రేఖకు పదిరోజుల క్రితమే, పెళ్లి చేసుకోవడం తప్ప తనకు వేరే గత్యంతరం లేదని అర్థమైపోయింది. ఆమె 15 ఏళ్ళ పిల్ల ఎంత వ్యతిరేకించగలదో అంత వ్యతిరేకత చూపింది కానీ ఆమె అమ్మానాన్న ఆ విషయాన్ని పట్టించుకోలేదు. “ఆమె ఏడ్చి తనకు ఇంకా చదువుకోవాలని ఉంది అని చెప్పింది”, అంది ఆమె తల్లి భాగ్యశ్రీ.
భాగ్యశ్రీ, ఆమె భర్త అమర్, ఇద్దరు వయసురీత్యా 30ల ఆఖరు అంచులో ఉన్నారు, మహారాష్ట్ర లోని బీడ్ జిల్లాలో ఒక పేద గ్రామంలో వారి పిల్లలతో కలిసి బ్రతుకుతున్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ లో వాళ్ళు పశ్చిమ మహారాష్ట్ర లేక కర్ణాటకకు చెరకు పంటను కోయడానికి వెళ్తారు. ఆరునెలలు విపరీతంగా కష్టపడ్డాక వారిద్దరికి కలిపి 80,000 రూపాయిలు వస్తాయి. వారి పేరు మీద భూమి లేదు, చెరకు పంట కోత మాత్రమే వారి కుటుంబ సంపాదన. వీరిది దళిత వర్గానికి చెందిన మాతంగి కులం.
ప్రతిసారి తన తల్లిదండ్రులు వలస వెళ్ళినప్పుడు. రేఖ, ఆమె తోబుట్టువులు(ఒకరికి 12, మరొకరికి 8 ఏళ్ళు) వాళ్ల నాయనమ్మ దగ్గర ఉండేవారు. కానీ ఆమె పోయిన సంవత్సరం మే నెలలో చనిపోయింది. ఈ పిల్లలు ముగ్గురూ ఊరు బయటనున్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కానీ మార్చ్ 2020 లో వచ్చిన ఈ మహారోగం అన్ని బడులను బలవంతంగా మూయించినప్పుడు, 9వ తరగతి చదువుతున్న రేఖ, ఇంట్లోనే ఉండిపోవలసి వచ్చింది. 500 రోజులు గడిచిపోయినా బీడ్ లో బడులు ఇంకా మూతబడే ఉన్నాయి.
“మాకు, బడులు ఇప్పటిలో తెరవరని అర్థమైంది.” అన్నది భాగ్యశ్రీ. “బడి తెరిచి ఉన్నప్పుడు, అక్కడ టీచర్లు, పిల్లలు చుట్టూ ఉండేవారు. ఊరు హడావిడిగా ఉండేది. బడి మూసేసాక, ఆమెని వదిలి ఎక్కడికి వెళ్లలేకపోతున్నాం. జాగ్రత్త పడాలి కదా.”
కాబట్టి భాగ్యశ్రీ, అమర్, రేఖను 22 ఏళ్ళ ఆదిత్యకి ఇచ్చిపెళ్లి చేసేశారు. ఆదిత్య వాళ్ళ ఊరు వీరి ఊరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్ళు కూడా వలస కూలి పనికే వెళ్తారు. నవంబర్ 2020లో చెరుకు పంటను కోసే సమయంలో, రేఖ, ఆదిత్య పశ్చిమ మహారాష్ట్రకు వెళ్లారు. ఆమె పేరు మాత్రం స్కూల్ రిజిస్టరులో ఉండిపోయింది.
కౌమార వయసులో ఉన్న రేఖ, ఆమె వంటి చిన్నవయసులో ఉన్న అమ్మాయిలు ఈ మహారోగం వలన బలవంతంగా పెళ్లి లోకి తోసివేయబడుతున్నారు. మార్చ్ 2021 లో విడుదల చేసిన UNICEF నివేదిక లోని కోవిద్ 19: పురోగతికి బాల్యవివాహాల ముప్పు అధ్యాయం, ఈ దశాబ్దపు చివరకు ప్రపంచంలో 10 మిలియన్ల అమ్మాయిలకు బాల్యవివాహ ముప్పు ఉందని చెబుతుంది. బడులు మూతబడడం, పేదరికం పెరగడం, తల్లిదండ్రుల చావు, ఇంకా కోవిడ్ వలన వచ్చే వేరే సమస్యల వలన, “ఇప్పటికే ఘోరంగా ఉన్న అమ్మాయిల పరిస్థితి మరింత ఘోరంగా మారుతోందని” ఆ నివేదిక చెబుతోంది.
గత 10 ఏళ్లుగా, బాల్యవివాహాలు 15 శాతం తగ్గాయి, దగ్గరగా 25 మిలియన్ పెళ్లిళ్లు ఆపగలిగారు, అని UNICEF నివేదిక చెబుతోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ మహారోగం, ఈ పురోగతికి మళ్లీ ముప్పు తెస్తోంది- ముఖ్యంగా మహారాష్ట్ర లో.








