మొహమ్మద్ ఘోసుద్దీన్ అజీమ్ దుకాణంలో రంగురంగు కాగితాలు, పెళ్ళి శుభలేఖల కార్డులు, పోస్టర్లు సూదులకి గుచ్చి ఒక తాడుకి వేలాడదీసున్నాయి. ఎండిన వెదురుతో చేసిన తన “కలం” (పెన్ను)తో తెల్లటి కాగితం మీద మొదటగా “అల్లాహ్” అని ఉర్దూలో రాశారు. ఆయన ఏ పనైనా దీనితోనే మొదలుపెడతారు. “నేను 28 ఏళ్ళ బట్టీ నగిషీకారుడిగా (కాలీగ్రాఫర్) పనిచేస్తున్నాను. నేను సౌదీ అరేబియాలో పని చేస్తున్నప్పుడు ఈ కళని నేర్చుకున్నాను. . 1996లో ఇండియాకు వాపసు వచ్చాక ఈ దుకాణం షురూ చేశాను.” అని చెప్పారు.
నలభై నాలుగేళ్ల అజీమ్, హైదరాబాదు నడిబొడ్డులో నివసిస్తుంటారు. ఆయన దుకాణం చార్మినారు దగ్గర చట్ట బజారులోని జమల్ మార్కెటులో ఒక మూడంతస్థుల భవనంలో ఉంది.. నగరంలోని పాత మార్కెట్టుల్లో అది ఒకటి. ప్రింటింగు షాపులకి అది ఒక అడ్డా. శతాబ్దాల పురాతన కళ అయిన “ ఖత్తాతి ” (ఉర్దూ, అరబిక్ అక్షరాలను అందంగా, అలంకారప్రాయంగా రాయడం) అక్కడ సాధన చేస్తూ ఉంటారు.
ఖత్తాతి దక్కను ప్రాంతంలో ఉన్న ఖుతుబు షాహీ రాజుల కాలం (1518-1687) నాటిది. చరిత్ర ప్రకారం, ఈ కళాకారులు (వీళ్ళని కత్తాత్ లేదా కాతిబ్ అని అంటారు) ఖురానుని అరబిక్కు, ఉర్దూలలో నగిషి చెక్కారని చెప్తారు. ఇలా చేతితో రాసిన ఖురానులు హైదరాబాదు, దాని పరిసర ప్రాంతాల్లోని మ్యూజియంలలో ఉన్నాయి. ఖుతుబ్ షాహీ కాలంనాటి కట్టడాలలో కూడా ఖత్తాతిని చూడవచ్చు. ఇప్పుడు మాత్రం ప్రజలు ఉర్దూ నగిషీ పనిని ఖుష్ ఖత్ (మంచి దస్తూరి)గానే చూస్తున్నారు, ఏవో ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే చట్ట బజారులోని చేయితిరిగిన కళాకారుల కోసం వెతుక్కుంటూ వస్తున్నారు. ఉర్దూ పాఠశాలలు, మదర్సాలు కూడా తన లోగోలు డిజైను చేయించుకోడానికి అప్పుడప్పుడు వస్తుంటారు..
అజీమ్ చుట్టూ చాలా సందడిగా - పనివాళ్ళు కాగితాలను తిరగేస్తూ ఉండడం, కస్టమర్ల అరుపులు, ప్రింటింగు మెషీన్ల సన్నని రొద - ఉన్నా ఆయన మాత్రం గమ్మున పనిజేసుకుంటూ ఉన్నారు. “జనాలు నన్ను గొప్ప నగిషీకారుడు అన్నా గాని, నన్ను నేను ‘ఈ కళని సాధన చేసేవాడిని’ అనే అనుకుంటాను,” అని అంటారాయన. “ ఖత్తాతి అంటే వ్యాకరణం. ప్రతి ఫాంటుకి, ప్రతి అక్షరానికి ఒక వ్యాకరణం ఉంటుంది - ఎత్తు, వెడల్పు, లోతు.”
అజీమ్, చట్ట బజారులోని తక్కిన ఖాతిబుల్లా , రోజుకి ఎనిమిది గంటలు, వారానికి ఆరు రోజులు పనిచేస్తారు. “అరబిక్కులో దగ్గర దగ్గర 213 ఖత్తాతి ఫాంట్లు ఉన్నాయి. వాటన్నింటిని సరిగ్గా నేర్చుకోవాలంటే కనీసం ముప్ఫై ఏళ్ళు పడుతుంది. వాటిలో నిపుణత రావాలంటే ఒక జీవితకాలపు సాధన కూడా సరిపోదు. ”
కాలీగ్రాఫర్లు పెళ్ళి శుభలేఖలో ఒక పేజీ డిజైనుకి దాదాపు రూ. 200-300 వరకు తీసుకుంటారు. దానిని వారు 45 నిమిషాల్లో తయారుచేయగలరు. కస్టమర్లు ఈ డిజైనుని తీసుకొని దగ్గర్లో ఉన్న ప్రింటింగు ప్రెస్సులో కాపీలు తీయించుకుంటారు. ఇప్పుడు పాత బస్తీలో కేవలం పది ఖాతిబులే మిగిలారు (వాళ్ళ సొంత అంచనాల ప్రకారం). పని ఎక్కువగా ఉన్న రోజుల్లో ఒక్కోరికి పది డిజైన్ల పని రావచ్చు.
చాలామంది ఈ పనిని వదిలేశారు, చార్మినారు దగ్గర ఘణి బజారులో ఉండే యాభై మూడేళ్ల అఫ్జల్ మొహమ్మద్ ఖాన్, 1990లో వదిలేసినట్టు. “మా నాన్న ఘౌస్ మొహమ్మద్ ఖాన్ ఆయన జమానాలో ఒక గొప్ప నగిషీకర్త” అని చెప్పారు. “వందలాది విద్యార్థులకి ఆయన “ఇదర-ఎ-అదబియాత్-ఎ-ఉర్దూ” (హైదారాబాదులో పంజగుట్ట ప్రాంతంలో కాలీగ్రాఫీ కోసం ఉన్న ట్రైయినింగ్ సెంటరు)లో నేర్పించేవారు. మేమిద్దరం సియాసత్ (ఉర్దూ దినపత్రిక)కు పనిచేసేవాళ్ళం. కానీ కంప్యూటర్లు వచ్చాక, నా ఉద్యోగం పోయింది. నేను అడ్వర్టైజింగులో పనిచేయడం మొదలెట్టాను. ఈ కళ కొన్నేళ్ళల్లో చచ్చిపోతుంది. మేము ఈ కళను సాధన చేసే ఆఖరి తరం వాళ్ళం” అని ఆయన, కొంత నిరాశగా చెప్పారు.
1990-మధ్య నాటికి ఉర్దూ ఫాంటులు కంప్యూటర్ల ద్వారా చేయడంతో కస్టమర్లు డిజిటల్ ప్రింటింగ్ వైపు మొగ్గు చూపారు. ఫలితంగా, కాలీగ్రాఫర్లకి డిమాండు తక్కువైపోయింది. సియాసత్ లాంటి దినపత్రికలు కూడా డిజిటల్ అయిపోయి, ఒకరిద్దరు కాలీగ్రాఫర్లను మాత్రమే పతాక శీర్షికలు రాయడానికి ఉంచారు. తక్కినవారంతా ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. కొందరు పెళ్ళి కార్డులు, లోగోలు, పోస్టర్లు, సైన్-బోర్డులు చేయడానికి చట్ట బజారులో చిన్న దుకాణాలు మొదలుపెట్టారు.
ప్రభుత్వం నుండి ఈ కళను కాపాడడానికి ఎలాంటి సహాయసహకారాలు లేవు గనుక, ఈ ఖత్తాతి దారుణమైన స్థితిలో ఉందని, అంతరించిపోయే ప్రమాదంలో ఉందని కాలీగ్రాఫర్ల అభిప్రాయం. దానికి తోడు, యువతలో కూడా ఈ కళపై ఆసక్తి లేదు -, దీని మీద అంత శ్రమ వెచ్చించలేక, నేర్చుకునే కొద్ది మంది వదిలేస్తున్నారు. ఇతురులు ఇది దండుగ పనిగా, భవిష్యత్తులో అక్కరకు రానిదానిగా భావిస్తున్నారు.
కానీ, ముప్ఫైలలో ఉన్న మొహమ్మద్ ఫహీమ్, జైనుల్ అబెదీన్ అలా కాదు. వారి తండ్రి మొహమ్మద్ నయీమ్ సబేరి 2018లో చనిపోయారు. ఆయన నైపుణ్యం గల కాలీగ్రాఫరని, ఉర్దూ, అరబిక్ కాలీగ్రాఫీలో వేర్వేరు రంగులు వాడిన మొదటి వ్యక్తుల్లో ఒకరని ఆయన కుమారులు, చట్ట బజారులో తక్కినవారు నాకు చెప్పారు. ఆయన పెట్టిన షాపునే ఇప్పుడు ఆయన కొడుకులు నడుపుతున్నారు. వాళ్ళు ఉర్దూ, అరబిక్ యే కాక ఇంగ్లీషు కాలీగ్రాఫీలోనూ నైపుణ్యం సాధించారు. వారికి - కువైట్, సౌదీ అరేబియా, ఇంకా వేరే దేశాలలోనూ క్లైంట్లు ఉన్నారు. వారికి సందర్భాన్ని బట్టి,పెద్ద ఫ్రేముల్లో ఉర్దూ కాలీగ్రాఫీ చేసి ఇస్తుంటారు,.
ఆ రోజుకి పని పూర్తవ్వగానే, చట్ట బజారులోని కాలీగ్రాఫర్లు తమ కలాలని జాగ్రత్తగా, వరుసలో పెట్టుకున్నారు. ఇంకు బాక్సులను పక్కకు పెట్టారు. ఇంటికెళ్ళే ముందు నమాజు చదివారు. నేను అజీమ్‍ను అడిగాను ఈ కళ త్వరలో అంతరించిపోతుందా అని. ఆయన బెదిరిపోయిన చూపుతో “అలా అనకండి! ఊపిరి ఉన్నంత వరకూ ఎన్ని కష్టాలు పడైనా దీన్ని కొనసాగిస్తూనే ఉంటాము.” అని అన్నారు. దుకాణంలో గోడ మీద ఆయన పై ఒక దినపత్రికలో వచ్చిన ఆర్టికల్ ఒకటి అతికించి ఉంది, పాతదైపోయి, పాలిపోయి, ఆయన కళలానే.
ఈ ఆర్టికల్ కొద్ది మార్పులతో “యు.ఓ.హెచ్ డిస్పాచ్” అనే యూనివర్సిటి ఆఫ్ హైదారాబాద్ పత్రికలో ఏప్రిల్ 2019లో ప్రచురితమైంది.
అనువాదం: పూర్ణిమ తమ్మిరెడ్డి