ఏడుగురు బాలికలు, ఆరు గ్రామాలు, ఐదు మాతృభాషలు, రెండు ఆటలు, ఆట భాష మాత్రం ఒక్కటే!
రంజన్ రాఠవా (12), జ్యోతి భీల్ (11), శర్మిలా ఢాకి (9), కింజల్ నాయక (10), నిరాల్ రాఠవా (10) - వీరంతా తేజ్గఢ్ గ్రామంలోని తమ ఆశ్రమ పాఠశాల, వసంత్ శాలలో ఉన్న ఆటమైదానంలో ఒక ఆటలో మునిగివున్నారు. ఈ ఆదివాసీ గ్రామం గుజరాత్, ఛోటాఉదేపుర్ జిల్లాలోని కోరజ్ కొండ పాదాల వద్ద ఉన్నది.
ఆడకో దడుకో దహీ దడుకో
శ్రావణ్ గాజే, పిల్లూ పాకే...
రాష్ట్రవ్యాప్తంగా పిల్లలు ఆటలాడుకునేటప్పుడు గుజరాతీలో పాడుకునే బడ్-బడ్ గీతో లేదా అర్థంలేని అంత్యప్రాసల గీతాల భండారం నుంచి వచ్చినదే ఈ పాట. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాసల గీతం ఏ భాషలో ఉందో ఆ భాష ఆ పిల్లల సమూహంలోని ఎవరికీ మాతృభాష కాదు. ఈ ఐదుగురు బాలికలు వారి పాఠశాల నుండి 30 నుండి 50 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న గ్రామాలలో నివసిస్తోన్న తమ కుటుంబాలతో, తమ స్వంత ఆదివాసీ భాషలైన రాఠవీ, ధానకీ, డుంగరా భీలీ, నాయకిలలో మాట్లాడుతారు. కానీ వారి పాఠశాల, వసతిగృహాలు ఉన్న ఈ ఆదివాసీ విద్యాసంస్థ ఆవరణలో ప్రధాన స్రవంతి గుజరాతీ వారి సంధాన భాషగా మారింది.





