నీటి ఎద్దడికీ వర్షాభావానికీ మారుపేరైన నేలపై పుట్టిందీ జానపద గీతం. కచ్ (కచ్చ్ అని కూడా అంటారు) ప్రాంతపు తరగని వైవిధ్యాన్నీ, ప్రజలనూ 'తియ్యని నీరు'గా వర్ణించే పాట.
లాఖో ఫులాని (క్రీ.శ. 920) వెయ్యేళ్ళ క్రితం కచ్, సౌరాష్ట్ర, సింధ్ ప్రాంతాల్ని పరిపాలించాడు. తన ప్రజల్ని అంకితభావంతో ప్రేమించే రాజుగా అతను ప్రసిద్ధి చెందాడు. ఈనాటికీ జనం అతని ఉదారమైన పరిపాలనను తలచుకుంటూ అంటుంటారు,"లక్ఖా తో లాఖో మలాశే పాన్ ఫులానీ ఎ ఫేర్ (లాఖో అనే పేరున్నవాళ్ళు లక్షమంది ఉండొచ్చు కానీ లాఖో ఫులాని మాత్రం ఒకడే."
ఈ పాట అతన్ని గురించి చెబుతుంది. ఇంకా ఈ ప్రాంతపు సంస్కృతికి పునాదిగా ఉన్న మత సహనాన్ని గురించీ, సామరస్యాన్ని గురించీ కూడా ప్రస్తావిస్తుంది. హిందువులూ ముస్లిములూ కూడా దర్శించుకునే హాజీపీర్ వలి దర్గా, దేశదేవిలో ఉన్న ఆశాపురా ఆలయం వంటి ఎన్నో ప్రార్థనా స్థలాలు కూడా కచ్‌లో వున్నాయి. ఈ జానపద గీతం, ఫులాని కారా గ్రామంలో కట్టించిన కారాకోట్ వంటి చారిత్రక కట్టడాల విశేషాల గురించి కూడా చెప్తుంది.
ఈ పాట, సంకలనంలోని ఇతర జానపదాలన్నింటి మాదిరే ప్రేమ, బంధం, విరహం, పెళ్ళి, మాతృభూమి మొదలుకొని లింగ వివక్షపై అవగాహన, ప్రజస్వామ్య హక్కులు మొదలైన విషయాలన్నిటినీ స్పృశిస్తోంది.
కచ్ ప్రాంతపు 341 జానపద గేయాలను PARI మల్టీమీడియా రూపంలో భద్రపరిచింది. ఇక్కడ వినే పాట స్థానిక గాయకులు వారి భాషలో పాడినది. ఇదే జానపద గీతాన్ని చదవడానికి వీలుగా పాఠకుల సౌలభ్యం కోసం గుజరాతీ లిపిలోనూ, ఇంకా ఆంగ్లంతో సహా ప్రస్తుతం ప్రచురిస్తోన్న 14 భాషల్లో PARI అందుబాటులో ఉంచింది.
కచ్ 45,612 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సున్నితమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. కచ్‌కు దక్షిణాన సముద్రం, ఉత్తరాన ఎడారి ఉన్నాయి. భారతదేశంలోని అతిపెద్ద జిల్లాలలో ఒకటైన కచ్ క్రమం తప్పకుండా నీటి కొరతతోనూ, కరవు సమస్యలతోనూ పోరాడే పాక్షిక ఉష్ణమండల ప్రాంతం కిందకు వస్తుంది.
విభిన్న కులాలు, మతాలు, వర్గాలు కచ్‌లో నివసిస్తున్నాయి. వారిలో ఎక్కువ మంది గత 1,000 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి వలస వచ్చిన ప్రజల వారసులు. హిందువులు, ముస్లిమ్‌లు జైనులు వంటి మతాలు, రబారీ, గఢవీ, జాట్, మేఘ్వాల్, ముత్వా, సోఢా రాజ్‌పుత్, కోలి, సింధీ, దర్బార్ వంటి ఉప సమూహాలు ఉన్నాయి. కచ్‌కు చెందిన సంపద్వంతమైన బహుళ వారసత్వం దాని ప్రత్యేక దుస్తులు, ఎంబ్రాయిడరీ, సంగీతం, ఇతర సాంస్కృతిక సంప్రదాయాలలో ప్రతిబింబిస్తుంది. 1989లో స్థాపించిన కచ్ మహిళా వికాస్ సంఘటన్ (కెఎమ్‌విఎస్) ఈ ప్రాంత ప్రజలను సంఘటితపరుస్తూ వారి సంప్రదాయాలను పరిరక్షించడం కోసం పనిచేస్తోంది.



