షెనోలిలో ఆ చారిత్రాత్మకమైన రైల్వే ట్రాక్ వద్ద ఒక చిన్న వేడుకలా, చరిత్రను గుర్తిస్తూ వారిని సన్మానిద్దామనుకున్నాం. కానీ ఆ వేసవి మధ్యాహ్నం 3 గంటలకు వేడుకలో పాల్గొనడానికి 250 మంది దాకా వచ్చారు. చాలామంది 80 లలో 90 లలో ఉన్న వృద్ధులు, ఆ రైల్వే లైన్ వద్ద చిందరవందరగా- పార్క్ లో చిన్నపిల్లల్లా గుమిగూడి ఉన్నారు. వారికి ఇదొక కలయిక, రకరకాల పాయలలో స్వాతంత్య్ర పోరాట యోధులందరూ కలుసుకునే సందర్భం. ఆ వృద్ధ విప్లకారులు గోపాల్ గాంధీని ఆలింగనం చేసుకుని, ‘మహాత్మా గాంధీకి జై’ అని నినాదాలిచ్చారు. ముఖ్యంగా కెప్టెన్ భాను. ఆయన కళ్ళు గర్వంతో తడిసాయి. ఆరోగ్యం బాలేకున్నా వీరందరిని కలవాలని గట్టిపట్టు మీద వచ్చాడు. 94 ఏళ్ళ మాధవరావు మన్నే, ట్రాక్ చుట్టూ చురుకైన బాలుడిలాగా తిరుగుతుంటే, నేను ఆయన పడిపోతాడేమోనని ఆయన వెనుకే పరుగులు తీస్తున్నా. ఆయన పడలేదు. నవ్వునూ వీడలేదు.
ఆ తరవాత మేము, ట్రాక్ కిందుగా, ఎక్కడైతే 74 ఏళ్ళ క్రితం సైనికులు రైలుని ఆపి ఎక్కారో అక్కడికి వెళ్లాము. అక్కడొక చిన్న స్మారక చిహ్నం ఉంది- అది విప్లవకారులు ఏర్పరచింది కాదు, బ్రిటిష్ ఇండియన్ రైల్వేవారు ఆ దాడికి దుఃఖ చిహ్నంగా ఉంచారు. బహుశా ఇప్పుడక్కడ ఇంకో స్మారక చిహ్నం పెట్టాలేమో, ఆ రోజుకు అసలు అర్థాన్ని వివరిస్తూ.
ఆ తరవాత షెనోలికి 20 నిముషాల దూరంలో ఉన్న కుండల్ లో ఏర్పాటు చేసిన పెద్ద వేడుకలో పాల్గొనడానికి వెళ్ళాము. 1943లో ప్రతిసర్కార్ కుండల్ లో ఉండేది. ఈ వేడుకను అక్కడి స్థానికులు, స్వాతంత్య్ర పోరాట యోధుల - నాగనాథ్ నాయక్వాడి కి చెందిన జి డి బాపు లాడ్, గొప్ప యోధుడైన, ప్రతిసర్కార్ అధినాయకుడైన అయిన నానాపాటిల్ వారి కుటుంబాలు నిర్వహించారు. 1943 సన్నివేశంలోని ఈ చతుష్టయంలో పాలుపంచుకున్న వారిలో పావువంతు భాగస్వామ్యం ఉన్న భాను కెప్టెన్ ఒకరే సజీవంగా ఉన్నారు. వారితో పాటే చక్కని వ్యక్తీకరణ కలిగిన ఇంకో వ్యక్తి హౌషాబాయి, నానాపాటిల్ కుమార్తె, అలానే ఆ విప్లవోద్యమంలో సభ్యురాలు కూడా - అక్కడే ఉన్నారు. ఆ వృద్ధుడైన కెప్టెన్ భాను రెండు రోజుల ముందు నుంచి రోడ్డు మీదే ఉన్నారు. అవును, మహారాష్ట్ర లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల తరఫున. ఇది గుర్తుంచుకోండి: చాలామంది స్వాతంత్య్ర పోరాట యోధులు, వారి వారసులు - రైతులు, రైతు కూలీలు.