“నా ఇద్దరు కూతుళ్ళకు ఇందుకు భిన్నమైన జీవితం కావాలనుకుంటున్నాను,” వెండి రంగులో మెరు స్తూ పొరలు పొరలు ఎండబెట్టి ఉన్న చేపల మీద ఉప్పు జల్లేందుకు ముందుకు వంగుతూ అన్నారు విశాలాచ్చి. తమిళనాడు తీరంలోని కడలూరు పాతపట్నం ఓడరేవులో గత 20 ఏళ్లుగా చేపలను ఎండబెడుతున్నారు ఈ 43 ఏళ్ళ మహిళ.
“నేనొక భూమి లేని దళిత కుటుంబంలో పెరిగాను. వరి పొలాల్లో వ్యవసాయకూలీలుగా పని చేసే నా తల్లిదండ్రులకు సహాయం చేస్తుండేదాన్ని. వాళ్ళసలు చదువుకోలేదు,” అని ఆమె తెలిపారు. విశాలాచ్చికి 15 ఏళ్ళ వయసులో శక్తివేల్తో వివాహం జరిగింది. ఆ తరువాత రెండు సంవత్సరాలకు కడలూరు జిల్లాలోని ఒక కుగ్రామమైన భీమారావునగర్లో వారి మొదటి కుమార్తె శాలిని పుట్టింది.
భీమారావునగర్లో వ్యవసాయ కూలీ పనులు దొరకకపోవడంతో, జీవనోపాధి కోసం కడలూరు పాతపట్నం ఓడరేవుకు వచ్చారు విశాలాచ్చి. అక్కడ కమలవేణిని కలిసినప్పటికి ఆమె వయస్సు 17 సంవత్సరాలు. చేపలను ఎండబెట్టడంలోని మెళకువలను, సదరు వ్యాపార సూత్రాలను ఆవిడే విశాలాచ్చికి నేర్పారు. నెమ్మదిగా విశాలాచ్చి ఆ వ్యాపారంలో ఆరితేరారు.
బహిరంగ ప్రదేశంలో చేపలను ఎండబెట్టడం అనేది చేపలను నిలవచేసే ఒక పాత ప్రక్రియ. ఉప్పులో ఊరవేయడం (సాల్టింగ్), కలప లేదా మొక్కలను మండించి, అందులోంచి వస్తున్న పొగలో చేపలను ఉంచడం (స్మోకింగ్), పచ్చడి పట్టడం వంటివి కూడా ఈ నిల్వ చేసే పద్దతులలో భాగమే. కొచ్చిలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేపట్టిన మెరైన్ ఫిషరీస్ సెన్సస్-2016 ప్రకారం, కడలూరు జిల్లాలో 5,000 మందికి పైగా ఉన్న మత్స్యకార మహిళల్లో, దాదాపు 10 శాతం మంది చేపలను ఎండబెట్టడం, చేపలను ఊరబెట్టడం (క్యూరింగ్), వాటి తోలు ఒలచటం వంటి పనులలో నిమగ్నమై ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చూస్తే, ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది; 2020-2021లో దాదాపు 2.6 లక్షల మంది మహిళలు సముద్రపు చేపల పెంపకంలో ఉన్నారని తమిళనాడు రాష్ట్ర మత్స్యశాఖ వెబ్సైట్ పేర్కొంది.

















