ఇప్పుడైతే, వర్షపాతం కూడా మారిపోయింది. “నేనిక్కడ 30 ఏళ్ళుగా నివసిస్తున్నాను. కానీ, ఇంతకుముందెప్పుడూ ఇలాంటి వర్షాన్ని చూడలేదు. ఇది ఒక్కసారిగా కురుస్తుంది – భారీగా, విరామం లేకుండా. ప్రతి ఏటా ఇది మాకు మాళీణ్ని గుర్తుచేస్తుంది.”
ఈ ప్రమాదం కేవలం ఊహాజనితం కాదు. వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ, గాలిలో తేమ శాతం పెరుగుతుంది. “ఇప్పుడు వర్షం ఎంత పడుతుందో, ఎప్పుడు పడుతుందో లాంటివి మారిపోయాయి. ఒకప్పుడు మూడు నెలల పాటు కురిసే వర్షం, ఇప్పుడు కేవలం రెండు వారాల్లోనే కురుస్తోంది,” పుణె గోఖలే ఇన్స్టిట్యూట్లోని సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ డైరెక్టర్, డాక్టర్ గురుదాస్ నుల్కర్ తెలిపారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని తీవ్రతరం చేస్తున్న ప్రధాన కారణాల్లో, మారిన వర్షపాత సరళి, నియంత్రణ లేని నిర్మాణాలూ ఉన్నాయని ఆయన వివరించారు. (చదవండి: థానేలో వర్షం సోమరిగా తయారు అయింది)
పసార్వాడీ కొండ దిగువన, ఫసాబాయి ఇంటి పక్కన నివసించే జావ్జీ బాల్చిమ్, వారి ఇళ్ళ వెనుక పడి ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ళను చూపించారు. కొన్ని ఆయన మోకాళ్ళ ఎత్తు వరకు, మరి కొన్ని ఆయన తొడల ఎత్తు వరకు ఉన్నాయి. “కిందటి ఏడాదే ఈ రాళ్ళు కిందికి దొర్లుకుంటూ వచ్చాయి,” అన్నారు ఈ 80 ఏళ్ళ రైతు. “చిన్న రాళ్ళు చెట్లలో ఇరుక్కుపోయాయి, ఈ పెద్దవి మాత్రం కిందికి దొర్లుకుంటూ వచ్చాయి. అదృష్టం బాగుండి, అవి ఎవరి ఇంటినీ ధ్వంసం చేయలేదు.”
పసార్వాడీలోని ఇళ్ళు, తేలికైన మట్టి ఇటుకలతో కట్టినవి. ఇవి ఒకప్పుడు మాళీణ్లో ఉండిన సురక్షితం కాని ఇళ్ళను పోలి ఉంటాయి. దశాబ్దం తర్వాత కూడా, ఇక్కడి కుటుంబాలకు మనుగడ సాగించేందుకు మౌలిక సదుపాయాలు లేనట్టుగా కనిపిస్తోంది. బండరాళ్ళు కిందికి దొర్లకుండా ఆపడానికి, ఇప్పటికీ వాళ్ళు కొండవాలులో ఉండే చెక్క కంచెలపైనే ఆధారపడుతున్నారు.
“గతంలో ఇలా ఉండేది కాదు. కానీ, రహదారి పనులు మొదలైనప్పటి నుండి, ఈ కొండవాలు ప్రాంతమంతా వదులుగా మారినట్లు అనిపిస్తోంది,” అన్నారు జావ్జీ. “వాళ్ళు మట్టిని తవ్వి పోస్తూనే ఉన్నారు. మేం మా జీవితమంతా ఇక్కడే నివసించాం. కానీ ఇప్పుడు, మా ఇళ్ళలో కూడా మాకు సురక్షితం అనిపించడం లేదు.” జావ్జీ, అతని భార్య యమునాబాయి, ఒక గుంఠ కంటే తక్కువ (0.025 ఎకరాలు) విస్తీర్ణం ఉన్న సొంత పొలంలో, 2-3 క్వింటాళ్ళ వరిని పండిస్తారు. ఆ ఆదాయంతో పాటుగా, వ్యవసాయ కూలీ పనులు చేస్తూ, పుణెలో నివసించే వారి కొడుకులు పంపించే కొంత డబ్బుతో తమ బతుకులు వెళ్ళదీస్తున్నారు.
“ఇప్పుడు మా పిల్లలు పుణెలో నివసిస్తున్నారు. ఆ పగుళ్ళూ, భయం కారణంగా, ఇంటికి రావడానికి తమకు ఇష్టంగా లేదని వాళ్ళు చెబుతున్నారు. ఇంట్లోని ఈ రెండు గదులను వారి కోసమే కట్టించాం. కానీ ఇప్పుడు, ఇద్దరం ముసలివాళ్ళం ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయాం,” యమునాబాయి బాల్చిమ్ మృదువుగా అన్నారు.