కేరళలోని కాసర్గోడ్ జిల్లా పరప్పా గ్రామంలో 15 మందితో కూడిన ఓ ఆదివాసీ వాయిద్య బృందం వెదురుబొంగుల మీద దరువు (మూలం చెండా) వేసి సంగీతాన్ని సృష్టిస్తుంది. మావిళన్ తెగకు చెందిన ఈ సంప్రదాయ ఆదివాసీ కళాకారులు కాసర్గోడ్, కన్నూర్ జిల్లాలలో నివసిస్తారు.
“సంగీతాన్ని సృజించేందుకు గతంలో మా పెద్దవాళ్ళు ఈ వెదురు వాయిద్యాలనే వినియోగించేవారు” అంటారు కె.పి. భాస్కరన్. ఇక్కడ వీడియోలో సంగీతంతో అలరిస్తున్న బృందం ఆయనదే. బృంద సభ్యులందరూ కాసర్గోడ్ జిల్లా వెల్లరిక్కుండ్ తాలుకాలోని పరప్పా గ్రామానికి చెందినవారే. “ ఈనాటికీ ఆవు చర్మంతోనే మృదంగ వాయిద్యాలను తయారు చేస్తారు (కేరళలోని ఇతర ప్రదేశాల్లో). సాంప్రదాయకంగా మా రోజువారీ జీవితాల్లో ఆవు మాంసాన్ని కానీ, ఆవు చర్మాన్ని గానీ మేము ఏనాడూ వాడింది లేదు. తెయ్యం లాంటి సంప్రదాయ కళలో సంగీత సృజన కోసం మా పూర్వీకులు వెదురు బొంగులతో దరువు వాయిద్యాలను తయారు చేసేవారు” అంటారు భాస్కరన్.
కొన్ని దశాబ్దాల క్రితం వరకు మా జాతి అటవీ ఉత్పత్తులను సులువుగానే సంపాదించుకునేది. అయితే అడవులపై ప్రభుత్వ నియంత్రణ కారణంగా వెదురు వాయిద్యాల తయారు ప్రియమైపోయింది. దీంతో మావిళ సమూహ ప్రజలు వెదురును కొనుక్కోవడానికి ఇక్కడికి 50 కి.మీ. దూరంలో ఉన్న బదియాడ్కా పట్టణానికి వెళ్ళవలసి వస్తోంది. మూడు, నాలుగు వాయిద్యాలను ఇవ్వగల వెదురు గెడ ఒక్కటీ రూ. 2500 నుంచి రూ. 3000 వరకూ ఖరీదు పలుకుతోంది. ఒక్కో వెదురు బొంగు వాయిద్యాన్ని మహా అయితే రెండుసార్లు వాడవచ్చు. ఆ తరువాత అది బీటలు వారుతుంది. వాయిద్యాన్ని తయారు చేయడానికి అంటే దాన్ని చెక్కడానికి గానీ, అది ఎండలో ఆరేసరికిగానీ మూడునాలుగు రోజులు పడుతుంది. “ఒక వాయిద్యాన్ని తయారు చేయడానికి చాలా శ్రమపడాలి” అంటారు బృందంలోని ఓ వాయిద్యకారుడు సునీల్ వీటియోడి.
పూర్వం మావిళ ప్రజలు (స్థానికంగా మావిలర్ ఆంటారు ) భూస్వాముల వ్యవసాయభూముల్లో పనిచేసేవారు. ఈ మధ్య కొన్ని కుటుంబాలకు చిన్నపాటి సొంత భూమి దొరకడంతో నేడు వారు వ్యవసాయం చేసుకుంటున్నారు. వాయిద్యకారులు ప్రధానంగా శ్రామికులుగా, వడ్రంగి పని వారుగా, నిర్మాణ కార్మికులుగా, వెల్లవేసే పనివాళ్ళుగా కాలం వెళ్ళబుచ్చుతున్నారు.
ఓ 30-35 మంది సభ్యులు మాత్రమే నేటికీ వెదురు బొంగుల దరువును వాయిస్తున్నారు. సంప్రదాయకంగా మావిళ పురుషులు గానం, దరువులలో పాలుపంచుకుంటే మహిళలు దేవాలయాల్లో పండుగల సందర్భంలో జరిగే నృత్యాలు, ఇంకా ఇతర ప్రదర్శనల్లో పాల్గొంటారు. వెదురు దరువు కోసం వచ్చే ఆహ్వానాలు ఏటా పది దాకా ఉండవచ్చుననీ, ఒక్కోసారి అవి కూడా లేకపోవచ్చుననీ కె.పి. భాస్కరన్ అంటారు. ఒక్కో ప్రదర్శన పది నిమిషాల నుంచి అరగంట సాగుతుంది.ప్రతి వాయిద్యకారుడు. 1500 రూపాయిలు సంపాదించుకుంటాడు. దారి ఖర్చులు కళాకారులే భరిస్తారు. ప్రదర్శన రోజు వారు పనులు మానుకుని వస్తారు కాబట్టి వారికి ఆ రోజు సంపాదన ఉండదు.
“మేము ఇబ్బందులు పడక తప్పదేమో కానీ మా సంస్కృతిని కుటుంబంలోని యువతరానికి నిస్సందేహంగా అందిస్తాం. మా కళనీ, మా సంస్కృతినీ కాపాడుకుంటాం. ఈ కళలు విలక్షణమయినవనీ, అవి తరతరాలుగా సంక్రమిస్తూ వచ్చాయనీ మాకు తెలుసు. ఇది మా అస్తిత్వం”, అంటారు భాస్కరన్.
అనువాదం - ఎన్.ఎన్. శ్రీనివాస రావు