రుజ్లుక్ సు యార్సు తై గొవ్ బహ్నాయ్ ఆంథె ఆంథె, ఏక్ దమ్ ఒ పష తై గొవ్ హమ్లాయ్ ఆంథె ఆంథె...
అతనొచ్చాడు, ఏవో సాకులు చెప్పి వెళ్ళిపోయాడు, నన్ను చూసి, వెళ్ళిపోయాడు
నా స్నేహితుడు ఏవో సాకులతో నన్ను వదిలివెళ్ళాడు, నన్ను చూసి వెళ్ళిపోయాడు

Bandipore, Jammu and Kashmir
|TUE, AUG 05, 2025
Author
Editor
Photo Editor
Translator
రుజ్లుక్ సు యార్సు తై గొవ్ బహ్నాయ్ ఆంథె ఆంథె, ఏక్ దమ్ ఒ పష తై గొవ్ హమ్లాయ్ ఆంథె ఆంథె...
అతనొచ్చాడు, ఏవో సాకులు చెప్పి వెళ్ళిపోయాడు, నన్ను చూసి, వెళ్ళిపోయాడు
నా స్నేహితుడు ఏవో సాకులతో నన్ను వదిలివెళ్ళాడు, నన్ను చూసి వెళ్ళిపోయాడు
కిషన్‌గంగ నదిపైనే చూపు నిలిపిన ఫరీద్ అహ్మద్ లోన్ జమ్మూ కశ్మీర్ లోని దర్ద్-శిన్ సముదాయానికి చెందిన ప్రసిద్ధ కవి గులామ్ రసూల్ ముష్తాక్ రాసిన ఈ పంక్తులను చదివారు.
ఒడ్డున కూర్చున్నప్పుడు, చిన్నచిన్న మంచుగడ్డలు కొట్టుకు పోతున్నప్పటికీ, సన్నని పలకలుగా మంచు పేరుకుపోతుండటాన్ని మనం చూడవచ్చు. నది ఇంకా గడ్డకట్టలేదు, కానీ అది మారిపోతోంది. ఋతువూ మారుతోంది
కొన్ని మీటర్ల దూరంలో, స్థానిక మహిళలు కొందరు కట్టెల మోపులనూ, గడ్డిమోపులనూ తలలకెత్తుకుపోతున్నారు, అందులో కొన్ని 25-30 కిలోలకు పైగా బరువుంటాయి. మరో మహిళ తమ సంప్రదాయక శీతాకాలపు పొయ్యి దాన్కి ఇంధనం కోసం ఒక తొట్టె నిండా ఆవుపేడను తీసుకువెళ్తున్నారు. మా చుట్టూ ఉన్న, గురేజ్ లోయ సందర్శనకు వచ్చిన పర్యాటకులు నెమ్మదిగా ఇళ్ళకు మళ్ళుతున్నారు.
నదిలో మాత్రమే కాక, గురేజ్ శీతాకాలానికి సిద్ధమయ్యే విధానంలో కూడా ఋతువు మారుతోన్న గుర్తులను ఫరీద్ ఎత్తి చూపారు. దర్ద్-శిన్ సముదాయానికి చెందిన ఆయన, తన ప్రజల్లో ఎక్కువ మంది గురేజ్ లోయలో నివసిస్తున్నారని, అక్కడ 37,992 మంది దర్దీలు నివసిస్తున్నారని (2011 జనాభా లెక్కల ప్రకారం) చెప్పారు.

Muzamil Bhat

Muzamil Bhat

Muzamil Bhat

Muzamil Bhat
అక్టోబర్ నెల వచ్చేవరకు శీతాకాలం మొదలవడంతో, లోయంతా మంచుతో కప్పేసి ఉంటుంది. "వృద్ధులు మాత్రమే ఇక్కడ ఉండిపోతారు," 68 ఏళ్ళ ఫరీద్ చెప్పారు. మంచు కారణంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడం దాదాపు అసాధ్యంగా ఉంటుంది. "వెనుక ఉండిపోయేవారు ఎక్కువగా ఇంటి లోపలికే పరిమితమై ఉంటారు.”
కొన్నిసార్లు, లోయలోని కొన్ని ప్రాంతాలలో 15 అడుగుల ఎత్తున మంచు కురుస్తుంది, దాంతో ఆరు నెలల పాటు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయి. దీని వలన సుమారు 80 శాతం జనాభా వలస వెళ్ళవలసి వస్తోంది. "కొంతమంది కశ్మీర్‌లోని ఇతర ప్రాంతాలకు వలస వెళతారు. మరికొందరు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాలకు కూలిపనుల కోసం వెళతారు," ఉద్యానవన శాఖ నుండి పదవీ విరమణ చేసిన ఈ సీనియర్ టెక్నీషియన్ చెప్పారు. కశ్మీర్‌లోనే ఉండేవారు తరచుగా చిన్న హోటళ్ళలో, లేదా శ్రీనగర్‌లోని హరిస్సా దుకాణాలలో వంటపెద్దల(chefs)తో కలిసి పనిచేస్తారు. (చదవండి: In Srinagar: Harissa is best served hot)
కఠినమైన శీతాకాలాలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నిరంతర సవాలుగా ఉంటాయి. 2017, జనవరి 25న గురేజ్ను తాకిన నాలుగు హిమపాతాలలో దావర్‌లోని ఫరీద్ ఇంటి నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉండే మజ్గుండ్ నీరూలో 20 మంది సైనికులు, నలుగురు పౌరులు మరణించారు.
గురేజ్‌లో కనీసపు వైద్య సహాయం కూడా అందని రోజులు ఆయనకు గుర్తున్నాయి. 1970ల ప్రారంభంలో సమీపంలోని మర్కూట్ గ్రామానికి చెందిన ఒక మౌల్వీ సాహబ్ (ఇస్లామిక్ మతబోధకుడు) శీతాకాల సమయంలో జబ్బుపడ్డారు. మంచు 12 నుంచి 15 అడుగుల లోతునుంచి పేరుకొని ఉంది. "లోగ్ ఉన్కో చార్పాయ్ పే లే గయే [జనం ఆయన్ని ఒక మంచం మీద మోసుకెళ్ళారు]." ఆయనను అక్కడికి 86 కిలోమీటర్ల దూరాన ఉన్న బాందీపుర్లోని ఆసుపత్రికి తీసుకుపోవటానికి రెండు రోజులు పట్టింది.
మరో సంఘటనలో ఒక ఉస్తాద్ మొహత్రామ్ [గౌరవనీయుడైన ఉపాధ్యాయుడు] కుమార్తెకు కానుపు కష్టమయింది. ఆ సమయంలో పౌర హెలికాప్టర్లు లేవు, ఆమెను ప్రసవానికి ఆసుపత్రికి తీసుకువెళ్ళాలంటే లక్ష రూపాయల పైనే ఖర్చవుతుంది. సహాయం చేయటానికి భారత సైన్యం ముందుకొచ్చింది. "ఆర్మీ నే సద్భావనా కే జరియే మదద్ దేనా శురూ కియా [సైన్యం తన ఆపరేషన్ సద్భావనలో భాగంగా సాయం చేసింది]."
ఈ రోజున పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ, జమ్మూకశ్మీర్‌లో షెడ్యూల్డ్ తెగగా జాబితా అయివున్న ఈ సముదాయం, అత్యవసర పరిస్థితులలో ఇక్కడి నుంచి తరలిపోవటానికి సైన్యం సహాయంపైనే ఆధారపడుతోంది. గర్భధారణలు, శిశుజననాలు ఇంకా సమస్యగానే ఉన్నాయి.

Muzamil Bhat

Muzamil Bhat
కాలానుగుణంగా సాగే వలసలతో పాటు, భారత పాకిస్తాన్ల మధ్య నియంత్రణ రేఖ (LoC)కు దగ్గరగా ఉండటంతో సరిహద్దుల వెంబడి జరిగే కాల్పులు ఈయన సముదాయానికి తీవ్ర ఆందోళనను కలిగిస్తాయి.
క్యాంప్‌సైట్ చుట్టూ తిరుగుతూ ఉన్న ఫరీద్ అకస్మాత్తుగా ఆగిపోయి, "ఈ రోడ్డు గురించి ఒక దృశ్యం నా మనసులో ఇంకా తాజాగా ఉంది," అన్నారు. "అది 2005 సంవత్సరం. మా గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు తమ గొర్రెలను మేపుతున్నారు. వారు గ్రామంలోకి రావాలంటే ఈ వంతెనను దాటాలి," రోడ్డుకున్న మరొక చివరను చూపిస్తూ అన్నారాయన
"బాప్ పీఛే పీఛే బేటా ఆగే ఆగే [తండ్రి వెనుకగా నడుస్తోంటే, కొడుకు ముందు నడుస్తున్నాడు]." అప్పుడు అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక మస్జిద్ (మసీదు) దగ్గర నిల్చొని ఇదంతా చూసిన ఫరీద్ గుర్తుచేసుకున్నారు. వారి మీద ఒక బాంబు పడటాన్ని ఆయన చూశారు. కానీ ఆ కుటుంబానికి కలిగిన విషాదం అంతటితో ఆగలేదని అన్నారాయన. అదే రోజున సైనిక శిబిరానికి దగ్గరలోనే పరీక్ష రాయటం కోసం ఇంట్లోంచి బయటకు వచ్చిన ఆ కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిపై విచక్షణా రహితంగా గుండ్ల వర్షం కురిసింది.
ఇదంతా PARIతో చెప్తోన్న ఆయన గొంతు వణికింది,"ఏక్ హీ దిన్ మేఁ ఘర్ సే ఏక్ కా లడకా గయా, ఏక్ కీ లడకీ గయీ [ఒకే రోజున ఒక కుటుంబం తన కొడుకును పోగొట్టుకుంటే, మరో కుటుంబం తన కూతురిని పోగొట్టుకుంది]." ఆ కాల్పులలో 20-25 మంది మనుషులతో పాటు, అనేక పశువుల, మందల ప్రాణాలు పోయాయి.
మరో సంఘటనలో కాల్పుల వల్ల తులైల్ మార్కెట్ వద్ద నిలిపి ఉంచిన బస్సుకు నిప్పంటుకోవటంతో మార్కెట్ మొత్తం నాశనమైపోయింది. మంటలు వేగంగా వ్యాపించాయని ఆయన చెప్పారు. ఆ రోజుల్లో కట్టడాలన్నీ ఎక్కువగా చెక్కతో నిర్మించినవే ఉండేవి.
"ఇక్కడ చనిపోవాలని ఎవరు మాత్రం ఎందుకు ఎంచుకుంటారు? అలాంటి ప్రదేశంలో ఎవరు నివసించాలనుకుంటారు?" ఫరీద్ అడిగారు. ఆయన ఇప్పుడు తన భార్య, నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలతో కలిసి ప్రసిద్ధ తులైల్ లోయకు వెళ్ళటానికి ముందు వచ్చే చివరి మార్కెట్ అయిన దావర్లో నివసిస్తున్నారు.

Muzamil Bhat

Muzamil Bhat
ఇంతకుమునుపు కూడా గురేజ్‌లో సంపాదనా అవకాశాలు పెద్దగా ఉండేవి కావు. "జనం పశువులను మేపుకోవటమో, సైన్యం దగ్గర బరువులు మోసేవారిగానో జీవనం సాగించేవారు." అందరి దగ్గరా గుర్రాలున్నాయి, అయితే "ములాజామత్ బిల్కుల్ కమ్ థీ [ఉద్యోగావకాశాలు చాలా తక్కువగా ఉండేవి]," అన్నారాయన. చాలామంది సముదాయపు సంప్రదాయక వృత్తి అయిన పట్టూ నేతపని చేసేవారు. చదవండి: కనుమరుగైపోతోన్న పట్టూ నేత
జనం లోయలోని ఇతరప్రాంతాలకు వెళ్ళినప్పుడు మంచి ఉద్యోగాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ లభించేవి. అందుకే, ప్రజలు బాందీపుర్, కంగన్, గాందర్బల్, శ్రీనగర్ వాణిజ్యప్రాంతం (డౌన్‌టౌన్) వంటి ప్రదేశాలలో స్థిరపడటం ప్రారంభించారని ఫరీద్ వివరించారు.
ఇలా చాలామంది ప్రజలు బయటకు వెళ్ళిపోవటంతో, తమ మాతృభాషలో మాట్లాడటం కష్టమైపోయింది. దర్ద్-శిన్ ప్రజలు సరుకులు కొనుక్కోవడానికి బాందీపుర్ వెళ్ళినప్పుడు, ఇతర కశ్మీరీల ముందు శీనా భాషను మాట్లాడేవారు కాదు. "ఏక్ కాంప్లెక్స్ హోతా హై. శాయద్ హమ్ అలగ్ హైఁ [ఒక రకమైన సంకోచ భావన ఉంటుంది. బహుశా మేం వారికంటే భిన్నమైనవారిమని కావొచ్చు]."
ఇదెప్పుడూ ఇలాగే లేదు. "నా చిన్నప్పుడు అందరూ శీనాలో మాట్లాడటమే చూసేవాడిని," అన్నారు ఫరీద్. కానీ ఇప్పుడు, నేను బజారుకు వెళ్ళినప్పుడల్లా మా సముదాయానికి చెందిన యువత ఉర్దూ, హిందీ, కశ్మీరీ, కొన్నిసార్లు ఆంగ్లంలో మాట్లాడటం కూడా చూశాను."
శీనా అనేది ఇండో-ఆర్యన్ భాషా కుటుంబానికి చెందిన దర్దిక్ భాష. యునెస్కో దీనిని అంతరించిపోతున్న భాషగా జాబితా చేయనప్పటికీ, ఈ భాషలో మాట్లాడేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. దీనిని ఇప్పుడు నశించిపోయే ప్రమాదమున్న భాషగా వర్గీకరించారు.
హబ్బా ఖాతూన్ సాంస్కృతిక బృందం సభ్యుడిగా ఫరీద్, గత 40 ఏళ్ళుగా తన మాతృభాషను రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గురేజ్ స్థానికులే ఈ బృందానికి నిధులు సమకూరుస్తారు. అయితే అప్పుడప్పుడూ వీరు ఇచ్చే ప్రదర్శనలకు డబ్బు కూడా వస్తుంటుంది. తమ సముదాయపు భాష, సంస్కృతి గురించి అవగాహన పెంచడానికి ఈ బృందం పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

Muzamil Bhat

Muzamil Bhat
రోజులు గడిచేకొద్దీ ఆ ప్రయత్నాన్ని నిలబెట్టుకోవటం కష్టంగా మారుతోంది. ఇక్కడి పిల్లలు చాలా వరకు గురేజ్ బయటే చదువుకోవటం వలన ఎవరి ద్వారానైనా నేర్చుకునే వీలు లేకుండా పోతోంది. "బడులలో ఉదయం చేసే ప్రార్థన, పుస్తకాలు, ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు - ఇవన్నీ ఉర్దూ, హింది, ఆంగ్ల భాషలలోనే సాగుతున్నాయి," అన్నారాయన. "ఒక సాంస్కృతిక కార్యక్రమంలో నేను శీనా భాషలో పాటలు పాడినప్పుడు, చాలామంది విద్యార్థులు ఆ పాటల అర్థం తెలుసుకోలేక ఇబ్బందిపడ్డారు."
గణతంత్ర దినం, స్వాతంత్ర్య దినం వంటి ప్రధాన కార్యక్రమాలను కశ్మీరీ లేదా ఉర్దూలోనే నిర్వహిస్తారు. "కానీ ఇప్పుడు మా బృందం ఆ అలోచనా విధానాన్ని మార్చుకుంది, మా మాతృభాషలోనే ఈ కార్యక్రమాలను నిర్వహించే ప్రయత్నం చేస్తోంది; వీటిలో జానపద గేయాలను, కవిత్వాన్ని కూడా చేరుస్తున్నాం," అన్నారాయన.
*****
"చౌక్ అంటే ఏమిటో మీకు తెలుసా?" తారిక్ పర్వాయిజ్ లోన్ తన 10వ తరగతి విద్యార్థులను ప్రశ్నించారు, వారు ఆయనవైపు అయోమయంగా చూశారు. "అదేమిటి సార్? చూడటానికి ఎలా ఉంటుంది?" వాన్పురా ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి వచ్చిన ఒక విద్యార్థి కుతూహలంగా అడిగాడు. ఆ ప్రధానోపాధ్యాయుడు ఒక గుర్తుపట్టలేని వస్తువును నల్లబల్ల మీద గీస్తూ తన విద్యార్థులతో ఇలా చెప్పారు, "అది ఒక మగ్గం. మన పెద్దవాళ్ళు ఉన్ని బట్టలను నేయటానికి దీన్ని ఉపయోగించారు."
తారిక్ తన పాఠాన్ని కొనసాగిస్తూ, బోర్డు మీద ఒక బొంగరం రేఖాచిత్రాన్ని గీశారు. "దీనిని మనం శీనాలో ఏమని పిలుస్తాం?" అని ఆయన తన విద్యార్థులను అడిగారు. ఒక పిల్లవాడు దానిని 'లట్టు' అని పిలిచాడు, ఇది బొంగరానికి కశ్మీరీ పదం. తారిక్ "దీనిని తుర్కతి అంటారు," అని సమాధానం ఇచ్చే వరకు అక్కడ నిశ్శబ్దం కొనసాగింది.
ఆయన తన పాఠాన్ని అలా కొనసాగిస్తూ పోగా, తరగతిలోని 30 మంది విద్యార్థులలో ఒక్క విద్యార్థి మాత్రమే ఆ వస్తువులను తమ మాతృభాషైన శీనాలో ఏమంటారో చెప్పగలిగాడు. "ఇలాంటి పదాలు ఇంకా చాలా ఉన్నాయి," అంటారు తారిక్, "మేం ఇతర భాషలను అలవాటు చేసుకోవటం వల్ల మేం ప్రతిరోజూ మాట్లాడుకునే భాషలోనించి ఇవన్నీ మాయమైపోయాయి."

Muzamil Bhat
గురేజ్ పిల్లలు తమ ఇళ్ళను వదిలి, చదువుకోవటానికి వెళ్ళినప్పుడు, బడిలో రోజువారీ సంభాషణ కోసం ఉర్దూ, కశ్మీరీ వంటి ఇతర భాషలను నేర్చుకుంటారు. వాటితో పాటు చాలామంది పిల్లలు హిందీ, ఆంగ్లం కూడా నేర్చుకుంటారు.
"ఏడాదిలో 12 నెలలూ గురేజ్లోనే నివసించే పిల్లలు తమ భాషను మాట్లాడటానికి ఏమీ కష్టపడరు," అంటారు తారిక్. "కానీ పనుల కోసం, చదువుల కోసం, లేదా ఆరోగ్య, వాతావరణ సమస్యల వలన బయటకు వెళ్ళినవాళ్ళు తమ మాతృభాషను ధారాళంగా మాట్లాడటంలో తరచుగా సమస్యను ఎదుర్కొంటున్నారు.
తారిక్ మాట్లాడుతుండగానే ఆయన సహోద్యోగిని వెంటనే కలగజేసుకున్నారు, "నా చిన్న కూతురు తన సొంతంగానే ఉర్దూ నేర్చుకుంది, ఫోన్ దేఖ్ దేఖ్ కర్ [ఫోన్లో (వీడియోలు) చూసి]." ఈమె తన కూతురికి ఆ భాషను నేర్పలేదు, కానీ శీనా భాషను నేర్పించటానికి ప్రయత్నించినపుడు మాత్రం ఆమె చిన్న కూతురు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఒక ఏడాది నుంచి మాత్రమే ఆమె మెల్లగా ఆ భాషను నేర్చుకోవటం మొదలుపెట్టింది. ఆమె పెద్ద కూతురు మాత్రం ముందు నుంచీ తన మాతృభాషలో బోధించే బడికే వెళ్ళటం వలన శీనాలో చక్కగా మాట్లాడుతుంది.
తమ భాషను సజీవంగా ఉంచుకునేందుకు ఇళ్ళలో, మార్కెట్ ప్రాంతాలలో తమ సొంత భాషలో మాట్లాడుకోవటమే మార్గమని తారిక్ భావిస్తున్నారు. తాను కశ్మీరీ, ఉర్దూ భాషలకు వ్యతిరేకం కాదనీ, గురేజ్ నుంచి బయటకు వెళ్ళిన పిల్లలు కశ్మీర్‌లోని ఇతర ప్రాంతాలకు చెందిన పిల్లలతో మాట్లాడుకోవటానికి అవి చాలా ఉపయోగపడతాయని ఆయన అన్నారు. "కానీ మన భాషను మర్చిపోవటమంటే, మన గుర్తింపును మర్చిపోవటమే," అంటారాయన.
కానీ అనేకమంది విద్యార్థులు తమను 'దర్దే' (ఈ సముదాయం పట్ల కొన్నిసార్లు అవమానకరంగా ఉపయోగించే పదం) అంటారేమోననే భయంతో తమ దర్ద్ గుర్తింపును బయటపెట్టడానికి అభద్రతాభావంతో ఉంటారు.

Muzamil Bhat

Muzamil Bhat
*****
బాందీపుర్ నుండి గురేజ్ మీదుగా గిల్గిత్ వరకు వాణిజ్యం కోసం, తీర్థయాత్ర కోసం ప్రయాణించే కశ్మీర్ ప్రజలకు గురేజ్ లోయ ఒకప్పుడు సిల్క్ రూట్‌గా ఉండేది. హజ్ యాత్రికులు కూడా ఇదే మార్గాన్ని ఉపయోగించేవారు.
గురేజ్, ద్రాస్లలోని దర్ద్- శిన్ తెగకు ప్రత్యేకమైన సాంస్కృతిక, భాషా మూలాలున్నాయి. ఇది ఒకప్పుడు కశ్మీర్ లోయ నుండి గిల్గిత్, ఆఫ్ఘనిస్తాన్ల వరకు విస్తరించి ఉన్న ఒక చారిత్రక ప్రాంతం. కశ్మీరీ, దర్ద్ల మధ్య సంబంధం 1947 విభజన కంటే చాలా లోతైనదని మసూద్ అల్ హసన్ సమూన్ (73) అన్నారు. “పార్టీషన్ తో కల్ కీ బాత్ హై [విభజన నిన్నటి కథ]. దర్ద్లు శతాబ్దాలుగా జమ్మూకశ్మీర్‌లో నివసిస్తున్నారు,” అని జమ్మూకశ్మీర్ ప్రభుత్వ మాజీ విద్యా సంచాలకులైన ఆయన చెప్పారు.
12వ శతాబ్దం నాటి కశ్మీరీ చరిత్రకారుడైన కల్హణుడు కశ్మీరీ రాజుల సంస్కృత కవితా చరిత్ర రాజతరంగిణిలో గురేజ్‌కు చెందిన దర్దుల గురించి ప్రస్తావించాడు. గురేజ్ రాజులు తరచుగా లోయ పాలకులతో యుద్ధాలు చేసేవారని, దడ్ఖాత్ పర్వతం మీద దర్దులకూ హర్ష రాజుకు (ఈయన భారతదేశానికి చెందిన హర్షవర్ధనుడు కాదు) మధ్య ఒక ముఖ్యమైన యుద్ధం జరిగిందనీ మసూద్ చెప్పారు.
దానికంటూ ఒక ప్రత్యేకమైన లిపి లేకపోవడంతో, ఈ భాష మౌఖిక సంప్రదాయాలు, జానపద కథలు, జానపద గీతాల ద్వారా మనుగడ సాగించింది. కానీ దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో సాగుతోన్న కాలానుగుణమైన వలసలు, సరిహద్దుల నుండి వచ్చే కాల్పులు, రాజకీయ, సాంస్కృతిక గందరగోళం ఈ సముదాయాన్ని వారి మాతృభాష నుండి మరింత దూరం చేస్తున్నాయి.
"శ్రీనగర్‌లో చూస్తే, ఉన్న 50 ఇళ్ళలో శీనా మాట్లాడే ఇల్లు ఒకటి మాత్రమే ఉన్నప్పుడు భాష ఎలా బతుకుతుంది?" ఆయన సముదాయానికి చెందిన పిల్లలు ఇతర పిల్లలతో కశ్మీరీలో గానీ, ఇతర వాడుకలో ఉన్న భాషలో గానీ మాట్లాడతారు. బహుశా ఒక తరం మాతృభాష మాట్లాడటాన్ని కొనసాగిస్తే, రెండవ తరం వచ్చేవరకు అది చనిపోయి ఉంటుందని ఆయన అంటున్నారు.
ఉత్తర కశ్మీర్‌లోని బాందీపుర్ ప్రాంతంలో నివసిస్తోన్న మసూద్ ప్రస్తుతం ఏకీకృత శీనా లిపిని రూపొందించే పనిలో ఉన్నారు. "ఇప్పటివరకు శీనా కోసం రెండు లిపులు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి జార్జ్ అబ్రహమ్ గ్రియర్సన్ రోమన్ భాషలో రాసినది, మరొకటి పాకిస్తాన్‌లోని గిల్గిత్లోని జిల్లా విద్యాధికారి డాక్టర్ షుజా నామస్, నాస్తాలిక్ లిపిని ఉపయోగించి ఉర్దూలో రాసిన గిల్గిత్ ఔర్ శీనా జబాన్ అనేది."
ఈ రెండింటిలోనూ వారి ప్రమాణపత్ర రచన వారి పరిశోధనకే పరిమితమయింది. గ్రియర్సన్ గానీ, డా. నామస్ గానీ మాతృభాషగా దీనిని మాట్లాడగలిగేవారు కాదు. దాంతో శబ్దశాస్త్రానికి సంబంధించిన అనేక వివరాలను వారు నిర్దుష్టంగా సంగ్రహించలేకపోయారు.
శీనాకు నాలుగు ప్రత్యేకమైన హల్లులు ఉన్నాయని మసూద్ చెప్పారు. “జో దాయేఁ-బాయేఁ కీ కిసీ లాంగ్వేజ్ మే నహీఁ హై [ఇది ఏ ఇరుగుపొరుగు భాషలలోనూ లేదు], ఉర్దూ లేదా ఫార్సీతో సహా ఇది కశ్మీరీలో కూడా సాధారణం కాదు.” కాబట్టి, ప్రత్యేకమైన విశేషకాల (diacritics) అవసరం ఉంది, కానీ ఎవరూ ఫలితం సాధించలేదు. ఆ తరువాత పాకిస్తాన్‌లోని కారకోరం విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మొహమ్మద్ అమీన్ జియా కంప్యూటర్లు వచ్చిన కొత్తలో దానికి వ్యాకరణాన్నీ, నియమాలనూ రాశారని ఆయన చెప్పారు. కానీ అది కూడా లిపిపై దృష్టి పెట్టలేదు.
మసూద్‌తో ఏకీభవిస్తూ తారిక్, "లిపి లేనప్పుడు మనం భాషను ఎలా రాస్తాం, ఎలా నేర్పిస్తాం? శీనా వ్యాకరణంపై పుస్తకం ప్రచురించిన తర్వాత, సముదాయానికి చెందిన చాలామంది వాట్సాప్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు, కానీ అది పని చేయలేదు," అన్నారు.
"శీనా సాహిత్యం చాలావరకు ఇప్పటికీ ఉర్దూలోనే రాసివుంది కాబట్టి, సరైన లిపి ఉంటే అది సహాయపడుతుంది," అని కూడా ఫరీద్ అంటున్నారు. కొత్త లిపిని పరిచయం చేయడం వలన పిల్లలు తమ మాతృభాషకు దగ్గరవుతారు. "మన పిల్లలు కశ్మీర్ నుండి రష్యా, జర్మనీ వంటి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు, మనం వారికి ఆ విదేశీ భాషలను నేర్పించం కదా? వాళ్ళు దానిని అక్కడే నేర్చుకుంటారు," అన్నారాయన.

Muzamil Bhat

Muzamil Bhat
భాషలను సజీవంగా ఉంచే ప్రాథమిక అంశం సాహిత్యమేనని మసూద్ నొక్కిచెప్పారు. ఆయన లల్ దెద్, షేక్-ఉల్-ఆలమ్ (నంద్ రిషి అని కూడా పిలుస్తారు) వంటి కవుల కశ్మీరీ సాహిత్యాన్ని, మధ్యయుగ, ఆధునిక యుగానికి చెందిన అనేకమంది కవుల కవిత్వాన్నీ పేర్కొన్నారు. నేటికీ కశ్మీరీలో చాలా గద్యం, కవిత్వం ఉత్పత్తి అవుతున్నాయనీ, ఇది రాబోయే కాలంలో భాష మనుగడకు సాధనంగా ఉంటుందనీ ఆయన అన్నారు, “కానీ శీనా విషయంలో మనం అలా చెప్పలేం."
శీనా కోసం ఒక ప్రత్యేకమైన లిపిని రూపొందించే ప్రయత్నంలో ఉన్న మసూద్ ప్రయాణం 1975లో కశ్మీర్ విశ్వవిద్యాలయంలో ఉర్దూ, పర్షియన్లను బోధించే పూర్తి కాల ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రారంభమైంది. "నేను జానపద కథలను, జానపద గీతాలను సేకరిస్తాను," అనే ఆయనకు తరచుగా "దీన్ని ఎలా రాయాలి!" అనే ప్రశ్న వస్తుంటుంది.
తరువాత ఆయన విద్యా సంచాలకులు అయినప్పుడు, జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో నాల్గవ తరగతి నుండి మాతృభాషలో బోధించడానికి ఒక కొత్త భాషా విధానాన్ని ప్రకటించారు. ఆయన ఇలా అంటారు, “ఒక లిపిని కలిగి ఉండటానికి ఇదే సరైన సమయం,” ఇంకా దానిని కంప్యూటర్‌కు అనుకూలంగా మార్చడానికి కూడా.
ఆయన ఒక లిపిని రూపొందించే ప్రయత్నం చేయటంతో పాటు ఒక ప్రాథమిక పాఠ్య పుస్తకం (ప్రైమర్) కూడా రాశారు. కానీ తర్వాత ఆయన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు, "జీవితం గందరగోళంగా మారిపోయింది." ఆయన దాన్ని ఎప్పటికీ ప్రచురించలేకపోయారు. పదవీ విరమణ చేసిన తర్వాత మళ్ళీ తన ప్రయత్నాలను తిరిగి ప్రారంభించానని అతను చెప్పారు.

Muzamil Bhat

Muzamil Bhat
లిపిని ప్రామాణీకరించడానికి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత, ఆయన పాఠ్యపుస్తకమైన పమికీ శీనా కితాబ్ను నాల్గవ తరగతి విద్యార్థుల కోసం ముద్రించారు. అయితే, అప్పటికి కూడా, శీనా ఒక ఐచ్ఛిక విషయం మాత్రమే. "నేను భాషా కార్యకర్తను అయ్యాను, కనీసం నా ప్రాంతంలోనైనా లిపిని ప్రామాణీకరించారు," అన్నారాయన. ఇటీవల, మాతృభాషను డాక్యుమెంట్ చేయడానికి కొన్ని ఇతర ప్రయత్నాలు జరిగాయి. శ్రీనగర్‌లోని కశ్మీర్ విశ్వవిద్యాలయంలోని భాషాశాస్త్ర విభాగం శీనా వ్యాకరణంపై ఒక పుస్తకాన్ని ప్రచురించింది.
లిపిని ప్రామాణీకరించే వరకు, ప్రాథమిక స్థాయిలో, కనీసం పదవ తరగతి వరకైనా శీనాను బోధనా మాధ్యమంగా మార్చడం వల్ల భాష ఎక్కువ కాలం మనుగడ సాగించగలదని మసూద్ అంటున్నారు. ఈ దశలో రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం వంటి ఉన్నత లేదా సాంకేతిక అధ్యయనాలకు బోధనా మాధ్యమంగా దీనిని ఉపయోగించడం సాధ్యం కాకపోయినా, ఈ విషయంలో అత్యవసర పరిస్థితి ఉందనీ, "లేదంటే భాష చచ్చిపోతుందనీ," ఆయన పేర్కొన్నారు.
తాను పనిచేసిన రోజుల్లో గురెజ్‌లో గడిపిన సందర్భాన్ని ఆయన వివరిస్తారు. తన సముదాయానికి చెందిన ఎవరైనా కార్యాలయంలో తనతో కశ్మీరీ లేదా ఉర్దూలో మాట్లాడితే, “నేను వారిని తిట్టి, నేను శీనాలో మాట్లాడుతున్నాను కాబట్టి నువ్వు కూడా అందులోనే మాట్లాడాలి అని చెప్పేవాడిని!”
"నువ్వు నీ కుటుంబంతో మాట్లాడాలంటే, ఆంగ్లంలో మాట్లాడతావా? ఫ్రెంఛివాళ్ళెవరూ ఇళ్ళల్లో ఆంగ్లంలో మాట్లాడరు. కేవలం మన భారతీయులకు మాత్రమే ఈ మానసికమైన బీమారీ ఆఫ్ ఆంగ్రేజీ కీ గులామీ [ఆంగ్లం ఏదో గొప్ప భాష అనే రోగం] ఉంటుంది," అన్నారాయన.
ఈనాటి పిల్లలు అన్నిటినీ ఆంగ్లంలో నేర్చుకుంటారని, విదేశీ భాషలలో మాట్లాడటంలోనే వారి మానసిక సామర్థ్యాలన్నీ అలసిపోతాయని ఆయన అంటున్నారు. “ఆంగ్రేజీలు మాత్రమే తెలివైనవారని కాదు. మన హిందుస్తానీలం ఏమైనా మూర్ఖులమా? అయితే, నిజానికి విషయం అది కాదు, మనం విదేశీ భాషలను నేర్చుకోవడానికే మన సమయాన్నంతా వెచ్చిస్తున్నందున మన [భారతీయ] భాషలకు ఎలాంటి పెరుగుదల ఉండటంలేదు,” అని ఆయన అన్నారు.

Muzamil Bhat

Muzamil Bhat

Muzamil Bhat

Muzamil Bhat
దేశీయ విద్యా విధానం (NEP) 2020 ప్రకారం ఐదవ తరగతి వరకు బోధనా మాధ్యమం పిల్లల మాతృభాషలోనే ఉండాలి. "ఇది బహుశా భారతదేశ విద్యా రంగంలో జరిగిన అత్యంత వివేకశీలమైన పని, కానీ ఇది సవాళ్ళతో కూడుకున్నది," అని మసూద్ చెప్పారు.
విద్యా మండలి దీనిని కశ్మీరీ, డోగ్రీ భాషలలో ఒకటవ తరగతి పాఠ్యపుస్తకాలలో అమలు చేసింది. శీనా భాషలో ఉన్న తన పాఠ్యపుస్తకాన్ని దాదాపు ఏడాది క్రితమే తాను పంపి ఉన్నందున, త్వరలోనే అది ప్రచురితమవుతుందని తాను ఎదురు చూస్తున్నట్టు ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా, మసూద్ తన తోటి కార్యకర్తలతో కలిసి శీనా లిపిని ప్రామాణీకరించే ప్రయత్నం చేస్తున్నారు, "కానీ అది అంత త్వరగా పూర్తవుతుందో లేదో నేను మీకు హామీ ఇవ్వలేను. దీనికి చాలా పని చేయాల్సిన అవసరం ఉంది, నాకేమో వయసు మీద పడుతోందని భయపడుతున్నాను," అన్నారాయన.
ఈ కథన నిర్మాణంలో సహాయం చేసినందుకు మసూద్ అల్ హసన్ సమూన్, బషీర్ అహ్మద్ టేరూ, ఫరీద్ అహ్మద్ లోన్, అబ్రార్-ఉల్-ఆలమ్లకు ఈ రిపోర్టర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
గులామ్ రసూల్ ముష్తాక్ రాసిన శీనా కవిత్వంపై ఫరీద్ వ్యాఖ్యానించగా, ప్రతిష్ఠ పాండ్యా సంపాదత్వం వహించారు. మసూద్ అల్ హసన్ సమూన్ రాసిన కవిత్వాన్ని ముజామిల్, ప్రతిష్ఠ పాండ్యాలు ఆంగ్లంలోకి అనువదించారు.
PARI నిర్వహణలోని అంతరించిపోతున్న భాషల ప్రాజెక్ట్ (ELP) అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం సహకారం అందిస్తున్న కార్యక్రమంలో ఒక భాగం. భారతదేశంలోని హానికి లోనవుతున్న భాషలను ఆ భాషను మాట్లాడే వ్యక్తుల స్వరాల ద్వారా, ప్రత్యక్ష అనుభవాల ద్వారా డాక్యుమెంట్ చేయడాన్ని ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈకథనాన్ని PARI సీనియర్ ఫెలోషిప్ 2025 కింద ప్రచురించారు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/in-gurez-home-is-not-where-the-word-is-te