“నేను ఇక్కడే పుట్టాను. ఎదుగుతూ ఈ అడవుల్లోనే, ఈ డొంగర్ [పర్వతం] పైనే తిరుగాడాను,” ఈ విలేఖరిని తన గూడేనికి పరిచయం చేస్తున్నప్పుడు యెమా సొంగాళ్ ముఖంమీది చిరునవ్వు చెక్కుచెదరలేదు. ఎర్రటి మట్టిపెంకులు కప్పిన ఇళ్ళ కప్పులు, చుట్టూతా దట్టమైన ఆకుపచ్చని సహ్యాద్రి పర్వతాలు – ప్రకృతికీ, మనుషులకీ మధ్య గాఢమైన సయోధ్య కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అతనికి తెలియదు, కానీ అది ప్రపంచంలోని ఎనిమిది జీవ వైవిధ్య "హాటెస్ట్ హాట్స్పాట్"లలో ఒకటి.
దురదృష్టమేంటంటే, అందులో దాదాపు 280 హెక్టార్లు త్వరలో ముంపుకి గురి కాబోతోంది.
“మా పొలం ఆ డొంగర్ వెనక ఉంది,” మహారాష్ట్రలో లాడేవాడీ పల్లె (కాల్భోండె గ్రామ పంచాయతీ)లోని తన ఇంటి ముందరి ఆవరణలో నిలబడి ఉన్న యెమా, ఓ కొండకేసి చూపించారు. అతనూ, అతని భార్య సుళీ డెబ్భయ్యో వడిలో ఉన్న ఆదివాసులు. వరై (ఊదలు) పండించే తమ చిన్న మడిచెక్కను చేరాలంటే వాళ్ళు గంటసేపు నడవాలి. “వానాకాలం వ్యవసాయం మాది. అయిదారు మూటలు [క్వింటాళ్ళు] వస్తాయి.” ఎకరం కన్నా తక్కువ వున్న వాళ్ళ పొలంనుంచి మొత్తం దక్కే దిగుబడి అది. యెమా, సుళీ, నలుగురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు, ఆరుగురు మనవళ్ళు, మనవరాళ్ళతో కలిపి పదిహేనుమంది సభ్యులున్న ఆ కుటుంబం, వచ్చే ఏడాది కోతలు జరిగేంతవరకూ దాంతోనే సరిపెట్టుకోవాలి. ఆ పొలంమీదా, చుట్టూతా పరచుకున్న అడవిమీదా సమానంగా ఆధారపడ్డ కుటుంబం వాళ్ళది.
“అడవి కూడా మాకు ఎన్నో అందిస్తుంది,” కొనసాగించారు యెమా. “పళ్ళు, రాణకందో [అడవి దుంపలు], కూరగాయలు, జలుబూ జ్వరాలూ మోకాళ్ళ నొప్పులను తగ్గించే మందుమొక్కలూ, ఇవన్నీ.” యెమాకు, 97 కుటుంబాలున్న అతని సముదాయపు మనుగడకు ఆ అడివి ఎంతో ముఖ్యం. వీరంతా ఠాణే జిల్లా, శహాపుర్ తాలూకాకు చెందిన మా ఠాకూర్ అనే షెడ్యూల్డ్ తెగకు చెందినవారు. “మేం చెట్లని కొట్టేయం. పడిపోయిన కొమ్మలని ఏరి వంటచెరకుగా వాడుకుంటాం. మట్టి, ఇటుకలు, అడవిలో దొరికే కొయ్యలతో పక్కా ఇళ్లు కట్టుకుంటాం; ఎన్నేళ్ళయినా అవి చెక్కుచెదరవు.”




















