“కౌడీ, కౌడీ, కౌడీ, కబడ్డీ, కబడ్డీ, కబడ్డీ…”
వలయాకారంలోని మట్టి మైదానంలో కేకలు మరింత బిగ్గరగా వినిపిస్తున్నాయి- రెయిడర్స్ (దాడి చేసేవారు), స్టాపర్స్ (దాడిని అడ్డుకునేవారు) మధ్య జరుగుతోన్న పోరాట దృశ్యమది. అది 2020-2021లో రైతులు నిరసన ప్రదర్శన చేపట్టిన దిల్లీ వెలుపలి సింఘు-టీక్రీ సరిహద్దు ప్రదేశం. కబడ్డీ వ్యాఖ్యానం నిరసన నినాదాలు, ప్రతిఘటన ప్రసంగాలతో కలగలిసిపోయింది. కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు లక్షలాది మంది రైతులూ, వ్యవసాయ శ్రామికులూ ఇక్కడ నిరసన చేస్తూ నిలిచారు.
సెప్టెంబర్ 2021లో వారం రోజుల పోటీ ముగిసేసరికి, ఒక కొత్త క్రీడాకారుడు వెలుగులోకి వచ్చాడు: హరియాణాలోని రోహ్తక్కి చెందిన శీలూ బల్హారా. తరువాత అతను తక్కువ ఆదాయ, అణగారిన వర్గాలకు చెందిన యువకులు తమ కోసం ఒక స్థిరమైన ఆర్థిక పునాదిని ఏర్పరచుకుంటోన్న పంజాబ్‌కి చెందిన కబడ్డీ తారల సరసన చేరారు.
పంజాబ్‌లోని గ్రామాలలో నివసించే అబ్బాయిలు మొట్టమొదటగా నేర్చుకునే క్రీడలలో వృత్తాకార-శైలి కబడ్డీ ఒకటి. దీని ఆకర్షణ మొత్తం దీని సరళతలోనే ఉంది; ఇందులో ఎలాంటి పరికరాలూ అవసరం పడవు – క్రీడాకారులు తరచూ బూట్లు కూడా ధరించరు. పైగా, నియమాలు చాలా సులభంగా ఉంటాయి. దీన్ని మట్టిలో ఆడతారు.
ఇది శారీరకంగా అధిక శ్రమతో కూడుకున్న క్రీడ కావడంతో, దృఢమైన శరీరాన్ని నిర్మించుకోవడానికి ఇష్టపడే యువతకి ఆ అంశమే ఒక అదనపు ఆకర్షణగా మారింది. పంజాబ్-శైలి కబడ్డీగా కూడా పిలిచే ఈ క్రీడను జాతరలు, సాముదాయిక సమావేశాలు, ఇంకా స్థానిక పోటీలలో ఆడతారు.
పంజాబ్‌లో, కబడ్డీ సీజన్ ఎప్పుడూ వ్యవసాయ క్యాలెండర్‌కు అనుగుణంగా సాగుతుంది. అక్టోబర్‌లో విత్తనాలు నాటిన తరువాత మొదలై, పంట చేతికి వచ్చే ఏప్రిల్ వరకు ఇది కొనసాగుతుంది.




















