తన దంతాలతో కోడిపుంజును కొరికి శ్మశాన దేవత అయిన సుడలై కాళి గౌరవార్థం బలియిచ్చిన తరువాత, తన దంతాల మధ్య తొరప్పు (మేక ఊపిరితిత్తులు)ను పట్టుకొని, ఎడమ చేతితో కొడవలిని తిప్పుతూ ఆమె లయబద్ధంగా నడుస్తున్నారు. దేవి పుట్రు పూంగావణత్తు అమ్మన్ ఆలయం నుండి తిరువళం పట్టణంలోని పొణ్ణయి నదికి దారితీసే రద్దీగా ఉన్న వీధిలో, నల్ల చీర కట్టుకొని, పంబై, పరై వాద్యాల సంగీతానికి తగ్గట్టు ఐశ్వర్య నాట్యం చేస్తున్నారు. ఆమె వెనుకే నడుస్తున్న ఊరేగింపు ఎండిపోయిన పొణ్ణయి నదీ తీరానికి చేరేసరికి, అప్పటికే అలసిపోయిన ఆ తిరుణంగై (తమిళంలో ట్రాన్స్‌మహిళ) అక్కడే కూలబడ్డారు. సొంత డ్రామా కంపెనీని నడుపుతోన్న ముప్పై ఏడేళ్ళ ఐశ్వర్యకు ఇది కేవలం ఒక ‘ప్రదర్శన’ కాదు. చీకటిపడ్డాక ఆవిడ నాటకం ప్రదర్శించాలి; అందుకు ఆమెకు కొన్ని గంటల సమయమే ఉంది.
ఆవిడ వార్షిక మయాణ కొళ్ళై (శ్మశానవాటిక దోపిడీ) పండుగలో పాల్గొంటున్నారు. తమిళనాడులోని వేలూర్ జిల్లాలో, ఈ గ్రామంలో నివసించే దళిత వర్గాలు తమిళ మాసమైన మాసి (మార్చి)లో వచ్చే అమావాస్య రోజున ఈ పండుగ జరుపుకుంటారు. ఐశ్వర్య, రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులంగా జాబితా చేయబడిన చక్కిళియర్ సముదాయానికి చెందినవారు. ఆలయ ఉత్సవంలో నిర్వహించే ఆచారాలలో గత రెండు దశాబ్దాలుగా పాలు పంచుకుంటున్నారు.
“అంత ఆవేశంతో నాట్యం చేసింది నేను కాదు. నాకసలు అది గుర్తు కూడా లేదు. నన్ను అమ్మన్ ఆవహించింది,” తరువాత అన్నారామె. అమ్మన్ ఒక గ్రామ దేవత. చక్కిళియర్ సముదాయ ప్రజలు అమ్మన్‌ను కాళీమాత స్వరూపంగా భావించి పూజిస్తారు. ఆచార వ్యవహారాలన్నీ ముగిశాక, రాత్రి 10 గంటలకు చివరి ప్రదర్శన మొదలవుతుంది.
రాత్రిపూట దృశ్యం పగటికి పూర్తిగా భిన్నంగా ఉంది. వీధి మధ్యలోని నెలకొల్పిన 10x12 అడుగుల వేదికపైకి అడుగుపెట్టిన ఐశ్వర్య తన బలాన్ని పుంజుకున్నట్టు కనిపిస్తున్నారు. బ్యానర్ ఎక్కడ కట్టాలో ఉత్సవ నిర్వాహకులకు చెబుతూనే, రెండు 500-వాట్ల లైట్లను అమర్చడానికి సరైన స్థలాన్ని గుర్తించారు. “ఆ రెండిటినీ వేదికకు ఎదురుగా, కొంచెం ఎక్కువ వాలుగా కట్టండి,” అని ఆదేశించారు. తన డ్రామా కంపెనీ పేరు ‘అశోక్ నాడగ మండ్రమ్’. దానికి ఐశ్వర్యే రంగస్థల నిర్వాహకురాలు, కాస్ట్యూమ్ డిజైనర్, లైట్ డిజైనర్, డైరెక్టర్, రచయిత; కళాకారుల బృందానికి నాయకురాలు కూడా. ఆవిడే ఒక సైన్యం. వేదికపై కట్టిన (వస్త్రంతో చేసిన) బ్యానర్‌పై, ఆ డ్రామా కంపెనీ పేరు పెద్ద పెద్ద అక్షరాలతో చిత్రించి ఉంది.



