ఆర్. కైలాసం బ్యాంకు నుంచి కలవరపడుతూ బయటికి వచ్చాడు. “ప్రతిసారి నా పాస్ బుక్ అప్డేట్ చేయడానికి వెళ్ళినప్పుడు, మెషిన్ రిపేర్ లో ఉందని, మరోసారి రమ్మని పంపించేస్తారు.” అన్నాడు.
తన బ్యాంకు పాస్ బుక్ ని అప్డేట్ చేయించడం కోసం అతను తన కుగ్రామం, బంగాలమేడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కే జి కండగై గ్రామంలోని బ్యాంకుకి వెళ్ళడానికి రెండు గంటలు నడుస్తాడు. (సంవత్సరం క్రితం వరకు అతని గ్రామానికి కిలోమీటర్ దూరం వరకు ఒక బస్సు నడిచేది, కానీ ఇప్పుడది నిలిపివేశారు.)
అతని అసలు పోరాటం బ్యాంకు వద్ద మొదలవుతుంది. తమిళనాడు తిరువళ్లూరు జిల్లా లో ఉన్నకెనరా బ్యాంకు, కే జి కందిగై బ్రాంచ్ కి స్వయంగా పని చేసే యంత్రం లో పాస్ బుక్ ఎంట్రీలు వేసుకోవచ్చు. కానీ కైలాసం దాన్ని ఎప్పుడూ వాడలేకపోయాడు. “నాకు అది పని చెయ్యదు”, అంటాడు.
ఒక రోజు ఉదయం అతను తన బాంక్ కష్టాల గురించి నా దగ్గర వెళ్ళబోసుకుంటుండగా, అక్కడే ముళ్లతుమ్మ చెట్టు నీడ కింద కూర్చున్న కొంత మంది ఆడవారు కూడా సంభాషణలో మా కలిశారు. “నీ బుక్ లో ఎంట్రీలు వేయించుకోవాలంటే, స్టికర్ పెట్టించుకోవాలి తాత”, అని ఒకరు చెప్పారు. వాళ్లు చెప్పినది నిజమే. కైలాసం పుస్తకం లో బార్ కోడ్ లేదు. అది ఉంటేనే యంత్రం పని చేస్తుంది. “వాళ్ళు నా పుస్తకం లో స్టికర్ ఎందుకు వెయ్యలేదో నాకు తెలీదు. నాకు ఇటువంటి విషయాలు అర్థం కావు.” అని చెప్పాడు. అక్కడున్న ఆడవాళ్లకి కూడా స్పష్టంగా తెలియక రకరకాల సూచనలు ఇచ్చారు. “నీ దగ్గర ATM కార్డు ఉంటే నీకు ఒక స్టికర్ వస్తుంది”, అన్నది ఒకామె. “నువ్వు 500 రూపాయిలు కట్టి ఒక కొత్త అకౌంట్ తెరవాలి”, అన్నది మరొకామె. “ఒకవేళ అది జీరో అకౌంట్ అయితే నీకు అది రాదు”, చెప్పింది మూడో ఆమె. కైలాసానికి మళ్లీ ఏమి అర్థం కాలేదు.
ఈ బాంకు యుద్ధాలు అతనికి మాత్రమే సొంతం కాదు. బంగాలమేడు లో ఉన్న ఎందరికో వారి అకౌంట్లనీ చూసుకోవడం, డబ్బులు డ్రా చేయడం, వారి బాలన్స్ చూసుకోవడం - ఇవన్నీ అంత తేలికైన పనులు ఏమి కావు. ఈ కుగ్రామం - అధికారికంగా దీన్ని చెరుక్కనూర్ ఇరులార్ కాలనీ అని పిలుస్తారు - తిరుత్తణి బ్లాక్‌లోని ఓపెన్ స్క్రబ్‌ల్యాండ్ మధ్యలో ఉన్న ఒకే వీధి. వీధికి ఇరువైపులా చిన్న గుడిసెలు, కొన్ని పక్కా ఇళ్ళు- మొత్తం కలిపి 35 ఇరులా కుటుంబాలు ఉన్నాయి. (ఈ సంఘం పేరు ఇప్పుడు అధికారిక పత్రాలలో ఇరులార్ అని పిలువబడుతుంది.)
అరవైఏళ్ల కైలాసం, నలభై అయిదేళ్ల అతని భార్య సంజయమ్మ మట్టి గోడలున్నపూరింట్లో ఉంటున్నారు. వాళ్లకు నాలుగు మేకలు, వీటిని సంజయమ్మ చూసుకుంటుంది. వీరి నలుగురు పిల్లలు పెద్దయ్యి వాళ్ళ కుటుంబాలతో వేరే ఇళ్లకు మారిపోయారు. రోజు కూలి పని చేసుకునే కైలాసం ఏమంటాడంటే,” నేను రోజంతా పొలం లో ఒంగి పని చెయ్యాలి. దానివలన నాకు తీవ్రమైన వెన్నునొప్పి వస్తుంది, నా ఎముకలు నొప్పి పుడతాయి. నేను చెరువు తవ్వడానికి (MGNREGA పని) వెళ్తే బావుంటుందని అనుకున్నాను.” మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయమెంట్ గారంటీ ఆక్ట్ 2005 లో ప్రతి యొక్క గ్రామీణ కుటుంబానికీ సంవత్సరానికి కనీసం 100 రోజుల పనిని ఇస్తుంది. కానీ ఇలా పని ఇవ్వడం, బంగాలమేడు లో ఎప్పుడో తప్ప జరగదు.











