మహారాష్ట్రలోని ఉల్హాస్నగర్ తాలూకాలో మధ్యాహ్న సమయం. ఇప్పుడే జల్లు కురవడం ఆగింది.
థానే జిల్లాలోని ఉల్హాస్నగర్ సెంట్రల్ హాస్పిటల్ (కేంద్రీయ వైద్యశాల) ప్రవేశద్వారం ముందు ఒక ఆటోరిక్షా వచ్చి ఆగింది. ఎడమచేతిలో ఒక తెలుపు-ఎరుపు బెత్తం కర్రను పట్టుకుని జ్ఞానేశ్వర్ ఆటోలోంచి దిగారు. అతని భార్య అర్చన, జ్ఞానేశ్వర్ భుజాలను పట్టుకుని, రబ్బరు చెప్పులు బురదనీటిని చిమ్ముతుండగా అతన్ని అనుసరించారు.
జ్ఞానేశ్వర్ తన చొక్కా జేబులోంచి రెండు అయిందొందల రూపాయల నోట్లను బయటకు తీసి, ఒకదానిని ఆటో నడిపే వ్యక్తికి ఇచ్చారు. అతడు కొంత చిల్లరను వెనక్కు ఇచ్చాడు. జ్ఞానేశ్వర్ ఆ నాణేన్ని తడిమి, "అయిదు రూపాయలు" అంటూ జాగ్రత్తగా తన జేబులో వేసుకున్నారు. ముప్పైమూడేళ్ళ జ్ఞానేశ్వర్ తనకు మూడేళ్ళ వయసప్పుడు కార్నియల్ అల్సర్ కారణంగా చూపు కోల్పోయారు.
డయాలసిస్ చికిత్స కోసం, అంబర్నాథ్ తాలూకా వాంగణీలోని తమ యింటినుంచి 25 కిలోమీటర్ల దూరంలో గల ఉల్హాస్నగర్ సెంట్రల్ హాస్పిటల్కు ఆటోలో రావడానికి వీరికి రూ.480-520 ఖర్చవుతుంది. "(ఈ ప్రయాణం కోసం) నా స్నేహితుడి దగ్గర వెయ్యిరూపాయలు అప్పు చేశాను. (ఆసుపత్రికొచ్చే) ప్రతిసారీ నేను అప్పు చేయవలసిందే." అంటారు జ్ఞానేశ్వర్. నెమ్మదిగా, జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఆసుపత్రి రెండవ అంతస్తులోని డయాలసిస్ గదివైపుకు నడిచారిద్దరూ.
పాక్షికంగా చూపు దెబ్బతిన్న అర్చనకు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నట్టు ఈ సంవత్సరం మే నెలలో ముంబైలోని లోకమాన్య తిలక్ మున్సిపల్ సర్వజన ఆసుపత్రిలో నిర్ధారణ అయింది. "ఆమె రెండు కిడ్నీలూ పాడైపోయాయి," అంటారు జ్ఞానేశ్వర్; 28 యేళ్ల అర్చనకు వారానికి మూడుసార్లు హీమోడయాలసిస్ చికిత్స అవసరం.
"మూత్రపిండాలు శరీరంలోని ముఖ్యమైన అవయవాలు. అవి శరీరంలోని వ్యర్థాలనూ, అధికంగా ఉండే శారీరక ద్రవాన్నీ వ్యవస్థలోంచి తొలగిస్తాయి. మూత్రపిండాలు పని చేయనప్పుడు వ్యక్తి సజీవంగా ఉండాలంటే డయాలసిస్, లేదా మూత్రపిండాల మార్పిడి అవసరమవుతుంది" అంటారు, ఉల్హాస్నగర్ సెంట్రల్ హాస్పిటల్లో నెఫ్రాలజిస్టుగా పనిచేస్తోన్న డా. హార్దిక్ షా. భారతదేశంలో ప్రతి సంవత్సరం 2.2 లక్షల మంది కొత్తగా "చివరి దశ మూత్రపిండాల వ్యాధి (ESRD)" బారిన పడుతున్నారు. ఈ కారణంగా అదనంగా 3.4 కోట్ల డయాలసిస్ ప్రక్రియలు అవసరమవుతున్నాయి.









