తన తలపైకి ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తోన్న తస్లా (ఇనుప బొచ్చె) కొద్ది క్షణాల పాటు కాస్త అస్థిరంగా ఉన్నట్టనిపించటంతో అమర్జీత్ కౌర్ మధ్యలోనే ఆగిపోతారు. ఆ తర్వాత, గేదెల కొట్టం నుండి సేకరించిన వ్యర్థాలను పారబోయడానికి ఆమె నెమ్మదిగా అడుగులు వేస్తూ రూడీ (పేడ కుప్ప) వైపు నడవటం ప్రారంభిస్తారు. ఒకప్పుడు సుమారు 10-12 కిలోల బరువుతో నిండిన ఆ తస్లాను తలపై మోస్తూ ఆమె నడవగలిగేవారు; కానీ 72 ఏళ్ళ ఈ వయసులో అది కష్టమైన పనే. అయితే, ఈ రోజు ఆమె తలపై ఉన్న బొచ్చె బరువు కంటే, ఆమె గుండెల్లోని బాధే ఆమెను మరింత నెమ్మదిగా కదిలేలా చేస్తోంది.
ఆమె కుటుంబం గురించి నేను అడిగిన ఒక మామూలు ప్రశ్న, అమర్జీత్ను 24 ఏళ్ళ నాటి జ్ఞాపకాల సునామీలోకి లాగేసింది. "ఉన్హాఁ దసయా పట్టి మోడ్ తే తేరా ముండా మర్ గయా యాక్సిడెంట్ నాల్ [పట్టి దగ్గరున్న మలుపులో జరిగిన ప్రమాదంలో నీ కొడుకు చనిపోయాడని వాళ్ళొచ్చి చెప్పారు]," అని చెబుతూనే ఆమె మరికొంత పశువుల పేడను పోగుచేయడానికి కింద కూర్చున్నారు. నేల మీదకు ముంగాళ్ళ మీద కూర్చుంటున్నప్పుడు ఆమె మోకాళ్ళు కిరకిర చప్పుడు చేస్తున్నాయి, ఆమె చేతులు మాత్రం యాంత్రికంగా కదులుతున్నాయి. "అతను రిక్షా నడిపేవాడు. అప్పుడు వాడి వయసు కేవలం 18 ఏళ్ళు." ఆ తర్వాత ఐదేళ్ళకు, 21 ఏళ్ళ వయసున్న తన రెండో కొడుకును కూడా ఆమె కోల్పోయారు.
36 ఏళ్ళ క్రితం, తాగుబోతు అయిన వారి తండ్రి చనిపోయినప్పుడు ఆ అబ్బాయిల వయసు కేవలం ఆరు, నాలుగు సంవత్సరాలు. అమర్జీత్కు పెళ్ళయినప్పటి నుండి ఆమె చేస్తున్న గోహా-కూడా (పశువుల పేడను ఎత్తిపోయటం) పని లేకపోయి ఉంటే, ఆమె తన కొడుకులను, ఇద్దరు కూతుళ్ళను (ఇప్పుడు వివాహితులు) పెంచగలిగి ఉండేవారుకాదు. తిరిగి తలెత్తిన దుఃఖంతో పాటు, ఆమె ఒట్టి చేతులతోనే మరింత పేడను తీస్తూ, చేతికొచ్చినంత పేడను బొచ్చెలో పోస్తున్నారు. ఆ బొచ్చెను తల మీదకు ఎత్తుకుంటూ ఆమె దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి, సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న రూడీ వైపు తడబడుతూ అడుగులు వేస్తున్నారు. ఈ ఉదయం ఆమె శుభ్రంచేయటం మొదలుపెట్టినప్పటి నుండి ఇది 20వ సారి. ఆమె పంజాబ్లో షెడ్యూల్డ్ కులంగా జాబితా చేయబడిన మెహ్రే సిక్కు సమాజానికి చెందినవారు. భూమిలేని దళితురాలైన అమర్జీత్, జీవనోపాధి కోసం పట్టి పట్టణంలోని ఏడు ఇళ్ళలో గోహా-కూడా చేస్తారు.
"జదోఁ మేఁ డంగ్రాఁ దా గోహా చుక్కణ్ లయీ థల్లే బహిందీ హాఁ, తాఁ ఓ అక్సర్ మేరే శిర్ తే హీ మూత్ దిందియాఁ నే. మైఁ రోజ్ రోజ్ శిర్ నహీ ధో సక్దీ తే షాంపూ సాబణ్ దా ఖర్చా వీ నహీఁ చుక్క్ సక్దీ. ఎస్ లయీ ఆహ్ లిఫాఫా పా లైనీ హాఁ [నేను ఈ ప్లాస్టిక్ సంచిని నా తలకు చుట్టుకోవాలి, ఎందుకంటే నేను పేడ తీస్తున్నప్పుడు గేదెలు తరచుగా నా మీద మూత్రం పోస్తాయి. నేను ప్రతిరోజూ నా జుట్టు కడుక్కోలేను, సబ్బూ షాంపూల కోసం డబ్బు ఖర్చుపెట్టలేను]." అమర్జీత్ తన పిడికిలిలో పట్టుకున్న నల్లటి సంచిని నాకు చూపిస్తూ చెప్పారు. ఆమె అప్పుడే ఆ రోజుకు మొదటి ఇంట్లో పని పూర్తి చేశారు. అది 10 గేదెలున్న ఒక భూస్వామి ఇల్లు. ఇప్పుడామె ఇక్కడి నుండి మరో ఇంటికి నడిచి వెళ్తారు.





