"మేం మా జీవితమంతా ఇక్కడ ఉన్న అందరిలాగే మేం కూడా ఈ దేశ పౌరులమేనని రుజువు చేయడం కోసం ప్రభుత్వానికీ తోటి దేశవాసులకీ పత్రాలు సమర్పిస్తూనే గడిపాం."
బహారుల్ ఇస్లామ్ చెత్తను వేరుచెయ్యడంలో మునిగివున్నారు. ప్లాస్టిక్ సీసాలు, తడి చెత్త, అట్టలు, థెర్మోకోల్ - వీటన్నిటినీ వేరు వేరు గుట్టలుగా చేసి వేర్వేరు బస్తాలలోకి నింపుతున్నారు. 35 ఏళ్ళ బహారుల్, అస్సామ్‌లోని బర్పేట, బొంగైగాఁవ్, గొవాల్పారా జిల్లాల నుంచి వలస వచ్చిన 13 కుటుంబాలలో ఒకరు. హరియాణాలోని అసావర్పుర్లో వీరంతా కలిసి ఒక చిన్న స్థలంలో నివాసముంటున్నారు. చెత్త ఏరుకోవడం, దాన్ని వేరు చెయ్యడం వారి జీవనాధారం.
"జనం మేమెవరమని ఎప్పుడూ అడుగుతూనే వుంటారు- ఇక్కడా, అస్సామ్‌లో కూడా." అధికారులు తరచుగా తమ మురికివాడకు వచ్చి గుర్తింపు పత్రాలు చూపించమని అడుగుతూ వుంటారని బహారుల్ చెప్పారు. "మేం చెత్త ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడి జనం మేమెక్కడినుంచి వచ్చాం అని అడుగుతారు. మేం అస్సామ్ అని చెప్తే వాళ్ళు బంగ్లాదేశ్ అని ఊహించుకుంటారు." అంతేగాక పోలీసులు వచ్చి, వారిపై క్రిమినల్ కేసులు ఏమీ లేవని నిర్ధారించుకోడానికి అస్సామ్ పోలీసుల ధృవీకరణ కోసం అడుగుతారని కూడా ఆయన చెప్పారు. "మేమేం చెప్తున్నామనేది ఎవరూ పట్టించుకోరు," అన్నారు బహారుల్. అతనికి అస్సామ్‌లో దేశీయ పౌరసత్వ నమోదు (NRC) జరుగుతోందని తెలుసు. అయితే ఆయన దగ్గర భూ యాజమాన్య పత్రాలు వున్నాయి కాబట్టి ఆయనేం భయపడటంలేదు.
అతనితో పాటే ఉంటోన్న అన్నదమ్ములు రియాజ్, నూర్ ఇస్లామ్ కూడా అస్సామ్ నుంచి వచ్చినవాళ్ళే. తరచుగా వచ్చే బ్రహ్మపుత్ర వరదలవల్ల వాళ్ళ పొలంలో వ్యవసాయం చేయటం కష్టం కావడంతో ఇక్కడికి వచ్చామని వాళ్ళు చెప్పారు. అక్కడ బర్‌పేటలో వారికున్న 800 చదరపు అడుగుల స్థలంలో వాళ్ళ తల్లితండ్రులు పచ్చిమిర్చి, టమాటో ఇంకా ఇతర కూరగాయలను పండిస్తారు. "భారీ వర్షాలప్పుడు మా ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేస్తాయి. మేం ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సివస్తుంది. అరటి బోదెల మీద ఎక్కి ఒక చోటినుండి ఇంకోచోటికి ప్రయాణాలు చేస్తాం," అని ఆ అన్నదమ్ములు చెప్పారు. దేశీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం (NRSC) లెక్కల ప్రకారం 1998 నుండి 2005 మధ్య వరదల వల్ల అస్సామ్ రాష్ట్రంలో 28.75 శాతం భూమి ప్రభావితమయింది.














