"నిజ జీవితంలో నేనున్నట్లుగానే, ఇచ్ఛే కుసుమ్ నాటకంలో నేను నేతకారుడి పాత్రను పోషించాను," ఒక పాత నాటకం రాతప్రతిని తన చేతుల్లో పట్టుకుని ఉన్న అసిత్ ప్రామాణిక్ చెప్పారు. తన ఇంట్లోని రంగు మారిపోయిన ఇనుప అల్మారా అంతా వెతుకుతూ, జాగ్రత్తగా దాచిపెట్టిన అనేక నాటకాల రాతప్రతుల కాపీలను ఆయన వెలికితీశారు.
విశిష్టమైన శాంతిపురి తంగైల్, జామ్దానీ చేనేత చీరలకు ప్రశంసలు అందుకున్న నదియా జిల్లాలోని శాంతిపూర్ చేనేత క్లస్టర్ల నుండి వచ్చిన అనేకమంది చేనేత కార్మికులలో అసిత్ దా ఒకరు. మగ్గంపై ఈ అనుభవజ్ఞుడైన నేత కార్మికుడి శ్రమ, రంగస్థలం పట్ల ఆయనకున్న ప్రేమ సమాంతరంగా సాగిపోతుంటాయి. తాంత్-ఘర్ (మగ్గం గది), రంగ-మంచా (రంగస్థలం) నిరంతరం పడుగూ పేకల్లా పెనవేసుకొని ఈ కార్మిక-కళాకారుడి ఆరు దశాబ్దాల జీవితంలో దట్టమైన వస్త్రాన్ని నేశాయి.
రంగస్థలంపై తన మొట్టమొదటి పెద్ద ప్రదర్శన గురించి మాట్లాడుతున్నప్పుడు అసిత్ దా ముఖం హద్దులేని ఆనందంతో వెలిగిపోయింది. "ఆ నాటకాన్ని శియాల్దహ్ స్టేషన్ చుట్టుపక్కల ఎక్కడో ప్రదర్శించారు. నేను న్యాయమూర్తిగా [పాత్రలో] నటిస్తున్నప్పుడు, నిజం చెప్పాలంటే, నేను భయంతో వణుకుతున్నాను," హృదయపూర్వకంగా నవ్వుతూ చెప్పారాయన. ఒక బహిరంగ ప్రదేశంలో ఒక పెద్ద నాటక క్లబ్ కోసం ప్రదర్శించిన నాటకంలో మొదటిసారి ప్రేక్షకులను ఎదుర్కొన్న తన అనుభవాన్ని ఆయన అలా మాతో పంచుకున్నారు.
నేత ప్రపంచంలోకి తన ప్రవేశం గురించి కూడా అసిత్దా అంతే ఉత్సాహంతో మనకిలా చెబుతారు: “నేను ఐదవ తరగతి వరకు చదువుకున్నాను. నేతకారుల కుటుంబంలో చిన్న పిల్లలు మొదలుకొని, ఇంట్లోని స్త్రీ పురుషుల వరకు, ప్రతి ఒక్కరూ మగ్గం పనికి సంబంధించిన వివిధ పనులలో పాల్గొంటారు.” నూలును వడకడం, దానికి అద్దకం వేయడం, రాట్నాన్ని ఉపయోగించి నూలును గొట్టంలోకి చుట్టడం, ఆ గొట్టం నుండి దానిని ఒక డ్రమ్ములోకి చుట్టడం, చివరికి మగ్గంపై అమర్చడం వంటి పనులను వివిధ వయసులలోని కుటుంబ సభ్యులు చేస్తారు. “ఇతర తాంతి [నేత] కుటుంబాల మాదిరిగానే, మా ఇంట్లో కూడా చాలా చిన్న వయస్సు నుండే ఈ పనుల్లో పాల్గొనవలసి వచ్చింది,” అని ఆయన చెప్పుకొచ్చారు.








