గమనిక: భారతదేశంలో గ్రామీణప్రాంతాల ఆరోగ్య స్థితిపై వస్తున్న సిరీస్లో ఇది మొదటిది.
మలాజ్పూర్ అనే చిన్న వ్యవసాయ గ్రామంలో 17 ఏళ్ళ సావి దుర్వే, 16 ఏళ్ళ ఆశా కొర్కు (పేర్లు మార్చబడ్డాయి) అనే ఇద్దరు బాలికలు ఒక అపూర్వమైన స్నేహాన్ని ఏర్పరచుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇక్కడ జరిగిన ఆలయ ఉత్సవంలో వారు కలుసుకున్నారు. అక్కడ వారి ఇరువురి కుటుంబాలు వారిని స్థానిక భూతవైద్య కర్మకు తీసుకువచ్చాయి. ఆ బాలికలు, వారి కుటుంబాలు కూడా తాము ఒక దెయ్యం ప్రభావంలో ఉన్నామని నమ్ముతున్నారు.
"నేను గదిలో ఎవరో విసిరేసినట్టుగా చుట్టూ తిరిగిపోయి మూర్ఛపోయేదాన్ని. నొప్పితో వంకర్లు తిరిగిపోయేదాన్ని, మేల్కొన్నప్పుడు ఏమీ గుర్తుండేది కాదు," సావి వివరిస్తున్నట్టుగా చెప్పింది. సావి తన వాక్యాన్ని ముగించటానికి ముందే ఆశా కూడా "నాకూ అంతే," అంటూ ఏకీభవించింది. "నాక్కూడా ఏమీ గుర్తుండదు."
కారణమేమీ లేకుండానే, లేదంటే ప్రతి విషయానికీ వారు ఒకరివైపు ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. ఇది టీనేజర్లలో సాధారణంగా కనిపించే సుపరిచితమైన ప్రాణస్నేహితుల మధ్య అకారణంగా ఉప్పొంగే ఒక యవ్వన శక్తి. ఈ ఇద్దరు అమ్మాయిలు దాదాపు ఒక నెల రోజులుగా ఆలయ ప్రాంగణంలోనే నివసిస్తున్నారు. ఈ సమయంలో వారు విడదీయరానంతగా కలిసిపోయారు - హారతి ఇచ్చే సమయంలో భుజం భుజం కలిపి కూర్చోవడం, గర్భగుడి లోపల దేవత చుట్టూ పరిక్రమ (ప్రదక్షిణ) చేసే సమయంలో ఒకరిమీదొకరు, అంతకు మించి కూడా గుసగుసగా పరిహాసాలతో మాట్లాడుకోవడం చేస్తారు.
ఆశ వైపు ప్రేమగా చూస్తూ, “ఆమె సులభంగా ప్రభావితమవుతుంది...” అంటుంది సావి.
"– నేను దాన్ని వివరించలేను –"
"– హారతి సమయంలో మీరే చూస్తారు –"
"– కానీ నేనిప్పుడు చాలా బాగున్నాను –" ఆలయంలో నెల రోజులు గడిపిన తర్వాత, తన పరిస్థితి మెరుగుపడిందని సూచిస్తూ ఆశా ముగించింది.
స్థానికంగా భూతోఁకా మేళా అని పిలిచే శతాబ్దాల నాటి ఈ మలాజ్పూర్ దెయ్యాల ఉత్సవం ఏటేటా జరిగే కార్యక్రమం. ఇది మాఘ పూర్ణిమ (జనవరి-ఫిబ్రవరి మాసాలలో వచ్చే పౌర్ణమి రోజు) నాడు ప్రారంభమై బసంత్ పంచమి (వసంతకాల ఆగమనం) నాడు ముగుస్తుంది. బేతుల్ జిల్లాలోని చిఁచోలి బ్లాక్లో జరిగే ఈ ఉత్సవం, గురుసాహబ్ బాబా లేదా దేవ్జీ మహారాజ్ అనే సాధువు సమాధి కేంద్రంగా జరుగుతుంది. ఆయనకు ఆత్మలు 'పట్టిన' వ్యక్తులకు నయంచేసే అతీంద్రియ శక్తులున్నాయని జనం నమ్మకం. ఆలయ ఆవరణలో ఉన్న మర్రి చెట్ల ఆకులలో దయ్యాల ఆత్మలు చిక్కుకుపోతాయని ఇక్కడి గ్రామస్తులు నమ్ముతారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ చుట్టూ ఉన్న ప్రాంతాల నుండే కాక పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్ నుండి కూడా వేలాదిమంది యాత్రికులు, విశ్వాసులు వస్తారు.












