ఇందులో ఇద్దరున్నారు, అని రోపి ప్రైవేట్ మెటర్నిటీ క్లినిక్ లో డాక్టర్ కి చాలా విశ్వాసంగా చెప్పింది. ఆమె వద్ద అల్ట్రా సౌండ్ రిపోర్ట్ కూడా లేదు.
రోపి మన్ను బేటే రెండేళ్ల క్రితం జరిగిన ఈ విషయాన్ని చాలా ఆనందంగా, కాస్త గొప్పగా చెప్పింది. “కాన్ మే వో లాగాయా(చెవుల్లో అవి పెట్టుకుంది)”, డాక్టర్ స్టెతస్కోప్ ఎలా వాడిందో అనుకరించి చూపిస్తూ చెప్పింది. నీరసంగా ఉన్న ఆ గర్భవతి మధ్యస్తంగా ఉన్న పొట్టను చూసి, చివరగా కాదని చెప్పింది ఆ డాక్టరు.
“మేడం, దో హోతా, దో(రెండు మేడం, రెండు ఉన్నాయి),” ఆమె వెనక్కి వెళ్లి ఆ క్లినిక్ లోని ప్రసూతి గదిలో స్టూల్ మీద కూర్చోబోతూ మళ్లీ అన్నది. ఈశాన్య మహారాష్ట్రలోని మెల్ఘాట్ అడవుల అంచున ఉన్నవారి గ్రామమైన జైతదేహికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరాట్వాడా పట్టణంలో70 పైబడిన రోపి, ప్రసూతి నొప్పులు అనుభవిస్తూ తల్లి కాబోతున్న ఆ యువతి పక్కనే ఉంది
సాయంత్రానికి ఒక బాబు పుట్టాడు, ఇంకొన్ని సెకండ్ల తరవాత రెండవ శిశువు తల బయటకు వచ్చింది. ఈసారి ఒక పాప, బాబుకి కవల చెల్లెలు.
రోపి గట్టిగా నవ్వి, ఆ వరండాకి ఒక చివర ఉన్న పరుపు లేని చెక్క మంచం మీద కూర్చుంది. నేలంతా ఆవు పేడతో అలికి, సంప్రదాయపు మట్టి గోడలున్న ఇంటిలో, ఆమె ఉంది. లోపల, చెక్క బద్దల కప్పు ఉన్న మిగిలిన మూడు గదులు ఖాళీగా ఉన్నాయి. ఆమె కొడుకులు వారికున్న 2 ఎకరాల నేలను సాగుచేయడానికి వెళ్లారు.
ఆమె కొరుకు భాషలో ఒక తిట్టుని తిట్టింది- గాడిద గుప్తావయవాలు దాన్ని అచ్చమైన అర్ధం. ఆ తిట్టుని మళ్ళీ తిట్టి మళ్ళీ నవ్వింది. ఆమె మొఖం పై ముడతలు మరింత లోతుకు సాగినాయి. “నేను ఆమెకి అదే చెప్పాను”, ఆ సిటీ డాక్టర్ ని జ్ఞాపకం చేసుకుని లోపల తిట్టుకుంది.











