1968 డిసెంబర్ చివరి వారంలో, వెన్మణి గ్రామంలోని కీళ్వెణ్మని కుగ్రామంలో భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా సాగుతున్న వ్యవస్థీకృత పోరాటం రాజుకుంది. తమిళనాడు నాగపట్నం జిల్లాలోని ఈ గ్రామానికి చెందిన భూమిలేని దళిత కూలీలు అధిక వేతనాలు, వ్యవసాయ భూములపై ​​నియంత్రణ, మరియు భూస్వామ్య అణచివేతకు ముగింపు పలకాలని సమ్మె  చేశారు. దీనికి భూస్వాముల స్పందన ఏంటి? వారు కుగ్రామంలో 44 మంది దళిత కార్మికులను సజీవ దహనం చేశారు. శక్తివంతమైన ధనిక భూస్వాములు, దళితులలో రేకెత్తుతున్న ఈ నూతన రాజకీయ చైతన్యం తో  చెలరేగిపోయి, పక్క ఊర్ల నుండి కూలీలను పనికి  పెట్టుకోవడమే కాక, ఒక భారీ ప్రతీకార ప్రణాళిక  పన్నారు.

డిసెంబర్ 25 రాత్రి, భూస్వాములు కుగ్రామాన్ని చుట్టుముట్టి దాడి చేసి, దళితులు తప్పించుకుపోగల అన్ని మార్గాలను మూసివేశారు. గుడిసెలోకి దూసుకెళ్లిన 44 మంది కూలీల బృందాన్ని లోపల బంధించి నిప్పు అంటించారు. హత్యకు గురైన వారిలో సగం మంది - 11 మంది బాలికలు మరియు 11 మంది బాలురు - 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు. ఇద్దరు 70 ఏళ్లు పైబడిన వారు. మొత్తం మీద 29 మంది స్త్రీలు, 15 మంది పురుషులు ఉన్నారు. అందరూ దళితులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) మద్దతుదారులు.

1975 లో మద్రాస్ హైకోర్టు, ఈ హత్య కేసులో 25 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. కానీ  ఈ నరమేధను  గొప్ప చరిత్రకారులలో ఒకరైన మైథిలి శివరామన్, వెలుగులోకి తీసుకురావడమే కాక, దాని వర్గ, కుల అణచివేత సమస్యలను గురించి కూడా శక్తివంతమైన, విస్తృతమైన విశ్లేషణలను రాయడం కొనసాగించారు. 81 ఏళ్ళ వయసులో, ఒక వారం క్రితమే కోవిడ్ -19 కి ప్రాణాలు కోల్పోయిన మైథిలి శివరామన్ జ్ఞాపకంగా, కీళ్వెణ్మని విషాదం గురించి ఆమె రాసిన ఈ కవితను ప్రచురిస్తున్నాము.

సుధన్వ దేశ్‌పాండే కవిత పఠనం వినండి

నలభై నాలుగు  రాతి పిడికిళ్లు

పూరి గుడిసెలు.
పైకప్పుల్లేని గుడిసెలు.
గోడలు లేని గుడిసెలు.
బుగ్గిపాలై మన్నులో కలిసిన గుడిసెలు.

44 రాతి పిడికిళ్లు,
దళితవాడలో వరసగా
ఒక కోపోధ్రికమైన జ్ఞాపకంలా,
చరిత్రలోని ఒక యుద్ధ ఆక్రందనలా,
మంచులా మంటలా మారిన కన్నీళ్లలా
ఆ కాళరాత్రికి  సాక్ష్యం పలుకుతూ
డిసెంబర్ 25, 1968
ఆ క్రీస్తు జన్మదినం,
44 మంది బిడ్డలకు మరణదినం .
వారి కథను వినండి మరి.
అమ్మా, అయ్యా , అందరూ  వినండి

పూరి గుడిసెలు.
పైకప్పుల్లేని గుడిసెలు.
గోడలు లేని గుడిసెలు.
బుగ్గిపాలై మన్నులో  కలిసిన గుడిసెలు.

నాలుగు సోళ్ల తిండిగింజలే కూలి.
సరిపోవు, సరిపోవని మొత్తుకున్నారు,
అవి భూమి లేని వారికి, ఆకలిగొన్న వారికి సరిపోవు.
వారికి తిండి కోసం ఆకలి, భూమి కోసం ఆకలి.
విత్తనాల ఆకలి, నారుకై ఆకలి,
వారి కష్టం, వారి చెమట, వారి కూలికి ఫలం.
ఈ సత్యం  పై కులాలకు,
భూస్వాములకు తెలియజేయాలనే  ఆకలి.
విరిగిన వెన్నులను నిలబెట్టకునే ఆకలి.

పూరి గుడిసెలు.
పైకప్పుల్లేని గుడిసెలు.
గోడలు లేని గుడిసెలు.
బుగ్గిపాలై మన్నులో  కలిసిన గుడిసెలు.

కొందరి బట్టలు ఎరుపు
చేతిలో సుత్తీ  కొడవలి
బుర్రలో ఆలోచనలు .
అందరూ పేదలే, అందరిలోనూ కోపమే
వాళ్లంతా దళిత అన్నలూ, దళిత అక్కలూ
శ్రమకు పుట్టిన పిల్లలు .
అంతా కలిసి ఏకమవుదాం, అన్నారు,
యజమానుల పొలాలు కోతబోమన్నారు
కానీ  కన్నీటిపాటలో మునిగిన వారికి ఏం తెలుసు?
కోత ఎవరిదో, పంట ఎవరిదో.

పూరి గుడిసెలు.
పైకప్పుల్లేని గుడిసెలు.
గోడలు లేని గుడిసెలు.
బుగ్గిపాలై మన్నులో  కలిసిన గుడిసెలు.

యజమానులెప్పుడూ తెలివైనవారే,
జిత్తులమారులు, దయలేనివారే.
పక్క గ్రామాల కూలీలను తెచ్చుకున్నారు
“క్షమాభిక్ష అడగండి”, గద్దించారు.
“ఎందుకు అడగాలి”, వీరు తిరగబడ్డారు.
అంతే, భూస్వాములు వారిని బంధించారు
మగవారిని, ఆడవారిని, పిల్లలని భయపెట్టారు
44 మందిని ఒక గుడిసెలోకి  తోశారు
పేల్చారు, కాల్చారు
లోపల ఇరుక్కున్నవారు
మంటలుగా మారిపోయారు

అర్ధరాత్రి పూట
22 పిల్లలు, 18 స్త్రీలు, 4 పురుషులు
క్రూరంగా చంపబడ్డారని
లెక్కతేలింది
కీళ్వెణ్మనిలో మరణకాండ లో
హతమైనవారు
సజీవంగా ఉన్నారు
పత్రికావార్తల్లో
నవలల్లో
పరిశొధనాపత్రాల్లో.

పూరి గుడిసెలు.
పైకప్పుల్లేని గుడిసెలు.
గోడలు లేని గుడిసెలు.
బుగ్గిపాలై మన్నులో  కలిసిన గుడిసెలు.

* చెరి: సాంప్రదాయకంగా, తమిళనాడులోని గ్రామాలను ఊర్లు గా, చేరిలుగా విభజించారు, ఊర్లలో ఆధిపత్య కులాల వారు  నివసిస్తారు. దళితులు నివసించే వాడలను చెరి అంటారు.

* పద్యంలో ఉపయోగించిన పల్లవి - పైకప్పులు లేని గుడిసెలు / గోడలు లేని గుడిసెలు / నేలకొరిగిన గుడిసెల దుమ్ము / బూడిదపాలైన గుడిసెల వరకు - 1968 లో మైథిలీ శివరామన్ రాసిన మారణకాండ గురించి ఒక వ్యాసం యొక్క ప్రారంభ పంక్తుల నుండి, ఎకనామిక్ లో ప్రచురించబడిన జెంటిల్మెన్ కిల్లర్స్ ఆఫ్ కీళ్వెణ్మని మరియు పొలిటికల్ వీక్ల్ వై, మే 26, 1973, వాల్యూమ్. 8, నం 23, పిపి. 926-928.

* ఈ పంక్తులు మైథిలీ శివరామన్ పుస్తకంలో హాంటెడ్ బై ఫైర్: ఎస్సేస్ ఆన్ కాస్ట్, క్లాస్, ఎక్స్ ప్లాయి టేషన్ అండ్ ఎమాన్సిపేషన్, లెఫ్ట్ వర్డ్ బుక్స్, 2016 లో ఉన్నాయి.

ఆడియో: సుధన్వ దేశ్‌పాండే జన నాట్య మంచ్‌తో నటుడు, దర్శకుడు. అంతేగాక లెఫ్ట్ వర్డ్ బుక్స్‌ లో సంపాదకుడు.

అనువాదం - అపర్ణ తోట

Poem and Text : Sayani Rakshit

সায়নী রক্ষিত নিউ দিল্লির জামিয়া মিলিয়া ইসলামিয়া বিশ্ববিদ্যালয়ে মাস কমিউনিকেশনে স্নাতকোত্তর স্তরের পড়াশোনা করছেন ।

Other stories by Sayani Rakshit
Painting : Labani Jangi

২০২০ সালের পারি ফেলোশিপ প্রাপক স্ব-শিক্ষিত চিত্রশিল্পী লাবনী জঙ্গীর নিবাস পশ্চিমবঙ্গের নদিয়া জেলায়। তিনি বর্তমানে কলকাতার সেন্টার ফর স্টাডিজ ইন সোশ্যাল সায়েন্সেসে বাঙালি শ্রমিকদের পরিযান বিষয়ে গবেষণা করছেন।

Other stories by Labani Jangi
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota