నా గమ్యస్థానానికి చేరుకున్నానని గూగుల్ మ్యాప్స్ చెప్పింది. కానీ ఆ ప్రాంతం నా జ్ఞాపకాలకు భిన్నంగా, కాస్త కొత్తగా అనిపించింది. క్రితంసారి ఉప్పాడకు వచ్చినప్పుడు సముద్రపు ఒడ్డున శిథిలావస్థలో ఉన్న ఒక పాత ఇంటి కో-ఆర్డినేట్స్‌ను నేను ఫోన్‌లో భద్రపరుచుకుని ఉన్నాను. దాని ఆనవాళ్లు ఇప్పుడు తెలియడం లేదు. “ఓహ్, ఆ ఇల్లా? అది ఇప్పుడు సముద్రంలో ఉంది - అక్కడ!” అని బంగాళా ఖాతంలో నుండి ఎగిసిపడుతోన్న ఒక అలవైపు చూపిస్తూ టి. మారమ్మ చెప్పారు.

2020 మార్చి నెలలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు కొన్ని వారాల ముందు మారమ్మను, ఆమె కుటుంబ సభ్యులను నేను ఫోటోలు తీశాను. ఆ ఫోటోల బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ ఇల్లు అద్భుతంగాను, ఏదో నిగూఢమైన విషాదాన్ని దాచుకున్నట్టు అనిపించడం స్పష్టంగా గుర్తుంది. ఈ ఇల్లు, అంతగా వెడల్పు లేని ఒక బీచ్‌లో సముద్రానికి చాలా దగ్గరగా ప్రమాదకరంగా నిలబడి ఉండింది. ఈ శతాబ్దపు తొలి నాటి వరకు మారమ్మ ఉమ్మడి కుటుంబం ఈ ఇంట్లోనే నివాసం ఉండేవారు. ఆ ఇంట్లో కొంత భాగం మాత్రమే ధ్వంసం కాకుండా నిలబడి ఉండేది.

“ఇందులో ఎనిమిది రూములు, మూడు షెడ్లు [పశువుల కోసం] ఉండేవి. ఇక్కడ సుమారు వంద మంది కలిసి ఉండేవాళ్లం,” అని మారమ్మ చెప్పారు. ఈమె స్థానికంగా ఒక చిన్న స్థాయి రాజకీయ నాయకురాలు, గతంలో చేపల వ్యాపారం చేసేవారు. 2004 సునామీకి ముందు వచ్చిన ఒక తుఫాను తాకిడి వల్ల ఈ భవనంలో అధిక భాగం దెబ్బతిని సముద్రంలో కలిసిపోయింది. దాంతో ఆ ఉమ్మడి కుటుంబం విడిపోయి వేర్వేరు ఇళ్లలోకి మారాల్సి వచ్చింది. మారమ్మ అదే భవనంలో ఇంకొన్నేళ్లపాటు నివసించి ఆ తర్వాత దగ్గర్లోని మరో ఇంటికి మారారు.

మారమ్మ, ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే కాదు; సముద్ర విస్తరణ వల్ల ఉప్పాడలో దాదాపు అందరూ కనీసం ఒక్కసారైనా వేరే ఇళ్లకు మారాల్సి వచ్చింది. తమ జీవితంలో చవిచూసిన అనుభవాన్ని బట్టి, స్థానిక ప్రజలకు సముద్రపు అలలపై ఉండే అవగాహనను బట్టి ఎప్పుడు ఇళ్లు మారాలా అని వారు అంచనా వేసుకుంటారు. “అలలు మున్ముందుకు రావడం మొదలుపెట్టగానే మా ఇల్లు కూడా సముద్రంలో మునిగిపోతుందని మాకు అర్థం అవుతుంది. అప్పుడు మా వంట సామాగ్రి, ఇతరత్రా వస్తువులన్నీఒకవైపు పేర్చుతాము, [ఆ తర్వాత తాత్కాలికంగా ఉండేందుకు అద్దె ఇల్లు వెతుక్కుంటాం]. అలా మేము అంచనా వేసుకున్న ఒక నెలలోపే పాత ఇల్లు [సముద్రంలో] మునిగిపోతుంది,” అని ఓ. శివ వివరించారు. తనకు 14 ఏళ్లే అయినా, ఈ వయసులోనే ఇదివరకే ఒకసారి ముంపును తప్పించుకోవడానికి ఇల్లు మారాడు.

T. Maramma and the remains of her large home in Uppada, in January 2020. Her joint family lived there until the early years of this century
PHOTO • Rahul M.

జనవరి 2020లో ఉప్పాడలోని ఆమె పెద్ద ఇంటి అవశేషాలతో టి. మారమ్మ. ఆమె ఉమ్మడి కుటుంబం ఈ శతాబ్దపు ప్రారంభ సంవత్సరాల వరకు అక్కడే నివసించింది

*****

975 కిలోమీటర్ల పొడవు గల ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం గుండా, తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఉప్పాడ గ్రామ ప్రజలకు స్పృహ తెలిసినప్పటి నుండి వారి గ్రామం సముద్ర అలల తాకిడికి గురవుతూనే ఉంది.

దాదాపు 50 ఏళ్ల క్రితం మారమ్మ కుటుంబ సభ్యులు ఆ కొత్త ఇంట్లోకి చేరారు. అది బీచ్ నుండి బాగా దూరంలో ఉండేది. “సముద్రపు ఒడ్డు నుండి ఇంటి వరకు నడిచే సరికి మా కాళ్లు నొప్పి పుట్టేవి,” అని ఓ. చిన్నబ్బాయి చెప్పారు. ఆయన మారమ్మకు బాబాయి, శివకు తాతయ్య అవుతారు. మత్స్యకారుడైన ఆయన వయస్సు 70లు లేదా 80లలో ఉంటుంది. బీచ్ నుండి తమ ఇంటికి వెళ్లే దారి గుండా ఇళ్లు, దుకాణాలు, కొన్ని ప్రభుత్వ భవనాలు ఉండేవని ఆయన గుర్తు చేసుకున్నారు. “సముద్రపు ఒడ్డు అక్కడ ఉండేది,” అని సుదూరంగా సముద్రం మధ్యలోని ఒక చోటు వైపు చూపుతూ చెప్పారు. ఆయన చూపిన చోట కొన్ని పడవలు సాయంత్రపు వెలుతురులో ఏకమైపోతున్నట్టు అనిపించాయి.

“మా కొత్తింటికి సముద్రానికి మధ్య ఎక్కువగా ఇసుక కూడా ఉండేది,” అని మారమ్మ గుర్తు చేసుకున్నారు. “చిన్నతనంలో ఇసుక దిబ్బల మీద జారుతూ ఆడుకునే వాళ్లం.”

వీళ్ల జ్ఞాపకాలలో మిగిలి ఉన్న ఉప్పాడ దాదాపు అంతా సముద్ర గర్భంలో కలిసిపోయింది. 1989 నుండి 2018 వరకు, ఉప్పాడ తీరప్రాంతం సగటున ఒక్కో సంవత్సరానికి 1.23 మీటర్ల చొప్పున ముంపునకు గురైంది; 2017-18లో ఆ ముంపు 26.3 మీటర్ల స్థాయికి చేరిందని విజయవాడలోని ఆంధ్ర ప్రదేశ్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు చేసిన ఒక అధ్యయనం పేర్కొనింది. గత నాలుగు దశాబ్దాలలో కాకినాడ పరిసర ప్రాంతాలలో 600 ఎకరాలకు పైగా భూమి సముద్రం పాలైందని మరో అధ్యయనంలో తెలిసింది. కాకినాడ విభాగంలోని కొత్తపల్లె మండలంలో ఉప్పాడ ఒక్కటే ఈ భూమిలో దాదాపు పావు భాగం వరకు కోల్పోయింది. గత 25 ఏళ్లలో, పలు వందల మీటర్ల మేర బీచ్ కుచించుకుపోయిందన్నా సంగతి, కాకినాడకు ఉత్తరాన ఉన్న తీరప్రాంత మత్స్యకారులు తెలియజేశారని 2014లోని ఒక అధ్యయనం పేర్కొనింది.

Maramma’s old family home by the sea in 2019. It was washed away in 2021, in the aftermath of Cyclone Gulab.
PHOTO • Rahul M.
Off the Uppada-Kakinada road, fishermen pulling nets out of the sea in December 2021. The large stones laid along the shore were meant to protect the land from the encroaching sea
PHOTO • Rahul M.

ఎడమవైపు: 2019లో సముద్రం ఒడ్డున ఉన్న మారమ్మ పాత ఇల్లు. 2021 గులాబ్ తుఫాను కారణంగా అది కొట్టుకుపోయింది. కుడివైపు:  డిసెంబర్ 2021లో, ఉప్పాడ-కాకినాడ రహదారికి ఆనుకుని ఉన్న సముద్రం నుంచి  జాలర్లు వలలు లాగుతున్నారు. పక్కనే పెద్ద పెద్ద రాళ్లు సముద్ర ఆక్రమణ నుండి భూమిని రక్షించడానికి పేర్చారు

“కాకినాడ పట్టణానికి కొద్ది కిలోమీటర్ల దూరంలోని ఉప్పాడలో జరిగే తీర ప్రాంత ముంపు వెనుక గల ప్రధాన కారణం, హోప్ ఐల్యాండ్ విస్తరించడం. దీనిని శాస్త్రీయ భాషలో ‘స్పిట్’ అని పిలుస్తారు. ఇది 21 కిలోమీటర్ల పొడవు గల ఒక ఇసుక నిర్మాణం. గోదావరి ఉపనది అయిన నీలరేవు ముఖద్వారం నుండి అది సహజంగా ఉత్తరం వైపు విస్తరిస్తూ వస్తోంది,” అని డా. కాకాని నాగేశ్వర రావు చెప్పారు. ఈయన విశాఖపట్టణం ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన జియో-ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. “సముద్రపు అలలు ఈ స్పిట్ వల్ల రిఫ్రాక్ట్(వక్రీభవనం) అయ్యి, ఉప్పాడ తీరప్రాంతంపై వెల్లువెత్తుతాయి కాబట్టి ఇలా తీరప్రాంతం ముంపునకు గురవుతుంది. ఈ ప్రక్రియ ఒక శతబ్దపు కాలం కంటే మునుపే ప్రారంభమై, 1950లలో ఈ స్పిట్ ప్రస్తుత ఆకారాన్ని సంతరించుకుంది,” అని ప్రొఫెసర్ వివరించారు. ఈయన పలు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం గుండా సహజ ప్రక్రియలను, నిర్మాణాలను లోతుగా పరిశోధిస్తూ వచ్చారు.

1900ల శతాబ్దపు తొలినాళ్లకు చెందిన అధికారిక దస్తావేజులను పరిశీలిస్తే ఉప్పాడలో జరిగే ఈ ప్రక్రియ ఒక శతాబ్దం కంటే ముందే గుర్తించడం జరిగిందని నిర్ధారించవచ్చు. ఉదాహరణకు 1907కు చెందిన గోదావరి జిల్లా గజెటీర్‌ను పరిశీలిస్తే, 1900 నుండి 50 గజాలకు మించిన భూమి సముద్రం వల్ల ముంపునకు గురైందని అందులో పేర్కొనబడింది. మరో విధంగా చెప్పాలంటే, ఆ ఏడేళ్లలో ఈ గ్రామం, ఏడాదికి ఏడు మీటర్ల చొప్పున భూమిని కోల్పోయింది.

“తీర ప్రాంతాలలో సాధారణంగా పలు ప్రక్రియలు స్థానికంగానే కాక తీర ప్రాంతమంతటా జరుగుతూ ఒకదానితో ఒకటి సంక్లిష్టమైన సంబంధాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఉప్పాడలో జరిగే తీర ప్రాంత ముంపు వెనుక గల కారణాలు ఎంతో క్లిష్టమైనవి,” అని డా. రావ్ చెప్పారు. ఇందుకు గ్లోబల్ వార్మింగ్, ఉత్తర దక్షిణ ధృవాలలో మంచుకొండల ద్రవీభవనం, సముద్రపు మట్టాల పెరుగుదలతో పాటు బంగాళా ఖాతంలో ఇటీవలి కాలంలో తరచుగా ఏర్పడుతోన్న తుఫానులు కూడా కారణమవుతున్నాయి. నదుల ముఖద్వారాల వద్ద ఉండే పూడిక స్థాయి గణనీయంగా తగ్గడంతో పాటు గోదావరి బేసిన్‌లో మితిమీరి నిర్మించబడుతోన్న డ్యాముల వల్ల పరిస్థితి మరింత జటిలంగా మారింది.

*****

ఉప్పాడలోని భూమి సముద్రం లోపలికి కొద్ది కొద్దిగా ముంపునకు గురవుతూ వస్తున్నప్పటికీ, అక్కడి ప్రజల జ్ఞాపకాలలో ఆ ఊరు సజీవంగా ఉంది.

తమ జ్ఞాపకాలలో, తాము పంచుకునే కబుర్లలో ఉండే గ్రామం ఎలా ఉంటుందో చూడటానికి, నాకూ స్వతంత్రం వచ్చింది అనే తెలుగు సినిమాను చూడమని గ్రామవాసులలో ఒకరు నాకు సూచించారు. 1975లో విడుదలైన ఆ సినిమాలో కనబడే ఉప్పాడ ఎంతో భిన్నమైనది : గ్రామానికి సముద్రానికి మధ్య కావాల్సినంత దూరం ఉండి, వాటి మధ్య అందమైన ఒక ఇసుక బీచ్ ఉంది. అప్పట్లో ఆ బీచ్‌ను, సముద్రాన్ని సినిమా కోసం వేర్వేరు కోణాల నుండి చిత్రీకరించడానికి వీలుగా అప్పటి బీచ్ ఎంతో వెడల్పుగా ఉండింది. షూటింగ్‌లో భాగంగా సముద్రాన్ని, ఇసుకను సింగిల్-ఫ్రేమ్ షాట్‌లలో చిత్రీకరించిన సన్నివేశాలు ఆ సినిమాలో జరిగే ప్రధాన ఘట్టాలకు బ్యాక్‌గ్రౌండ్‌గా నిలిచాయి.

Pastor S. Kruparao and his wife, S. Satyavati, outside their church in Uppada, in September 2019.
PHOTO • Rahul M.
D. Prasad  grew up in the coastal village, where he remembers collecting shells on the beach to sell for pocket money. With the sand and beach disappearing, the shells and buyers also vanished, he says
PHOTO • Rahul M.

ఎడమ: సెప్టెంబర్ 2019లో, ఉప్పాడలోని వారి చర్చి వెలుపల, పాస్టర్ ఎస్. కృపారావు అతని భార్య, ఎస్. సత్యవతి. కుడివైపు: డి.ప్రసాద్ తీరప్రాంత గ్రామంలో పెరిగారు. పాకెట్ మనీ కోసం,  తన స్నేహితులతో కలిసి  గవ్వలు సేకరించడానికి వెళ్లడం అతను గుర్తుచేసుకున్నాడు. ఇసుక, ఇంకా బీచ్ కనుమరుగవడంతో, గవ్వలు, కొనుగోలుదారులు కూడా కనిపించడం లేదని ఆయన చెప్పారు

“ఆ సినిమా షూటింగ్ నేను చూశాను. షూటింగ్ కోసం వచ్చిన కొంతమంది నటులు ఇక్కడే అతిథి గృహంలో బస చేశారు. అదంతా ఇప్పుడు సముద్రం పాలైంది. చివరికి ఆ అతిథి గృహం కూడా.” అని ఎస్. కృపారావ్ (68) చెప్పారు. ఈయన ఉప్పాడలోని ఒక చర్చిలో పాస్టర్‌గా సేవలందిస్తున్నారు.

1961లో ప్రచురితమైన తూర్పు గోదావరి జిల్లా సెన్సస్ హ్యాండ్ బుక్‌లో కూడా ఈ అతిథి గృహం ప్రస్తావన ఉంది: “సముద్రపు ఒడ్డు నుండి సుమారు ఒక ఫర్లాంగు దూరంలో ఎంతో సౌకర్యవంతమైన, రెండు సూట్ల గదులతో ట్రావెలర్స్ బంగళా ఉంది. ఇంతకు మునుపు గల ట్రావెలర్స్ బంగళా సముద్రంలో మునిగిపోవడంతో దీనిని నిర్మించినట్టుగా జనబాహుళ్యంలో ప్రాచుర్యం పొందింది.” కాబట్టి, ‘నాకు స్వతంత్రం కావాలి..’ చిత్ర నిర్మాణ బృందం బస చేసిన అతిథి గృహం, అలల తాకిడికి ముంపునకు గురైన వాటిలో రెండవది కావచ్చు.

సముద్రంలో మునిగిపోయిన నిర్మాణాలు, వాటిలోని వస్తువులు ఆర్కైవల్ రికార్డులలోను, ప్రజలు నోటి మాట ద్వారా తర్వాతి తరాలకు చెప్పే కబుర్లలోనూ తిరిగి దర్శనం ఇస్తూ ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా ఒక పెద్ద రాయి సముద్ర గర్భంలో మునిగిపోయి ఉందని తమ తల్లిదండ్రులు, బామ్మలు తాతయ్యలు చెప్పేవారని ఈ గ్రామానికి చెందిన వృద్ధులు గుర్తు చేసుకున్నారు. 1907 గెజెటర్ కూడా ఇటువంటి దానినే వివరించింది: “సముద్రంలో దాదాపు అర్ధ మైలు దూరంలో శిథిలాల అవశేషాలు ఉన్నాయి. అవి మత్స్యకారుల వలలలో, అలాగే చిన్న పిల్లలు బీచ్‌లో పెద్ద అలలు వచ్చినప్పుడు నాణేల కోసం వెతికినప్పుడు దొరుకుతున్నాయి. ఈ శిథిలాలను పరిశీలించి చూస్తే ఏదో ఒక పట్టణమే పూర్తిగా మునిగిపోయి ఉండవచ్చనే నమ్మకం కలుగుతోంది.”

ఈ శిథిలాలను 1961 హ్యాండ్‌బుక్ కూడా ప్రస్తావించింది: “తమ బోట్లలో లేదా తెప్పలలో చేపలు పట్టడానికి వెళ్లినప్పుడు వాళ్ల వలలలో భవనాల పైభాగాలు, పెద్ద చెట్ల మానులు చిక్కుకుంటాయని వృద్ధ మత్స్యకారులు చెప్పారు. తీరానికి దాదాపు ఒక మైలు దూరంలో ఇలా జరుగుతోందనీ, సముద్రం ఈ ఊరిని క్రమంగా ఆక్రమిస్తోందని తమ స్వీయానుభవం ద్వారా తెలుస్తోందని వారు చెప్పారు. ”

సముద్రం ఆకలితో దాడి చేసినట్టుగా తాకిడి కలగజేసే అలల వల్ల ఈ గ్రామం ఎంతో కోల్పోయింది : దాదాపు బీచ్ మొత్తం మునిగిపోవడంతో పాటు లెక్కలేనన్ని ఇళ్లు, ఒక మసీదు, ఒక గుడి కూడా సముద్రంలో ఏకమైపోయాయి. ఉప్పాడను సంరక్షించడానికి 2010లో రూ. 12.16 కోట్ల ఖర్చుతో 1,463 మీటర్ల పొడవు గల ‘జియోట్యూబ్’ను నిర్మించినా, గడిచిన దశాబ్దంలో అలల ధాటికి అది కూడా నిలబడలేకపోయింది. జియోట్యూబ్‌లు పైపు ఆకారంలో ఉండే భారీ పాత్రల వంటి నిర్మాణాలు. వీటిలో ఇసుకను నీటిని కలిపిన మిశ్రమాన్ని నింపి తీరప్రాంతాన్ని సంరక్షించేందుకు, నేలను పునరుద్ధరించేందుకు ఉపయోగిస్తారు. “రెండు చదరపు అడుగుల వైశాల్యం గల భారీ రాళ్లు కూడా 15 ఏళ్ల పాటు అలల తాకిడికి గురైన తర్వాత ఆరు ఇంచుల గులకరాళ్లుగా మారడం నేను చూశాను,” అని డి. ప్రసాద్ (24) చెప్పారు. ఈయన ఈ ప్రాంతంలోనే పెరిగారు, అప్పుడప్పుడు చేపలు పట్టే వృత్తిని చేపడుతూ ఉంటారు.

Remnants of an Uppada house that was destroyed by Cyclone Gulab.
PHOTO • Rahul M.
O. Chinnabbai, Maramma's uncle, close to where their house once stood
PHOTO • Rahul M.

ఎడమవైపు: గతేడాది గులాబ్ తుఫాను తాకిడికి ధ్వంసమైన ఇంటి అవశేషాలు. కుడి: మారమ్మ మేనమామ,  ఓ.చిన్నబ్బాయి, ఒకప్పుడు వారి ఇల్లు ఉన్న ప్రదేశానికి దగ్గరగా నిలబడి ఉన్నారు

2021లో విడుదలైన తెలుగు సినిమా ‘ఉప్పెన’లో భారీగా మార్పులకు లోనైన ఉప్పాడను చూడవచ్చు. ఈ సినిమాలో, గతంలో ఉన్న బీచ్‌కు బదులుగా గ్రామాన్ని సముద్రం నుండి రక్షించడానికి ఏర్పరిచిన బండరాళ్లు దర్శనమిస్తాయి. 1975 సినిమాలోలా కాకుండా, గ్రామంలోని దృశ్యాలను, సముద్రాన్ని ఒకే ఫ్రేమ్‌లో చిత్రీకరించడానికి బాగా ఎత్తులో (బర్డ్స్ ఐ వ్యూలో) లేదా ఐ మూలగా (డయాగనల్ గా) కెమెరాను ఉంచాల్సి వచ్చింది. ఎందుకంటే, కెమెరాను ఉంచి చిత్రీకరించడానికి ఇప్పుడు బీచ్ పెద్దగా మిగల్లేదు కాబట్టి.

ఇటీవలి కాలంలో ఉప్పాడ తీరాన్ని అతి భయంకరంగా ధ్వంసం చేసింది 2021లో వచ్చిన తుఫాన్ అని చెప్పవచ్చు. ఈ తుఫాన్ తాకిడికి 30కి పైగా ఇళ్లు మునిగిపోయి, కొత్తగా నిర్మించిన ఉప్పాడ-కాకినాడ రోడ్డు వినియోగించడానికి వీల్లేనంత తీవ్రంగా దెబ్బతినింది.

గులాబ్ తుఫాను వల్ల అల్లకల్లోలంగా మారిన సముద్రం అక్టోబర్ మొదట్లో మారమ్మ కుటుంబానికి చెందిన పాత ఇంటిలో మిగిలిన భాగాన్ని కూడా ముంచేసింది. అంతేగాక తాను, తన భర్త ప్రస్తుతం నివసించే ఇల్లు కూడా కొట్టుకుని పోయింది.

*****

2021లో కలిగిన భారీ ఉత్పాతాన్ని గుర్తు చేసుకుంటూ “క్రితంసారి తుఫాను వచ్చినప్పుడు ఇతరుల ఇళ్ల బయట కాస్తంత ఎత్తులో ఎర్పరిచిన గట్టు మీద నిద్రపోవాల్సిన అగత్యం వచ్చింది,” అని వణికే గొంతుతో మారమ్మ చెప్పారు.

2004లో తుఫాను వల్ల మారమ్మ, మత్స్యకారుడైన ఆమె భర్త టి. బాబాయి తమకు వంశపారంపర్యంగా వచ్చిన ఇంటిని వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. అప్పటి నుండి వాళ్లు ఒకసారి అద్దె ఇంట్లో, ఆ తర్వాత సొంతింట్లో నివసించారు. గత సంవత్సరపు తుఫాను వల్ల ఆ ఇల్లు కూడా సముద్రంలో కలిసిపోయింది. నేడు, అదే ప్రాంతంలో తమ బంధువుల ఇంటి బయట బహిరంగ ప్రదేశంలోనే, ఎత్తులో నిర్మించిన ఒక గట్టు మీద ఆ భార్యాభర్తలు నివసిస్తున్నారు.

“ఒకానొకప్పుడు మేము కూడా సౌండ్ పార్టీనే [ఆస్తి పాస్తులు గల వాళ్లమే],” అని మారమ్మ చెప్పారు. సముద్రపు తాకిడి వల్ల నిర్వాసితులుగా మారడం, తమ జీవితాలను పునర్నిర్మించుకోవడం, మళ్లీ నిర్వాసితులుగా మారడం ఇలాంటి చట్రంలో ఇరుక్కుపోవడంతో పాటు నలుగురు కూతుళ్ల పెళ్లి ఖర్చుల వల్ల వారు పొదుపు చేసుకున్న ఆస్తంతా భారీగా కరిగిపోయింది.

M. Poleshwari outside her third house; the first two were lost to the sea. “We take debts again and the house gets submerged again”
PHOTO • Rahul M.
M. Poleshwari outside her third house; the first two were lost to the sea. “We take debts again and the house gets submerged again”
PHOTO • Rahul M.

ఎడమ: మారమ్మ ఇదివరకటి ఇల్లు ఎనిమిది గదులతో కూడిన భవనం. 'ఇక్కడ సుమారు వంద మంది నివసించేవారు,' ఆమె చెప్పింది. కుడి: ఎం. పోలేశ్వరి తన మూడవ ఇంటి వెలుపల; ఆమె మొదటి రెండు ఇళ్లు సముద్రంలో మునిగిపోయాయి. ఆమె చెప్పింది: 'మేము మళ్లీ అప్పులు చేశాము, కానీ ఈ ఇల్లు మళ్లీ మునిగిపోతుంది'

“ఇల్లు కట్టడానికి ఇతరుల నుండి అప్పులు తీసుకున్నాం, కానీ ఇల్లు మునిగిపోయింది,” అని మత్స్యకారుల కుటుంబానికి చెందిన ఎమ్. పోలేశ్వరి చెప్పారు. ఆమె కూడా మారమ్మ లాగానే ఎన్నో కష్టాలను చవిచూశారు. “మళ్లీ అప్పులు తీసుకున్నాం, మళ్లీ ఇల్లు మునిగిపోయింది.” ఇప్పటికి సముద్రం ధాటికి పోలేశ్వరి రెండు ఇళ్లను కోల్పోయారు. ఇప్పుడు ఆమె మూడో ఇంట్లో ఉంటున్నారు, తన కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి, మత్స్యకారుడైన తన భర్త భద్రత గురించి ఆమె నిరంతరం ఆందోళన చెందుతున్నారు. “తను చేపలను పట్టడానికి వెళ్లినప్పుడు తుఫాను వస్తే, చనిపోయే అవకాశం ఉంది. అయినా తను మాత్రం ఏం చేస్తాడు? సముద్రం మీదే మా జీవనోపాధి ఆధారపడి ఉంది.”

ఇతర ఆదాయ వనరులు కూడా క్షీణించసాగాయి. తన చిన్నతనంలో స్నేహితులతో కలిసి చిన్న అలలు వచ్చే సమయంలో బీచ్‌లో గవ్వలు, పీతలు ఏరుకుని వాటిని అమ్మి చిల్లర ఖర్చుల కోసం డబ్బు సంపాదించగలిగేవారని ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. ఇసుకతో పాటుగా బీచ్ కూడా అదృశ్యం కావడంతో గవ్వలు దొరకడం లేదు, వాటిని కొనేవాళ్లు కూడా కరువయ్యారు.

“ఈ గవ్వలను ఏరుకుని వాటిని అమ్మి డబ్బు సంపాదించాలని ఆశపడేవాళ్లం,” అని తన ఇంటి బయట ఎండలో ఆరబెట్టిన పాత గవ్వల వైపు చూస్తూ పోలేశ్వరి చెప్పారు. “మునుపు ‘గవ్వలు కొంటాం, గవ్వలు కొంటాం’ అని అరుస్తూ వ్యాపారులు వచ్చేవారు. ఇప్పుడు అంతగా రావడం లేదు.”

2021 తుఫాను తర్వాత, తమ గ్రామానికి తీవ్రమవుతోన్న ఆపద, దుస్థితులపై దృష్టి సారించాల్సిందిగా కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మారమ్మతో పాటు 290 మంది ఇతరులు కలిసి ఒక లేఖ రాశారు. “గతంలో, శ్రీ వై. యస్. రాజశేఖరరెడ్డి గారు [మాజీ ముఖ్యమంత్రి] ఉప్పాడ మత్స్యకారుల గ్రామ తీరం గుండా పెద్ద బండరాళ్లను స్థాపించి ఆ గ్రామాన్ని ముంపు ప్రమాదం నుండి కాపాడారు. ఆ తర్వాత వచ్చిన తుఫానుల నుండి సునామీల నుండి ఈ బండరాళ్లు మమ్మల్ని సంరక్షించాయి,” అని ఆ లేఖలో పేర్కొన్నారు.

The stretch from the fishing colony to the beach, in January 2020. Much of it is underwater now.
PHOTO • Rahul M.
The Uppada-Kakinada road became unsafe after it was damaged by Cyclone Jawad in December 2021. A smaller road next to it is being used now
PHOTO • Rahul M.

ఎడమవైపు: జనవరి 2020లో ఫిషింగ్ కాలనీ నుండి బీచ్ వరకు సాజీ దారి. ఇప్పుడు ఆ దారిలో చాలా భాగం నీటి అడుగున ఉంది. కుడివైపు: డిసెంబరు 2021లో జవాద్ తుఫాను కారణంగా దెబ్బతిన్న ఉప్పాడ-కాకినాడ రహదారి ప్రమాదకరంగా మారింది. దాని పక్కనే నిర్మించిన చిన్న రహదారి ఇప్పుడు ఉపయోగిస్తున్నారు

“ప్రస్తుతం తుఫానుల సంఖ్య పెరగడంతో, తీరంపై ఏర్పరిచిన బండరాళ్లు కదిలిపోయి, ఒడ్డు దెబ్బతినింది. ఈ రాళ్లను కట్టి ఉంచే తాడు కూడా అరిగిపోయింది. అందువల్ల, తీరం పొడవునా ఉన్న ఇళ్లు, గుడిసెలు సముద్రంలో ఏకమైపోయాయి. తీరప్రాంతం గుండా ఉండే మత్స్యకారులు భయభ్రాంతులకు గురవుతున్నారు,” అని వివరించి ప్రస్తుత బండరాళ్లను తీసేసి ఇంకా పెద్దరాళ్లను పెట్టించాల్సిందిగా కోరారు.

అయితే, ఈ బండరాళ్ల వల్ల సముద్రం నుండి శాశ్వతమైన రక్షణ లభిస్తుందని చెప్పేందుకు బలమైన రుజువులేవీ లేవని డా. రావ్ చెప్పారు. సముద్రం మున్ముందుకు దూసుకొచ్చే క్రమంలో, అవి తాత్కాలిక భద్రతను మాత్రమే ఇవ్వగలవని చెప్పారు. “ఆస్తులను కాపాడుకోవడానికి ప్రయత్నించే బదులు బీచ్‌ను కాపాడుకోవాలి. బీచ్‌ను కాపాడుకుంటే, అదే మీ ఆస్తులను కాపాడుతుంది,” అని ఆయన చెప్పారు. “జపాన్‌లోని కాయికె తీరంలో అలలను అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన భారీ రాతి నిర్మాణాల లాగా, సముద్రపు ఒడ్డు మీద నిరోధక నిర్మాణాలను ఏర్పాటు చేస్తే అవి ఉప్పాడలో ముంపును నివారించడంలో సహాయపడగలవు.”

*****

సముద్రపు తాకిడి గ్రామంపై పడుతూ ఉన్నప్పటికీ మరోవైపు ఆ ఊరి సాంఘిక నిర్మాణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉప్పాడ శ్రేష్ఠమైన చేనేత పట్టుచీరలకు ప్రసిద్ధి. 1980లు, 90లలో చేనేత సామాజిక వర్గ ప్రజలకు ఆ గ్రామ తీర ప్రాంతానికి దూరంగా ఇతర ప్రాంతాలలో ప్రభుత్వం కొంత భూమిని కేటాయించింది. దాంతో ఆ వర్గ ప్రజలు ఆ భూముల వైపు తరలిపోయారు. క్రమంగా, ప్రధానంగా అగ్ర కులాలకు చెందిన, స్థానికంగా పరపతి గల గ్రామవాసులు కూడా సముద్రానికి దూరంగా తరలిపోవడం ప్రారంభించారు. కానీ, మత్స్యకారుల జీవనోపాధి సముద్రంతోనే ముడిపడి ఉండటంతో వేరే దిక్కేదీ లేక అక్కడే నివసించాల్సి వస్తోంది.

అగ్ర కులస్తులు సురక్షితమైన ప్రాంతాలకు తరలిపోవడంతో, కుల వ్యవస్థతో ముడిపడి ఉన్న కట్టుబాట్లు, పద్ధతులు క్రమంగా బలహీనపడసాగాయి; ఉదాహరణకు అగ్రకులస్తుల పండగలకు మత్స్యకారులు తాము పట్టిన చేపలను ఉచితంగా ఇవ్వాల్సి వచ్చే ఆనవాయితీకి అడ్డు పడింది. క్రమంగా మత్స్యకారుల వర్గ ప్రజలు క్రైస్తవ మతం వైపు మొగ్గుచూపారు. “చాలా మంది తమ స్వేచ్ఛ కోసం ఈ మతంలోకి చేరారు,” అని పాస్టర్ కృపారావు చెప్పారు. ఇక్కడి ప్రజలలో అధిక శాతం తీవ్రమైన పేదరికంలో ఉన్న వారు, వీరిని వెనుకబడిన కులాలుగా (బీసీలుగా) వర్గీకరించారు. క్రైస్తవ మతంలోకి చేరే ముందు తాను ఎన్నో పర్యాయాలు కుల వివక్షను, అవమానాలను ఎదుర్కొన్నానని కృపారావు గుర్తు చేసుకున్నారు.

Poleru and K. Krishna outside their home, in 2019. The structure was washed away in 2021 after Cyclone Gulab struck the coast.
PHOTO • Rahul M.
The cyclone also wrecked the fishing colony's church, so prayers are offered in the open now
PHOTO • Rahul M.

ఎడమవైపు: 2019లో వారి ఇంటి వెలుపల, కె. పోలేరు కె. కృష్ణ. ఈ నిర్మాణం గత ఏడాది గులాబ్ తుఫాను కారణంగా కొట్టుకుపోయింది. కుడివైపు: ఫిషింగ్ కాలనీలోని చర్చి భవనం తుఫాను కారణంగా ధ్వంసమైనందున, అదే స్థలంలో బహిరంగంగా ప్రార్థనలు చేస్తున్నారు

“సుమారు 20-30 ఏళ్ల ముందు, గ్రామవాసులలో హిందువులు అధికంగా ఉండేవారు. గ్రామవాసులు స్థానిక గ్రామదేవతల పండగలను జరుపుకునేవాళ్లు,” అని చిన్నబ్బాయి కుమారుడు ఓ. దుర్గయ్య చెప్పారు. “ఇప్పుడు గ్రామవాసులలో క్రైస్తవులు అధికంగా ఉన్నారు.” 1990ల వరకు [గ్రామదేవతకు పూజ చేయడానికి గాను] ప్రతి గురువారం సెలవు తీసుకునే వారు. ఇప్పుడు అదే ప్రాంతంలో చర్చికి వెళ్లడానికి గాను ప్రతి ఆదివారం సెలవు తీసుకుంటున్నారు. ఉప్పాడలో కొన్ని దశాబ్దాల వరకు కొద్దో గొప్పో ముస్లిములు నివసించేవారు, కానీ స్థానిక మసీదు ముంపునకు గురైన తర్వాత చాలామంది తరలిపోయారు.

ఈ గ్రామంలో నివసించడం కొనసాగిస్తున్న ప్రజలు సముద్రం నుండే ప్రమాద సంకేతాలను, బతికి బయటగట్టే ఉపాయాలను నేర్చుకుంటున్నారు. “[ప్రమాదాన్ని] గుర్తించడం సాధ్యమే. బండరాళ్ల నుండి ఘొల్లుఘొల్లుమనే వింత శబ్దం వినబడుతుంది. గతంలో [అలల ఉధృతిని అంచనా వేయడానికి] నక్షత్రాలను గమనించేవాళ్లం, ఉధృతి అధికంగా ఉన్న రోజుల్లో అవి ప్రత్యేకంగా మెరుస్తాయి. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ల ద్వారా తెలుసుకుంటున్నాం,” అని 2019లో నేను తొలిసారి ఇక్కడికి వచ్చినప్పుడు మత్స్యకారుడైన కె. కృష్ణ నాకు చెప్పారు. “కొన్నిసార్లు, తూర్పు వైపు ఉన్న పొలాల నుండి గాలులు వీస్తున్నాయంటే మత్స్యకారులకు ఒక్క రూపాయి [సముద్రంలో చేపలను] కూడా దక్కదని అర్థం,” అని అతని భార్య కె. పోలేరు చెప్పారు. ఆమె ఇలా చెబుతున్నప్పుడు, మత్స్యకారుల కాలనీ అంచున ఉన్న వారి గుడిసెలో నుండి మేము ముగ్గురం అలలను గమనిస్తూ ఉన్నాము. 2021 తుఫానులో ఆ గుడిసె ధ్వంసం కావడంతో వారు ఇంకో కొత్త గుడిసెలోకి తరలి వెళ్లారు.

మరోవైపు మారమ్మ తన బంధువుల ఇంటి బయటి గట్టు మీదే రాత్రింబవళ్లు నివసిస్తున్నారు. “మేము కట్టుకున్న రెండిళ్లనూ సముద్రం లాగేసుకుపోయింది; మళ్లీ ఇంకో ఇంటిని కట్టుకోగలమో లేదో నాకు తెలీదు,” అని ఆమె చెబుతున్నప్పుడు ఆమె గొంతులో వణుకు, మాటల్లో ఉద్వేగం, నిరాశ స్పష్టమవుతున్నాయి.

అనువాదం: శ్రీ రఘునాథ్ జోషి

Reporter : Rahul M.

রাহুল এম. অন্ধ্র প্রদেশের অনন্তপুর জেলায় স্বাধীনভাবে কর্মরত একজন সাংবাদিক। তিনি ২০১৭ সালের পারি ফেলো।

Other stories by Rahul M.
Editor : Sangeeta Menon

মুম্বই-নিবাসী সংগীতা মেনন একজন লেখক, সম্পাদক ও জনসংযোগ বিষয়ে পরামর্শদাতা।

Other stories by Sangeeta Menon
Series Editor : P. Sainath

পি. সাইনাথ পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার প্রতিষ্ঠাতা সম্পাদক। বিগত কয়েক দশক ধরে তিনি গ্রামীণ ভারতবর্ষের অবস্থা নিয়ে সাংবাদিকতা করেছেন। তাঁর লেখা বিখ্যাত দুটি বই ‘এভরিবডি লাভস্ আ গুড ড্রাউট’ এবং 'দ্য লাস্ট হিরোজ: ফুট সোলজার্স অফ ইন্ডিয়ান ফ্রিডম'।

Other stories by পি. সাইনাথ
Translator : Sri Raghunath Joshi

Sri Raghunath Joshi obtained a Masters degree in Engineering but switched careers to pursue his love of Telugu language. Currently he works remotely as Telugu-Language Lead at a Localization firm based in Noida. He can be contacted at [email protected]

Other stories by Sri Raghunath Joshi