తాజాగా కోసిన చెర్రీ పండ్లు పసుపు రంగు టార్పాలిన్ పట్టా మీద కుప్పలుగా పోసి ఉన్నాయి. అరవైల వయసులో ఉన్న సోదరులు అబ్దుల్ సలామ్ ఖాన్, నస్రుల్లా ఖాన్లు బాసింపట్టు వేసుకుని కూర్చుని, అలవాటైన జాగ్రత్తతో పండ్లను వర్గీకరించి సరికూరుస్తున్నారు. నీరు చొరనివ్వని ఆ పట్టాపై పడి మెరుస్తోన్న సూర్యకాంతి, కష్టకాలం ముగిసిపోయి అలసటను నిభాయించి నిలిచిన వారి ముఖాలను వెలిగిస్తోంది.
కేవలం పావు ఎకరం మాత్రమే ఉండే వారి చాలా చిన్న పండ్ల తోట, మధ్య కశ్మీర్లో గాందర్బల్ జిల్లాలోని సొరఫ్ రావ్ గ్రామంలో ఉంది.
“ఈ ఏడాది చాలా కష్టంగా ఉంది,” జూన్ నెలలోని ఒక వెలిగిపోతోన్న ఉదయాన అబ్దుల్ సలామ్ అన్నారు. “మేం 40 ఏళ్ళకు పైగా ఈ పని చేస్తున్నాం, కానీ ఇలాంటి సీజన్‌ను మాత్రం నేనెప్పుడూ చూడలేదు. వాతావరణం, పర్యాటకుల కొరత రెండూ కలిసి మమ్మల్ని తీవ్రంగా దెబ్బతీశాయి,” అని 65 ఏళ్ళ సలామ్ అన్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో, పష్తూన్ (పఠాన్) సముదాయానికి చెందిన ఖాన్ సోదరులు, సొరఫ్ రావ్లోని వివిధ ప్రాంతాలలో విస్తరించి ఉన్న రెండు ఎకరాల చెర్రీ తోటలను కౌలుకు తీసుకున్నారు. ఈ గ్రామం శ్రీనగర్‌కు ఉత్తరాన 49 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వారి స్వగ్రామమైన గొట్లీ బాగ్ నుండి 35 కిలోమీటర్ల ప్రయాణ దూరంలో ఉంటుంది.
కుటుంబ సభ్యులు, కూలీలు కలిసి పంట కోత కోసం పనిచేశారు, కానీ నెలల తరబడి శ్రమించి పండించిన పంటను కొనేవాళ్ళు కరవయ్యారు.














