2025 సెప్టెంబర్ నెలంతా 24 ఏళ్ళ వీణా రాణి కంటి నిండా నిద్ర లేకుండా గడిపారు. పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లా, వల్లే షా ఉత్తాడ్ గ్రామంలో ఆవిడ గంటల తరబడి తన నులక మంచంపై వాలి, కళ్ళు మూసుకొని, గత నెల తమ కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని కబళించి, ఆపై తమ ఇంటిలోకి చొచ్చుకొచ్చిన వరదకు సంబంధించిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉంటారు.
“నేను మునుపటి కంటే మెరుగ్గానే ఉన్నాను,” రాత్రి పడుకునే ముందు వేసుకునే మందును మింగుతూ అన్నారు వీణ. ప్రధాన గ్రామానికి బయట, పొలాల మధ్యలో ఉన్న వాళ్ళ మూడు గదుల పక్కా ఇల్లు, సట్లెజ్ నదికి చెందిన ఒక కయ్య పక్కనే ఉంది. వాళ్ళ ఇంటి నుండి చూస్తే ఆ కయ్య ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అది ఎనిమిది అడుగులు లోతున ప్రవహిస్తుంది. దానికి అవతలి వైపున వాళ్ళ నాలుగు ఎకరాల పొలం ఉంది.
“ఆమె నవ్వడం మానేసింది,” వీణ సోదరి, 26 ఏళ్ళ కైలాస్ రాణి అన్నారు. ఆమెను పడుకోనివ్వకుండా బలవంతంగా కూర్చోబెట్టడానికి ప్రయత్నించినప్పుడల్లా, ఆమె ఎలా ఏడ్చేదో వారి తండ్రి, 52 ఏళ్ళ జర్నెయిల్ సింఘ్ గుర్తుచేసుకున్నారు.
“ఇప్పుడు పంట పోయింది కాబట్టి, మాకు డబ్బెలా వస్తుంది, నీళ్ళింకా ఎంత కాలం నిలిచి ఉంటాయి, వచ్చే పంటకాలంలోనైనా మేం గోధుమలు పండించగలమా- నా మనసులో ఈ ఆలోచనలే ఎప్పుడూ మెదులుతూ ఉంటాయి,” అన్నారు వీణ. దేని వల్ల అంతలా ఆందోళనకు గురవుతున్నావని తన ఆత్మీయులు అడిగినప్పుడు, దాన్ని వివరించడానికి ఆమె చాలా ఇబ్బందిపడ్డారు. “నా తల మీద ఎప్పుడూ ఏదో బరువైన వస్తువు నొక్కుతున్నట్లుంటుంది."
గ్రామ ప్రజలందరూ వరదల వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అయితే, అన్నీ కుదుటపడతాయని వీణ భావించారు.
కానీ అలా జరగలేదు. దాంతో ఆమె మరింత కుంగిపోయి, నిస్తేజంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆమెను 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబోర్లోని ఒక మానసిక వైద్యుని దగ్గరికి తీసుకువెళ్ళారు. అక్కడ, ఆమెకు డిప్రెషన్ ఉందని నిర్ధారించి, ఐదు నెలల పాటు వాడమని కొన్ని మందులు రాసిచ్చారు.
క్లినిక్‌లో కూడా ఆమె వెక్కివెక్కి ఏడుస్తూనే ఉన్నారు. “దిమాగ్ ది నస్సా కమ్జోర్ హో గయీ నే [నా మెదడు నరాలు బలహీనపడిపోయాయి],” అన్నారామె.
















