కోరై గడ్డి కోతలో నైపుణ్యం ఉన్నవారు ఆ మొక్కను 15 సెకన్లలోపే కోసి, దాన్ని అర నిమిషంలో విదిలించి, ఇంకొన్ని నిమిషాలలోనే ఒక బండిల్‌గా కట్టగలరు. గడ్డి లాగా ఉండే ఆ మొక్క వాళ్ల కంటే ఎత్తుగా ఉంటుంది, ఒక్కో బండిల్ దాదాపు అయిదు కిలోల బరువు ఉంటుంది. ఒక్కొక్కరు అలాంటి 12-15 బండిల్స్ ఒకేసారి అలవోకగా నెత్తిన పెట్టుకుని మండుటెండలో దాదాపు అర్ధ కిలోమీటర్ నడిస్తే వారికి వచ్చే ఆదాయం ఒక బండిల్‌కు కేవలం 2 రూపాయలు మాత్రమే.

రోజు చివరికి, ఒక్కొక్కరు తలా కనీసం 150 కోరై బండిల్స్ కడతారు. ఇది తమిళనాడులోని కరూర్ జిల్లాలోని నదీ తీర పొలాల్లో పుష్కలంగా పెరుగుతుంది.

కావేరి నదీ తీరాన కరూర్ జిల్లాలో మణవాసి గ్రామానికి చెందిన నత్తమేడు అనే బస్తీలో కోరై గడ్డి కోసే కార్మికులు - దాదాపు అందరూ మహిళలే - విరామం అనేదే లేకుండా రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తారు. దట్టంగా పెరిగిన గడ్డిని వంగి కోసి, చేతులతోలే ఆ గడ్డి కాడలను నూర్పిడి చేసి, బండిల్స్‌గా కట్టి, వాటిని కలెక్షన్ పాయింట్ వద్దకు తీసుకు వెళ్తారు. ఇందుకు నైపుణ్యం, సత్తువ అవసరం. ఇది ఎంతో కష్టమైన పని కూడా.

వాళ్లలో చాలా మంది, తాము చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుండి కోరై గడ్డిని కోస్తున్నాము అని చెప్పారు. "నేను పుట్టినప్పటి నుండి, కోరై కాడు (అడవి) చుట్టూనే నా ప్రపంచం ఉండేది. నాకు పదేళ్ల వయసు ఉన్నప్పటి నుండి ఈ పొలాల్లో పని చేస్తున్నాను, అప్పట్లో రోజుకు మూడు రూపాయల ఆదాయం వచ్చేది," అని ఎ. సౌభాగ్యం (59) చెప్పింది. ఇప్పుడు తన ఆదాయంతో ఐదుగురు ఉన్న కుటుంబాన్ని పోషిస్తోంది.

ఎమ్. మగేశ్వరి (33), స్కూలుకు వెళ్లే ఇద్దరు కొడుకులు ఉన్న ఒక వితంతువు. తన తండ్రి తనను ఆవుల పెంపకానికి, కోరై గడ్డిని కోయడానికి పంపడం గుర్తు చేసుకుంది. "నేను స్కూల్లో కనీసం అడుగు కూడా పెట్టలేదు" అని చెప్పింది. "ఈ కోరై పొలం నాకు మరో ఇల్లు లాంటిది." ఆర్. సెల్వి (39) తన తల్లి అడుగుజాడల్లో నడిచింది. "అమ్మ కూడా కోరై కోత పనే చేసేది. నేను కూడా చిన్నప్పటి నుండి ఈ పని చేయడం మొదలు పెట్టాను," అని ఆమె చెప్పింది.

వీడియో చూడండి: కరూర్‌లో కోరై గడ్డి కోత

ఈ మహిళలు తమిళనాడులో బ్యాక్‌వర్డ్ క్లాస్‌గా గుర్తించబడ్డ ముత్తరాయర్ సామాజిక వర్గానికి చెందిన వారు, వీరంతా తిరుచిరాపల్లి జిల్లాకు చెందిన అమూర్ గ్రామం నుండి వచ్చారు. ముసిరి తాలూకాలో నత్తమేడు నుండి 30 కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ గ్రామం కూడా కావేరి నదీ తీరాన ఉంది. కానీ అమూర్ గ్రామ పరిసర ప్రాంతాల్లో జరుగుతోన్న ఇసుక మైనింగ్ కారణంగా, ఆ గ్రామంలో నీటి కొరత ఏర్పడింది. "కాలువలో కొద్దో గొప్పో నీరు ఉన్నప్పుడు మా గ్రామంలో కోరై గడ్డి మొలుస్తుంది. ఈ మధ్య కాలంలో, నదిలో అసలు నీరే లేకుండా పోయినందువల్ల పని వెతుక్కుంటూ మేము చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోంది," అని మగేశ్వరి చెప్పింది.

అందువల్ల, అమూర్ గ్రామ వాసులు తమకు పొరుగు జిల్లా అయిన కరూర్‌లో సాగు అవుతోన్న పొలాలకు ప్రయాణించి వెళ్తారు. అక్కడికి బస్సులో లేదా లారీలో తమ సొంత ఖర్చుపై చేరుకుని రోజుకు రూ. 300 సంపాదిస్తారు. వి. ఎమ్. కణ్ణన్ (47) తన భార్య కె. అక్కండి (42)తో కలిసి కోరై గడ్డి కోస్తాడు. "కావేరి నీటిని బయటి వాళ్లకు ధారపోస్తున్నారు, మాలాంటి స్థానికులకు చుక్కైనా మిగలడం లేదు" అని తన పరిస్థితిలోని విషాదాన్ని ఎత్తి చూపాడు.

ఎ. మారియాయి (47) పదిహేనేళ్లప్పటి వయసు నుండి కోరై గడ్డి కోత పని చేస్తోంది. "అప్పట్లో రోజుకు 100 బండిల్స్ కట్టేవాళ్లం. ఇప్పుడు కనీసం 150 కట్టి, 300 రూపాయలు సంపాదిస్తున్నాం. గతంలో రోజు కూలీ బాగా తక్కువగా ఉండేది, ఒక బండిల్‌కు 60 పైసలు మాత్రమే ఇచ్చేవాళ్లు" అని ఆమె చెప్పింది.

కణ్ణన్ పన్నెండేళ్ల వయసున్నప్పుడు రోజుకు రూ. 8 సంపాదనతో కోరై కోత మొదలుపెట్టాడు. "1983లో ఒక బండిల్‌కు రేట్ 12.5 పైసలు ఉండేది" అని అతను గుర్తు చేసుకున్నాడు. కేవలం పదేళ్ల ముందు మాత్రమే, కాంట్రాక్టర్లను పలుమార్లు వేడుకున్న తర్వాత ఆ రేట్‌ను ఒక బండిల్‌కు రూ.1 గా, ఆ తర్వాత రూ.2 గా మార్చారు అని ఆయన చెప్పాడు.

అమూర్ గ్రామానికి చెందిన కార్మికులను పనిలోకి పెట్టుకున్న మణి అనే కాంట్రాక్టర్, కోరై గడ్డిని వాణిజ్య పంటగా సాగు చేయడానికి 1-1.5 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నాడు. పొలాల్లో నీటి స్థాయి తక్కువగా ఉన్నప్పుడు ఆ భూమిపై అద్దె ఎకరాకు నెలకు రూ. 12 వేల నుండి 15 వేల వరకు ఉంటుంది అని అతను చెప్పాడు. "నీటి స్థాయి ఎక్కువ ఉన్నప్పుడు అద్దె 3-4 రెట్లు ఎక్కువ అవుతుంది". నెలకు తన నికర ఆదాయం ఒక ఎకరాకు రూ వెయ్యి నుండి 5 వేల మధ్య మాత్రమేనని చెప్పినా, అంతకంటే ఎక్కువ ఉండే అవకాశాలున్నాయి.

Left: V.M. Kannan (left) and his wife, K. Akkandi (right, threshing), work together in the korai fields. Most of the korai cutters from Amoor are women
PHOTO • M. Palani Kumar
Left: V.M. Kannan (left) and his wife, K. Akkandi (right, threshing), work together in the korai fields. Most of the korai cutters from Amoor are women
PHOTO • M. Palani Kumar

ఎడమ: వి. ఎమ్. కణ్ణన్ (ఎడమ), అతని భార్య కె. అక్కండి (కుడి, కాడలను నూర్పిడి చేస్తోంది) కోరై పొలాల్లో కలిసి పని చేస్తారు. అమూర్ గ్రామానికి చెందిన కోరై కోత కార్మికులలో అధిక శాతం మహిళలే

కోరై, బురదనేలల్లో పెరిగే ఒక రకమైన తుంగ మొక్క, అది సైపరేషీ ఫ్యామిలీకి చెందినది, దాదాపు 6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ప్రముఖమైన పాయ్ (చాప) మరియు ఇతర ఉత్పత్తుల తయారీ కేంద్రమైన ముసిరిలోని కోరై చాపల నేత పరిశ్రమల కోసం దానిని కరూర్ జిల్లాలో వాణిజ్య పంటగా సాగు చేస్తారు.

ఈ పొలాల్లోని కార్మికుల శ్రమ మీదే ఈ పరిశ్రమ ఆధారపడుతుంది. రోజుకు రూ. 300 సంపాదించడానికి ఆ మహిళలు తెల్లవారుజామున ఆరింటికల్లా పని మొదలు పెట్టి, తమ ఒళ్లు వంచి పొడవైన ఆ మొక్కలను కొడవలితో నరుకుతూ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. వర్షాకాలంలో కొన్ని రోజులు తప్ప, సంవత్సరం పొడుగునా వాళ్లు పని చేస్తారు.

పని చాలా భారంగా ఉంటుందని 44 ఏళ్ల జయంతి చెప్పింది. "నేను ప్రతి రోజూ నాలుగింటికి నిద్ర లేచి, కుటుంబ సభ్యుల కోసం వండి, హడావుడిగా బస్సు ఎక్కి, పొలానికి వచ్చి పని మొదలుపెడతాను. ఇక్కడ నేను సంపాదించే డబ్బుతోనే బస్సు ఛార్జీ, తిండి ఖర్చు, ఇంటి ఖర్చులు నడవాలి.”

"నాకు వేరే దారి ఉందా? ఈ పని ఒక్కటే నాకు దొరికేది," అని మగేశ్వరి చెప్పింది. ఆమె భర్త నాలుగేళ్ల క్రితం గుండె పోటుతో మరణించాడు. "నాకు ఇద్దరు కొడుకులు, ఒకడు 9వ తరగతిలో, ఇంకొకడు 8వ తరగతిలో చదువుతున్నారు," అని ఆమె చెప్పింది.

ఆ మహిళలంతా, కోరై గడ్డి కోత ద్వారా వచ్చే ఆదాయంతో తమ ఇంటి ఖర్చులను నెగ్గుకొస్తున్నారు. "రెండు రోజుల పాటు నేను ఈ గడ్డిని కోయకపోతే, ఇంట్లో తినడానికి తిండి ఉండదు," అని నలుగురు కుటుంబ సభ్యులను పోషిస్తోన్న సెల్వి చెప్పింది.

PHOTO • M. Palani Kumar

రోజంతా వంగి కోత కోయడం వల్ల ఎమ్. జయంతికి ఛాతీలో నొప్పి వస్తోంది. తన ఆదాయంలో అధిక మొత్తం వైద్య ఖర్చులకే వెచ్చించాల్సి వస్తోంది.

కానీ డబ్బు సరిపోవడం లేదు. "నా చిన్న కూతురు నర్సింగ్ కోర్సు చదువుతోంది, నా కొడుకేమో 11వ తరగతిలో ఉన్నాడు. వాడి చదువు కోసం డబ్బు ఎక్కడి నుండి తేవాలో నాకు అర్థం కావడం లేదు. కూతురి ఫీజుల కోసం చేసిన అప్పుని తీర్చడంలోనే  ఇంకా మునిగి ఉన్నాను," అని మారియాయి చెప్పింది.

వాళ్ల ఆదాయం రోజుకు రూ. 300కు పెరగడం వల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదు. "గతంలో రోజుకు రూ. 200 ఆదాయం ఉన్నప్పుడు, ఎన్నో కూరగాయలను కొనగలిగే వాళ్లం. ఇప్పుడు 300 వచ్చినా కూడా సరిపోవడం లేదు," అని సౌభాగ్యం చెప్పింది. అయిదు మంది సభ్యులున్న తన కుటుంబంలో తన తల్లి, భర్త, కొడుకు, కోడలు ఉన్నారు. "నా ఒక్క జీతమే అందరినీ పోషిస్తోంది.”

ఇక్కడి కుటుంబాలలోని పురుషులు మద్యానికి బానిసలుగా మారతారు కాబట్టి మహిళల ఆదాయంపైనే పూర్తిగా ఆధారపడతారు. "నా కొడుకు మేస్త్రీ పని చేస్తాడు. రోజుకు రూ. వెయ్యి దాకా బాగానే సంపాదిస్తాడు. కానీ తన భార్యకు అయిదు పైసలు కూడా ఇవ్వకుండా మొత్తం అంతా మద్యం మీదే ఖర్చు పెడతాడు. అతడి భార్య అడిగితే, ఆమెను దారుణంగా కొడతాడు. నా భర్తకు బాగా వయసైపోయింది, ఏ పనీ చేయలేడు."

ఇంతటి కష్టంతో కూడిన పని వల్ల ఆ మహిళల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. "రోజంతా వంగి ఉండి కోత కోస్తాను కాబట్టి నాకు ఛాతీలో చాలా నొప్పి వస్తుంది" అని జయంతి చెప్పింది. "ప్రతి వారం ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. బిల్లు 500-1000 రూపాయల మధ్య ఉంటుంది. నేను సంపాదించేది అంతా మందుల ఖర్చులకే వెళ్తున్నట్టు అనిపిస్తుంది."

"ఈ పనిని ఇంకెంతో కాలం కొనసాగించలేను," అని మారియాయి తన వ్యథను వెల్లబుచ్చింది. కోరై కోత పనిని ఆపేయాలని ఆమె అనుకుంటోంది. "నా భుజాలు, నడుము, ఛాతీ, చేతులు, కాళ్లలో నొప్పి ఉంటుంది. పదునుగా ఉండే ఈ మొక్క చివర్లు తగిలి నా చేతులు పాదాలు గోక్కుపోయాయి. ఈ ఎండలో అది ఎంత బాధాకరంగా ఉంటుందో మీకు తెలుసా?"

PHOTO • M. Palani Kumar

తిరుచిరాపల్లి జిల్లా, ముసిరి తాలూకాకు చెందిన అమూర్ గ్రామ మహిళలు కోరై గడ్డి కోత పని ద్వారా డబ్బు అర్జించేందుకు తమ పొరుగు ఊరైన కరూర్‌కు ప్రయాణించి వెళ్తున్నారు. గడ్డి లాగా ఉండే ఈ పొడవాటి తుంగ మొక్క తమిళనాడులోని కావేరి నదీ తీరపొలాల్లో పుష్కలంగా పెరుగుతుంది.

PHOTO • M. Palani Kumar

ఎ. మారియాయి 30 ఏళ్లకు పైగా కోరై పొలాల్లో పని చేస్తోంది. ఈ మధ్యన, తన ఒంట్లో బాగా నొప్పులు వస్తున్నాయి, వంగి కోరై కాడలను ఎత్తలేకపోతోంది. కోరై కోత ద్వారా వచ్చిన ఆదాయంతో తన ఐదుగురు కూతుళ్లను, ఒక కొడుకును చదివించింది. అంతే కాక తన మొదటి ముగ్గురు కూతుళ్లకు పెళ్లి కూడా చేయగలిగింది.

PHOTO • M. Palani Kumar

ఎమ్. మగేశ్వరి, ఒక వితంతువు, ఆమె ఇద్దరు కొడుకులు హై స్కూల్లో చదువుతున్నారు. జీవితం అంతా కష్టాలే ఎదురయ్యాయని ఆమె చెప్పింది. "నేను అసలెన్నడూ స్కూలుకు వెళ్లలేదు. అది గుర్తొచ్చినప్పుడల్లా పశ్చాత్తాప్పడుతూ ఉంటాను. చదువుకుని ఉంటే, వేరే ఏదైనా పని చేసుకోగలిగే దానిని." తన చిన్ననాటి నుండి ఆమె కోరై కోత పని చేస్తూనే ఉంది

PHOTO • M. Palani Kumar

కొరై కాడలలో ఎండిపోయిన భాగాన్ని వేరు చేయడానికి ఆర్. సెల్వి వాటిని నూర్పిడి చేస్తోంది. తన జీతంతోనే నలుగురు సభ్యులున్న తన కుటుంబాన్ని పోషిస్తోంది. "నేను రూ. 300 సంపాదించినా కూడా, ఇంటిని నడిపేందుకు 100 మాత్రమే మిగులుతుంది. ఎందుకంటే నా భర్త రూ. 200 మద్యంపై ఖర్చు పెడతాడు. మా ఇళ్లల్లో మగవాళ్లు మద్యానికి అలవాటు పడకపోయి ఉంటే జీవితం ఇంకాస్త బాగుండేదేమో," అని ఆమె చెప్పింది.

PHOTO • M. Palani Kumar

మగేశ్వరి (ఎడమ) ఆర్. కవిత కంట్లోని ధూళిని తుడవడంలో సాయం చేస్తోంది, మరో వైపు ఎస్. రాణి (కుడి) తన కళ్లలోని ధూళిని టవల్‌తో తుడుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. కోరై గడ్డిని నూర్పిడి చేసేటప్పుడు ఎగిసిపడే ధూళి వల్ల ఈ మహిళలు తమ కళ్లలో ఇరిటేషన్‌ను తరచుగా ఎదుర్కొంటూ ఉంటారు.

PHOTO • M. Palani Kumar

తెల్లవారుజామున ఆరు గంటలకు మొదలయ్యే ఈ కార్మికుల పని షెడ్యూల్‌లో కేవలం పది నిమిషాలు మాత్రమే విశ్రాంతి దొరుకుతుంది. కూర్చోవడానికి నీడ లేదు కాబట్టి ఎండలోనే అందరూ కలిసి కూర్చుని టీ తాగుతున్నారు

PHOTO • M. Palani Kumar

కోసిన కోరై గడ్డి బండిల్‌ను ఎత్తి నూర్పిడి చేసేందుకు ఎమ్. నిర్మల సిద్ధమవుతోంది. ఈ బండిల్స్‌ను తిరుచిరాపల్లి జిల్లాలో కోరై చాపల అల్లికకు కేంద్రమైన ముసిరిలోని ప్రాసెసింగ్ యూనిట్లకు పంపుతారు.

PHOTO • M. Palani Kumar

తన బలమంతా వాడి కవిత ఒక బండిల్‌ను నూర్పిడి చేస్తోంది. కాడల నుండి ఎండిపోయిన భాగాన్ని వేరు చేయడానికి బలంతో పాటు నైపుణ్యం కూడా కావాల్సి ఉంటుంది. ఈ పనిలో అనుభవం ఉన్న మహిళలు ఒక బండిల్‌ను కట్టడానికి ఎంత కోయాలో సరిగ్గా అంతే కోస్తారు.

PHOTO • M. Palani Kumar

సరదాగా ఆటపట్టిస్తూ, ఎప్పుడూ నవ్వుతూ ఉండే కవిత, పని చేసేటప్పుడు ఇతరులను నవ్విస్తుంది. తన పెళ్లి అయ్యాక, ఆమె కోరై కోత పని మొదలు పెట్టింది.

PHOTO • M. Palani Kumar

ఎడమ నుంచి కుడికి: ఎస్. మేఘల, ఆర్. కవిత, ఎమ్. జయంతి, కె. అక్కండి విరామం అనేదే లేకుండా మండుటెండలో పని చేస్తున్నారు. వేసవి నెలల్లో ఉష్ణం నుండి సాంత్వన కోసం తమ మీద నీళ్లు చల్లుకుని పని చేయడం కొనసాగిస్తారు.

PHOTO • M. Palani Kumar

మేఘల భర్త అనారోగ్యంతో మంచాన పడటంతో, జీవనోపాధి కోసం ఆమె కోరై కోత పని మొదలు పెట్టింది

PHOTO • M. Palani Kumar

ఎ. కామాట్చి భర్త 20 ఏళ్ల ముందు చనిపోగా, ఆమె కొడుకు 2018లో మరణించాడు. 66 ఏళ్ల వయసులో ఒంటరిగా ఉంటూ, జీవనోపాధి కోసం కోరై కోత పని చేసుకుంటోంది

PHOTO • M. Palani Kumar

కార్మికులు ఆ బండిల్స్‌ను నేల మీద బలంగా బాది వాటిని లెవెల్ చేస్తున్నారు. అవన్నీ ఒకే ఎత్తు ఉండేలా కాంట్రాక్టర్ మణి (ఎడమ) వాటి కొనలు కత్తిరిస్తున్నాడు.

PHOTO • M. Palani Kumar

ఎ. వసంత ఎంతో నైపుణ్యంతో తన కాళ్లు, కాలి వేళ్లను ఉపయోగించి ఒక బండిల్‌ను పైకి లాక్కుంటోంది. ఎవ్వరి సహాయం లేకుండానే, తన నడుము దాకా లాక్కుని ఆ తర్వాత తన తల మీదకు ఎక్కించుకుంది. ఒక్కో బండిల్ దాదాపు ఐదు కిలోల బరువు ఉంటుంది.

PHOTO • M. Palani Kumar

ఈ మహిళలు ఒకే సారి 10-12 బండిల్స్ తమ తలల మీద బ్యాలెన్స్ చేయగలరు. మండుటెండలో దాదాపు అర్ధ కిలోమీటర్ నడిచి, కలెక్షన్ పాయింట్ వద్ద ఈ బండిల్స్‌ను దింపుతారు. "ఈ పని చేయడంలో భద్రత ఉందని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ పని చేసే ఆడవాళ్లలో చాలా మంది నా బంధువులే" అని మగేశ్వరి చెప్పింది

PHOTO • M. Palani Kumar

మారియాయి భారీ బాధ్యతను మోస్తోంది. "నిద్ర లేవడం, ఇక్కడికి [పొలాలకు] హడావుడిగా రావడం, రోజంతా పని చేయడం, హడావుడిగా తిరిగి వెళ్లడం -- నాకు అసలు విశ్రాంతే ఉండదు. నాకు ఒంట్లో బాలేకపోయినా, ఇంట్లో తలవాల్చలేను. ఇక్కడికి వచ్చి, పని మధ్యలో విశ్రాంతి తీసుకుంటాను"

PHOTO • M. Palani Kumar

బండిల్స్‌ను కలెక్షన్ పాయింట్ దగ్గరికి మోసుకు వస్తారు, అక్కడి నుండి లారీలోకి ఎక్కించి ప్రాసెసింగ్ కోసం తీసుకు వెళ్తారు

PHOTO • M. Palani Kumar

ఆ రోజు పనిని పూర్తి చేసిన తర్వాత చివరికి దాదాపు మధ్యాహ్నం రెండు గంటలకు కార్మికులు భోజనం చేస్తారు. "మాకు దగ్గర్లోనే పని దొరికితే, మధ్యాహ్నం ఒంటి గంట కల్లా ఇల్లు చేరుకుంటాం. లేకపోతే, ఇల్లు చేరే సరికి సాయంత్రం లేదా కొన్ని సార్లు రాత్రి కూడా అవుతుంది," అని వసంత చెప్పింది

ఈ ఆర్టికల్‌ను రాయడంలో అపర్ణ కార్తికేయన్ గారు సహకారం అందించారు.

అనువాదం: శ్రీ రఘునాథ్ జోషి

M. Palani Kumar

এম. পালানি কুমার পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার স্টাফ ফটোগ্রাফার। তিনি শ্রমজীবী নারী ও প্রান্তবাসী মানুষের জীবন নথিবদ্ধ করতে বিশেষ ভাবে আগ্রহী। পালানি কুমার ২০২১ সালে অ্যামপ্লিফাই অনুদান ও ২০২০ সালে সম্যক দৃষ্টি এবং ফটো সাউথ এশিয়া গ্রান্ট পেয়েছেন। ২০২২ সালে তিনিই ছিলেন সর্বপ্রথম দয়ানিতা সিং-পারি ডকুমেন্টারি ফটোগ্রাফি পুরস্কার বিজেতা। এছাড়াও তামিলনাড়ুর স্বহস্তে বর্জ্য সাফাইকারীদের নিয়ে দিব্যা ভারতী পরিচালিত তথ্যচিত্র 'কাকুস'-এর (শৌচাগার) চিত্রগ্রহণ করেছেন পালানি।

Other stories by M. Palani Kumar
Translator : Sri Raghunath Joshi

Sri Raghunath Joshi obtained a Masters degree in Engineering but switched careers to pursue his love of Telugu language. Currently he works remotely as Telugu-Language Lead at a Localization firm based in Noida. He can be contacted at [email protected]

Other stories by Sri Raghunath Joshi