కిరణ్ గహాలా (54)కు, ఆయనవంటి ఇతర ఆదివాసీ రైతులకు ఈ అనుభూతి చాలా సుపరిచితమైనది.
2026 జనవరి 19న ఆయన పాల్ఘర్ జిల్లా, డోల్హారీ బుద్రుక్ గ్రామంలోని తన చిన్న ఇంటి నుండి ఎర్రటి టి-చొక్కా, స్కార్ఫ్ ధరించి బయటకు వచ్చారు. ఇతర ఆదివాసీ రైతులతో కలిసి వేచి ఉన్న టెంపో-ట్రక్కు ఎక్కి చారోటి గ్రామం వైపు బయలుదేరారు. అఖిల భారత కిసాన్ సభ, మహారాష్ట్ర విభాగం నిర్వహించిన మరో భారీ పాదయాత్రకు అదే ప్రారంభ స్థానం.
ఇక్కడ పదివేల మందికి పైగా రైతులు ఉన్నారు. మీడియా నివేదికలు, ఎఐకెఎస్ల అంచనాల ప్రకారమైతే సుమారు 50,000 మంది వరకూ ఉంటారు. వీరంతా ప్రధానంగా పాల్ఘర్ జిల్లాలోని ఆదివాసీ సముదాయాలకు చెందినవారు. భూమి హక్కులను మెరుగ్గా అమలు చేయాలని, ఎంజిఎన్ఆర్ఇజిఎ (MGNREGA )ను పునరుద్ధరించాలని, వాఢవన్ ఓడరేవును రద్దు చేయాలని, తాగునీటినీ సాగునీటినీ అందుబాటులోకి తీసుకురావాలని, తదితర డిమాండ్లతో వారు కలెక్టరేట్ వైపు తమ పాదయాత్రను ప్రారంభించారు.











