ఔచిత్ మాత్రేకు తన తరగతి గదిలో ఏకైక విద్యార్థిగా చదువుకోవడం అలవాటే. అయితే, బడి మొత్తానికి తానొక్కడే విద్యార్థిగా మిగిలిపోతానని మాత్రం ఎన్నడూ ఊహించలేదు.
కొవిడ్ వల్ల 18 నెలల పాటు మూతబడిన తన బడి తిరిగి తెరుచుకోవడంతో, గత ఏడాది అక్టోబరు 4వ తేదీన ఉదయం 11 గంటలకు తన తరగతి గదిలోకి 12 ఏళ్ల ఔచిత్ అడుగుపెట్టినప్పుడు సరిగ్గా ఈ పరిస్థితే ఎదురైంది. బడిలోని మూడు గదులు ఖాళీగా ఉన్నాయి. తన టీచర్ మాత్రమే తన కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఆయన పక్కన ఒక కుర్చీ మీద మహాత్మా గాంధీ ఫోటో ఫ్రేమ్ ఉంది.
2015లో దాదాపు ఆరేళ్ల వయసున్నఔచిత్ 1వ తరగతిలో చేరినప్పటి నుండీ కూడా అతనికి సహవిద్యార్థులెవ్వరూ లేరు. “ ఫక్త్ మీచ్ హోతో [నేనొక్కడినే ఉండే వాడిని],” అని అతను చెప్పాడు. అప్పటికి దాదాపు 25 మంది విద్యార్థులున్న ఆ బడిలో చిట్టచివరన చేరిన విద్యార్థి కూడా అతనే. వారంతా ఘారాపురి శివార్లలోని మొరాబందర్, రాజ్‌బందర్, శేత్‌బందర్ అనే మూడు పల్లెలకు చెందినవారు. ఈ పల్లెలన్నింటికీ కలిపి దాదాపు 1,100 వరకు జనాభా ఉంటుంది. మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో ఉన్న ఘారాపురి దీవి, ప్రముఖ పర్యాటక స్థలమైన ఎలిఫెంటా గుహలకు ప్రసిద్ధి. ఈ దీవిని చేరుకోవాలంటే, దక్షిణ ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా నుండి పడవ మార్గంలో ఒక గంట సేపు ప్రయాణించాలి.
ఓ పదేళ్ళ ముందువరకు, ఔచిత్ వెళ్లే- 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఉన్న- జిల్లా పరిషత్ (ZP) పాఠశాలలో 55-60 మంది విద్యార్థులు చదివేవారు. ఒక్కో ఏడాదీ వారి సంఖ్య క్రమంగా క్షీణిస్తూ వచ్చి, చివరికి 2019లో కేవలం 13 మంది విద్యార్థులు మాత్రమే మిగిలారు. 2020 మార్చి నాటికి వారి సంఖ్య ఏడుకు చేరుకుంది. 2020-21 విద్యా సంవత్సరంలో ముగ్గురు విద్యార్థులు 7వ తరగతి పూర్తి చేశారు. మరో ఇద్దరు వేరే ప్రాంతానికి తరలిపోవడంతో ఇద్దరు మాత్రమే మిగిలారు. వారు- 6వ తరగతిలోని ఔచిత్, 7వ తరగతిలోని గౌరి మాత్రే. “ఇక్కడ చదువు సరిగ్గా సాగటంలేదు. అందుకే అందరూ వెళ్లిపోవడం మొదలుపెట్టారు,” అని గౌరి చెప్పింది.
ఇలా విద్యార్థులు బడివదిలి వెళ్లిపోవడానికి పలు కారణాలు ఉన్నాయి -- ఈ పాఠశాల ఉన్న దీవి ప్రాంతం, దాన్ని చేరుకోవడానికి ప్రయాణించాల్సిన దూరం వల్ల ఉపాధ్యాయులు అక్కడికి వచ్చినా కొద్ది కాలానికే వదిలేసి వెళ్లిపోవడం, దీవిలో అరకొరగా ఉండే వసతులు, పరిమితమైన ఉపాధి అవకాశాలు, కొద్దిపాటి ఆదాయంతోనే కుటుంబాలను నెట్టుకు రావాల్సిన పరిస్థితులు, విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదవాల్సిన అవసరం, అలాగే ఘారాపురి పాఠశాలలో మరాఠీ మాధ్యమంలో చదివిన తర్వాత పైచదువుల కోసం బయటకు వెళ్లినప్పుడు ఆ విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు – మొదలైనవి.
ఈ పాఠశాలలో పూర్తి స్థాయిలో విద్యార్థులు ఉన్నప్పుడు కూడా ఆ బడికి విద్యుత్తు, నీటి సరఫరా వంటి వసతులు లేవు. 2000 సంవత్సరం నుండి ఘారాపురికి సాయంత్రం 7 గంటల నుండి 10 గంటల వరకు జనరేటర్ ద్వారా విద్యుత్తు సరఫరా మొదలైంది. 2018 నుండి మాత్రమే, విద్యుత్తు నిలకడగా సరఫరా అవుతోందని (2019 నుండి నీటి సరఫరా కూడా మెరుగయ్యిందని) గ్రామవాసులు తెలిపారు.
ఏదేమైనా, బడి మూతపడకుండా ఉండటానికి ఎంతో కృషి జరిగింది. 2014-15 సంవత్సరాలలో ఒక కంప్యూటర్‌ను, ఒక ల్యాప్‌టాప్‌ను ఏర్పరిచారు (వాటిని సాయంత్రం పూట విద్యుత్తు లభించే సమయంలో మాత్రమే ఛార్జింగ్ చేయగలిగేవాళ్లు). అవిప్పుడు ఒక తరగతి గదిలో వ్యర్థంగా మూలన పడివున్నాయి. “వీటి సాయంతో కొద్ది కాలం పాటు [మా ఫోన్ ఇంటర్నెట్‌ను ఉపయోగించి] యూట్యూబ్ ద్వారా పిల్లల గేయాలు, గణితం వంటి వాటిని బోధించేవాళ్లం,” అని రణ్యా కుఁవర్ అనే ఉపాధ్యాయుడు చెప్పారు. ఔచిత్ ఏకైక విద్యార్థిగా ఉన్న తరగతిగదిలో ఆయన కూర్చుని ఉన్నారు.
అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్నప్పుడు కూడా, 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు అన్ని తరగతులను, అన్ని పాఠ్యాంశాలను కేవలం ముగ్గురు ఉపాధ్యాయులే బోధించేవారు. కొన్నిసార్లు పలు తరగతులు ఒకేసారి ఒకే గదిలో జరిగేవి, మిగిలిన విద్యార్థులు తరగతి బయట, లేదా బయట ఉన్న ఒక చిన్న మైదానంలో కూర్చునే వారు.
ఏళ్ల తరబడి ఈ దీవికి ప్రయాణించి వెళ్లి తమ విధులను నిర్వర్తించడానికి ఉపాధ్యాయులు మొగ్గుచూపడం లేదు. ఘారాపురిని చేరుకోవడానికి గల ఒకే మార్గం, ప్రతి రోజూ ఉరణ్ తాలూకా లోని ఇతర గ్రామాల గుండా అరగంట పాటు పడవలో ప్రయాణం చేయడం. వర్షాకాలంలో (జూన్ నుండి సెప్టెంబర్ వరకు) భారీ వర్షాల వల్ల, ఎత్తుగా ఎగసిపడే అలల వల్ల తరగతులకు మరింత అంతరాయం కలుగుతుంది. ఘారాపురిలో సరైన వసతులు లేకపోవడం వల్ల కూడా ఉపాధ్యాయులు విముఖత చూపుతారు. ఇక్కడ రేషన్ షాపులు, బ్యాంకులు, వైద్య కేంద్రాలు ఏవీ లేవు. అందువల్ల ఉపాధ్యాయులు తరచుగా బదిలీ చేయించుకుని వెళ్లిపోతారు.
“ఉపాధ్యాయులెవ్వరూ కొన్ని నెలలకు మించి ఉండరు,” అని 14 ఏళ్ల గౌరి చెప్పింది. “ఒక్కొక్కరు ఒక్కో విధంగా పాఠాలు చెప్పేవారు. వారి పద్ధతులకు అలవాటు పడటానికి మాకు సమయం పట్టేది.”
అయితే ఆ ఉపాధ్యాయులలో ఒకరైన రణ్యా (52) ఈ గ్రామంలోనే (తన భార్య సురేఖతో కలిసి) నివాసం ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకు గాను నెలకు రూ. 500 అద్దె చెల్లించి ఒక ఇంట్లో ఉంటున్నారు. “ఇన్నేళ్ల పాటు మేం ఇక్కడే ఉంటామని అనుకోలేదు. ఇక్కడ ఉద్యోగం ఒక సంవత్సరం పాటు ఉంటుందని నాకు చెప్పారు,” అని రణ్యా అన్నారు. మహారాష్ట్రలోని ధులే జిల్లాకు చెందిన ఈయన 2016 సంవత్సరం మధ్యలో ఘారాపురిలో ఉపాధ్యాయునిగా విధులు చేపట్టారు. 2019 దీపావళి సమయంలో పక్షవాతానికి గురై, చికిత్స కోసం ఈ గ్రామాన్ని విడిచి వెళ్లారు. 2020 ఆగష్టులో తిరిగి వచ్చి చూస్తే బడిలో ఔచిత్, గౌరి మాత్రమే మిగిలారు. ఆ నెల, రణ్యా మాత్రమే ఏకైక ఉపాధ్యాయునిగా మిగలడంతో, జిల్లా పరిషత్ కార్యాలయంవారు మరొక టీచర్‌ను పార్ట్-టైం పనిచేయాల్సిందిగా నియమించారు.
2021 సెప్టెంబర్ 3వ తేదీన, రాయ్‌గడ్ జిల్లా పరిషత్ విద్యా విభాగం వారు ఘారాపురి గ్రామ సర్పంచ్ అయిన బలిరామ్ ఠాకూర్‌కు ఒక నోటీసును పంపారు. ఒకే ఒక్క విద్యార్థి (ఔచిత్) మాత్రమే మిగిలి ఉన్నందువల్ల ఆ బడిని మూసివేసి,ఇంకెవరైనా విద్యార్థులు మిగిలి ఉంటే వారిని (ఉరణ్‌లోని) దగ్గర్లోని పాఠశాలలకు బదిలీ చేయాల్సిందిగా సూచించారు.
పాఠశాలను కొనసాగించాలని బలిరామ్ పట్టుబట్టారు. “ఒక్క విద్యార్థి ఉన్నా కూడా ఈ బడిని నేను మూయలేను. మా గ్రామం ఉన్న చోటు వల్ల, దగ్గర్లో వేరే బడులేవీ లేకపోవడం వల్ల, మా పరిస్థితి ఎంతో ప్రత్యేకమైనది,” అని ఆయన చెప్పారు. ఉచిత, నిర్బంధ విద్యను పొందడం చిన్నారుల హక్కు (2009) చట్టాన్ని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం, 5వ తరగతి వరకు విద్యార్థులకు ఒక కిలోమీటర్ దూరంలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాలి, అలాగే 8వ తరగతి వరకు విద్యార్థులకు మూడు కిలోమీటర్ల లోపు ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాలి.
“విద్య ఆవశ్యకత ఇక్కడి కుటుంబాలను ఊరు వదిలి వెళ్ళిపోయేలా చేసింది. తమ పిల్లలు [ఉరణ్‌లోని] ఇతర పాఠశాలలలో చదువుకోగలిగేందుకు ఇక్కడి కుటుంబాలు తరలివెళ్లాయి. మా గ్రామంలోని [పాఠశాల] నాణ్యతను మెరుగుపరిచేందుకు మాకు మద్దతు లభించి ఉంటే, ఇక్కడి తల్లిదండ్రులు ఇలా తరలిపోయేవాళ్లు కాదు,” అని బలిరామ్ చెప్పారు.
ఈ దీవికి చెందిన విద్యార్థులు ఎంతో కాలంగా తమ విద్యా అవసరాల కోసం ఉరణ్ తాలూకా లోని ఇతర గ్రామాలకు, లేదా నవీ ముంబైకు తరలి వెళ్లేవారు. అక్కడ వాళ్ళు తమ బంధువుల ఇళ్లలో బస చేస్తారు, లేదా కుటుంబం అంతా వలస వెళ్లి అద్దె ఇళ్లల్లో నివసిస్తారు. వారికి ముంబై కూడా దగ్గరదే అయినా, ఘారాపురిలోని కుటుంబాలకు ముంబై నగరంలో నివాస ఖర్చులను భరించే స్తోమత లేదు. వారిలో అధికులు వ్యవసాయంపై ఆధారపడే కోలి సామాజిక వర్గానికి చెందినవారు (ఓబీసీగా వర్గీకరించబడతారు). వారు టోపీలు, చలువ కళ్లద్దాలు, జ్ఞాపకార్థంగా కొనే వస్తువులు మొదలైన వాటిని ఈ దీవికి వచ్చే పర్యాటకులకు విక్రయించడం ద్వారా, లేదా ఎలిఫెంటా గుహల వద్ద పర్యాటకం మీద ఆధారపడే చిన్నపాటి పనులు చేసుకుంటూ ఉపాధిని పొందుతున్నారు.
“వేరే ఊరికి వలస వెళ్లాలంటే ఎన్నో ఖర్చులను భరించాల్సి ఉంటుంది. వాటిలో స్కూలు ఫీజులు మాత్రమే కాదు, ఇంటిని అద్దెకు తీసుకోవడానికి ధరావతు, అద్దెలతో పాటు ఇతరత్రా నిత్యావసరాల ఖర్చులు కూడా ఉంటాయి. అంతే కాక, విద్యార్థుల తల్లిదండ్రులు పని వెతుక్కోవాల్సి ఉంటుంది,” అని ఔచిత్ తల్లి వినంతి మాత్రే (38) చెప్పారు. “మేము వలస వెళ్లలేము, ఖర్చులకు డబ్బు సంపాదించడం ఎలా? వీలైతే ఔచిత్‌ను హాస్టల్‌కు పంపాలని ఉంది. ఇక్కడి ఉన్నత పాఠశాలను మూసివేశారు. లాక్‌డౌన్ వల్ల మా ఆదాయం కూడా [పలు నెలల పాటు] నిలిచిపోయింది.”
రేవుకట్ట నుండి ఎలిఫెంటా గుహల వరకు ఉండే 120 మెట్ల మార్గంలో వినంతి, ఆమె భర్త నీతిన్ (42) ఒక దుకాణాన్నినడుపుతున్నారు. 2020 మార్చి నెలలో లాక్‌డౌన్ విధించడానికి ముందు ప్రతి నెలా రూ. 6-7 వేలు సంపాదించగలిగేవారు. ఆ తర్వాత పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో విక్రయాలు సన్నగిల్లి, ఏడాదిలో కొన్ని నెలలకు మాత్రమే ఆ మాత్రం ఆదాయాన్ని సంపాదించగలుగుతున్నారు. ఈ గుహలను పర్యవేక్షించే భారతీయ పురావస్తు శాఖతో అనుబంధితమై ఉన్న కొందరు కాంట్రాక్టర్లు నీతిన్‌ను 2019లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన గుహలను శుభ్రం చేసే ఉద్యోగంలో నియమించారు. అందుకుగాను, నెలకు రూ. 12 వేల జీతం ఇచ్చేవారు. ఆ ఏడాది వారి పెద్ద కుమారుడు ఆదిత్య (18) ఆ గ్రామ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేయడమే కాక, నీతిన్ జీతం వల్ల పైచదువుల కోసం ఉరణ్‌కు తరలి వెళ్లగలిగాడు. (చెల్లింపుల విషయంలో వివాదాలు ఏర్పడినందువల్ల ఈ ఉద్యోగాన్ని 2022 మార్చి నెలలో కోల్పోయానని నీతిన్ చెప్పారు.)
ఘరాపురిలోని KES సెకండరీ విద్యాలయాన్ని కొంకణ్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ 1995లో ప్రారంభించింది. 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు మరాఠీ మాధ్యమంతో ఉన్న ఈ పాఠశాలలోనే ఆదిత్య చదివాడు. ఈ ఉన్నత పాఠశాల ప్రారంభమైనపుడు సువర్ణ కోలి (40) అనే ఒక అంగన్‌వాడీ కార్యకర్త తాను ఎంతగా సంతోషించారో వివరించారు:
“[1992లో] నేను 7వ తరగతి పూర్తి చేశాక అంతకు మించి చదవడానికి అప్పట్లో బడి
లేదు,” అని ఆమె చెప్పారు. “దాంతో పెళ్లైనా చేసుకోవాలి లేదా ఏదైనా దుకాణంలో పనిలోకి
చేరాలి - ఇవి రెండే దారులని మా అమ్మనాన్నలు చెప్పారు.” సువర్ణ తల్లి ఆ గ్రామంలో ఒక
చిన్న టిఫిన్ బండిలో వంట చేసేవారు, ఆమె తండ్రి వ్యవసాయం చేస్తూ
సర్పంచ్
కు సహాయకుడిగా పని చేసేవారు. సువర్ణ నర్సు వృత్తిని
చేపట్టాలని ఆశించేవారు. అది నెరవేరకపోయినప్పటికీ, ఉత్తమ శ్రేణి మార్కులతో “[1998లో]
10వ తరగతి అయినా పూర్తి చేయగలిగాను,” అని ఆమె చిరునవ్వుతో చెప్పారు.
ఫీజులు లేని KES సెకండరీ విద్యాలయం ఉన్నత స్థితిలో ఉన్నపుడు, దాదాపు 30 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులు బోధించేవారు. వారిలో నవనీత్ కాంబ్లే ఒకరు. ఘారాపురిలో తాను ఉపాధ్యాయుడిగా పని చేసిన 12 ఏళ్లలో ఆరేళ్లపాటు ఆ గ్రామంలోనే నివాసమున్నారు. ఆయనకు పెళ్లయ్యాక, ఉరణ్ నుండి పడవలో ప్రయాణించి వచ్చేవారు. "ఎనిమిదవ తరగతిలో చేరిన విద్యార్థులు [వారి అస్థిరమైన జిల్లా పరిషత్ పాఠశాల విద్య తర్వాత] చదువును అందిపుచ్చుకునేందుకు కష్టపడతారు; చాలామంది ఆసక్తి కోల్పోయారు కూడా," అని ఆయన చెప్పారు.
క్రమంగా, ఈ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య, విద్యార్థుల సంఖ్య రెండూ తగ్గుతూ వచ్చాయి. నిధుల కొరతతో సతమతమై, ఒక్కో ఏడాది ఒక తరగతి చొప్పున మూసివేయడం మొదలుపెట్టారు. 2018లో ఎనిమిదవ తరగతిని, 2019లో తొమ్మిదవ తరగతిని, అలాగే చివరికి 2020లో పదవ తరగతిని మూసివేశారు.
ఇలా ఉన్నత పాఠశాలను, దానితో పాటు అతికష్టం మీద నెగ్గుకొస్తోన్న జిల్లా పరిషత్ పాఠశాలను మూసివేయడం అనేది, విద్యా రంగ (గ్రామీణ) స్థితిగతులపై వార్షిక నివేదిక (2020 అక్టోబర్) సిఫార్సులకు పూర్తిగా విరుద్ధం. ఈ నివేదిక ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటోన్న, వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన పిల్లలకు లాక్‌డౌన్ తర్వాత మరింత సహాయం అందాల్సిన అవసరం ఉంది.
ఘారాపురిలో 0-6 ఏళ్ల వయస్సు గల దాదాపు 40 మంది పిల్లల కోసం అంగన్‌వాడీ కార్యకర్త సువర్ణ కోలీ, తన సహోద్యోగితో కలిసి అంగన్‌వాడీ క్లాసులను నడుపుతున్నారు. అయితే 6-14 ఏళ్ల వయసున్న 21 మంది పిల్లలలో ఎవ్వరూ ఆ దీవిలోని జిల్లా పరిషత్ పాఠశాలలోచేరలేదు. (కోలీ, రణ్యా కుఁవర్, ఆయన భార్య సురేఖ వేర్వేరుగా సర్వే చేసి ఈ వివరాలను సేకరించారు). ఘారాపురిలోని విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా పరిషత్ పాఠశాల క్రమంగా క్షీణించడాన్ని గమనించి, అది త్వరలోనే మూతబడుతుందని అంచనా వేసి, తమ పిల్లలను ఉరణ్‌లోని ఇతర పాఠశాలలలో చేర్పించడం మొదలుపెట్టారు.
ఉన్నత పాఠశాల మూతబడిపోవడంతో జిల్లా పరిషత్ పాఠశాలలో చదివే పిల్లలు 7వ తరగతి తర్వాత ఘారాపురిని వదిలి వెళ్లక తప్పలేదు. వారిలో కల్పేశ్ మాత్రే (16) ఒకరు. అతను న్హావా గ్రామంలోని పాఠశాలకు బదిలీ చేయించుకుని, కొన్ని నెలల తర్వాత దానికి వెళ్లడం కూడా ఆపేశాడు. “ బస్, నహీ హో రహా థా (నా వల్ల కాలేదు),” అని ఆయన చెప్పాడు. కల్పేశ్ ఆ దీవిలోనే ఒక కుర్సీవాలా గా పని చేయడం మొదలుపెట్టాడు. మరో ముగ్గురితో కలిసి పర్యాటకులను ఒక చెక్క కుర్చీపై మోస్తూ గుహల వరకు తీసుకెళ్తారు. నలుగురు వ్యక్తులు ఉండే ఒక టీమ్ రోజుకు అలాంటి ట్రిప్పులు 3-4 పూర్తి చేస్తే, ఒక్కో ట్రిప్పుకు రూ. 300-500 సంపాదిస్తారు.
ఘారాపురిలోని కొందరు విద్యార్థులు మాత్రం పైచదువులకు వెళ్ళగలిగారు. గౌరి అక్క, భావిక మాత్రే ఈ గ్రామ ఉన్నత పాఠశాలలోనే 2016లో 10వ తరగతి పూర్తి చేసి పన్వేల్‌లో బి. ఎ. పట్టా సాధించింది. 2020లో తన తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె ఘారాపురికి తిరిగి వచ్చి తమ దుకాణంలో తినుబండారాలను, అలంకరణ సామాగ్రిని విక్రయిస్తోంది. గౌరి పన్వేల్‌లో తమ బంధువుల ఇంట్లో ఉంటూ 8వ తరగతి చదువుతోంది.
“ఆయి, బాబా (అమ్మ, నాన్న) మమ్మల్ని బాగా చదువుకోమని ప్రోత్సహించేవారు. అమ్మ 8వ తరగతి వరకు చదివింది. ఇంకా చదువుకోవాలని ఉండింది కానీ సాధ్యపడలేదు. నాన్న నావికాదళంలో చేరాలనుకున్నారు కానీ తన తండ్రి చనిపోవడంతో ఇంటి బాధ్యతను తీసుకున్నారు,” అని భావిక (20) చెప్పారు. “మా నాన్న మమ్మల్ని కూర్చోబెట్టి హిందీ, గణితం నేర్పేవారు. అన్నీ నేర్చుకోమని చెప్పేవారు. తనే సొంతంగా పెయింటింగ్ నేర్చుకున్నారు, ఊరిలో పెళ్లిళ్ళకు డీజేగా కూడా పనిచేసేవారు. నన్ను కుట్టుపని, టైపింగ్ వంటి ఇతర క్లాసులలో కూడా చేర్పించారు. మమ్మల్ని పోటీ పరీక్షలు రాసి ఐఎఎస్‌కు దరఖాస్తు చేయమని, లేదా న్యాయవాద వృత్తి చేపట్టాలని కోరుకునేవారు...”
ఘారాపురి వాసులు విద్యను పొందడంలో ఎదురయ్యే ఒడిదుడుకుల వల్ల భావిక వంటి అతికొద్ది మంది మాత్రమే పై చదువులకు కొనసాగగలుగుతున్నారు. గ్రామీణ భారతదేశంలో 15 ఏళ్ల పైబడిన వాళ్లలో డిగ్రీ పట్టా లేదా అంతకంటే ఎక్కువ చదివిన వారి శాతం కేవలం 5.7 మాత్రమేనని విద్యపై సామాజిక వినియోగం (ఎన్‌ఎస్‌ఎస్ 75వ రౌండ్ 2017-18) నివేదిక పేర్కొంది. మహారాష్ట్రలోని పల్లెల్లో ఆ సంఖ్య కాస్తంత మెరుగ్గా, 12.5 శాతం వద్ద ఉంది. విద్యార్థులు పైచదువులకు కొనసాగలేకపోవడానికి గల కారణాలను ఈ నివేదిక వివరించింది - పాఠాలు లేదా బోధనా మాధ్యమం కష్టతరం కావడం, స్కూలుకు చాలా దూరం ప్రయాణించాల్సి రావడం, ఆర్థిక ఇబ్బందులు, ఇంటి పనులు లేదా సంపాదన కోసం పనుల్లోకి చేరడం వంటివి ఇందుకు కారణాలు.
ఇలా పైచదువులను కొనసాగించలేకపోయినవారిలో సోనల్ మాత్రే (23) ఒకరు. ఈమె ఉరణ్‌లో బంధువుల ఇంట్లో ఉండి 2016లో 12వ తరగతి పూర్తి చేశారు. ఆమె తల్లి చిప్స్ విక్రయించే దుకాణాన్ని నడుపుతారు, ఆమె తండ్రి ఉరణ్‌లో పడవ నడుపుతూ నెలకు రూ. 5 వేలు సంపాదిస్తారు. వీరిద్దరి సంపాదనతో ఇల్లు గడవడం కష్టం కావడంతో ఆమె ఘారాపురికి తిరిగి రావాల్సి వచ్చింది.
వినయ్ కోలీ కూడా 2019లో ఉరణ్‌లో 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత మరాఠీ మాధ్యమంలో కామర్స్ కోర్సు చేయడానికి ప్రయత్నించి తర్వాత వదిలేశారు. ఎందుకంటే, ఆ కోర్సులో అకౌంట్స్ సబ్జెక్ట్ మాత్రం ఆంగ్లంలో బోధించేవారు. “ఏం రాసుందో అర్థం చేసుకోవడానికే చాలా సమయం పట్టేది,” అని ఆయన చెప్పారు. 2020 జనవరి నుండి, ఎలిఫెంటా గుహలలో టికెట్ కలెక్టరుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన రూ. 9 వేల జీతానికి పని చేస్తున్నారు.
ఘారాపురిలోని కొందరు విద్యార్థులు 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత, ఒకటి-రెండు సంవత్సరాల పాటు వృత్తివిద్యా కోర్సులను పూర్తి చేస్తారు. వీటి ద్వారా, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వెల్డర్, టర్నర్ మొదలైన వృత్తులలో ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. “ఇటువంటి కోర్సుల వల్ల ‘బ్లూ-కాలర్ (శారీరక శ్రమ ఉండే కార్మిక రంగ) ఉద్యోగాలు దొరుకుతాయి,” అని భావుసాహెబ్ చాస్కర్ చెప్పారు. ఈయన అహ్మద్‌నగర్‌కు చెందిన విద్యా రంగ సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయుడు. “ఉన్నత విద్యను అందుకోలేని వాళ్లలో అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులే సాధారణంగా ఉంటారు.”
ఘారాపురి దీవిలో ప్రస్తుతానికి ప్రాథమిక విద్య లభించే మార్గం కూడా మూసుకుపోయింది.
ఈ నిబంధన వల్ల ఘారాపురి ఎంపిక అవ్వడం సాధ్యపడదు.
ఔచిత్ ఈ సంవత్సరం 7వ తరగతి పూర్తి చేయడంతో, ఈ బడిలో వేరే విద్యార్థులెవరూ మిగల్లేదు కాబట్టి ఈ దీవిలోని జిల్లా పరిషత్ పాఠశాల ఏప్రిల్ నెల నుండి మూతబడుతుంది.
అనువాదం : శ్రీ రఘునాథ్ జోషి