గడియారపు ముల్లు తిరిగినంత ఠంచనుగా, ప్రతి నెలా గాయత్రీ కచ్చరబికి భయంకరమైన కడుపు నొప్పి పట్టుకుంటుంది. ఆ మూడు రోజుల నొప్పి ఆమె బహిష్టు అయిందనడానికి ఒకే ఒక సంకేతం. సంవత్సరం క్రితం ఆమెకు బహిష్టు ఆగిపోయింది.
"ఈ విధంగానే నేను బహిస్టునయ్యాననే విషయాన్ని తెలుసుకుంటాను. కానీ నాకు రక్తస్రావం కాదు. బహుశా ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం వల్ల నాకు రుతుస్రావానికి సరిపడా రక్తం లేకుండా పోయినట్టుంది” అని 28 ఏళ్ల గాయత్రి చెప్పింది. అమెనోరియా - ఋతుస్రావం లేకపోవడం - నెలవారీ వచ్చే కడుపులో కండరాలు పట్టేయటాన్నీ, వెన్నునొప్పినీ తగ్గించదు. నొప్పి ఎంత బాధాకరంగా ఉంటుందంటే, పురిటి నొప్పులంత తీవ్రంగా ఉంటాయని గాయత్రి చెప్పింది. "లేచి నిల్చోవడం కూడా కష్టంగా ఉంటుంది."
గాయత్రి పొడవుగా సన్నగా ఉంటుంది. అద్భుతమైన కళ్ళు, కొద్దిగా నత్తి ఉన్నట్టు మాట్లాడే శైలి. కర్నాటకలోని హావేరి జిల్లా, రాణిబెన్నూరు తాలూకాలోని అసుండి గ్రామ శివార్లలోని మాదిగర కేరి - దళిత వర్గానికి చెందిన మాదిగల కాలనీకి - చెందిన వ్యవసాయ కూలీ. ఆమె పంటలకు చేతితో పరాగ సంపర్కం చేయించడంలో నైపుణ్యం కలిగినది.
ఒక సంవత్సరం క్రితం మూత్రవిసర్జన నొప్పిగా అనిపించినప్పుడు, ఆమె తన గ్రామానికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైడగిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వైద్య సహాయం కోసం వెళ్లింది.
















