఇద్దరు అబ్బాయిలు పడుకుని ఉన్నారు),” అన్నాడు హరిందర్. ఆ మాటలకు అతనితో పనిచేసేవారు ఆశ్చర్యపోయి, అతని ఉత్సాహానికి ఒక్క పెట్టున నవ్వేశారు. నిగమ్ బోధ్ ఘాట్ వద్ద ఉన్న రద్దీయైన స్మశానవాటిక లో ఉదాసీనంగా సాగే ఈ విషాదమైన పనిలో, ఈ వినోదం కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది.
కానీ హరీందర్ నాకు సమాధానం చెప్పుకోవాలని అనుకున్నాడు. అతను తన సహోద్యోగులతో క్రమటోరియం కొలిమివద్ద ఉన్న చిన్న గదిలో రాత్రి భోజనం చేస్తున్నాడు. అతను ఊపిరి తీసుకున్నాడు. ఈ కోవిడ్ మహారోగం మధ్యలో ఊపిరి తీసుకున్న అదృష్టవంతుడు అతను. “మీరు వాటిని శవాలు అంటారు. మేము వాటిని లౌన్డే (బాబులు) అని పిలుస్తాము.” చెప్పాడు.
“ఇక్కడికొచ్చే ప్రతి ఒక్కరు ఎవరికో కొడుకో కూతురో అవుతారు- నాలాగానే,” అన్నాడు పప్పు. “వాళ్ళని కొలిమి వద్దకు తీసుకెళ్లాలంటే బాధగా ఉంటుంది. కానీ మేము వారి ఆత్మ కోసం ఆ పని చెయ్యాలి, కదా.” ప్రతి నెలా నిగమ్ బోధ్ లో - CNG కొలిములలోను, కట్టెల పైనా 200 పైగా శవాలని వారు దహనం చేస్తారు.
ఆ మే 4 న నిగమ్ బోధ్ ఘాట్ లో 35 శవాలను CNG కొలిమిలో కాల్చారు. రెండో వేవ్ ఢిల్లీని తన గుప్పెట్లో నలిపేస్తున్నవేళ, ఏప్రిల్ 1 నుంచి మొదలైన సగటు రోజు లెక్కతో చూస్తే ఈ రోజు తక్కువ శవాలు వచ్చినట్టు. కానీ మహారోగానికి ముందు ఈ దహనాస్థలం లోని CNG కొలిములు నెలకు 100 శవాలనే కాల్చేవి.
ఘాట్ ప్రవేశద్వారం వద్ద, యమునా నది ఒడ్డున, ఢిల్లీ లోని కాశ్మీర్ గేట్ వద్ద, ఒక పెద్ద కుడ్యచిత్రం ఉంది. “నన్ను ఇక్కడికి తీసుకు వచ్చినందుకు కృతఙ్ఞతలు. ఇక పై నాది ఒంటరి పయనం.” అని రాసి ఉంది. కానీ కోవిడ్ 19, ఏప్రిల్ మే నెలలలో రాజధాని మీద స్వైరవిహారం చేసినప్పుడు, చనిపోయినవారు ఒంటరిగా వెళ్లిపోలేదు. మార్గంలో వారికి స్నేహితులు దొరికే ఉంటారు.
లోపలికి వెళుతున్నప్పుడు, కలుషితమైన యమున నుండి వచ్చే వాసనలతో పాటు మృతదేహాలను కాల్చే దుర్వాసన కూడా డబుల్ మాస్క్ ద్వారా నా ముక్కులోకి చొచ్చుకుపోయింది. నదికి దగ్గరగా దాదాపు 25 శవాలు కాలుతున్నాయి. నది ఒడ్డుకు దారితీసే ఇరుకైన దారి వెంబడి రెండు వైపులా ఇంకా ఎక్కువ ఉన్నాయి - కుడివైపు ఐదు శవాలను దహనం చేస్తున్నారు, ఎడమవైపు మూడు శవాలను దహనం చేస్తున్నారు. కాలుతున్న శవాల కన్నా తమ వంతు కోసం ఎదురుచూసే శవాలే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.
అక్కడ భూమిని సమం చేసి ఒక తాత్కాలిక దహనాస్థలాన్ని తయారు చేశారు. దీనిలో మొత్తం 21 జాగాలు ఉన్నాయి కానీ అవి సరిపోవు. మధ్యలో ఒక చిన్న చెట్టు ఉంది. దాని ఆకులు శవాలను దహనం చేసినప్పుడు రేగిన మంటల వలన కాలిపోయున్నాయి. ఇది కాఫ్కా రాసిన ఘట్టం లాగా అర్ధం లేకుండా భయపెట్టేట్లు, కలవరపెట్టేట్లు ఉంది
అక్కడున్న పనివారికి ఆ విషయం కూడా తెలుసు. అక్కడ హాళ్ల లోపల, CNG కొలిమిలు ఉన్నచోట, వారు పని చేసే ప్రదేశాలలో, మనుషులు నుంచుని ఉన్నారు- వారు నడుస్తూ కళ్ళు తుడుచుకుంటున్నారు, బాధపడుతూ, పోయిన వారి ఆత్మశాంతికై ప్రార్థిస్తున్నారు. అక్కడ ఉన్న వెయిటింగ్ ఏరియాల్లో వెలుగుతూ ఆరుతూ ఉన్న ట్యూబ్ లైట్లను ఎవరూ వాడడం లేదు.
“ఇక్కడ ఉన్న ఆరు కొలుములలో మూడింటిని పోయిన ఏడాది కరోనా(2020) వచ్చాకే అమర్చారు. కరోనా వలన చనిపోయినవారి శవాలు అలా పోగయిపోయేసరికి వీటిని కూడా కొనవలసి వచ్చింది.” అని పప్పు అన్నాడు. కోవిద్-19 మహారోగం తరువాత, ఈ CNG కొలిములు కోవిడ్ వలన చనిపోయిన వారిని మాత్రమే ఇక్కడ దహనం చేశాయి.
దహన సంస్కారాల కోసం శవాలని, దానితో పాటు ఉన్న వ్యక్తులు , అంటే ఆసుపత్రి సిబ్బంది లేదా దహన కార్మికులు కొలిమికి తీసుకువచ్చారు. వేరే శవాల కన్నా ఎక్కువ అదృష్టం చేసుకున్న శవాలు తెల్లని వస్త్రంతో కప్పి ఉన్నాయి. మిగతా వాటిని తెల్లటి ప్లాస్టిక్ బస్తాలలో ప్యాక్ చేసి నేరుగా అంబులెన్స్ నుంచి తీసుకువచ్చారు. కొన్నింటిని స్ట్రెచర్లపై తీసుకువచ్చారు, మరికొందరిని భవనంలోకి తీసుకువచ్చారు.
దహన కార్మికులు మృతదేహాన్ని చక్రాలతో కూడిన ప్లాట్‌ఫాం పైకి ఎత్తి, కొలిమిలోకి వెళ్లే ట్రాక్ లో ఉంచారు. ఇక తరవాత పని చురుకుగా జరగాలి. మృతదేహాన్ని కొలిమిలోకి నెట్టివేసిన తరువాత, కార్మికులు ప్లాట్‌ఫాంను వేగంగా బయటకు తీసి కొలిమి తలుపును మూసివేసి బోల్ట్ చేశారు. కన్నీటితో కుటుంబ సభ్యుల ముందు నుంచి, తమ ప్రియమైనవారు ఆ కొలిమిలోకి జారి మాయమయింది. పెద్ద చిమ్నీ నుండి పొగ లేచి ఆకాశం లో నల్లటి మేఘాలుగా మారుతోంది.
"రోజు మొదలైనప్పుడు, మొదటి శరీరం(శవం) పూర్తిగా కాలిపోవడానికి రెండు గంటలు పడుతుంది" అని పప్పు నాకు చెప్పాడు, "కొలిమి వేడెక్కడానికి సమయం పడుతుంది. ఆ తరువాత ఒక్కొక్క మృతదేహం కాలడానికి గంటన్నర పడుతుంది.” ప్రతి కొలిమి ఒక రోజులో 7-9 మృతదేహాలను దహనం చేయగలదు.
నిగమ్ బోధ్ ఘాట్‌లోని కొలిమిలను నలుగురు కార్మికులు నిర్వహిస్తున్నారు - అందరూ ఉత్తర ప్రదేశ్‌లోని షెడ్యూల్డ్ కులమైన కోరి వర్గానికి చెందినవారు. అందరికన్నా పెద్దవాడైన 55 ఏళ్ల హరీందర్ యూపీలోని బల్లియా జిల్లాకు చెందినవాడు. అతను 2004 నుండి ఇక్కడే పనిచేస్తున్నాడు. యుపి యొక్క కాన్షిరామ్ నగర్ జిల్లాలోని సోరన్ బ్లాక్ నుండి వచ్చిన 39 ఏళ్ళ పప్పు 2011 లో ఇక్కడ పనిలో చేరాడు. మిగిలిన ఇద్దరు, రాజు మోహన్, 37, రాకేష్ (28) కూడా సొరన్ కు చెందిన వాళ్ళే. ఇప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరారు.
ఏప్రిల్ మే నెలలలో వారు, తమ ప్రాణాలను పణంగా పెట్టి, ఉదయం 9 గంటల నుండి అర్ధరాత్రివరకు అంటే రోజుకు 15-17 గంటలు పని చేసి, వచ్చిన పనిభారాన్నినిభాయించారు. వాళ్ళు వైరస్ ను తప్పించుకున్నా 840 డిగ్రీల వేడి వారిని కరిగించేసేది. “రాత్రి పూట కొలిమి స్విచ్ ఆఫ్ చేసి ఒక శవాన్ని ఉంచితే పొద్దుటి పూటకు బూడిద మాత్రమే మిగిలేది”, అని చెప్పాడు హరిందర్.
పైగా వారు అసలు సెలవలు అనేవే లేకుండా పనిచేస్తున్నారు. “ఎలా తీసుకోము(సెలవుని)? అసలు మాకు నీళ్లుగాని, టీ గాని తాగే తీరికే లేదు.” అన్నాడు పప్పు. “మేము 2 గంటలు కూడా ఇక్కడ లేకపోతే గందరగోళం అయిపోతుంది.”
అయినా ఎవరిదీ పర్మనెంట్ ఉద్యోగం కాదు. నిగమ్ బోధ్ ఘాట్, బడి పంచాయత్ వైశ్య బీసే అగర్వాల్ ( సంస్థ అని పిలుస్తారు) వారి సేవాసంస్థ. వీరు ఇక్కడ ఒక మునిసిపల్ క్రమాటోరియాన్ని నడుపుతున్నారు.
ఈ సంస్థ హరిందర్ కి నెలకి 16000 రూపాయల ఇస్తుంది. అంటే రోజుకు 533 రూపాయిలు లేదా శవానికి 66 రూపాయిల లెక్క కట్టొచ్చు. పప్పు కి 12000 రూపాయిలు వస్తాయి, రాజు మోహన్ కి, రాకేష్ కి నెల కు 8000 వస్తాయి. “ సంస్థ మా జీతాలను పెంచుతానంది, కానీ ఎంత అనేది చెప్పలేదు”. అన్నాడు హరిందర్ నాతొ.
సంస్థ శవానికి 1500 రూపాయిలు తీసుకున్నా(కోవిడ్ కి ముందు 1000 రూపాయిలు తీసుకునేది) జీతం పెంచే ఛాయలు ఏమి కనిపించడం లేదు. “మేము వారి జీతాలు పెంచితే, ఇంక సంవత్సరం పొడుగునా ఆ పెంచిన జీతాన్నే ఇవ్వవలసి వస్తుంది. అందుకే మేము ఇన్సెంటివ్స్(ప్రోత్సాహకాలు) ఇస్తాము.” అని సంస్థ జనరల్ సెక్రటరీ సుమన్ గుప్త చెప్పాడు.
కానీ అతను ఆ కొలిమి పక్కనే ఉన్న చిన్న గది గురించి ప్రస్తావించలేదు. అది కొలిమికి సరిగ్గా 5 మీటర్ల దూరం లో ఉంది . ఆ గది ఒక ఇటుక బట్టీలా ఉంది. అందుకని పప్పు బయటికి వెళ్లి మా అందరికి కూల్ డ్రింకులు తెచ్చాడు. దానికి 50 రూపాయిలు అయింది. ఆ రోజు ఒక శవాన్ని దహనం చేసినందుకు అతనికి వచ్చిన డబ్బులవి.
ఒక శవం పూర్తిగా దహనమవడానికి 14 కిలోల CNG అవసరమవుతుందని చెప్పాడు పప్పు. మొదటగా దహనం చేసే శవానికి మన ఇళ్లలో వాడే రెండు సిలిండర్లంత గ్యాస్ కావాలి. తరవాత దహనం చేసే శవాలకి అంత గ్యాస్ అవసరం ఉండదు. ఒకటి, ఒకటిన్నర సిలిండర్లు సరిపోతాయి. “ ఏప్రిల్ లో నిగమ్ బోధ్ CNG కొలిములు 543 శవాలని కాల్చాయి”, అని చెప్పాడు గుప్త. ఆ నెల సంస్థ CNG బిల్లు 3,26,960 రూపాయిలు వచ్చింది.
కొలిమి తలుపుని తెరిచి ఒక పొడుగు కర్రతో కాలుతున్న శవాన్ని కడిపి, మెషిన్ లోపలికి తోస్తారు. “అలా చేయకపోతే మొత్తం శవం కాలే సమయం రెండు మూడు గంటలు ఎక్కువ పడుతుంది,” అన్నారు హరిందర్. “మేము CNG పొదుపు చెయ్యాలంటే ఈ పని తొందరగా చెయ్యాలి. లేదంటే సంస్థ ఈ నష్టాన్ని భరించవలసి వస్తుంది.”
సంస్థ ఖర్చుల్ని తగ్గించడానికి వారంత కష్టపడినా, అక్కడ పని చేసేవారి జీతాలు రెండేళ్ల బట్టి పెంచలేదు. “మేము కోవిడ్ వచ్చి చనిపోయినవారి శవాలని కాలుస్తున్నాము, మా ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి.” అన్నాడు పప్పు, ఇంకా జీతాలు పెంచలేదన్న అసంతృప్తి తో. “ ‘సంస్థ విరాళాల పై నడుస్తుంది, ఏం చేయగలము’, అని అడుగుతారు” అని చెప్పాడు హరిందర్. నిజంగానే వారికోసం ఏమి చేయలేదు.
వారు టీకాలు పూర్తిగా వేయించుకోలేదు. సంవత్సర మొదలులో ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఇచ్చే వాక్సినేషన్ ఇచ్చినప్పుడు పప్పు కి, హరిందర్ కి మొదటి డోసు పడింది. “రెండో డోసు కోసం వెళ్ళటానికి సమయం లేక వెళ్ళలేదు. నేను ఇక్కడే పనిలో పడిపోయాను.” అన్నాడు పప్పు. “మళ్లీ రెండ డోసుకు నన్ను రమ్మని నాకు ఫోన్ వచ్చినప్పుడు, నేను వాక్సినేషన్ సెంటర్ లో ఉండే మనిషికి, మరెవరికైనా వాక్సిన్ ఇవ్వమని చెప్పాను.”
ఆ రోజు ఉదయమే పప్పు కొలిమివద్ద వాడి పడేసిన PPE కిట్ ని చూసాడు. ముందురోజు వచ్చిన వారెవరో దానిని వదిలేసి వెళ్లారు. వచ్చిన వారికి PPE కిట్లను బయట ఉన్న కుండీలో పడేయమని చెప్పినా, చాలామంది వాటిని హాల్ లో పడేసి వెళ్లిపోయారు. పప్పు అవన్నీ ఒక కర్ర తో లాగి బయట పడేసి వచ్చాడు. అతను PPE వేసుకోలేదు, కనీసం చేతికి గ్లవ్స్ కూడా లేవు.
పప్పు ఆ కొలిమి వేడి వద్ద PPE కిట్ ని భరించలేము, అని చెప్పాడు. “అంతేగాక, కొలిమి వద్ద పనిచేస్తున్నప్పుడు PPE కిట్ కి మంట అంటుకునే అవకాశం చాలా ఉంది, ఎందుకంటే ఆ డోర్ నుండి కాస్త మంట అప్పుడప్పుడు బయటకి వస్తుంది. అప్పుడు కడుపు కాలిపోవచ్చు. ఆ సమయం లో PPE కిట్ తీయ్యడానికి సమయం పడుతుంది. తీసే సమయానికి కాలి చనిపోవచ్చు కూడా.” అని వివరించాడు. హరిందర్ చెప్పాడు. “ఆ కిట్ వేసుకోవడం వలన ఊపిరి ఆడదు. నాకైతే చచ్చిపోవాలని లేదు.”
వారికి ఉన్న రక్షణ, మాస్క్ ఒకటే, అది రోజుల తరబడి వేసుకుంటున్నారు. “మాకు వైరస్ వ్యాపిస్తుందని బాగా ఆందోళనగా ఉంది. కానీ ఈ కష్టకాలం లో వెనకడుగు వేయలేము కదా,” అన్నాడు పప్పు. “మనుషులందరూ బాధల్లో ఉన్నారు, వారిని అలానే వదిలేయలేము.”
ఈ ప్రమాద సూచనలు ఇక్కడతోనే ఆగలేదు. ఒకసారి శవాన్ని దహనం చేస్తున్నప్పుడు పప్పు ఎడమ చేయి మంటల్లో చిక్కుకుని మచ్చని మిగిల్చింది. “నాకు చాలా నొప్పి, మంటా పుట్టింది. కానీ ఏం చెయ్యను? నేను వారిని కలవబోయే ఒక గంట ముందు హరిందర్ కి దెబ్బ తగిలింది. “ఆ తలుపు మూస్తున్నప్పుడు నా మోకాలుకి గట్టిగా తగిలింది.” అని అతను చెప్పాడు.
“ఆ కొలిమి తలుపు హేండిల్ విరిగిపోయింది. ఒక కర్రని కట్టి దానినే వాడుతున్నాము”, అన్నాడు రాజు మోహన్. “మేము మా సూపెర్వైజర్ ని డోర్ రిపేర్ చేయించమని అడిగాము. ‘కానీ లాక్ డౌన్ లో ఎలా రిపేర్ చేయించగలము,’ అని ఆయన అడిగాడు. ఏమీ చేయించలేరని మాకు తెలుసు.” అన్నాడు హరిందర్.
వారి వద్ద ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా లేదు.
ఇప్పుడు కొత్త ప్రమాదాలున్నాయి. బంధువులు శవాన్ని కొలిమిలోకి పంపే ముందు దాని మీద పొసే నెయ్యి, నీళ్ళ వాళ్ళ వారు జారిపడొచ్చు. “అసలు అలా చేయడానికి అనుమతి లేదు. పైగా అది అపరిశుభ్రమైన పని, ప్రమాదం కూడా. కానీ వారు వినిపించుకోరు”, అన్నాడు అమర్ సింగ్, ఆయన నిగమ్ బోధ్ ఘాట్ లో మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ లో అధికారి. ఈ మహారోగ సమయం లో నియమించబడిన ఏడుగురు MCD సూపర్వైజర్లలో ఒకరు.
సాయంత్రం ఎనిమిది గంటల లోపల వచ్చిన శవాలను ఆ రోజే కాల్చేస్తారు, అని చెప్పాడు సింగ్. ఆ తరవాత వచ్చేవాటిని మరుసటి రోజు ఉదయం వరకు ఆపుతారు. కానీ ఎవరూ వాటిని చూసుకోరు. అందుకని రాత్రంతా ఉంచేసరికి అంబులెన్సు చార్జీలు పెరిగిపోతాయని చెప్పారు. “దీనికి పరిష్కారం, కొలిమి ని 24 గంటలు నడపడమే”, అని చెప్పారు.
కానీ అది జరుగుతుందా? “ఎందుకు కుదరదు?” అని అడుగుతాడు సింగ్. “చికెన్ ని తందూర్ లో వేసినప్పుడు, ఆ తందూర్ ఏమి పాడవదు కదా. ఈ కొలిములు 24 గంటలు పనిచేయగల సత్తా ఉన్నవే. కానీ సంస్థ ఆ విషయాన్ని ఒప్పుకోదు”. పప్పు కి ఆలోచన నచ్చలేదు. “మెషిన్ కి కూడా మనిషి లానే కొంచెం రెస్ట్ కావాలి.” అన్నాడు.
సింగ్, పప్పు ఇద్దరూ - క్రమటోరియం లో పని చేసే వాళ్ళ అవసరం చాలా ఉందని ఒప్పుకున్నారు. “ఒకవేళ ఇక్కడ పనిచేసే వారికేమైనా ఐతే, ఇక్కడ నత్తనడకగా అయినా, సాగుతున్న పనులు పూర్తిగా ఆగిపోతాయి.” అన్నాడు సింగ్, ఈ పనివారికి బీమా కూడా లేదని చెబుతూ. పప్పు ఆలోచనలు వేరేగా ఉన్నాయి. “ఇక్కడ నాలాగా హరిందర్ లాగ వేరే పనివారుంటే, పని సాఫీగా గడిచిపోతుంది, మాకు కూడా కాస్త విశ్రాoతి దొరుకుతుంది,” అని చెప్పాడు.
వారికేమన్నా అవుతుందని భయం లేదా అని అడిగితే, ఆయన నెమ్మదిగా అన్నాడు. “ఆ మిగిలిన ముగ్గురు పనిచేస్తారు. లేదంటే బయటనుండి పనివాళ్ళని తెచ్చుకుంటాము. ఆ వర్కర్లకు ప్రోత్సాహకాలు ఇస్తాము. వాళ్లకి తిండి, మందులు, శానిటైజర్ లు ఇస్తాము.” అన్నాడు.
ఆ తరువాత హరిందర్ తనతో పనిచేసే వారితో కలిసి ఆ చిన్న గదిలో రాత్రి భోజనం చేశాడు. పక్కనే ఉన్న కొలిమి లో ఒక శవం కాలుతూ ఉంది. పనివాళ్ళు కొంచెం విస్కీ తాగారు. “మేము తాగాలి. అది లేకుండా మేము బతకలేము.” చెప్పాడు హరిందర్.
మహారోగానికి ముందు వాళ్ళు మూడు పెగ్గుల విస్కీ తో సరిపెట్టేవారు. ఒక పెగ్గు 60 ml. కానీ ఇప్పుడు వారు రోజంతా తాగే పని చెయ్యాలి. “పొద్దున్న ఒక క్వార్టర్(180 ml), మధ్యాహ్నం భోజనానికి ముందు అదే, సాయంత్రం, రాత్రీ కూడా అంతే. కొన్ని సార్లు మేము ఇంటికి వెళ్ళాక కూడా తాగుతాము.” అన్నాడు పప్పు. “మంచి విషయం ఏంటంటే సంస్థ మమ్మల్ని తాగొద్దని చెప్పదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళే మాకు మందు ఏర్పాటు చేస్తారు.” అన్నాడు హరిందర్.
చనిపోయిన ఒక మనిషిని కాల్చడానికి చాలా బాధ, కష్టం పడాలి. ఆల్కహాల్ సేవించడం వలన దాని నుంచి ఉపశమనం దొరుకుతుంది. “వాళ్ళు చనిపోయారు. మేము కూడా చనిపోయాము, ఎందుకంటే ఇక్కడ పని చేయడం చాలా కష్టంగా ఉంటుంది.” అన్నాడు హరిందర్. “నేను కాస్త తాగాకే శవాలని చూస్తాను.” అన్నాడు పప్పు. “దుమ్ము, పొగ మా గొంతులో ఇరుక్కున్నా , మందు తాగినప్పుడు అదంతా గొంతులోంచి జారిపోతుంది.”
ఈ కాస్త ఆటవిడుపు గడిచిపోయింది. ఇక పప్పు వెళ్లి పడుకున్నఆ ఇద్దరు అబ్బాయిల సంగతి చూడాలి. “మేము కూడా ఏడుస్తాము. మాకూ కన్నీళ్లొస్తాయి.” అన్నాడు. అతని గొంతు బాధతో పూడుకుపోయింది, కళ్ళలో చెమ్మ చేరింది. “ కానీ మేము మా మనసును గట్టిగా కాపాడుకోవాలి.”
అనువాదం : అపర్ణ తోట