కొత్తగా పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడంలో మా ఆదివాసీలకు మావైన స్వంత పద్ధతులు ఉన్నాయి. మేం నదులు, అడవులు, పుట్టినవారికి సంబంధించిన భూమి, వారంలోని రోజులు, ఒక నిర్దిష్టమైన తేదీ, లేదా పుట్టినవారి పూర్వీకుల నుండి కూడా ఈ పేర్లను అరువు తీసుకుంటాం. కానీ, కాలక్రమేణా, మేం కోరుకున్న విధంగా పేరు పెట్టుకునే హక్కును మా నుండి లాగేసుకున్నారు. ఈ విశిష్టమైన హక్కును వ్యవస్థీకృతమైన మతం, మత మార్పిడులు మానుంచి తీసేసుకున్నాయి. మా పేర్లు మారుతూనే ఉన్నాయి, మళ్లీ మళ్ళీ ఆపాదించబడుతున్నాయి. ఆదివాసీ పిల్లలు చదువుకోసం నగరాలలోని ఆధునిక పాఠశాలలకు వెళ్లినప్పుడు, వ్యవస్థీకృత మతం మా పేర్లను మార్చింది. ఆ పిల్లలు పొందిన సర్టిఫికెట్లు మాపై బలవంతంగా రుద్దిన కొత్త పేర్లతో ఉన్నాయి. ఇలాగే మా భాషలను, మా పేర్లను, మా సంస్కృతిని, మా చరిత్రలను హతమార్చేశారు. ఈ పేరు పెట్టడంలో ఒక కుట్ర దాగివుంది. ఈ రోజున మేం మా మూలాలతో, మా చరిత్రతో ముడిపడి ఉన్న ఆ భూమి కోసం వెతుక్కుంటున్నాం. మా ఉనికితో గుర్తించబడిన ఆ రోజుల కోసం, తేదీల కోసం మేం వెతుక్కుంటున్నాం.
ఈ పేరు ఎవరిది?
సోమవారం పుట్టానని
నన్ను సోమ్రా అని పిలిచారు
మంగళవారం పుట్టానని
నన్ను మంగళ్ అని, మంగర్ అని, మంగరా అనీ పిలిచారు
బేస్తవారంనాడు పుడితే
నన్ను బిర్సా అని పిలిచారు
వారాల్లో రోజుల్లాగా
నేను కాలం గుండెలపై నించొని ఉండేవాడిని
తర్వాత వాళ్లొచ్చారు
వచ్చి, నా పేరునే మార్చేశారు
నా అస్తిత్వమైన ఆ వారాల్నీ తేదీల్నీ నాశనం చేశారు
యిప్పుడు నా పేరు రమేశ్
లేదా నరేశ్
కాకుంటే మహేశ్
అదీ కాదంటే ఆల్బర్ట్ గిల్బర్ట్ లేదా ఆల్ఫ్రెడ్
నన్ను సృష్టించని నేల మీది పేర్లన్నీ నాకున్నాయి
నాది కాని చరిత్ర కలిగిన నేల మీది పేర్లన్నీ నాకున్నాయి
యిప్పుడు నేను,
వారి చరిత్రలోనే నా చరిత్ర కోసం వెతుకుతున్నాను
కానీ, ప్రపంచపు ప్రతి మూలలోనూ, ప్రతి చోటా
నన్నే హతమార్చడాన్ని చూస్తున్నాను
యింకా,
ప్రతి హత్యకూ ఒక సుందరమైన పేరుండటాన్ని గమనిస్తున్నాను.
వచనానువాదం: సుధామయి సత్తెనపల్లి
కవితానువాదం: కె. నవీన్ కుమార్