మనోర్ ఫాటా (కూడలి) వద్ద అది ఒక చల్లని ఉదయం, రైతులు నివురుకప్పి ఆరిపోతున్న చలిమంటల చుట్టూ గుమిగూడి ఉన్నారు. ముందు రోజు రాత్రి విపరీతమైన చలిగా ఉంది, తెల్లవారుజామున కూడా పరిస్థితి ఏమాత్రం మెరుగ్గా లేదు. లక్ష్మి దత్తు బోబా వర్ణించినట్టు, "పైనుండి వర్షం పడుతున్నట్లుగా ఉంది – చల్లటి నీరు మా శరీరాలపై కురుస్తున్నట్లుగా ఉంది."
చలి తీవ్రంగా ఉంది. అయితే భూమి, నీరు, అన్నింటికంటే ముఖ్యంగా కూలి పనికి సంబంధించిన సమస్యల గురించి ఆ 46 ఏళ్ళ ఆదివాసీ రైతులో ఉన్న కోపం అంతకంటే తీవ్రంగా ఉంది. ఆమెలాగే, పదివేల మందికి పైగా పురుషులు, మహిళలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల పరిష్కారంలో జరుగుతోన్న జాప్యానికి నిరసనగా పాల్ఘర్ జిల్లా కలెక్టరేట్ వరకు నడచి వెళ్లారు: వారి భూ భాగాలను క్రమబద్ధీకరించడం, త్రాగడానికి యోగ్యమైన నీరు, ముఖ్యంగా కూలి పని. ఇవి వారు గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన ముఖ్య విషయాలు.
"ఏడాది మొత్తం సంగతి అటుంచి, మాకు రోజ్‌గార్ హామీ యోజన కింద ఒక్క రోజు కూడా పని దొరకలేదు," మహాత్మా గాంధీ దేశీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) గురించి ప్రస్తావిస్తూ, కోపంగా ఉన్న లక్ష్మి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ చట్టంలో నిర్మాణాత్మక మార్పులు చేసి, దానికి వికసిత్ భారత్ – జి రామ్ జి చట్టం (VB-G RAM G) అని పేరు మార్చింది. దీని ద్వారా పనికి సంబంధించిన చట్టపరమైన హామీని వెనక్కి తీసుకుని, ఈ కార్యక్రమానికి కేటాయించిన బడ్జెట్లో అధిక భాగాన్ని రాష్ట్రాలపై మోపింది.
సిపిఐ (ఎమ్), ఆల్ ఇండియా కిసాన్ సభ మహారాష్ట్ర యూనిట్ కలిసి నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వేలాదిమంది ప్రజల కీలక డిమాండ్లలో, రూ. 600 కనీస వేతనంతో ఏడాదిలో 200 రోజుల పాటు హామీతో కూడిన ఉపాధి కల్పించడం ఒకటి. జనవరి 19, 2026న ప్రారంభమైన ఈ ప్రదర్శన, జనవరి 21న జిల్లా కలెక్టర్ వారు పెట్టిన ప్రతి ఒక్క డిమాండ్‌పై హామీలు ఇవ్వడంతో ముగిసింది.












