బజరంజ్ గాయక్వాడ్ ఐదు కిలోల బరువు తగ్గినప్పుడే, జరగాల్సిన నష్టం జరిగిపోయిందని గ్రహించారు. “ఇంతకుముందు నేను ప్రతిరోజూ ఆరు లీటర్ల గేదె పాలు తాగేవాడిని; 50 బాదంపప్పులు, 12 అరటిపండ్లు, రెండు గుడ్లు, అలాగే రోజు మార్చి రోజు మాంసం తినేవాడిని.” అన్నారాయన. ఇప్పుడు, వాటినతను వారం రోజులలో, లేదా అంతకన్నా ఎక్కువ రోజులపాటు తింటున్నారు. దాంతో అతని బరువు 61 కిలోలకు పడిపోయింది.
"ఒక మల్లయోధుడు బరువు తగ్గకూడదు. అది మమ్మల్ని బలహీనపరుస్తుంది. కుస్తీ పట్టేటపుడు మంచి పోరాటాన్నివ్వడం కష్టమవుతుంది. అందుకే, శిక్షణలాగే ఖురాక్ (ఆహారం) కూడా మాకు చాలా ముఖ్యం,” అని కొల్హాపూర్ జిల్లా జునే పారగాఁవ్ గ్రామానికి చెందిన 25 ఏళ్ళ పహల్వాన్ బజరంగ్ నొక్కి చెప్పారు. పశ్చిమ మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఇతర మల్లయోధుల్లాగానే బజరంగ్ కూడా తన భారీ భోజనం కోసం చాలాకాలంగా ఎర్రమట్టి మైదానాల్లో కుస్తీ పట్టి గెలుచుకున్న సంపాదనపైనే ఆధారపడివున్నారు.
అయితే, కొల్హాపూర్‌లోని దొనోలి గ్రామంలో జరిగిన చివరి మైదాన్ (పోటీ)లో బజరంగ్ పాల్గొని 500 రోజులకు పైనే అయింది. “ఘోరంగా గాయమైనప్పుడు కూడా నేనింత సుదీర్ఘ విరామం తీసుకోలేదు!” అన్నారు బజరంగ్.













