బుధూరామ్ చిందా భయంతో వణికిపోతున్నారు. ఆయనకు కేవలం కొన్ని గజాల దూరంలో మెరుస్తోన్న వెన్నెల వెలుగులో నల్లని పెద్ద పెద్ద ఆకారాలు నిల్చొనివున్నాయి. కఠఫార్ గ్రామానికి చెందిన అరవయ్యేళ్ళ వయసున్న ఈ భుంజియా ఆదివాసీ రైతు సగం తెరచి ఉన్న తన ఇంటి తలుపు ఖాళీ గుండా తొంగిచూస్తున్నారు.
ఒడిశాలోని సునాబేడా వన్యప్రాణుల అభయారణ్యంలోని అంతర్భాగంలోనూ, తటస్థ ప్రాంతాల్లోనూ ఉన్న 52 మానవ నివాసాలలో ఒకదానిలో నివసించే ఈ రైతుకు ఈ పెద్ద క్షీరదాలను చూడటం అసాధారణమేమీ కాదు.
అయినాగానీ, "అవి నన్నూ, నా కచ్చా ఇంటినీ నిముషాలలో తొక్కిపారెయ్యగలవు అనేది తల్చుకొని నేను వణిపోయాను," అన్నారాయన. కాసేపయ్యాక ఆయన ఇంటివెనుక పెరటిలోకి వెళ్ళి, తులసి మొక్క ముందర నిల్చున్నారు. "నేను లక్ష్మీదేవినీ, ఆ పెద్ద క్షీరదాలను కూడా ప్రార్థించాను. ఆ ఏనుగుల గుంపు నన్ను చూసే ఉంటుంది."
బుధూరామ్ భార్య, 55 ఏళ్ళ సులక్ష్మి చిందా కూడా ఏనుగుల ఘీంకారాలను విన్నారు. ఆమె అక్కడికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న గ్రామంలోని తమ ఇంటిలో తన కుమారులతోనూ, వారి కుటుంబాలతోనూ కలిసివున్నారు.
సుమారు ఒక గంట సమయం గడిచాక, ఆ దళసరి చర్మపు జంతువులు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాయి
డిసెంబర్ 2020లో జరిగిన ఈ సంఘటనను తలచుకొన్న ఈ రైతు తన ప్రార్థనలు సాయంచేశాయని భావించారు.
డిసెంబర్ 2022లో ఈ ఏనుగులు తమ దారిని మార్చుకున్నప్పుడు బుధూరామ్ మాత్రమే కాకుండా, నువాపారా జిల్లాలోని 30 ఆదివాసీ గ్రామాలలో నివాసముండే ప్రజలంతా తేలికగా ఊపిరితీసుకున్నారు.











