మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని గ్రహించే సమయానికి, ఆయన పేరు మీద కనీసం ఒక బ్యాంకు ఖాతా కూడా లేదు. ఆయన భార్య ఆయనకు రూ. 15,000 అప్పుగా ఇచ్చారు. ఆమె ఒక ఆదివాసీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. పార్టీ కార్యకర్తలు కూడా తమకు తోచినంత విరాళాలు అందించటంతో, ఎన్నికల నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ముందే ఆయన మొత్తం రూ. 52,000 సమకూర్చుకోగలిగారు.
వినోద్ నికోలేకు పరిస్థితులు ఇంతకంటే ప్రతికూలంగా ఉండకపోయేవి. అంతేకాక ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా 2014లో డహాణూ నియోజకవర్గం నుండి 16,000కు పైగా వోట్ల మెజారిటీతో విజయం సాధించిన సిట్టింగ్ శాసనసభ్యుడైన ధనరే పాస్కల్ జాన్యా నిలిచారు. ఆయన భారతీయ జనతా పార్టీకి చెందినవారు; ఆ పార్టీ ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రూ. 82 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు అధికారికంగానే అంగీకరించింది.
అయితే ఫలితాలు వచ్చే సమయానికి వనరుల లేమి పెద్ద విషయం కాలేదు. నికోలే కేవలం 5,000 వోట్ల మెజారిటీతో గెలిచారు.
నాకు సోదరుడి వరసయ్యే ఒక బంధువు రూ. 70,000 అప్పుగా ఇచ్చాడు. ఎన్నికలకు ముందు నా దగ్గర ఉన్నది ఆ 70,000 నగదు మాత్రమే," డహాణూ పట్టణంలోని తన కార్యాలయం ముందు ఒక ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని ఉన్న ఆయన వంకరగా నవ్వుతూ అన్నారు. పాల్ఘర్ జిల్లా అంతటిలోనూ అధికంగా ఆదివాసీ జనాభా ఉన్నది ఈ పట్టణంలోనే.
ఇదిప్పుడు ఉనికిలో లేని ఒకప్పటి భారతదేశానికి సంబంధించిన కథలా అనిపిస్తోంది, కానీ ఇది జరిగింది 2019లోనే. మళ్ళీ 2024లోనూ ఇదే జరిగింది. ఎన్నికల తర్వాత ఎన్నికలో ప్రతిపక్షాలను బిజెపి చిత్తుచిత్తుగా ఓడిస్తున్న సమయంలోనూ, డబ్బును విచ్చలవిడిగా వెదజల్లకుండా ఈ రాజకీయాల ఆటలో గెలవడం అసాధ్యమనే భావన సర్వత్రా నెలకొన్న సమయంలోనూ, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్)కు చెందిన 48 ఏళ్ళ నికోలే, తన రెండవ పదవీకాలాన్ని ఎంతో సజావుగా కొనసాగిస్తున్నారు. అది కూడా శాసనసభ్యులలో 93 శాతం మంది కోటీశ్వరులే ఉన్న ఒక రాష్ట్రంలో! స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (GSDP) పరంగా చూస్తే, మహారాష్ట్ర దేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రంగా నిలుస్తుంది.
డహాణూ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాకీ గ్రామంలో ఒక ఇటుక బట్టీ కార్మికుడి కుటుంబంలో జన్మించిన నికోలే, ఎన్నికల సంబంధిత ఖర్చు అత్యధికంగా ఉండే రాష్ట్రంగా పేరున్న మహారాష్ట్రలో అత్యంత పేద శాసనసభ సభ్యుడుగా ఉన్నారు. ఎన్నికలకు ముందు పంచడానికి నికోలే వద్ద నిధులు లేవు, అలాగే తన అజెండాను ప్రచారం చేసుకోవడానికి ఒక విశాలమైన సోషల్ మీడియా బృందాన్ని కూడా ఆయన నియమించుకోలేదు. ప్రజల పక్షాన నిలబడటం, ప్రజా ఉద్యమాలలో పాల్గొనడం, ప్రధానంగా ఆదివాసీ రైతుల, కార్మికుల వంటి సామాన్యుల కోసం నిరంతరం పనిచేయడమే ఎన్నికలలో ఆయన నిజమైన పెట్టుబడి









