"మా అబ్బూ (నాన్న) దినకూలీగా పనిచేసేవాడు. కానీ చేపలు పట్టడమంటేనే ఇష్టం. ఏవో తిప్పలుపడి కిలో బియ్యం కొనుక్కోవడానికి సరిపడా డబ్బు మాత్రమే ఇచ్చి పత్తా లేకుండా పోయేవాడు... మిగతా అవసరాలన్నీ మా అమ్మీయే (అమ్మ) చూసుకోవాల్సి వచ్చేది," అన్నారు, బేల్డాంగాలోని ఉత్తర్‌పారా ప్రాంతంలో ఉన్న తన ఇంటి డాబాపైన కూర్చునివున్న కోహినూర్ బేగం..
‘‘ఆ కిలో బియ్యంతోనే మా అమ్మీ నలుగురు పిల్లల ఆకలి తీర్చాలి. మా దాదీ (నాయనమ్మ), మా అబ్బూ(నాన్న), మేనత్త, ఆమె కూడా తినాలి," అంటూ కాస్త ఆగి మళ్లీ అంది. దీనికి తోడు చేపలకు ఎరగా వెయ్యడానికి అన్నం కావాలంటాడు మా అబ్బూ. అలాంటి మనిషితో ఎలా వేగేది?"
కోహినూర్ ఆపా(అక్క)కు 55 ఏళ్లు. పశ్చిమ బెంగాల్, ముర్షీదాబాద్‌లోని జానకినగర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారుచేసే వంటమనిషిగా పనిచేస్తున్నారు. ఖాళీ సమయంలో బీడీలు చుడుతుంటారు. బీడీ కార్మిక మహిళల హక్కుల కోసం పోరాడుతుంటారు. ముర్షీదాబాద్‌లో అత్యంత నిరుపేద మహిళలే ఈ శారీరక ఆరోగ్యాన్ని పాడుచేసే పనిని చేస్తుంటారు. చిన్న వయసు నుంచే నిరంతరం పొగాకుతో పనిచేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా చదవండి: పొగచూరిపోతున్న మహిళా బీడీ కార్మికుల ఆరోగ్యం
2021 డిసెంబర్ నెలలో ఓ ఉదయం, ఒక బీడీ కార్మికుల సమావేశానికి హాజరై వచ్చిన కోహినూర్ ఆపా, ఈ విలేకరితో మాట్లాడారు. ఆ తర్వాత, తన బాల్యం గురించి తీరుబడిగా చాలా ముచ్చట్లు చెప్పారు. తాను సొంతంగా బాణీ కట్టిన ఒక పాట - ఎంతో శ్రమతో కూడుకున్న పని అయిన బీడీలు చుట్టడం గురించి, అక్కడ కార్మికుల శ్రమను దోచుకునే పని పరిస్థితుల గురించీ - పాడారు.
తన బాల్యంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండడంతో చాలా కష్టాలు పడ్డామని కోహినూర్ ఆపా చెప్పారు. అలాంటి పేదరికం ఓ బాలికకు దుర్భరంగా ఉంటుంది. "నాకు తొమ్మిదేళ్లున్నప్పుడు ఓ రోజు ఇంటిగోల నడమ అమ్మీ ఏడుస్తూ కనిపించింది. చుల్హా (మట్టిపొయ్యి)లో బొగ్గు, ఆవు పేడతో చేసిన పిడకలు, కట్టెలు వేసి మంట రాజేస్తోంది. వండటానికి ఇంట్లో చారెడు గింజలు కూడా లేవు."






