తూఫానీ, ఆయన నేతకారుల బృందం ఉదయం 6:30 నుంచి పని చేస్తున్నారు. రోజుకు 12 అంగుళాల నేత నేస్తూ, ఆ నలుగురు కలిసి పనిచేస్తే, 23x6 అడుగుల గలీచా(కార్పెట్)ను పూర్తి చేయడానికి వారికి 40 రోజులు పడుతుంది.
మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు, తూఫానీ బింద్ చివరకు ఒక చెక్క బల్లపై విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నారు. ఆయన పని చేస్తున్న రేకుల షెడ్లో, ఆయనకు వెనుకవైపున్న చెక్క చట్రానికి తెల్లటి నూలు దారాలు వేలాడుతున్నాయి. ఆయన ఈ కార్యశాల ఉత్తరప్రదేశ్‌లోని పుర్‌జాగీర్ ముజేహరా గ్రామంలో ఉంది. ఈ గ్రామం రాష్ట్రంలో తివాచీ నేతపనికి గుండెకాయ వంటిది. మొఘలులు ఈ కళను మీర్జాపూర్లో ప్రవేశపెడితే, బ్రిటిష్‌వాళ్ళు దీన్ని ఒక పరిశ్రమగా మార్చారు. రగ్గులు, చాపలు, తివాచీల ఉత్పత్తిలో యూపీదే ఆధిపత్యం. దేశీయ ఉత్పత్తిలో దాదాపు సగం (47 శాతం) ఉత్పత్తి ఇక్కడే జరుగుతోందని 2020 అఖిల భారత చేనేత గణన పేర్కొంది.
మీర్జాపూర్ నగరం నుంచి హైవే దిగగానే పుర్‌జాగీర్ ముజేహరా గ్రామానికి వెళ్ళే ఇరుకైన రహదారి కనబడుతుంది. గ్రామంలో ఇరువైపులా ఎక్కువగా ఒకే అంతస్తు ఉన్న పక్కా ఇళ్ళతో పాటు గడ్డి కప్పులతో నిర్మించిన కచ్చా ఇళ్ళు కూడా కనిపిస్తాయి; ఆవు పేడతో తయారుచేసిన పిడకలను కాలిస్తే లేచే పొగ గాలిలో తేలుతుంటుంది. ఇక్కడ రోజంతా మగవాళ్ళు బయట కనిపించరు, కానీ ఆడవాళ్ళు చేతి పంపు దగ్గర బట్టలు ఉతకడం లాంటి ఇంటి పనులు చేస్తూనో, లేదా కూరగాయలు, అలంకరణ సామాగ్రిని అమ్మే వ్యక్తితో మాట్లాడుతూనో కనిపిస్తారు.
ఇది చేనేతకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం అనడానికి ఇక్కడ ఎలాంటి సంకేతాలు కనిపించవు – స్థానికులు గలీచాలు అని పిలిచే ఈ తివాచీలు బయట వేలాడదీసి గానీ, పేర్చిపెట్టి గానీ కనిపించవు. ఇళ్ళల్లో తివాచీలు నేయడానికి అదనంగా స్థలాన్ని, లేదా గదిని కేటాయించుకున్నప్పటికీ, అది ఒకసారి సిద్ధమయ్యాక, దాన్ని కడగడం, శుభ్రపరచడం కోసం మధ్యదళారులు స్వాధీనం చేసుకుంటారు.
తూఫానీ విశ్రాంతి తీసుకుంటూనే PARIతో మాట్లాడుతూ, "నేను మా నాన్న నుంచి ఈ పని [ముడులు వేస్తూ చేసే నేతపని] నేర్చుకున్నాను. నాకు 12-13 సంవత్సరాల వయస్సు నుంచే ఈ పని చేస్తున్నాను," అన్నారు. ఆయన కుటుంబం బింద్ సామాజిక వర్గానికి (రాష్ట్రంలో ఇతర వెనుకబడిన తరగతుల జాబితాలో ఉంది) చెందినది. యూపీలో చాలామంది నేత కార్మికులు ఒబిసి కింద నమోదైవున్నారని గణన పేర్కొంది.























